Followers

Saturday, 26 April 2014

శ్రీమద్భాగవతం దశమ స్కంధం ముప్పై ఐదవ అధ్యాయం

         ఓం నమో భగవతే వాసుదేవాయ


శ్రీమద్భాగవతం దశమ స్కంధం ముప్పై ఐదవ అధ్యాయం

ఇది గోపికా యుగళ గీతం అంటారు. కృష్ణుడు పశువులను మేపడానికి వెళ్ళి వచ్చేవరకూ వేచి ఉండే గోపికలు విరహముతో పాడిన గీత ఇది.

శ్రీశుక ఉవాచ
గోప్యః కృష్ణే వనం యాతే తమనుద్రుతచేతసః
కృష్ణలీలాః ప్రగాయన్త్యో నిన్యుర్దుఃఖేన వాసరాన్

కృష్ణ పరమాత్మ పగలు అరణ్యానికి వెళితే ఆయన లేనప్పుడు ఉన్న విరహ వేదనను పరమాత్మ లీలలు గానం చేసుకుంటూ ఎంతో కష్టముతో పగళ్ళను గడిపారు.

శ్రీగోప్య ఊచుః
వామబాహుకృతవామకపోలో వల్గితభ్రురధరార్పితవేణుమ్
కోమలాఙ్గులిభిరాశ్రితమార్గం గోప్య ఈరయతి యత్ర ముకున్దః

పరమాత్మ యొక్క వేణు గానాన్ని చెబుతున్నారు ఈ శ్లోకములో. ఎడమ బాహువు ఎడమ కపోలం మీద ఉంచాడు. కనుబొమ్మలు కొంచెం కిందకు ఉంచాడు. మురళిని పెదవుల మీద ఉంచాడు. సుకుమారమైన వేళ్ళతో పరమాత్మ గోపికలలో కామాతురతను పెంచడానికి వేణువును ఊదుతున్నాడు.

వ్యోమయానవనితాః సహ సిద్ధైర్విస్మితాస్తదుపధార్య సలజ్జాః
కామమార్గణసమర్పితచిత్తాః కశ్మలం యయురపస్మృతనీవ్యః

పరమాత్మ వేణు గానాన్ని విని వ్రేపల్లె బృందావనములో ఉందే స్త్రీలే కాక ఆకాశములో విమానాలలో విహరించే సిద్ధ స్త్రీలు కూడా ఆయన రూపాన్ని చూచి ఆశ్చర్యముతో సిగ్గుపడినవారై పరమాత్మనే స్మరిస్తూ మన్మధ బాణముతో కొట్టబడిన వారై తమను తాము మరచిపోయారు

హన్త చిత్రమబలాః శృణుతేదం హారహాస ఉరసి స్థిరవిద్యుత్
నన్దసూనురయమార్తజనానాం నర్మదో యర్హి కూజితవేణుః

ఇది పరమ ఆశ్చర్యం, అందరూ వినండి. ఈయన మెడలో ఒక రత్నాల హారం ఉంది. నల్లని స్వామి మెడలో పసుపు పచ్చని హారము చూస్తే మెరుపుతో కూడిన మేఘములా ఉంది. సాధారణమైన మెరుపులో విద్యుత్తు చంచలం. ఈ మెరుపులో విద్యుత్తు మాత్రం స్థిరముగా ఉంది. పరిహాసాన్నీ ఆనందాన్నీ కలిగిస్తున్నాడు వేణు గానముతో. పరిహాసాన్ని అతన్ని ఆరాధించే స్త్రీలకు ఇస్తున్నాడు. మేఘం వర్షిస్తుంది. ఈ మేఘం వేణువనే మెరుపుతో కూడి ప్రియురాలికి కావలసిన సరస సందేశాన్ని ఇస్తున్నాడు.

