ఓం నమో భగవతే వాసుదేవాయ
శ్రీమద్భాగవతం దశమ స్కంధం నలభై ఐదవ అధ్యాయం
శ్రీశుక ఉవాచ
పితరావుపలబ్ధార్థౌ విదిత్వా పురుషోత్తమః
మా భూదితి నిజాం మాయాం తతాన జనమోహినీమ్
తల్లి తండ్రులకు అసలు విషయం తెలిసింది అని తెలుసుకున్నాడు స్వామి. వీరిద్దరూ అవతార పురుషులని తల్లి తండ్రులకు తెలిసింది అని తెలుసుకుని. అది అలా వుండరాదుకాబట్టి, తన దివ్య్మైన సకల జనములను మోహింపచేసే తన మాయను వారిపై కూడా ప్రసరింపచేసాడు
ఉవాచ పితరావేత్య సాగ్రజః సాత్వనర్షభః
ప్రశ్రయావనతః ప్రీణన్నమ్బ తాతేతి సాదరమ్
మొదలు తల్లి తండ్రుల మీద తన మాయను ప్రసరింపచేసి వారిని అమ్మా నాన్నా అని పిలుస్తూ
నాస్మత్తో యువయోస్తాత నిత్యోత్కణ్ఠితయోరపి
బాల్యపౌగణ్డకైశోరాః పుత్రాభ్యామభవన్క్వచిత్
తల్లి తండ్రులతో పుత్రులు ఎలా మాట్లాడాలి, అందులో ఇంచుమించు కాలం అంతా దూరముగా ఉన్నారు. బాల్యములో కైశోరములో పౌగండ్రములో మా నుండి మీకు ఎలాంటి ఆనందం కలగాలో అది మీకు కలగలేదు. వాటికి మేము దూరమయ్యాము.
న లబ్ధో దైవహతయోర్వాసో నౌ భవదన్తికే
యాం బాలాః పితృగేహస్థా విన్దన్తే లాలితా ముదమ్
దురదృష్టం ఆవరించిన మాకు మీ దగ్గర నివాసం కలగలేదు. కన్న తల్లి తండ్రుల దగ్గర వారింటిలో ఉండి సంతానం సహజముగా పొందవలసిన ఆనందాన్ని అదృష్టం లేని మేము పొందలేకపోయాము
సకల చరాచర జగత్తులో తల్లి తండ్రులకంటే గొప్పవారూ సేవించదగినవారూ మరొకరు లేరు.
సర్వార్థసమ్భవో దేహో జనితః పోషితో యతః
న తయోర్యాతి నిర్వేశం పిత్రోర్మర్త్యః శతాయుషా
అన్ని రకముల కార్యములనూ ఆరంభించడానికి మూలం ఐన శరీరం ఏ తల్లి తండ్రుల వలన ప్రసాదించబడినదో పోషించబడినదో, అటువంటి తల్లి తండ్రులు చేసిన దానికి ప్రత్యుపకారం నూరు సంవత్సరాలైనా చేయలేరు
యస్తయోరాత్మజః కల్ప ఆత్మనా చ ధనేన చ
వృత్తిం న దద్యాత్తం ప్రేత్య స్వమాంసం ఖాదయన్తి హి
అలా అని చెప్పి ఏమీ చేయకుండా తప్పించుకోరాదు. ఇటువంటి తల్లి తండ్రులకు వారి వృద్ధాప్యములో బతుకు తెరువు ఇవ్వాలి. సామర్ధ్యం ఉండి కూడా అలా చేయని వారికి పరలోకములో వారి మాంఅసాన్ని వారే తీసుకుని తినే శిక్ష పడుతుంది. శరీరముతో ధనముతో వారికి బతుకు తెరువు ఇవ్వని వారు వారి మాంసాన్నే భుజించే నరకములో పుడతారు.
మాతరం పితరం వృద్ధం భార్యాం సాధ్వీం సుతమ్శిశుమ్
గురుం విప్రం ప్రపన్నం చ కల్పోऽబిభ్రచ్ఛ్వసన్మృతః
పుత్రులైన వారు ఈ శ్లోకం రోజూ చదువుకోవాలి.
వృద్ధులైన తల్లి తండ్రులనూ, సాధ్వి ఐన (ఉత్తమురాలైన) భార్యనూ, శిశువైన పుత్రున్నీ బ్రాహ్మణుడైన గురువునూ సమర్ధుడై కూడా పోషించకుంటే వాడు శ్వాస తీస్తున్న శవము. చదువు కేవలం బతుకు తెరువుకే మాత్రం అనుకునే వారికి ఇదొక సమాధానం. మానవత్వానికి ఒక ధర్మం ఉంది.
