శ్రీమద్భాగవతం దశమ స్కంధం పన్నెండవ అధ్యాయం
ఓం నమో భగవతే వాసుదేవాయ
శ్రీశుక ఉవాచ
క్వచిద్వనాశాయ మనో దధద్వ్రజాత్ప్రాతః సముత్థాయ వయస్యవత్సపాన్
ప్రబోధయఞ్ఛృఙ్గరవేణ చారుణా వినిర్గతో వత్సపురఃసరో హరిః
ఆరవ ఏడు వస్తే పౌగండ్రం. ఐదేళ్ళ దాకా కౌమారం. ఏడాది దాకా శైశవం. పదకొండేళ్ళు దాటితే కిశోరుడు, పదహారేళ్ళు దాటితే యువకులు. యాభై రెండు దాటితే వృద్ధాప్యం, డెబ్భై దాటితే స్థావిర్యం. ఇలా ఆరు అవస్థలు ఉంటాయి. బల రామ కృష్ణులు పౌగండ్రములోకి రాబోతున్నారు. కౌమారము దాటారన్నదానికి గుర్తేమిటంటే, నిలాయనైః సేతుబన్ధైర్మర్కటోత్ప్లవనాదిభిః - పిల్లలు ఆడుకునే ఆటలు, దాగుడు మూతలూ, పిచుక గూళ్ళూ (ఒకరు గూడు కడుతూ ఉంటే ఇంకొకరు దూకుతారు, అదే కోతి గంతులు). ఇలా రక రకాల ఆటలతో కౌమార భావాన్ని వారు విడిచిపెడుతున్నారు
స్వామి వన భోజనానికి వెళదామనుకున్నాడు. అడవిలో భోజనం చేయాలన్న సంకల్పముతో స్వామి (అన్ని లోకాలవారు పరమాత్మ ద్వారం దగ్గర లేపడానికి నిలబెడితే) ఆయన త్వరగా లేచి కొమ్ము ఊదుతూ పడుకుని ఉన్న మిత్రులైన దూడలను కాచే గోపాల బాలకులను లేపుతున్నాడు. ఎందరో స్వామి యొక్క నిద్రాకాలిక విచ్చుకునే కనుల సౌందర్యం చూడగోరుతుంటే, ఆ పరమాత్మ గోపాల బాలకులను లేపుతున్నాడు.
తేనైవ సాకం పృథుకాః సహస్రశః స్నిగ్ధాః సుశిగ్వేత్రవిషాణవేణవః
స్వాన్స్వాన్సహస్రోపరిసఙ్ఖ్యయాన్వితాన్వత్సాన్పురస్కృత్య వినిర్యయుర్ముదా
తమ తమ వేలాది దూడలను ముందర నిలుపుకుని కొమ్ములూ పిల్లనగ్రోవులూ బెత్తమూ ఇవన్నీ పట్టుకుని అటుకులు తినే గోపాలకులు బాగా బలిసి ఉండి, వారంతా ముందు కదలగా,
కృష్ణవత్సైరసఙ్ఖ్యాతైర్యూథీకృత్య స్వవత్సకాన్
చారయన్తోऽర్భలీలాభిర్విజహ్రుస్తత్ర తత్ర హ
ప్రతీ గోపాలబాలుడు తన దూడలను లెక్కకు మించి ఉన్న కృష్ణ పరమాత్మ దూడలతో ఐక్యం చేసి, పిల్లల ఆటలతో అటూ ఇటూ విహరించారు.
ఫలప్రబాలస్తవక సుమనఃపిచ్ఛధాతుభిః
కాచగుఞ్జామణిస్వర్ణ భూషితా అప్యభూషయన్
వనములో దొరికే వస్తువులతో వీరిని వీరు అలంకరించుకుని వనమును వీరు అలంకరించారు (బంగారమూ గురివిందలూ మణులు).