వృన్దశో వ్రజవృషా మృగగావో వేణువాద్యహృతచేతస ఆరాత్
దన్తదష్టకవలా ధృతకర్ణా నిద్రితా లిఖితచిత్రమివాసన్

కృష్ణ పరమాత్మ వేణువును ఊదుతూ ఉంటే వ్రేపల్లెలో వృషభములూ గోవులూ, మనసు కాస్తా హరించబడి, గడ్డి తీసుకుని నోట్లో పెట్టుకుని చెవులు నిక్కబొడుచుకుని ఆనందముతో నిద్రపోతూ గీచిన బొమ్మలలాగ (నోటిలో గడ్డిపెట్టుకుని ) ఉన్నాయి.

బర్హిణస్తబకధాతుపలాశైర్బద్ధమల్లపరిబర్హవిడమ్బః
కర్హిచిత్సబల ఆలి స గోపైర్గాః సమాహ్వయతి యత్ర ముకున్దః

నెమళ్ళు పర్వతముల యొక్క గైరికాధి దాథ్వులు చిత్ర విచిత్ర వర్ణములతో రంగులుగా చేయబడి తమ నెమలి పించములోని ఆడంబరాన్ని కలిగించుకుంటూ అవి కూడా కృష్ణ పరమాత్మను పిలుస్తున్నాయి. అలాగే ఆవులూ తుమ్మెదలూ స్వామిని పిలుస్తున్నాయి.

తర్హి భగ్నగతయః సరితో వై తత్పదామ్బుజరజోऽనిలనీతమ్
స్పృహయతీర్వయమివాబహుపుణ్యాః ప్రేమవేపితభుజాః స్తిమితాపః

ఇంకా ఆశ్చర్యమేమిటంటే, నది తాను ప్రవహించే మార్గం నుంచి విడివడి పరమాత్మ వేణు గానముతో తమ దారి మరల్చుకుని వస్తున్నాయి, పరమాత్మ పాద పరాగాన్ని తాకాలని. ఆ నదులు కూడా మా వలె దురదృష్టవంతులు. అంత వరకూ వచ్చి కూడా పరమాత్మ పాద పరాగాన్ని పొందలేకపోతున్నాయి. పగలు స్వామికి దూరముగా ఉన్న మేము కొద్ది పుణ్యమే చేసుకున్నాము. నదులు కూడా మాలాగే కొద్ది పుణ్యమే చేసుకున్నాయి. స్వామి వచ్చి స్పృశిస్తాడేమో అని తమ వేగాన్ని తగ్గించుకున్నాయి.

అనుచరైః సమనువర్ణితవీర్య ఆదిపూరుష ఇవాచలభూతిః
వనచరో గిరితటేషు చరన్తీర్వేణునాహ్వయతి గాః స యదా హి

ఆవుల వెంట తిరిగే గోపాల బాలకులనూ, గోపాల బాలకులతో వెంట వస్తున్న ఆవులనూ కృష్ణ పరమాతమ తన వేణు గానముతో తన దగ్గరకు పిలుస్తున్నాడు.

వనలతాస్తరవ ఆత్మని విష్ణుం వ్యఞ్జయన్త్య ఇవ పుష్పఫలాఢ్యాః
ప్రణతభారవిటపా మధుధారాః ప్రేమహృష్టతనవో వవృషుః స్మ

తీగలూ వృక్షాలూ పరమాత్మ తనలోనే ఉన్నడని చెప్పడానికా అన్నట్లు తమ ఒంటినిండా పుష్పాలూ ఫలాలూ కలిగి ఉన్నాయి, (పరమాత్మ ఉన్నవాడికే ఫలం లభిస్తుంది) . మరికొన్ని వృక్షాలు ప్రణయ భారముతో (ఫల పుష్ప భారముతో) కొమ్మలు వంచి , ఆ కొమ్మలకున్న తేనెచెట్టులోంచి తేనెను వర్షిస్తున్నాయి. పరమాత్మ వేణు గానము వలన కలిగే రుచి ఇలాగే ఉంటుంది అని చెప్పడానికి.