తన్నావకల్పయోః కంసాన్నిత్యముద్విగ్నచేతసోః
మోఘమేతే వ్యతిక్రాన్తా దివసా వామనర్చతోః
ప్రతీ క్షణమూ కంసుని నుండి భయపడుతున్న మాకూ, అసమర్ధులమైన మాకు, ఇన్ని దివసాలూ వ్యర్థముగా గడచాయి మిమ్ములను అర్చించకుండా. శైశవం బాల్యం కౌమారం పౌగండ్రములో తల్లి తండ్రుల దగ్గర ఉండి వారిని సేవించకుండుటచే వ్యర్థముగా గడిచాయి
తత్క్షన్తుమర్హథస్తాత మాతర్నౌ పరతన్త్రయోః
అకుర్వతోర్వాం శుశ్రూషాం క్లిష్టయోర్దుర్హృదా భృశమ్
ఇది మా చేతులలో ఉన్న పని కాదు. మేము పరతంత్రులం. ఇంతకాలం మీకు దూరముగా ఉండి మిమ్ము సంతోషపెట్టనందుకూ, మిమ్ము సేవించనందుకూ, మావలన మీరు కష్టపడినందులకూ మమ్ము మీరు క్షమించండి.
శ్రీశుక ఉవాచ
ఇతి మాయామనుష్యస్య హరేర్విశ్వాత్మనో గిరా
మోహితావఙ్కమారోప్య పరిష్వజ్యాపతుర్ముదమ్
ఇప్పటిదాకా వీరిద్దరినీ పరమాత్మావతారం అనుకుంటున్నవారితో ఇలా మాట్లాడేసరికి వారిని తమ తొడ మీద కూర్చోబెట్టుకుని కౌగిలించుకున్నారు.
సిఞ్చన్తావశ్రుధారాభిః స్నేహపాశేన చావృతౌ
న కిఞ్చిదూచతూ రాజన్బాష్పకణ్ఠౌ విమోహితౌ
ఆనందబాష్పాలతో వారి శరీరాలను తడుపుతూ స్నేహపాశముతో గొంతులో కూడ తడి చేరి గొంతు బొంగురుపోయి మాట పెగల్లేదు.
ఏవమాశ్వాస్య పితరౌ భగవాన్దేవకీసుతః
మాతామహం తూగ్రసేనం యదూనామకరోన్ణృపమ్
కాల స్వరూపుడైన పరమాత్మ కాలాన్ని వ్యర్థము చేయక, రాజు లేని రాజ్యం ఉండకూడదు కాబట్టి ఉగ్రసేనుడికి పట్టాభిషేకం చేసి, మేము మీ సేవకులము, మమ్ము మీరు ఆజ్ఞ్యాపించండి ఏమి చేయాలో
ఆహ చాస్మాన్మహారాజ ప్రజాశ్చాజ్ఞప్తుమర్హసి
యయాతిశాపాద్యదుభిర్నాసితవ్యం నృపాసనే
మయి భృత్య ఉపాసీనే భవతో విబుధాదయః
బలిం హరన్త్యవనతాః కిముతాన్యే నరాధిపాః
యయాతి శాపం వలన మేము సింహాసనం మీద కూర్చుని పరిపాలించరాదు. అందుకే మిమ్ము రాజుగా చేసాము. మేము మీ బృత్యులము. మేము మీకు భృత్యులుగా ఉన్నప్పుడు దేవతలందరూ మీ ఆరాధన చేస్తారు. సామాన్యుల గురించి ఇక చెప్పేదేముంది
సర్వాన్స్వాన్జ్ఞతిసమ్బన్ధాన్దిగ్భ్యః కంసభయాకులాన్
యదువృష్ణ్యన్ధకమధు దాశార్హకుకురాదికాన్
రాజ్యములోని వారందరూ క్షేమముగా ఆనందముగా ఉండాలంటే రాజైన వాడు అంతముకుముదు ఉన్న రాజు వలన వేరే ప్రాంతాలకు విడిచి వెళ్ళిపోయిన వారుంటే వారిని పిలిపించి వారికి ఆశ్రయం కల్పించాలి. అంతకుముందు ఇల్లూ వాకిలీ ఆస్తులూ వదలి వెళ్ళిపోయినవారిని కృష్ణుడు పిలిపించి వారు వెళ్ళినపుడు వారికి ఉన్న ఆస్తిని మళ్ళీ వారికి ఇప్పించాడు.
