ఓం నమో భగవతే వాసుదేవాయ
శ్రీమద్భాగవతం దశమ స్కంధం ఇరవైరెండవ అధ్యాయం
శ్రీశుక ఉవాచ
హేమన్తే ప్రథమే మాసి నన్దవ్రజకమారికాః
చేరుర్హవిష్యం భుఞ్జానాః కాత్యాయన్యర్చనవ్రతమ్
కుమార వయసులో ఉన్న బాలికలు పరమాత్మ యొక్క ప్రసాదం (హోమ ద్రవ్యం, పురోడాశం) మాత్రమే భుజిస్తూ కాత్యాయనీ వ్రతాన్ని చేసారు. కాళిందీ నదీ జలములో సూర్యోదయం కాక ముందే స్నానం చేసి ఇసుకతో అమ్మవారి విగ్రహాన్ని చేసుకుని ఆమెను ఆరాధించారు.
ఆప్లుత్యామ్భసి కాలిన్ద్యా జలాన్తే చోదితేऽరుణే
కృత్వా ప్రతికృతిం దేవీమానర్చుర్నృప సైకతీమ్
గన్ధైర్మాల్యైః సురభిభిర్బలిభిర్ధూపదీపకైః
ఉచ్చావచైశ్చోపహారైః ప్రవాలఫలతణ్డులైః
ధూప దీప గంధములూ పాలు పెరుగూ వన్నె చిగురుటాకులూ పుష్పములూ పళ్ళూ బియ్యమూ మొదలైన వాటితో పూజించి ఈ మంత్రాన్ని చదివారు
కాత్యాయని మహామాయే మహాయోగిన్యధీశ్వరి
నన్దగోపసుతం దేవి పతిం మే కురు తే నమః
ఇతి మన్త్రం జపన్త్యస్తాః పూజాం చక్రుః కమారికాః
నీకు నమస్కారం, నంద గోప కుమారుడైన కృష్ణున్ని మాకు కుమారున్ని చేయి. అని ఈ మంత్రాన్ని వారు జపించారు. వారెవరూ వివాహం ఐన వారు కారు (ప్రౌఢులు కారు, కుమారికలు)..
ఏవం మాసం వ్రతం చేరుః కుమార్యః కృష్ణచేతసః
భద్రకాలీం సమానర్చుర్భూయాన్నన్దసుతః పతిః
ఇలా నెల రోజుల పాటు చేసారు కృష్ణ పరమాత్మ్య యందు మనసు లగ్నం చేసి ఆయన భర్తగా కావాలని భద్రకాళిని పూజించారు
ఊషస్యుత్థాయ గోత్రైః స్వైరన్యోన్యాబద్ధబాహవః
కృష్ణముచ్చైర్జగుర్యాన్త్యః కాలిన్ద్యాం స్నాతుమన్వహమ్
ఉషః కాలములో లేచి ఒకరి చేయి ఒకరు పట్టుకుని కృష్ణపరమాత్మ కీర్తి గానం చేస్తూ ప్రతీ కాళిందీ నదిలో స్నానం చేస్తూ ఉన్నారు.
నద్యాః కదాచిదాగత్య తీరే నిక్షిప్య పూర్వవత్
వాసాంసి కృష్ణం గాయన్త్యో విజహ్రుః సలిలే ముదా
వస్త్రాలన్నీ ఒడ్డు మీద పెట్టి కృష్ణున్ని ధ్యానిస్తూ జలక్రీడలాడుతున్నారు.
భగవాంస్తదభిప్రేత్య కృష్నో యోగేశ్వరేశ్వరః
వయస్యైరావృతస్తత్ర గతస్తత్కర్మసిద్ధయే
ఈ విషయం యోగీశ్వరులకు ఈశ్వరుడైన కృష్ణపరమాత్మ తెలుసుకున్నాడు. తన వారు ఆచరించే పనిని సిద్ధింపచేయడానికి. స్నేహితులతో కలసి అక్కడకు వెళ్ళారు.