దర్శనీయతిలకో వనమాలా దివ్యగన్ధతులసీమధుమత్తైః
అలికులైరలఘు గీతామభీష్టమాద్రియన్యర్హి సన్ధితవేణుః

పరమాత్మ చక్కని తిలకమూ వనమాలా ధరించి, వనమాలలో పుష్పముల తులసీ గంధములతో మకరందములతో మదించిన తుమ్మెదల చేత చాలా పెద్దగా గానం చేయబడి, ఆ తుమ్మెదలు కూడా వేణువును చూచి పరమాత్మ దగ్గరకు వస్తున్నాయి. ఆ వేణు గానం వినపడడానికి పూలలో మకరందాన్ని సేవిస్తున్న తుమ్మెదలు ఝంకారం చేయడం ఆపేసాయి. ఆ వేణుగాన మధుర ధ్వనికి ఆటంకం కలిగించకూడదని తుమ్మెదలు ఝంకారమాపేసాయి. సరస్సులో ఉండే రకరాకాల పక్షులు పరమాత్మ వేణు గానముతో ఇక్కడకు వచ్చాయి.

సరసి సారసహంసవిహఙ్గాశ్చారుగీతాహృతచేతస ఏత్య
హరిముపాసత తే యతచిత్తా హన్త మీలితదృశో ధృతమౌనాః

 హంసలూ కారండవములు కొంగలు సారసపక్షులు చక్రవాకములు జల కుక్కుటములూ కనులు మూసుకుని ఆ గానామృతాన్ని వారనుభవిస్తున్నారు. మౌన వ్రతాన్ని పాటించే వారు కూడా నోరు మాత్రమే మూసుకుంటే చాలదు. కనులు కూడా మూసుకోవాలి

సహబలః స్రగవతంసవిలాసః సానుషు క్షితిభృతో వ్రజదేవ్యః
హర్షయన్యర్హి వేణురవేణ జాతహర్ష ఉపరమ్భతి విశ్వమ్

పరమాత్మ బలరామునితో కలసి పుష్పాది అలంకారాలు చేసుకుని పర్వత శిఖర భాగాలలో తన దివ్యమైన మధుర వేణుగానముతో అందరినీ ఆనందింపచేస్తూ, ప్రపంచాన్నే ఆనందములో ముంచేస్తున్నాడు

మహదతిక్రమణశఙ్కితచేతా మన్దమన్దమనుగర్జతి మేఘః
సుహృదమభ్యవర్షత్సుమనోభిశ్ఛాయయా చ విదధత్ప్రతపత్రమ్

కృష్ణుడు వేణుగానంచేస్తున్నాడు కాబట్టి, కింద ఉన్న వారి గానం కన్నా ఎక్కువ శబ్దం చేయరాదన్నట్లుగా మేఘాలు కూడా మందముగా గర్ఝిస్తున్నాయి. ఈ పరమాత్మను వృక్షములు పుష్పమూల్తో పూజిస్తూ కొమ్మలతో గొడుగు పడుతున్నాయి

వివిధగోపచరణేషు విదగ్ధో వేణువాద్య ఉరుధా నిజశిక్షాః
తవ సుతః సతి యదాధరబిమ్బే దత్తవేణురనయత్స్వరజాతీః

ఓ యశోదమ్మా! రకరకాల గోపాలకుల గుంపులలో మహా నేర్పరి ఐన పరమాత్మ పలు రకాలుగా వేణుగానం చేస్తూ, నీ కుమారుడైనా కృష్ణుడు అధరం మీద వేణువు ఉంచుకుని రకరకాల స్వరగతులతో సకల ప్రపంచాన్నీ ఆనందింపచేస్తున్నాడు.