సభాజితాన్సమాశ్వాస్య విదేశావాసకర్శితాన్
న్యవాసయత్స్వగేహేషు విత్తైః సన్తర్ప్య విశ్వకృత్
కృష్ణసఙ్కర్షణభుజైర్గుప్తా లబ్ధమనోరథాః
గృహేషు రేమిరే సిద్ధాః కృష్ణరామగతజ్వరాః
కృష్ణ రాముల వలన అన్ని జ్వరాలూ తొలగి బలరామ కృష్ణుల వలన అన్ని కోరికలూ తీర్చుకుంటూ అన్ని బాధలూ తొలగి ఆనందముగా ఉన్నారు
వీక్షన్తోऽహరహః ప్రీతా ముకున్దవదనామ్బుజమ్
నిత్యం ప్రముదితం శ్రీమత్సదయస్మితవీక్షణమ్
ప్రతీరోజు కన్నయ్య చిన్ని ముఖాన్ని తనివి తీరా చూస్తూ మురిసిపోతున్నారు. వారి మనసు ఎపుడూ కళకళలాడుతూ ఉంటోంది. బాధలున్నా లేకున్నా ఎవరైనా దగ్గరకు వస్తే వారిని దయతో చిరునవ్వుతో మాట్లాడేవారు. చిరునవ్వు పదహారు రకాలు ఉంటుంది. ఎదుటివారిని బుట్టలో వేసే చిరునవ్వు, కోపాన్ని దాచుకుని నవ్వే చిరునవ్వు, ఏడుపును దాచుకుని నవ్వే చిరునవ్వు, ప్రతీకారాన్ని దుఃఖాన్నీ దాచుకుని నవ్వేదీ ఇలాంటివి. మనకు రోజులో ఉత్తమమైన చిరునవ్వు ఉత్తములైన వారికి రెండు గంటలు వస్తుంది.
తత్ర ప్రవయసోऽప్యాసన్యువానోऽతిబలౌజసః
పిబన్తోऽక్షైర్ముకున్దస్య ముఖామ్బుజసుధాం ముహుః
వృద్ధులూ యువకులూ బలవంతులూ ప్రతాపవంతులూ అందరూ తమ నేత్రముల డొప్పలతో పరమాత్మ ముఖపద్మాన్ని మాటి మాటికీ తాగుతూ ఆనందాన్ని పొందారు.
అథ నన్దం సమసాద్య భగవాన్దేవకీసుతః
సఙ్కర్షణశ్చ రాజేన్ద్ర పరిష్వజ్యేదమూచతుః
అపుడు బలమ్రామ కృష్ణులు నందుని వద్దకు వెళ్ళి నమస్కరించి, నందున్ని ఆలింగనం చేసుకుని, ఈ మాట చెబుతున్నారు
పితర్యువాభ్యాం స్నిగ్ధాభ్యాం పోషితౌ లాలితౌ భృశమ్
పిత్రోరభ్యధికా ప్రీతిరాత్మజేష్వాత్మనోऽపి హి
మీరు గొప్ప స్నేహముతో ప్రేమతో మమ్ము ఇంతకాలం లాలించారు. తల్లి తండ్రులకంటే మా యందు మీరు మీకంటే ఎక్కువ ప్రేమను చూపారు.
స పితా సా చ జననీ యౌ పుష్ణీతాం స్వపుత్రవత్
శిశూన్బన్ధుభిరుత్సృష్టానకల్పైః పోషరక్షణే
కన్నవారే కాదు, తన సంతానం వలే పోషించిన వారు తల్లి తండ్రులే అవుతారు. పోషించడానికి అవకాశం లేని పరిస్థితిల్లో కన్న తల్లి తండ్రుల్లా పోషించిన వారు తల్లి తండ్రులే
యాత యూయం వ్రజంన్తాత వయం చ స్నేహదుఃఖితాన్
జ్ఞాతీన్వో ద్రష్టుమేష్యామో విధాయ సుహృదాం సుఖమ్
నాన్న గారూ మీరు వ్రేపల్లెకు వెళ్ళండి. మేము ఇంతకాలం మమ్ము దూరముగా ఉన్నందువలన దుఃఖించిన మా బంధువ్లను ఓదార్చి వారికి సుఖ సంతోషాలనిచ్చి మళ్ళీ వస్తాము.