పళ్ళతో కాయలతో చిగుటాకులతో గుత్తులతో పూవులతో కొంతభాగం అలంకరించుకున్నారు. మరికొంతభాగం బంగారం సీసం గురివిందలూ మణులతో అలంకరించుని, ఆ వనాన్ని అలంకరింపచేసారు.
ముష్ణన్తోऽన్యోన్యశిక్యాదీన్జ్ఞాతానారాచ్చ చిక్షిపుః
తత్రత్యాశ్చ పునర్దూరాద్ధసన్తశ్చ పునర్దదుః
పిల్లలు కాబట్టి పక్కవారు చూస్తుండగానే వారి ఉట్టిని వీరూ, వీరి ఉట్టిని వారూ దొంగిలిస్తున్నారు. ఒకరినొకరు ఆక్షేపించుకుంటున్నారు. దూరముగా పరిగెడుతున్నారు, మళ్ళీ వారే వచ్చి చేరుతున్నారు.
యది దూరం గతః కృష్ణో వనశోభేక్షణాయ తమ్
అహం పూర్వమహం పూర్వమితి సంస్పృశ్య రేమిరే
పరమాత్మ కృష్ణుడు కొంత దూరముగా వెళితే పిల్లలు ఎవరు ముందు కృష్ణున్ని ముట్టుకుంటారో అని పోటీ పెట్టుకునేవారు.
కేచిద్వేణూన్వాదయన్తో ధ్మాన్తః శృఙ్గాణి కేచన
కేచిద్భృఙ్గైః ప్రగాయన్తః కూజన్తః కోకిలైః పరే
మురళి వాయిస్తూ కొమ్ములు ఊదుతూ, తుమ్మెదలు పద్మాలలో నాదం చేస్తుంటే ఆ నాదముతో కొందరు గొంతు కలుపుతున్నారు. కోకిలలతో కలిసి కొందరు పాటలు పాడుతున్నారు
విచ్ఛాయాభిః ప్రధావన్తో గచ్ఛన్తః సాధుహంసకైః
బకైరుపవిశన్తశ్చ నృత్యన్తశ్చ కలాపిభిః
పక్షులు పైన ఎగురుతూ ఉంటే ఆ రెక్కల నీడనే పరిగెత్తే ఆట ఆడుతున్నారు - విచ్ఛాయాభిః ప్రధావన్తో
కొందరు హంఅసలతో కలిసి నడుస్తూ, కొంగలతో కలిసి కూర్చోవడం నెమళ్ళతో కలిసి నాట్యం చేయడం, కోతులని లాగడం, కోతులతో కలిసి చెట్లు ఎక్కడం
వికర్షన్తః కీశబాలానారోహన్తశ్చ తైర్ద్రుమాన్
వికుర్వన్తశ్చ తైః సాకం ప్లవన్తశ్చ పలాశిషు
కోతులు చేసిన చేష్టలను వీరు అనుకరించడం
సాకం భేకైర్విలఙ్ఘన్తః సరితః స్రవసమ్ప్లుతాః
విహసన్తః ప్రతిచ్ఛాయాః శపన్తశ్చ ప్రతిస్వనాన్
కప్పలతో కలిసి గంతులు వేయడం
ఇత్థం సతాం బ్రహ్మసుఖానుభూత్యా దాస్యం గతానాం పరదైవతేన
మాయాశ్రితానాం నరదారకేణ సాకం విజహ్రుః కృతపుణ్యపుఞ్జాః
నదీ ప్రవాహముతో మునిగి తేలి ఈత కొడుతున్నారు. ఒకరినొకరు చూసి నవ్వుతున్నారు. అడవిలో ఒక భాగములోకి వెళ్ళి ఇంకో భాగం నుండి ప్రతిధ్వని వినిపిస్తున్నారు.