సవనశస్తదుపధార్య సురేశాః శక్రశర్వపరమేష్ఠిపురోగాః
కవయ ఆనతకన్ధరచిత్తాః కశ్మలం యయురనిశ్చితతత్త్వాః

అటువంటి వేణుగానాన్ని వినడానికి ఇంద్రుడూ రుద్రుడూ బ్రహ్మాదులందరూ, మెడ వంచి హృదయం అక్కడే ఉంచి, ఆ గానం కొంత సేపట్లో ఐపోతుంది కదా, అయ్యో అని దుఃఖముతో ఉన్నారు. పరమాత్మ గానములో మునిగి ఉన్నవారు  పరమాత్మ తత్వాన్ని నిశ్చయించలేక బ్రహ్మాదులందరూ దుఃఖాన్ని పొందుతూ మెడవంచి అటే చూస్తున్నారు.

నిజపదాబ్జదలైర్ధ్వజవజ్ర నీరజాఙ్కుశవిచిత్రలలామైః
వ్రజభువః శమయన్ఖురతోదం వర్ష్మధుర్యగతిరీడితవేణుః

పరమాత్మ మనకు అబ్జదలైర్ధ్వజవజ్ర నీరజాఙ్కుశవిచిత్రలలామైః, దివ్యమైన పాదములతో వ్రేపల్లె వాడలలో భూములనూ బృందావనములో భూములనూ, ఆ భూములలో ఉన్న అశుభాలను తొలగించి వేణువును గానం చేస్తూ వెళుతున్నాడు.

వ్రజతి తేన వయం సవిలాస వీక్షణార్పితమనోభవవేగాః
కుజగతిం గమితా న విదామః కశ్మలేన కవరం వసనం వా

గోపికలు అందరూకూడా వృక్షాలకూ మాకు తేడా లేదు అంటున్నారు. స్వామి పక్కన చెట్లలా ఐపోయాము. చెట్టుకు ఆకులూ కొమ్మలు రాలినా బెరడు ఊడిపోయినా ఏమీ తెలియదు. అలాగే మేము కూడా పూలు జారిపోతున్నా, వస్త్రం జారిపోతున్నా, ఆభరణాలు రాలినా ఏమీ తెలియట్లేదు. పరమాత్మ గానముతో గోపికలు వృక్షాలుగా వృక్షాలు గోపికలుగా ఐపోయాయి. (మూకం కరోతి వాచాల పంగుం లంఘైతే గిరిం)

మణిధరః క్వచిదాగణయన్గా మాలయా దయితగన్ధతులస్యాః
ప్రణయినోऽనుచరస్య కదాంసే ప్రక్షిపన్భుజమగాయత యత్ర

ఎక్కడ పరమాత్మ తన  భుజాన్ని కొంచెం వంచి వేణువు పట్టుకు గానంచేస్తున్నాడో, వేణుగానం చేస్తూనే ఆవులను ఒక కంట కనిపెడుతూ ఉన్నాడు. వేణు రంధ్రాలలో వాయువు నింపుతూ, అంగుళులతో ఆవులను లెక్కపెడుతున్నట్లుగా వేణువు మీద వేళ్ళను ఆడిస్తున్నాడు.

క్వణితవేణురవవఞ్చితచిత్తాః కృష్ణమన్వసత కృష్ణగృహిణ్యః
గుణగణార్ణమనుగత్య హరిణ్యో గోపికా ఇవ విముక్తగృహాశాః

లేళ్ళు కూడా, పరమాత్మ వేణు గానాన్ని విని పరమాత్మ గుణాలచే రంజింపబడి గోపికల లాగానే ఇళ్ళు వదిలి పెట్టి కృష్ణుని చుట్టూ తిరుగ్తూ ఉన్నాయి.

కున్దదామకృతకౌతుకవేషో గోపగోధనవృతో యమునాయామ్
నన్దసూనురనఘే తవ వత్సో నర్మదః ప్రణయిణాం విజహార

నీ కుమారుడు యమునా తీరములో ఆయనను ఆశ్రయించిన వారందరికీ ఆనందం కలిగిస్తూ విహరిస్తున్నాడు. రాత్రి గానీ పగలు కానీ అరణ్యములో గాలి తన ఇష్టమొచ్చినట్లు వీస్తుంది. నీకుమారుడు ఉన్నప్పుడు నీ కుమారునికి తగిన సుఖం కావాల్సినంతగానే వాయువు వీస్తుంది.