ఏవం సాన్త్వయ్య భగవాన్నన్దం సవ్రజమచ్యుతః
వాసోऽలఙ్కారకుప్యాద్యైరర్హయామాస సాదరమ్
ఇలా నందాదులను ఓదార్చి వారికి బంగారమూ వెండీ ఆభరణాలూ వస్త్రాలూ రత్నాలూ కానుకలుగా ఇచ్చి వారిని వ్రేపల్లెకు పంపించారు.
ఇత్యుక్తస్తౌ పరిష్వజ్య నన్దః ప్రణయవిహ్వలః
పూరయన్నశ్రుభిర్నేత్రే సహ గోపైర్వ్రజం యయౌ
ఇలా చెప్పిన తరువాత నందుడు వారిని కౌగిలిచుకుని ప్రేమతో కళ్ళు మొత్తం నిండిపోగా పోలేక పోలేక తాను వ్రేపల్లెకు వెళ్ళాడు
అథ శూరసుతో రాజన్పుత్రయోః సమకారయత్
పురోధసా బ్రాహ్మణైశ్చ యథావద్ద్విజసంస్కృతిమ్
పన్నెండవ యేట వారికి ఉపనయనాదులు జరిపించారు. ఆ సమయములో బ్రాహ్మణోత్తములకు బంగారు నూపురాలతో బంగారు బంగారు హారాలతో గిట్టలతో బంగారు కొమ్ములతో పట్టు వస్త్రాలతో అలంకరించబడి ఉన్న గోవులను (ఎన్ని గోవులను కృష్ణ పరమాత్మ పుట్టినపుడు ఇస్తానని సంకల్పించుకున్నాడో అన్ని గోవులను ఇచ్చాడు. )
ఆనాడు కంసుని నిర్భందములో ఉన్నందున కుమారులు కలిగినా దానం చేయలేని దుస్థితిలో ఉన్నందున మనసుతో మాత్రమే సంకల్పించుకున్నాడు. వాటిని ఈనాడు ఇచ్చి ఆ బాకీ తీర్చుకున్నాడు
తేభ్యోऽదాద్దక్షిణా గావో రుక్మమాలాః స్వలఙ్కృతాః
స్వలఙ్కృతేభ్యః సమ్పూజ్య సవత్సాః క్షౌమమాలినీః
యాః కృష్ణరామజన్మర్క్షే మనోదత్తా మహామతిః
తాశ్చాదదాదనుస్మృత్య కంసేనాధర్మతో హృతాః
తతశ్చ లబ్ధసంస్కారౌ ద్విజత్వం ప్రాప్య సువ్రతౌ
గర్గాద్యదుకులాచార్యాద్గాయత్రం వ్రతమాస్థితౌ
ఇలా ఉపనయనమైన తరువాత గర్గుని వద్ద గాయత్రీ మంత్రాన్ని పొందారు
ప్రభవౌ సర్వవిద్యానాం సర్వజ్ఞౌ జగదీశ్వరౌ
నాన్యసిద్ధామలం జ్ఞానం గూహమానౌ నరేహితైః
అన్ని విద్యలకూ మూలం ఐన వారు జగన్నాధులూ, ఇతరుల వలన పొందదగిన అవసరం లేని జ్యానం కలవారైనా కూడా మానవులుగా పుట్టినందున ఆ జ్ఞ్యానాన్ని దాచుకుని
అథో గురుకులే వాసమిచ్ఛన్తావుపజగ్మతుః
కాశ్యం సాన్దీపనిం నామ హ్యవన్తిపురవాసినమ్
చదువుకోడానికి గురుకులానికి వెళ్ళారు. కాశీ నగరములో ఉండే సాందీపుని వద్దకు వెళ్ళారు
యథోపసాద్య తౌ దాన్తౌ గురౌ వృత్తిమనిన్దితామ్
గ్రాహయన్తావుపేతౌ స్మ భక్త్యా దేవమివాదృతౌ
మమ్ము శిష్యులుగా స్వీకరించవలసింది అని ప్రార్థించారు. భగవంతుడు ఎదురుకుండా ఉంటే మనమెలా భక్తి శ్రద్ధలతో సేవిస్తామో వారు గురువును అదే రీతిలో సేవించగా
తయోర్ద్విజవరస్తుష్టః శుద్ధభావానువృత్తిభిః
ప్రోవాచ వేదానఖిలాన్సఙ్గోపనిషదో గురుః
నిష్కపటమైన పరిశుద్దమైన మనసుతో గురువును అనుసరించారు. దానితో ఆ బ్రాహ్మణోత్తముడు సంతోషించి ఆరు వేదాంగాలనూ బోధించాడు, వేదాలనూ ఉపనిషత్తులనూ బోధించాడు
సరహస్యం ధనుర్వేదం ధర్మాన్న్యాయపథాంస్తథా
తథా చాన్వీక్షికీం విద్యాం రాజనీతిం చ షడ్విధామ్
ధనుర్విద్యనూ, న్యాయమార్గములో ఉన్నవాటినీ, వేదాంతమూ తర్కమూ రాజనీతీ
సర్వం నరవరశ్రేష్ఠౌ సర్వవిద్యాప్రవర్తకౌ
సకృన్నిగదమాత్రేణ తౌ సఞ్జగృహతుర్నృప
సకల విద్యలనూ ప్రవర్తింపచేసేవారికి నేర్పించారు. ఒక సారి చెప్పగానే వారికి అవగతమయ్యాయి.