తాసాం వాసాంస్యుపాదాయ నీపమారుహ్య సత్వరః
హసద్భిః ప్రహసన్బాలైః పరిహాసమువాచ హ
వాటిని తీసుకుని వృక్షాన్ని అధిరోహించి తోటి పిల్లలందరితో కలసి నవ్వుతూ నవ్విస్తూ పరిహాసముగా ఆ గోపకుమారికలతో ఇలా అంటున్నాడు
అత్రాగత్యాబలాః కామం స్వం స్వం వాసః ప్రగృహ్యతామ్
సత్యం బ్రవాణి నో నర్మ యద్యూయం వ్రతకర్శితాః
అమ్మాయిలూ మీరు అందరూ నా ముందుకు వచ్చి మీ మీ వస్త్రాలను తీసుకోండి. నేను నిజమే చెబుతున్నాను. పరిహాసం కాదు (నో నర్మ). వ్రతములో ఉన్న వారితో వ్రతములో లేని వారు పరిహాసం చేయకూడదు
న మయోదితపూర్వం వా అనృతం తదిమే విదుః
ఏకైకశః ప్రతీచ్ఛధ్వం సహైవేతి సుమధ్యమాః
ఇపుడే కాదు. నేను ఇంతవరకూ ఎపుడూ అబద్దం చెప్పలేదు. వీరే(సహ గోపాలురు) సాక్షి అందుకు.
ఒక్కొక్కరూ వచ్చైనా తీసుకోండి. కలసి వచ్చి ఐనా తీసుకోండి. ఒడ్డుకు వచ్చి మీ మీ వస్త్రాలను తీసుకోండి.
తస్య తత్క్ష్వేలితం దృష్ట్వా గోప్యః ప్రేమపరిప్లుతాః
వ్రీడితాః ప్రేక్ష్య చాన్యోన్యం జాతహాసా న నిర్యయుః
పరిహాసం ఆడటం లేదంటూనే పరిహాసముగా మాట్లాడుతున్నాడని తెలుసుకుని అతని మీద ప్రేమ అడ్డువస్తోంటే సిగ్గుపడి ఒకరినొకరు చూసుకుని, వచ్చిన నవ్వును లోపల పెట్టుకుని బయటకు వెళ్ళకుండా నీటిలోనే అలా ఉనారు.
ఏవం బ్రువతి గోవిన్దే నర్మణాక్షిప్తచేతసః
ఆకణ్ఠమగ్నాః శీతోదే వేపమానాస్తమబ్రువన్
కృష్ణ పరమాత్మ మాటలను పరిహాసముగానే ఎంచారు. వారి మనసు పరిహాసముతొ నిండిపోయి చల్లటి నీరు కంఠం వరకూ నిండిపోయి వణుకుతూ ఇలా అన్నారు
మానయం భోః కృథాస్త్వాం తు నన్దగోపసుతం ప్రియమ్
జానీమోऽఙ్గ వ్రజశ్లాఘ్యం దేహి వాసాంసి వేపితాః
నీవు అన్యాయం చేయవద్దు. నీవెవరవో మాకు తెలుసు. నంద గోపుని కుమారుడవు.ఆయన మాకు రాజు. నీవు అధర్మం చేయవు. వ్రేపల్లెలో ఉన్నవారందరిచేత కీర్తించబడే చరిత్ర ఉన్నవాడిగా మాకు తెలుసు.మా వస్త్రాలు మాకు ఇవ్వు. చలితో వణికిపోతున్నాము .
శ్యామసున్దర తే దాస్యః కరవామ తవోదితమ్
దేహి వాసాంసి ధర్మజ్ఞ నో చేద్రాజ్ఞే బ్రువామ హే
మేము నీకు దాసీ జనము. ఇలా వస్త్రం తీసుకుని ఇబ్బంది పెట్టకు. ధర్మం తెలిసినవాడవు. నీవు మర్యాదగా ఇవ్వకపోతే నీ మీద మీ తండ్రికి చెబుతాము.