పుణ్యాల పోగులే గోపాల బాలురుగా పుట్టారు. బ్రహ్మ సుఖానుభూతి - ఆనందం అని కూడా తెలుసుకోలేని స్థితిలో ఉన్నారు. ఆ బ్రహ్మ సుఖం మన ప్రయత్నముతో సిద్ధించదు. పరమాత్మ సంకల్పముతో మాత్రమే సాధ్యపడుతుంది
యత్పాదపాంసుర్బహుజన్మకృచ్ఛ్రతో
ధృతాత్మభిర్యోగిభిరప్యలభ్యః
స ఏవ యద్దృగ్విషయః స్వయం స్థితః
కిం వర్ణ్యతే దిష్టమతో వ్రజౌకసామ్
పరమాత్మ ఈ గోపాల బాలకులకు బ్రహ్మ సుఖానుభూతి కలిగించి, ఆ అనుభూతిలో ఈ గోపాల బాలకులందరూ దాసులయ్యారు. అలా కృష్ణ పరమాత్మతో కలిసి విహరించడానికి వారు పుణ్యాల రాశిని చేసుకున్నారు. వ్రేపల్లె వాసుల అదృష్టాన్ని ఏ పదాలతో వర్ణించగలము. కొన్ని వేల జన్మలలో యోగమును అభ్యసించి మనసునీ ఇంద్రియాలనూ నిగ్రహించి తపింపచేసిన యోగులకు కూడా పరమాత్మ యొక్క పాద ధూళి దొరకదు.
అథాఘనామాభ్యపతన్మహాసురస్తేషాం సుఖక్రీడనవీక్షణాక్షమః
నిత్యం యదన్తర్నిజజీవితేప్సుభిః పీతామృతైరప్యమరైః ప్రతీక్ష్యతే
వీరు ఇంత పరమానందములో ఉండగా అఘాసురుడనే రాక్షసుడు ఆనందముగా ఆడుకుంటున్నవారి ఆటను చూడజాలకపోయాడు. అమృతం తాగిన దేవతలు కూడా ఈ అఘాసురుడు ఎప్పుడు మరణిస్తాడా అని ఎదురుచూస్తున్నారు. పూతన, బకాసురులకు తమ్ముడు ఈ అఘాసురుడు.
దృష్ట్వార్భకాన్కృష్ణముఖానఘాసురః
కంసానుశిష్టః స బకీబకానుజః
అయం తు మే సోదరనాశకృత్తయోర్
ద్వయోర్మమైనం సబలం హనిష్యే
వీరు నా సోదరులను నశింపచేసిన వారు కాబట్టి, ఈ ఇద్దరినీ నేను యమలోకానికి తీసుకుని వెళతాను.
ఏతే యదా మత్సుహృదోస్తిలాపః కృతాస్తదా నష్టసమా వ్రజౌకసః
ప్రాణే గతే వర్ష్మసు కా ను చిన్తా ప్రజాసవః ప్రాణభృతో హి యే తే
ఇప్పటిదాకా మా బంధువులకు ఇచ్చిన నువ్వుల నీళ్ళు, ఇక ముందు వీరి బంధువులు వీరికి ఇవ్వాలి. తమకు వచ్చిన కష్టాలే పక్కవారికి రావాలి అని కోరుకునే వారే అఘాసురులు. అదే పాపము.