అహోరాత్రైశ్చతుఃషష్ట్యా సంయత్తౌ తావతీః కలాః
గురుదక్షిణయాచార్యం ఛన్దయామాసతుర్నృప
మొత్తం అరవై నాలుగు కళలనూ అరవై నాలుగు రోజులలో చెప్పాడు గురువు. ఆ గురువుగారిని గురు దక్షిణగా ఏమి ఇవ్వాలని అడిగారు. గురువుగారికి వారికి ఇష్టమైన ధనం గురు దక్షిణగా ఇవ్వాలి (శక్తి ఉంటే).
ద్విజస్తయోస్తం మహిమానమద్భుతం
సంలోక్ష్య రాజన్నతిమానుసీం మతిమ్
సమ్మన్త్ర్య పత్న్యా స మహార్ణవే మృతం
బాలం ప్రభాసే వరయాం బభూవ హ
వీరికున్న మానవాతీతమైన బుద్ధి వైభవాన్ని చూచి భార్యతో ఆలోచించి ప్రభాస తీర్థములో సముద్రములో పడిన తన పుత్రున్ని ఇమ్మని అడిగారు
తేథేత్యథారుహ్య మహారథౌ రథం
ప్రభాసమాసాద్య దురన్తవిక్రమౌ
వేలాముపవ్రజ్య నిషీదతుః క్షనం
సిన్ధుర్విదిత్వార్హనమాహరత్తయోః
అలాగే అని రథం ఎక్కి ప్రభాసానికి వెళ్ళారు. సముద్రం వద్దకు వెళ్ళగానే సముద్రుడు ఎదురుగా వచ్చి స్వాగతం చెప్పి అన్ని పూజలూ చేయగా, కృష్ణుడు తన గురు పుత్రులను అడిగారు
తమాహ భగవానాశు గురుపుత్రః ప్రదీయతామ్
యోऽసావిహ త్వయా గ్రస్తో బాలకో మహతోర్మిణా
స్నానం చేస్తుండగా ఒక తరంగం వచ్చి మింగిందట, ఆ పిల్లవాన్ని ఇవ్వు.
శ్రీసముద్ర ఉవాచ
న చాహార్షమహం దేవ దైత్యః పఞ్చజనో మహాన్
అన్తర్జలచరః కృష్ణ శఙ్ఖరూపధరోऽసురః
అపుడు సముద్రుడు నేను అపహరించలేదు. ఇందులో మునిగితే ఇందులో ఉన్న పంచ జనుడు అనే శంఖ రూపములో ఉన్న రాక్షసుడు అపహరించాడు.
ఆస్తే తేనాహృతో నూనం తచ్ఛ్రుత్వా సత్వరం ప్రభుః
జలమావిశ్య తం హత్వా నాపశ్యదుదరేऽర్భకమ్
వెంటనే స్వామి నీటిలో ప్రవేశించి ఆ రాక్షసున్ని సంహరించి అతని గర్భములో కుమారుడు లేకపోవడాన్ని గమనించాడు
తదఙ్గప్రభవం శఙ్ఖమాదాయ రథమాగమత్
తతః సంయమనీం నామ యమస్య దయితాం పురీమ్
అతని పొట్టలో ఒక శంఖం దొరికింది. ఆ శంఖం తీసుకుని రథం ఎక్కాడు. ఎక్కి యమలోకానికి వెళ్ళాడు
గత్వా జనార్దనః శఙ్ఖం ప్రదధ్మౌ సహలాయుధః
శఙ్ఖనిర్హ్రాదమాకర్ణ్య ప్రజాసంయమనో యమః
తెచ్చుకున్న శంఖాన్ని పూరించాడు. యమ లోకానికి వెళ్ళిన వారు కూడా పాంచజన్య శబ్దాన్ని వింటే తిరిగి వస్తారు. వైకుంఠాన్ని చేరతారు. ఆ ధ్వని వినలేకున్నా పాంచజన్యం అన్న పేరు వింటే చాలు.