మన్దవాయురుపవాత్యనకూలం మానయన్మలయజస్పర్శేన
వన్దినస్తముపదేవగణా యే వాద్యగీతబలిభిః పరివవ్రుః

 వందిమాగధులూ దేవతా గణమూ తమ తమ వాద్యములతో నీ కుమారుడికి పరిచర్యలు చేస్తున్నారు.

వత్సలో వ్రజగవాం యదగధ్రో వన్ద్యమానచరణః పథి వృద్ధైః
కృత్స్నగోధనముపోహ్య దినాన్తే గీతవేణురనుగేడితకీర్తిః

దేవతలతో వృద్ధులతో నమస్కరించబడుతూ సాయం కాలం అయ్యే సరికి మొత్తం ఆవులను తిప్పుతూ  (సాయం కాలం కాగానే ప్రతీ ఇంటికీ వచ్చి ఆవులను కట్టేసే కృష్ణునికి నమస్కారం అంటారు లీలా శుకులు. ఆశ్రిత సౌలభ్యం అది.వాత్సల్యం కలవాడు)

ఉత్సవం శ్రమరుచాపి దృశీనామున్నయన్ఖురరజశ్ఛురితస్రక్
దిత్సయైతి సుహృదాసిష ఏష దేవకీజఠరభూరుడురాజః

కష్టపడి, అరచిన వారిన కళ్ళకు కూడా పండువ చేసే రూపముతో సంతోషం కలిగించడానికి మిత్రునిలా వస్తున్నాడు దేవకీ గర్భమున జన్మించిన చంద్రుడు

మదవిఘూర్ణితలోచన ఈషత్మానదః స్వసుహృదాం వనమాలీ
బదరపాణ్డువదనో మృదుగణ్డం మణ్డయన్కనకకుణ్డలలక్ష్మ్యా

ఈ వనమాలి తెల్లని ముఖం కలవాడు, సుకుమారమైన కపోలభాగాన్నీ మకర కుండలముల కాంతితో ప్రకాశింపచేస్తూ, సాయం కాలం కాగానే ఎలా చంద్రుడు ఆకాశములో విహరించడానికి వస్తాడో ఈయన వ్రేపల్లెలో రెండవ చంద్రునిలా వస్తాడు

యదుపతిర్ద్విరదరాజవిహారో యామినీపతిరివైష దినాన్తే
ముదితవక్త్ర ఉపయాతి దురన్తం మోచయన్వ్రజగవాం దినతాపమ్

ఆందందమైనటువంటి ముఖముతో ఇంత సేపూ విరహముతో తపించిన గోపికల విరహ తాపాన్ని తొలగించడానికి స్వామి సాయం కాలం కాగానే వ్రేపల్లెకు వస్తున్నాడు.

శ్రీశుక ఉవాచ
ఏవం వ్రజస్త్రియో రాజన్కృష్ణలీలానుగాయతీః
రేమిరేऽహఃసు తచ్చిత్తాస్తన్మనస్కా మహోదయాః

పరమాత్మ ఆవులను తీసుకు వెళ్ళాడు (సృష్టి), వేణు గానముతో (వేదముతో) వాటిని మురిపించాడు, పోషించాడు (రక్షించాడు), సాయం కాలం కాగానే వాటిని ఇంటికి తీసుకు వచ్చాడు (ప్రళయం)
ఇది సృష్టి స్థితి లయములకు ఈ అధ్యాయం వ్యాఖ్యానం. నైమిత్తిక ప్రళయములో ఋషులు పరమాత్మ యొక్క లీలలను సువర్లోక మహర్లోకములో వారు జనో లోక తపో లోకములకు వెళ్ళి మళ్ళీ ఈ లోకాలు ఆవిర్భవించే వరకూ పరమాత్మ లీలలను గానం చేస్తూ ఉంటారు.

                                        సర్వం శ్రీకృష్ణార్పణమస్తు 

Popular Posts