ఇతి వ్యవస్యాజగరం బృహద్వపుః స యోజనాయామమహాద్రిపీవరమ్
ధృత్వాద్భుతం వ్యాత్తగుహాననం తదా పథి వ్యశేత గ్రసనాశయా ఖలః
వీరిద్దరూ చనిపోతే వ్రేపల్లెలో ఎవరూ బతుకరు. బతికున్నా ప్రయోజనం లేదు, ప్రాణం పోయిన శరీరములా ఉంటుంది వ్రేపల్లె
ధరాధరోష్ఠో జలదోత్తరోష్ఠో దర్యాననాన్తో గిరిశృఙ్గదంష్ట్రః
ధ్వాన్తాన్తరాస్యో వితతాధ్వజిహ్వః పరుషానిలశ్వాసదవేక్షణోష్ణః
ప్రజల ప్రాణాలు ప్రభువు ప్రాణాలతో సంబందించి ఉంటాయి. ఒక పెద్ద కొండ చిలువ ఆకారముతో వచ్చాడు. అది ఒక యోజనం (పన్నెండు కిలో మీటర్లు ఉంది). పెద్ద పర్వత గుహలాగ నోరు తెరుచుకుని ఉంది. దూడలనూ ఆవులనూ తీసుకు వెళుతున్న దారిలో వీరిని మింగదలచి నోరు తెరుచుకుని కనపడ్డాయి. అందులో కింది పెదవి భూమి మీదా, రెండవ పెదవి మేఘాల దగ్గరా ఉంది
దవడలు వనానికి రెండు హద్దులా ఉన్నాయి. పర్వత శిఖరాల వంటి కోరలు. నోటి లోపల కటిక చీకటి. అగ్ని శిఖలాగ మండుతున్న నాలుక కలిగి, మహా కఠినమైన కారు చిచ్చు వేడిలాంటి శ్వాస గలవాడు
దృష్ట్వా తం తాదృశం సర్వే మత్వా వృన్దావనశ్రియమ్
వ్యాత్తాజగరతుణ్డేన హ్యుత్ప్రేక్షన్తే స్మ లీలయా
అలాంటి వాన్ని చూచి అందరూ బృందావనములో ఇది కూడా ఒక కొత్త వింత అనుకున్నారు.
ఇది పర్వత గుహ అనుకుని "ఈ పర్వతం అచ్చం కొండచిలువ నోటిలా ఉందే" అనుకున్నారు.
అహో మిత్రాణి గదత సత్త్వకూటం పురః స్థితమ్
అస్మత్సఙ్గ్రసనవ్యాత్త వ్యాలతుణ్డాయతే న వా
మిత్రులందరితో ఆ విషయం చెప్పారు. "చూడండి, ఇది చూస్తే కొండ చిలువలా ఉంది. మనందరినీ మింగేట్లుగా ఉంది. "
సత్యమర్కకరారక్తముత్తరాహనువద్ఘనమ్
అధరాహనువద్రోధస్తత్ప్రతిచ్ఛాయయారుణమ్
సూర్యుని కిరణాలు పడేసరికి కొండ పై భాగం కొండచిలువ నోటి పైభాగములా కనపడుతోంది. ఆ పక్కా ఈ పక్కా కూడా కొండచిలువలాగే ఉంది. పర్వతం యొక్క లోపలి భాగాలూ , ఈ పక్కా ఆ పక్కా నాలికతో తమని తామే నాకుతున్నట్లు కనపడుతోంది. ఈ పెద్ద శిఖరాలు పాము యొక్క దమ్ష్ట్రలు వలె కనపడుతున్నాయి. కారు చిచ్చుతో కాలిపోయిన చెట్ల వాసన ఎలా ఉందంటే కొండచిలువ ఏదైనా ప్రాణిని తినేస్తే ఆ చనిపోయిన ప్రాణి (పాము) యొక్క వాసన లాగ ఉంది. పర్వతాన్ని చూచి కొండచిలువ అనుకుంటున్నామో కొండ్చిలువను చూచి పర్వతం అనుకుంటున్నామో. ఒక వేళ ఇది కొండచిలువే ఐనా మనకేమి భయం. బకాసురుడి గతి ఏమయ్యింది. ఇదే కొండచిలువ ఐతే చస్తాడు. కొండే ఐతే మనం ఎక్కుదాము (ఇదే దృడమైన అధ్యవసాయం అంటే)
ప్రతిస్పర్ధేతే సృక్కభ్యాం సవ్యాసవ్యే నగోదరే
తుఙ్గశృఙ్గాలయోऽప్యేతాస్తద్దంష్ట్రాభిశ్చ పశ్యత
ఆస్తృతాయామమార్గోऽయం రసనాం ప్రతిగర్జతి
ఏషాం అన్తర్గతం ధ్వాన్తమేతదప్యన్తరాననమ్
దావోష్ణఖరవాతోऽయం శ్వాసవద్భాతి పశ్యత
తద్దగ్ధసత్త్వదుర్గన్ధోऽప్యన్తరామిషగన్ధవత్
అస్మాన్కిమత్ర గ్రసితా నివిష్టానయం తథా చేద్బకవద్వినఙ్క్ష్యతి
క్షణాదనేనేతి బకార్యుశన్ముఖం వీక్ష్యోద్ధసన్తః కరతాడనైర్యయుః
చప్పట్లు కొట్టుకుంటూ దాని నోటిలోకి నడుచుకుంటూ వెళ్ళారు.