శ్రీభగవానువాచ
భవత్యో యది మే దాస్యో మయోక్తం వా కరిష్యథ
అత్రాగత్య స్వవాసాంసి ప్రతీచ్ఛత శుచిస్మితాః
నో చేన్నాహం ప్రదాస్యే కిం క్రుద్ధో రాజా కరిష్యతి
మీరే చెబుతున్నారు దాసీ జనమని. దాసీ జనం చెప్పినట్లు వింటారు. మీరూ అలాగే చేయండి. ఇక్కడకు వచ్చి పవిత్రమైన చిరునవ్వుతో రండి. (సుందరకాండలో కూడా సీతమ్మ రావణునితో మాట్లాడేప్పుడు సీతమ్మను శుచిస్మిత అని వర్ణిస్తారు. స్త్రీ పవిత్రముగా నవ్వేది తన పిల్లల దగ్గరే. )
తతో జలాశయాత్సర్వా దారికాః శీతవేపితాః
పాణిభ్యాం యోనిమాచ్ఛాద్య ప్రోత్తేరుః శీతకర్శితాః
ఎక్కువ సేపు సరస్సులో ఉండలేక చలికి వణికిపోతూ చేతులతో కొన్ని అవయవాలను కప్పుకుని బయటకు వచ్చారు.
భగవానాహతా వీక్ష్య శుద్ధ భావప్రసాదితః
స్కన్ధే నిధాయ వాసాంసి ప్రీతః ప్రోవాచ సస్మితమ్
అంటే ఇంకా వారు పరమాత్మను పరమాత్మగా చూడటములేదు. భగవంతుని ముందర సిగ్గు తగదు. ఆయన దగ్గర మనలో ఏ వస్తువైనా దాచవలసిన వస్తువు లేదు. మనకు అవయవాలు ఇచ్చినది, ఇంద్రియాలు ఇచ్చినదీ, అధిష్ఠాన దేవతలనిచ్చిన్నదీ ఆయనే. ఆయన కానిదంటూ ఏదీ లేదు. అంటే వారికి ఇంకా తాము ఆడువారం అన్న భావన ఉంది. ఇంకా వీరి దగ్గర సంకోచం పోలేదు అన్న భావం తెలుసుకున్నాడు కృష్ణుడు. వారి భావములో పరిశుద్ధి వలన్ (చెప్పినట్లు విన్నారు కాబట్టి) వారిని అనుగ్రహించి వస్త్రాలను చెట్టు కొమ్మపై ఉంచి నవ్వుతూ ఇలా అన్నాడు
యూయం వివస్త్రా యదపో ధృతవ్రతా వ్యగాహతైతత్తదు దేవహేలనమ్
బద్ధ్వాఞ్జలిం మూర్ధ్న్యపనుత్తయేऽంహసః కృత్వా నమోऽధోవసనం ప్రగృహ్యతామ్
మీరు వ్రతాన్ని స్వీకరించారు కదా. వ్రతాన్ని తీసుకుని వస్త్రాలు లేకుండా నీటిలోకి మునిగారు. ఇది భగవదపచారం కాదా. మీరు తప్పు చేయలేదా. దేవతలను మీరు అవమానించారు. తిరస్కరించారు. చేసిన తప్పు దండముతో సరి. చేతులెత్తి నమస్కరించండి అందుకు ప్రాయశ్చిత్తముగా. శిరస్సు మీద చేతులు జోడించి పాపాన్ని తొలగించుకోండి. అలా చేసి మీ వస్త్రాలను మీరు తీసుకోండి
ఇత్యచ్యుతేనాభిహితం వ్రజాబలా మత్వా వివస్త్రాప్లవనం వ్రతచ్యుతిమ్
తత్పూర్తికామాస్తదశేషకర్మణాం సాక్షాత్కృతం నేమురవద్యమృగ్యతః
ఇది వారి మనసులో బాగా నాటింది. మేము తప్పు చేసాము, దాని వలన మా వ్రతం భగ్నం కాకూడదు. ఇది తప్పూ అని తెలుసుకుని, ఒక చేతితో నమస్కారం చేసారు. ఒక చేతితో కొన్ని అవయవాలను దాచిపెట్టుకుని రెండవ చేతితో స్వామికి నమస్కరించారు. అపుడు కృష్ణుడు "ఒక చేతితో నమస్కారం చేస్తే ఆ చేతిని నరికేయాలని శాస్త్రం". మీరు రెండవ తప్పు చేసిన వారవుతారు. అనగా, వారిలో అన్ని సంకోచాలూ అపవిత్ర భావాలు తొలిగాయి. ఇలా స్పష్టముగా చెప్పిన తరువాత మనమాచరించే అన్ని కర్మలకూ సాక్షీ భూతుడైన పరమాత్మకు నమస్కరించాడు. ఆయన చూడకుండా ఆయనకు తెలియకుండా మనం ఏ కర్మలూ చేయజాలము. అన్ని పాపములనూ తొలగించేవాడు పరమాత్మ. చేసిన తప్పులను క్షమించేవాడు. చేసిన ప్రతీ పనినీ చూసేవాడు పరమాత్మ.