తయోః సపర్యాం మహతీం చక్రే భక్త్యుపబృంహితామ్
ఉవాచావనతః కృష్ణం సర్వభూతాశయాలయమ్
ఆ ధ్వని విన్న యముడు ఎదురు వచ్చి పూజించి
లీలామనుష్యయోర్విష్ణో యువయోః కరవామ కిమ్
ఏమి ఆజ్ఞ్య అన్ అడిగాడు
శ్రీభగవానువాచ
గురుపుత్రమిహానీతం నిజకర్మనిబన్ధనమ్
ఆనయస్వ మహారాజ మచ్ఛాసనపురస్కృతః
వాడు చేసుకున్న కర్మకు అనుగుణముగా నీవు మా గురు పుత్రున్ని ఇక్కడకు తీసుకు వచ్చినట్లు తెలుసు. నా ఆజ్ఞ్యను వహించి ఆ పిల్లవాన్ని తీసుకు రా
తథేతి తేనోపానీతం గురుపుత్రం యదూత్తమౌ
దత్త్వా స్వగురవే భూయో వృణీష్వేతి తమూచతుః
ఆ అబ్బయిని తెచ్చి ఇచ్చి ఇంకేమి ఆజ్ఞ్య అని అడిగాడు.
శ్రీగురురువాచ
సమ్యక్సమ్పాదితో వత్స భవద్భ్యాం గురునిష్క్రయః
కో ను యుష్మద్విధగురోః కామానామవశిష్యతే
కొడుకును చూసుకున్న గురువుగారు,
గురువుగారికి ప్రత్యుపకారం చాలా చక్కగా చేసావు. ఇటువంటి గురు దక్షిణ ప్రపంచములో ఎవరూ ఇచ్చి ఉండలేదు.
మీలాంటి శిష్యుడు ఉన్న గురువుకు తీరని కోరికలు ఉంటాయా
గచ్ఛతం స్వగృహం వీరౌ కీర్తిర్వామస్తు పావనీ
ఛన్దాంస్యయాతయామాని భవన్త్విహ పరత్ర చ
మీరు మీ ఇంటీకి వెళ్ళండి. మీకు పరిశుద్ధమైన కీర్తి కలుగు గాక. మీరు చదువుకున్న చదువులు పాతబడిబోకుండా ఉండాలి, ఇహ లోకములో పరలోకములో (అంటే ఆ విద్య ఏ ఒక్క నాడూ చదవబడకుండా ఉండరాదు. ఎలా ఐతే వండిన అన్నం మూడు గంటలు (ఒక ఝాము) లోపు తినాలో ప్రతీ రోజు గురువుగారు చెప్పిన పాఠాన్ని చదువుతూ ఉండాలి.)
చదువుకున్న విద్య ఒక్కరోజు ఆవృతం చేయకున్నా వ్యర్థం. శాస్త్రం అభ్యాసం చేయకా, శస్త్రం(ఆయుధం) అభ్యాసం చేయడం వలనా విషముతో సమానం అవుతుంది. అనభ్యాసే విషం శాస్త్రం.
గురుణైవమనుజ్ఞాతౌ రథేనానిలరంహసా
ఆయాతౌ స్వపురం తాత పర్జన్యనినదేన వై
ఇలా గురువుగారి ఆజ్ఞ్యను పొంది తమ నగరానికి మేఘ గంభీర ధ్వనితో రాగా వారిని చూచి
సమనన్దన్ప్రజాః సర్వా దృష్ట్వా రామజనార్దనౌ
అపశ్యన్త్యో బహ్వహాని నష్టలబ్ధధనా ఇవ
అందరూ పరమానందాన్ని పొంది అభినందించారు. అరవై నాలుగు రోజులు చూడకపోవడముతో పోయిన ధనం దొరికితే ఎలా సంతోషిస్తారో అలా సంతోషించారు.
సర్వం శ్రీకృష్ణార్పణమస్తు