ఇత్థం మిథోऽతథ్యమతజ్జ్ఞభాషితం
శ్రుత్వా విచిన్త్యేత్యమృషా మృషాయతే
రక్షో విదిత్వాఖిలభూతహృత్స్థితః
స్వానాం నిరోద్ధుం భగవాన్మనో దధే
ఉన్నదాన్ని లేనట్లుగా లేని దాన్ని ఉన్నట్లుగా వీళ్ళు అనుకుంటున్నారు.
మనం కూడా ఎప్పుడూ అలాగే అనుకుంటాము. ఈ సంసారమనే గుహలోకి మనం వెళుతూ కూడా చేతులతో చప్పట్లు చరుస్తూనే వెళ్ళాలి. మనం చేసే కర్మల (చేతుల) చప్పుళ్ళతోనే మనం సంసారములోకి వెళతాము. అఘాసుర సంహారం అంటే మనం అజ్ఞ్యానములో సంసారములో ఎలా పడి మగ్గుతామో చెబుతుంది.పరమాత్మ విన్నాడు. సత్యం కూడా వీరి దగ్గర అబద్దముగా మారుతోంది. రాక్షసుడని తెలియక పిల్లలు అందులో పడుతున్నారు. వారిని కాపాడాలి. ఎందుకంటే ఆయన అందరి హృదయాలలో ఉన్నాడు. అఖిల జీవులకీ స్నేహితుడు. లోకములో సహజముగా హితం కోరేవారు తల్లీ మిత్రుడూ తండ్రి. తక్కిన వారు వారి ప్రయోజనాన్ని బట్టి హితము కోరతారు. పరమాత్మకు మనతో పనిలేదు. మనకే ఆయనతో పని.
తావత్ప్రవిష్టాస్త్వసురోదరాన్తరం పరం న గీర్ణాః శిశవః సవత్సాః
ప్రతీక్షమాణేన బకారివేశనం హతస్వకాన్తస్మరణేన రక్షసా
తన వారిని కాపాడటానికి స్వామి సంకల్పించాడు. పరమాత్మ అనుకునే లోపే కొంతమంది గోవులూ గోపాలకులూ పాము నోట్లోకి వెళ్ళారు
కానీ వారు పాము కడుపులో పడి అరిగిపోలేదు. (కొండచిలువ వీరు లోపలకి పోగానే నోరు మూసుకోలేదు కృష్ణుడు రాలేదు కాబట్టి. అందుకే ఆ గోపాలురు అరిగిపోలేదు.భగవంతుని కోసం ఎదురు చూచేవాడు రాక్షసుడైనా ఋషి ఐనా లోకానికి మేలే చేస్తాడు). కృష్ణుని కోసం ఎదురుచూస్తున్నాడు రాక్షసుడు. ఆ రాక్షసుడి మనసులో పగ బాగా ఉంది. తన వారిని చంపిన వాడు అన్న కక్ష ఉంది. ఇలా ఆలోచిస్తూ నోరు మూయలేదు. తెరిచే ఉంచాడు. పరమాత్మ కాపాడ దలచుకుంటే సంహరించేవాడితోటే కాపాడిస్తాడు.
పగతో భగవంతుని ధ్యానించినా భగవంతుని భక్తులకు ఉపకారమే చేస్తాడు. ఎలాగైనా పరమాత్మ మనసులో ఉంటే చాలు. ఆయన మనసులో ఉంటే కీడు జరుగదు.