తాస్తథావనతా దృష్ట్వా భగవాన్దేవకీసుతః
వాసాంసి తాభ్యః ప్రాయచ్ఛత్కరుణస్తేన తోషితః
వారు చెప్పినట్లు విని తప్పు తెలుసుకుని ప్రాయశ్చిత్తం ఆచరించారు కాబట్టి స్వామి సంతోషించి దయ కలవాడై వారి వారి వస్త్రాలను ఇచ్చ్చాడు.
దృఢం ప్రలబ్ధాస్త్రపయా చ హాపితాః
ప్రస్తోభితాః క్రీడనవచ్చ కారితాః
వస్త్రాణి చైవాపహృతాన్యథాప్యముం
తా నాభ్యసూయన్ప్రియసఙ్గనిర్వృతాః
ఇంచుమించు పరిహాసం చేసాడు, వారి సిగ్గునూ విడిపించాడు, హేలన కూడా చేసాడు, ఆటబొమ్మల లాగ వారిని ఆడించాడు, వారి వస్త్రాలను కూడా అపహరించాడు. ఇంత చేసినా వారికి స్వామి మీద కోపం రాలేదు. స్వామి చర్యను వారు తప్పు బట్టలేదు. ఆయనే తమ ప్రియుడు. ప్రియుడి యొక్క దర్శనముతో తృప్తి పొందినవారై ఆయన ఎన్ని రకాలుగా ప్రయత్నించినా ఆయన మీద కోపించక సంతోషించారు.
పరిధాయ స్వవాసాంసి ప్రేష్ఠసఙ్గమసజ్జితాః
గృహీతచిత్తా నో చేలుస్తస్మిన్లజ్జాయితేక్షణాః
ఇలా వారి వారి వస్త్రాలను ధరించి కృష్ణ సమాగమం వలన తృప్తి పొందిన వారై, వస్త్రాలను కట్టుకుని కృష్ణుని ఎదుట నిలబడ్డారు, ఆయన యందే మనసు లగ్నం చేసారు, సిగ్గు తొణికిసలాడే చూపులతో స్వామిని చూస్తూ ఉంటే
తాసాం విజ్ఞాయ భగవాన్స్వపాదస్పర్శకామ్యయా
ధృతవ్రతానాం సఙ్కల్పమాహ దామోదరోऽబలాః
ఎపుడైతే వారు ఇలా వస్త్రాలు కట్టుకుని కూడా అక్కడనుంచి వెళ్ళకుండా స్వామి వైపే చూస్తూ ఉంటే వారి అభిప్రాయం తెలుసుకున్నాడు, తన పాదాలను పట్టుకోవాలనే వారి సంకల్పాన్ని తెలుసుకున్నాడు దామోదరుడు. దామోదర శబ్దముతో భక్త పరాధీనత తెలుస్తుంది. ఎలాగైతే ఆనాడు యశోదమ్మ సంకల్పాన్ని పూర్తి చేసాడో అలాగే ఈనాడు వారి సంకల్పాన్ని కూడా పూర్తి చేయదలచి
సఙ్కల్పో విదితః సాధ్వ్యో భవతీనాం మదర్చనమ్
మయానుమోదితః సోऽసౌ సత్యో భవితుమర్హతి
సాధ్వీమణులారా మీ సంకల్పం నాకు తెలిసింది. నన్ను మీరు ఎందుకు ఆరాధించారో నాకు తెలిసింది (వారు ఆరాధించినది కాత్యాయని అమ్మవారిని. కానీ ఇక్కడ స్వామి "నన్ను ఆరాధించారు" అంటున్నాడు. యో యో యాం యాం తనుం భక్తః శ్రద్ధయార్చితుమిచ్ఛతి | తస్య తస్యాచలాం శ్రద్ధాం తామేవ విదధామ్యహమ్ అన్నది గీతా వాక్యం అర్థమవుతుంది మనకు. ఎవరిని ఆరాధించినా అందులో ఉన్న అంతర్యామి కృష్ణుడే. సర్వదేవ నమస్కార: కేశవం ప్రతిగచ్ఛతి. ) మీ సంకల్పాన్ని నేను ఆమోదించాను. నాచేత ఆమోదించబడి ఆ సంకల్పం నిజమే అవుతుంది.