తాన్వీక్ష్య కృష్ణః సకలాభయప్రదో
హ్యనన్యనాథాన్స్వకరాదవచ్యుతాన్
దీనాంశ్చ మృత్యోర్జఠరాగ్నిఘాసాన్
ఘృణార్దితో దిష్టకృతేన విస్మితః
కృష్ణుడి కన్నా వేరే దిక్కు ఉంది అని భావించేవారు కారు గోపాల బాలురు. అందరికీ అభయాన్నిచ్చే కృష్ణపరమాత్మ వారిని చూచాడు. తనకన్నా వేరే దిక్కు లేకున్నా తన చేతిలోంచి జారిన వారిని చూచాడు. మృత్యువు యొక్క కడుపులోని అగ్నికి వీరు ఆహారం అవుతున్నారు. అటువంటి వారి మీద దయ కలిగి "దైవం ఎంత పని చేస్తుంది" అని కృష్ణుడు కూడా ఆశ్చర్యపడ్డాడు.
కృత్యం కిమత్రాస్య ఖలస్య జీవనం
న వా అమీషాం చ సతాం విహింసనమ్
ద్వయం కథం స్యాదితి సంవిచిన్త్య
జ్ఞాత్వావిశత్తుణ్డమశేషదృగ్ఘరిః
అఘాసురున్ని చంపుదామంటే వీరంతా కడుపులో ఉన్నారు. వాన్ని బతికిస్తే మిగతావారు చస్తారు.
రెండూ కావాలి. వీడు చావాలి, వారు బతకాలి. నేను లోపలకి వెళితే వాడికి తృప్తి నన్ను మింగానని. అందుచే కృష్ణుడు లోపలకు ప్రవేశించాడు.
అన్ని విషయాలు తెలుసుకోగల హరి కూడా కడుపులో ప్రవేశించాడు.
తదా ఘనచ్ఛదా దేవా భయాద్ధాహేతి చుక్రుశుః
జహృషుర్యే చ కంసాద్యాః కౌణపాస్త్వఘబాన్ధవాః
ఇదంతా దేవతలు మబ్బుల చాటున దాక్కుని చూస్తున్నారు
అది చూసి హాహాకారాలు చేసారు. అఘాసురుని బంధువులూ కంసాదులు సంతోషించారు.
తచ్ఛ్రుత్వా భగవాన్కృష్ణస్త్వవ్యయః సార్భవత్సకమ్
చూర్ణీచికీర్షోరాత్మానం తరసా వవృధే గలే
ఇలా వారి ఆనందాలూ వీరి విషాదాలు. అన్ని రకములైన వాటిని విన్న అవ్యయుడైన (వ్యయం కాని) పరమాత్మ, తాను లోపలకు వెళ్ళగానే తాను మింగిన గోవులూ గోపాల బాలకులనూ పొడి చేయాలనుకున్నాడు ఆ రాక్షసుడని తెలుసుకుని, గొంతు వద్ద తన శరీరం పెంచి నిలబడ్డాడు.
తతోऽతికాయస్య నిరుద్ధమార్గిణో హ్యుద్గీర్ణదృష్టేర్భ్రమతస్త్వితస్తతః
పూర్ణోऽన్తరఙ్గే పవనో నిరుద్ధో మూర్ధన్వినిర్భిద్య వినిర్గతో బహిః
ఎపుడైతే పరమాత్మ అలా పెరిగాడో, అంత పెద్ద శరీరం కూడా స్వామి గొంతు వద్ద అడ్డు పడగానే కనుగుడ్లు బయటకు వచ్చి. లోపలకు వెళ్ళి వచ్చే వాయువు నిరోధించబడింది.