న మయ్యావేశితధియాం కామః కామాయ కల్పతే
భర్జితా క్వథితా ధానాః ప్రాయో బీజాయ నేశతే
నా మీద ఉన్న కామం కామాన్ని ప్రసాదించదు. నా మీద కోరిక సాంసారిక విషయాల మీద ప్రసరించదు. భూమి మీద విత్తనం వేస్తే మొలక వస్తుంది. కానీ వేసే ముందు ఆ ధాన్యాన్ని వేపి, లేదా దంచి భూమిలో వేస్తే మొలక ఎత్తదు. నా కామన ఇతర కామములకు దారి చూపదు.
యాతాబలా వ్రజం సిద్ధా మయేమా రంస్యథా క్షపాః
యదుద్దిశ్య వ్రతమిదం చేరురార్యార్చనం సతీః
మీరు నిస్సందేహముగా మీ మీ ఇళ్ళకు వెళ్ళండి. ఈ కొద్ది రోజులలోనే చక్కని వెన్నెల రాత్రులలో మీరు నాతఓ రమిస్తారు. మీరు సతులుగా భక్తురాళ్ళుగా దేన్ని మనసులో పెట్టుకుని కాత్యయనీని ఆరాధించారో ఆ మీ సంకల్పం నెరవేరుతుంది. కానీ ఆ నెరవేరిన సంకల్పం కామాన్ని ప్రసాదించదు. ఉద్వేగాన్ని పెంచదు. నా మీద కామం కూడా మోక్షాన్నే ఇస్తుంది.
శ్రీశుక ఉవాచ
ఇత్యాదిష్టా భగవతా లబ్ధకామాః కుమారికాః
ధ్యాయన్త్యస్తత్పదామ్భోజమ్కృచ్ఛ్రాన్నిర్వివిశుర్వ్రజమ్
ఇలా స్వామి ఆజ్ఞ్య ఇస్తే తమ కోరిక నెరవేరింది కాబట్టి ఆ పరమాత్మ పాదములను ధ్యానం చేస్తూ వెళ్ళలేక వెళ్ళలేక అతి కష్టం మీద వారు వారి ఇళ్ళకు వెళ్ళారు
అథ గోపైః పరివృతో భగవాన్దేవకీసుతః
వృన్దావనాద్గతో దూరం చారయన్గాః సహాగ్రజః
తోటి గోపాలకురల్తో కలసి కృష్ణ పరమాత్మ బృందావనానికి వెళ్ళాడు.
నిదఘార్కాతపే తిగ్మే ఛాయాభిః స్వాభిరాత్మనః
ఆతపత్రాయితాన్వీక్ష్య ద్రుమానాహ వ్రజౌకసః
పగలంతా ఎండ బాగా ఉండి ఆ ఎండ వేడికి ఇబ్బంది పడతారేమో అని చెట్లు తమ కొమ్మలతో నీడను ఇస్తున్నాయి.
హే స్తోకకృష్ణ హే అంశో శ్రీదామన్సుబలార్జున
విశాల వృషభౌజస్విన్దేవప్రస్థ వరూథప
కొంతమంది గోపాలబాలకులను పేరు పెట్టి పిలుస్తూ గోపాలబాలకులు ఇలా అంటున్నారు. ఈ వృక్షాలను చూసారా. ఇవి ఎలాంటి వృక్షాలంటే పరోపకార పరాయణులు. నిరతంతరం పరోపకారానికే ప్రయత్నిస్తున్నారు. వాటికి ఎటువంటి స్వార్థం లేదు. గాలీ నీరూ వర్షమూ ఎండా మంచూ, వీటిని తాము భరిస్తూ , వాటి నుండి మనను కాపాడుతున్నాయి. మనుషులకంటే చెట్ల పుట్టుకే ఎంతో అదృష్టవంతమైన గొప్పదైన జన్మ.
పశ్యతైతాన్మహాభాగాన్పరార్థైకాన్తజీవితాన్
వాతవర్షాతపహిమాన్సహన్తో వారయన్తి నః
అహో ఏషాం వరం జన్మ సర్వ ప్రాణ్యుపజీవనమ్
సుజనస్యేవ యేషాం వై విముఖా యాన్తి నార్థినః
ఉత్తములైతే తమ ఇంటికొచ్చిన అతిథులను ఒట్టిచేత్తో పంపించరు. అలాగే ఈ చెట్ల వద్దకు వచ్చిన వారు నిరాశతో వెళ్ళరు.
పత్రపుష్పఫలచ్ఛాయా మూలవల్కలదారుభిః
గన్ధనిర్యాసభస్మాస్థి తోక్మైః కామాన్వితన్వతే
పత్రములూ ఆకులూ పూవులూ పళ్ళూ నీడనూ బెరడునూ చెక్కనూ గంధమునూ నిర్యాతమనూ భస్మమునూ ఎండిన భాగాన్ని (అస్థి)ఇచ్చి కోరిన వారి అన్ని కోరికలనూ నెరవేరుస్తున్నారు.
ఏతావజ్జన్మసాఫల్యం దేహినామిహ దేహిషు
ప్రాణైరర్థైర్ధియా వాచా శ్రేయఆచరణం సదా
ఎవరు కోరితే అది లేదనకుండా ఇస్తున్నారు. లోకములో శరీర ధారులకు జన్మ సాఫల్యం ఎప్పుడంటే ప్రాణములతో అర్థములతో బుద్ధితో వాక్కుతో ఎదుటివారికి శ్రేయస్సునే అందించాలి. పరులకు శ్రేయస్సును ఆచరించుటే మన జన్మకు సార్ధక్యము. దానిని మన కంటే ఈ చెట్లే బాగా చేస్తున్నాయి.
ఇతి ప్రవాలస్తబక ఫలపుష్పదలోత్కరైః
తరూణాం నమ్రశాఖానాం మధ్యతో యమునాం గతః
వంగి ఉన్న చెట్ల కొమ్మల మధ్యనుండి వాటిని చూస్తూ చూస్తూ ఆహా ఎంత పుణ్యం చేసుకున్నాయి, ఎంత ధన్యములు ఈ వృక్షములు. నిజముగా వీరు కదా అదృష్టవంతులు. చెట్లూ పళ్ళూ ఆ చెట్లు ఇచ్చేవి తమ కోసం కాదు. సత్పురుషుల యొక్క సంపదలు స్వార్థం కోసం కాదు. పరోపకారం కోసమే.
తత్ర గాః పాయయిత్వాపః సుమృష్టాః శీతలాః శివాః
తతో నృప స్వయం గోపాః కామం స్వాదు పపుర్జలమ్
అక్కడ ఆవులను చక్కటి తీయటి కమ్మని నీరు తాగించి, మొదలు పశువులకు నీరు తాపించిన తరువాత తాము తాగారు. (మనం, మనం తాగగా మిగిలిన నీరు వాటికిస్తాము. తమచే పోషింపబడే వారికి ముందు భోజనం పెట్టి తరువాత మిగిలితే మనం తినాలి. భార్య పిల్లలూ అందరూ తిన్న తరువాతే భర్త తినాలి.భార్యా భర్తలు ఒకరు భోజనం చేస్తున్నప్పుడు ఒకరు చూడరాదు. )
తస్యా ఉపవనే కామం చారయన్తః పశూన్నృప
కృష్ణరామావుపాగమ్య క్షుధార్తా ఇదమబ్రవన్
ఇలా ఆ బృందావన ఉపవనములో ఆవులను తిప్పుతూ ఉండగా మధ్యాన్నం అయ్యింది. తెచ్చుకున్న చద్ది మూటలైపోగా మళ్ళీ ఆకలయ్యింది. అపుడు ఆకలవుతుంది అని చెప్పడానికి స్వామిని చేరారు అందరూ.
సర్వం శ్రీకృష్ణార్పణమస్తు