తేనైవ సర్వేషు బహిర్గతేషు ప్రాణేషు వత్సాన్సుహృదః పరేతాన్
దృష్ట్యా స్వయోత్థాప్య తదన్వితః పునర్వక్త్రాన్ముకున్దో భగవాన్వినిర్యయౌ
పరమాత్మను చేరాలంటే ప్రాణాన్ని (వాయువును) నిరోధించాలి. పరమాత్మ అలా నిరోధించి నోటిలోకి వెళ్ళి తలను చీల్చుకుని బయటకు వచ్చాడు. అప్పటికే వాడి విష వాయువులతో గోపాల బాలకులు చనిపోయారు. ఒక రంధ్రం చేసి వారిని బయటకు తీసాడు. అమృతం వంటి చల్లని చూపుతో అందరినీ బతికించాడు. మళ్ళీ తాను అఘాసురుని నోటి నుండే బయటకు వచ్చాడు.లోపల ఇంకెవరైనా ఉన్నారేమో మళ్ళీ వెళ్ళి వెతికి వచ్చాడు.
పీనాహిభోగోత్థితమద్భుతం మహజ్జ్యోతిః స్వధామ్నా జ్వలయద్దిశో దశ
ప్రతీక్ష్య ఖేऽవస్థితమీశనిర్గమం వివేశ తస్మిన్మిషతాం దివౌకసామ్
అంతకంటే ఇంకో అద్భుతం జరిగింది. చనిపోయిన ఆ అఘాసురుని దేహం నుండి సకల దిక్కులనూ ప్రకాశింపచేసే జ్యోతి వెడలి కృష్ణ పరమాత్మలో కలిసింది.
తతోऽతిహృష్టాః స్వకృతోऽకృతార్హణం
పుష్పైః సుగా అప్సరసశ్చ నర్తనైః
గీతైః సురా వాద్యధరాశ్చ వాద్యకైః
స్తవైశ్చ విప్రా జయనిఃస్వనైర్గణాః
అఘాసురుడు మరణించాడని అప్సరసలు నాట్యం గంధర్వులు గానం చేసారు దేవతలు స్తోత్రం చేసారు.
తదద్భుతస్తోత్రసువాద్యగీతికా జయాదినైకోత్సవమఙ్గలస్వనాన్
శ్రుత్వా స్వధామ్నోऽన్త్యజ ఆగతోऽచిరాద్దృష్ట్వా మహీశస్య జగామ విస్మయమ్
ఒకే సారి స్తోత్రాలూ గానాలూ నాట్యాలూ తాళాలు జయ జయ ధ్వానాలు ఉత్సవాలు మంగళ ధ్వనులూ అన్నీ వినిపిస్తే బ్రహ్మ గారు ఒక్కసారి లేచి చూసారు. చూసి, చనిపోయిన వారిని బతికించడం నా పని కదా. నా పని చేసాడు కృష్ణుడు అని ఆశ్చర్యం పొందాడు.
రాజన్నాజగరం చర్మ శుష్కం వృన్దావనేऽద్భుతమ్
వ్రజౌకసాం బహుతిథం బభూవాక్రీడగహ్వరమ్
తన నివాసం దగ్గర వరకూ వినవచ్చినవన్నీ చూచి, తాను దిగి వచ్చి, ఈ వింతను చూచి ఆశ్చర్యపడ్డాడు. గోపాల బాలకులు ఏమని అన్నారో ఆ మాట నిజమైనది. ఆ కొండచిలువ శరీరం వారికి ఆట స్థలమే అయ్యింది.
ఏతత్కౌమారజం కర్మ హరేరాత్మాహిమోక్షణమ్
మృత్యోః పౌగణ్డకే బాలా దృష్ట్వోచుర్విస్మితా వ్రజే
ఇలా పరమాత్మ పాము నోటి నుండి ఆ పిల్లలను కాపాడినది కౌమారములో. ఐదేళ్ళ వయసులో జరిగిన ఈ విషయాన్ని గోపాల బాలకులు ఆరవ ఏట (పౌగండ్రం) ఇంటికి వెళ్ళి చెప్పారు.
నైతద్విచిత్రం మనుజార్భమాయినః పరావరాణాం పరమస్య వేధసః
అఘోऽపి యత్స్పర్శనధౌతపాతకః ప్రాపాత్మసామ్యం త్వసతాం సుదుర్లభమ్
ఇది మనకు ఆశ్చర్యం కానీ మాయామానుష విగ్రహుడైన పరమాత్మ విషయములో ఇది ఆశ్చర్యం కాదు. ఈయన స్పర్శ వలన అన్ని పాపాలు తొలగి అఘాసురుడు కూడా పరమాత్మ సామ్యాన్ని పొందాడు. అది దుర్మార్గులకు దుర్లభమైనది
సకృద్యదఙ్గప్రతిమాన్తరాహితా మనోమయీ భాగవతీం దదౌ గతిమ్
స ఏవ నిత్యాత్మసుఖానుభూత్యభి వ్యుదస్తమాయోऽన్తర్గతో హి కిం పునః
ఏ పరమాత్మ యొక్క నామాన్నీ, ఊహా రూపాన్ని మనసులో పెట్టుకున్న వాడికే మోక్షం వస్తే పరమాత్మ రూపాన్నే నోట్లో పెట్టుకున్నవాడికి మోక్షం రావడములో వింతేముంది.
స్వామి ఆ రాక్షసుడికి భాగవత మార్గాన్ని చూపాడు. అలాంటి పరమాత్మే అన్ని మాయలను తొలగించి ఆత్మానందాన్ని కలిగించేవాడు. పరమాత్మ ఆనందస్వరూపుడు. ఆయన ఇచ్చేది ఆనందమే.
అలాంటి స్వామి లోపలకి వెళ్ళిన తరువాత మోక్షం రాక ఇంకేమొస్తుంది.
శ్రీసూత ఉవాచ
ఇత్థం ద్విజా యాదవదేవదత్తః శ్రుత్వా స్వరాతుశ్చరితం విచిత్రమ్
పప్రచ్ఛ భూయోऽపి తదేవ పుణ్యం వైయాసకిం యన్నిగృహీతచేతాః
ఈ ప్రకారముగా పరీక్షిత్తు శుకుడు చెప్పిన ఈ లీలను విని ఆ మహానుభావుని మాటలతో ఆకట్టుకున్న మనసు గలవాడై శుకునితో పరమపావనమైన పరమాత్మ కథను మళ్ళీ అడిగాడు
శ్రీరాజోవాచ
బ్రహ్మన్కాలాన్తరకృతం తత్కాలీనం కథం భవేత్
యత్కౌమారే హరికృతం జగుః పౌగణ్డకేऽర్భకాః
తద్బ్రూహి మే మహాయోగిన్పరం కౌతూహలం గురో
నూనమేతద్ధరేరేవ మాయా భవతి నాన్యథా
వయం ధన్యతమా లోకే గురోऽపి క్షత్రబన్ధవః
వయం పిబామో ముహుస్త్వత్తః పుణ్యం కృష్ణకథామృతమ్
ఐదవ ఏడున చేసిన పని ఆరవ ఏట చెప్పడం ఏమిటి. మీరు సమర్ధులు కాబట్టి దీన్ని తెలుసుకో గోరుతున్నాను. ఇలా జరిగింది అంటే అది పరమాత్మ మాయే తప్ప మరేమీ కాదు. మేము చాలా అదృష్టవంతులము. మేము క్షత్రియులం ఐనా మీ నుండి పరమ పావనమైన శ్రీకృష్ణ కథామృతం వినగలుగుతున్నామంటే అది మా అదృష్టం
శ్రీసూత ఉవాచ
ఇత్థం స్మ పృష్టః స తు బాదరాయణిస్
తత్స్మారితానన్తహృతాఖిలేన్ద్రియః
కృచ్ఛ్రాత్పునర్లబ్ధబహిర్దృశిః శనైః
ప్రత్యాహ తం భాగవతోత్తమోత్తమ
ఇలా అడగగానే పరమాత్మ లీలలన్నీ మనసులో ఉప్పొంగి, అన్ని ఇంద్రియాలూ మనసు పరమాత్మ నిండి, కష్టపడి ఈ లోకములోకి వచ్చి, భాగవతోత్తములలో ఉత్తముడైన పరీక్షిత్తు ఇలా చెప్పాడు
సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు