ఓం నమో భగవతే వాసుదేవాయ
శ్రీమద్భాగవతం దశమ స్కంధం నలభై నాలగవ అధ్యాయం
శ్రీశుక ఉవాచ
ఏవం చర్చితసఙ్కల్పో భగవాన్మధుసూదనః
ఆససాదాథ చణూరం ముష్ట్తికం రోహిణీసుతః
తాను అనుకున్నదాన్నే వారితో పలికించిన కృష్ణుడు చాణూరుణితో బలరాముడు ముష్టికునితో తలపడ్డారు.
హస్తాభ్యాం హస్తయోర్బద్ధ్వా పద్భ్యామేవ చ పాదయోః
విచకర్షతురన్యోన్యం ప్రసహ్య విజిగీషయా
గెలవాలనే సంకల్పముతో పరస్పరం చేతులు పట్టీ కాళ్ళు పట్టీ లాగుతున్నారు.
అరత్నీ ద్వే అరత్నిభ్యాం జానుభ్యాం చైవ జానునీ
శిరః శీర్ష్ణోరసోరస్తావన్యోన్యమభిజఘ్నతుః
అరత్నితో అరత్నినీ మోకాళ్ళతో మోకాళ్ళనీ తలని తలతో వక్షస్థలాన్ని వక్షస్థలముతో కొట్టుకున్నారు.
పరిభ్రామణవిక్షేప పరిరమ్భావపాతనైః
ఉత్సర్పణాపసర్పణైశ్చాన్యోన్యం ప్రత్యరున్ధతామ్
తిప్పట విసిరివేయటం లాగడం గుంజడం పడవేయడం లేపడం కింద పడేయడం
ఉత్థాపనైరున్నయనైశ్చాలనైః స్థాపనైరపి
పరస్పరం జిగీషన్తావపచక్రతురాత్మనః
ఇలా ఒకరితో ఒకరు యుద్ధం చేసుకుంటూ ఉంటే
తద్బలాబలవద్యుద్ధం సమేతాః సర్వయోషితః
ఊచుః పరస్పరం రాజన్సానుకమ్పా వరూథశః
బలవంతులతో బలహీనుల యుద్ధం, ఇది సరి ఐన యుద్ధం కాదు అని అక్కడ స్త్రీలు అనుకుంటున్నారు.
మహానయం బతాధర్మ ఏషాం రాజసభాసదామ్
యే బలాబలవద్యుద్ధం రాజ్ఞోऽన్విచ్ఛన్తి పశ్యతః
ఈ సభలో పెద్ద అధర్మం జరుగుతోంది. ఒకరు మహా బలవంతులు, ఒకరు చిన్నపిల్లలు, దీన్ని రాజు ఒప్పుకుంటున్నాడు, చూసేవారు కూడా కాదనట్లేదు
క్వ వజ్రసారసర్వాఙ్గౌ మల్లౌ శైలేన్ద్రసన్నిభౌ
క్వ చాతిసుకుమారాఙ్గౌ కిశోరౌ నాప్తయౌవనౌ
పర్వతాలలాగ వజ్రశరీరముతో ఉన్నారు చాణూర ముష్టికులు , యవ్వనమే రాని అతి సుకుమారమైన బలరామ కృష్ణులెక్కడా.
ధర్మవ్యతిక్రమో హ్యస్య సమాజస్య ధ్రువం భవేత్
యత్రాధర్మః సముత్తిష్ఠేన్న స్థేయం తత్ర కర్హిచిత్
ఈ సభకు అధర్మం బాగా తగులుతుంది. అధర్మం జరుగుతున్న చోట ఉండకూడదని శాస్త్రం. సభలో ఉండే దోషాలు చూచిన తరువాత బుద్ధిమంతులెవరూ అలాంటి సభలోకి ప్రవేశించకూడదు.
న సభాం ప్రవిశేత్ప్రాజ్ఞః సభ్యదోషాననుస్మరన్
అబ్రువన్విబ్రువన్నజ్ఞో నరః కిల్బిషమశ్నుతే
ఒక సారి సభలోకి ప్రవేశించిన తరువాత ఏమీ చెప్పకున్నా పాపమే చెప్పినా పాపమే. చెబితే రాజ దిక్కారం చెప్పకుంటే ధర్మ దిక్కారం
వల్గతః శత్రుమభితః కృష్ణస్య వదనామ్బుజమ్
వీక్ష్యతాం శ్రమవార్యుప్తం పద్మకోశమివామ్బుభిః
కిం న పశ్యత రామస్య ముఖమాతామ్రలోచనమ్
ముష్టికం ప్రతి సామర్షం హాససంరమ్భశోభితమ్
ఒక్కరికీ కనపడట్లేదా వారు యుద్ధం చేస్తుంటే. పరమ సుకుమారులు. పద్మం మీద మంచు బిందువులులా వారి ముఖం మీద చెమట బిందువులు వస్తున్నాయి.
పుణ్యా బత వ్రజభువో యదయం నృలిఙ్గ
గూఢః పురాణపురుషో వనచిత్రమాల్యః
గాః పాలయన్సహబలః క్వణయంశ్చ వేణుం
విక్రీదయాఞ్చతి గిరిత్రరమార్చితాఙ్ఘ్రిః
మళ్ళీ జ్ఞ్యాపకం తెచ్చుకుంటున్నారు. వ్రేపల్లెలో స్త్రీలు చాలా పుణ్యం చేసుకున్నవారు. మానవ దేహముతో పురాణ పురుషుడైన పరమాత్మ వారితో ఆడి పాడి వారించ్చిన పుష్పాలనూ పళ్ళనూ తీసుకున్నాడు. గోవులను పాలించాడు. వేణువును ఊదుతూ ఆవులను మేపుతూ, లక్ష్మి చేత శంకరుని చేతా పూజించబడే పాదపద్మములు కలవాడు.
గోప్యస్తపః కిమచరన్యదముష్య రూపం
లావణ్యసారమసమోర్ధ్వమనన్యసిద్ధమ్
దృగ్భిః పిబన్త్యనుసవాభినవం దురాపమ్
ఏకాన్తధామ యశసః శ్రీయ ఐశ్వరస్య
గోపికలు ఏ తపస్సు చేసారో. పరమాత్మ యొక్క సౌందర్యం అనే మహా సారాన్ని తమ కళ్ళతో తాగుతూ అమ్మవారి యొక్క ఏకాంత ధామాన్ని కనులారా చూచి అనురాగాన్ని వారు పొందగలిగారు
యా దోహనేऽవహననే మథనోపలేప ప్రేఙ్ఖేఙ్ఖనార్భరుదితోక్షణమార్జనాదౌ
గాయన్తి చైనమనురక్తధియోऽశ్రుకణ్ఠ్యో ధన్యా వ్రజస్త్రియ ఉరుక్రమచిత్తయానాః
పిల్లల్ను పెంచే తల్లులు చేసే పనులు. దోహనం (పాలు పిండడం) అవహనన (ఒడ్లు దంచడం) మహ్దనం (పెరుగు చిలకడం) ఉపలేప (ఇల్లు అలకడం) ఆవుల యొక్క గంతులు వేయడం పిల్లల యొక్క ఏడుపులు, వారి ఒళ్ళు తుడవడం ఇల్లు కడగడం,, ఇవన్నీ చేసుకుంటూ కూడా ఏ పరమాత్మ యొక్క లీలా చరితమును అశ్రుకంఠముతో గానం చేస్తూ ఉన్నారు. ఎంత అదృష్టవంతులు.
భగవంతుని చీతమునకు వీరే వాహనాలు. భగవంతుని చిత్తములో వీరు ఉన్నారు. వీరి చిత్తములో భగవానుడు ఉన్నాడు
పరమాత్మ నామాన్ని కీర్తించుకుంటూ గృహకృత్యాలు చేయాలి. సంసారం మానవలసిన అవసరం లేదు. పరమాత్మని మనసులో ఉంచుకుని, ఆయన మీద అనురాగముతో ఆయనను గానం చేస్తూ మన పనౌలు మనం చేసుకోవాలి.
ప్రాతర్వ్రజాద్వ్రజత ఆవిశతశ్చ సాయం
గోభిః సమం క్వణయతోऽస్య నిశమ్య వేణుమ్
నిర్గమ్య తూర్ణమబలాః పథి భూరిపుణ్యాః
పశ్యన్తి సస్మితముఖం సదయావలోకమ్
గోవులను తీసుకు వెళుతున్నపుడు పొద్దున్నా, గోవులను తీసుకు వస్తున్నపుడు సాయం కాలం వేణువును గానం చేస్తుంటే విని, ఇలా వెళుతున్న వాడిని ఎంతో పుణ్యం చేసుకున్న వీరు చిరునవ్వుతో దయతో నిండి ఉన్న స్వామి ముఖాన్ని చూడగలిగారు
ఏవం ప్రభాషమాణాసు స్త్రీషు యోగేశ్వరో హరిః
శత్రుం హన్తుం మనశ్చక్రే భగవాన్భరతర్షభ
ఇలా అందరూ మాట్లాడుతుంటే, వారి బాధను తెలుసుకున్న పరమాత్మ చాణూరున్ని వధించ సంకల్పించుకున్నాడు
సభయాః స్త్రీగిరః శ్రుత్వా పుత్రస్నేహశుచాతురౌ
పితరావన్వతప్యేతాం పుత్రయోరబుధౌ బలమ్
దేవకీ వసుదేవులు కూడా అక్కడే ఉన్నారు. వారు కూడా పుత్రుల బలం తెలియని వారై బాధపడుతున్నారు.
తైస్తైర్నియుద్ధవిధిభిర్వివిధైరచ్యుతేతరౌ
యుయుధాతే యథాన్యోన్యం తథైవ బలముష్టికౌ
మల్లయుద్ధములో ఎన్ని రకాల యుద్ధాలు ఉంటాయో అవి అన్నీ చేసారు ఉభయులూ.
భగవద్గాత్రనిష్పాతైర్వజ్రనీష్పేషనిష్ఠురైః
చాణూరో భజ్యమానాఙ్గో ముహుర్గ్లానిమవాప హ
పరమాత్మ యొక్క ముష్టిఘాతములతో పిండి పిండి చేయబడి చాణూరుడు అలసట చెందాడు
స శ్యేనవేగ ఉత్పత్య ముష్టీకృత్య కరావుభౌ
భగవన్తం వాసుదేవం క్రుద్ధో వక్షస్యబాధత
వాడికి కోపం వచ్చి డేగలా మహావేగముగా వచ్చి కృష్ణుని వక్షస్థలములో కొట్టడానికి పిడికిలి బిగించి వచ్చాడు
నాచలత్తత్ప్రహారేణ మాలాహత ఇవ ద్విపః
బాహ్వోర్నిగృహ్య చాణూరం బహుశో భ్రామయన్హరిః
అంత బలవంతుడు అంత గట్టిగా కొడితే పూల మాల వేయబడిన ఏనుగులా చూచాడు. ఎలాగూ వాడే చేతులు అందించాడు కాబట్టి వాడి రెండు చేతులూ పట్టుకుని గిర గిరా తిప్పి
భూపృష్ఠే పోథయామాస తరసా క్షీణ జీవితమ్
విస్రస్తాకల్పకేశస్రగిన్ద్రధ్వజ ఇవాపతత్
గట్టిగా నేల కేసి కోట్టి చంపాడు. వాడు కిందపడి చచ్చాడు.
తథైవ ముష్టికః పూర్వం స్వముష్ట్యాభిహతేన వై
బలభద్రేణ బలినా తలేనాభిహతో భృశమ్
అది చూచిన బలరాముడు,అది సమ్జ్యగా భావించి ముష్టికున్ని కూడా కొట్టగా
ప్రవేపితః స రుధిరముద్వమన్ముఖతోऽర్దితః
వ్యసుః పపాతోర్వ్యుపస్థే వాతాహత ఇవాఙ్ఘ్రిపః
పెద్ద సుడిగాలికి పడిన చెట్టులా కింద పడిపోయాడు.
తతః కూటమనుప్రాప్తం రామః ప్రహరతాం వరః
అవధీల్లీలయా రాజన్సావజ్ఞం వామముష్టినా
వారి అనుచరులందరూ ఇది చూసి యుద్ధం చేయకుండా ప్రాణాలు దక్కించుకుందాం అని పారిపోయారు. అలా పారిపోతున్న వారిని పట్టుకోమని తమ వెంట ఉన్న గోపాలురకు చెప్పారు కృష్ణబలరాములు
తర్హ్యేవ హి శలః కృష్ణ ప్రపదాహతశీర్షకః
ద్విధా విదీర్ణస్తోశలక ఉభావపి నిపేతతుః
చాణూరే ముష్టికే కూటే శలే తోశలకే హతే
శేషాః ప్రదుద్రువుర్మల్లాః సర్వే ప్రాణపరీప్సవః
గోపాన్వయస్యానాకృష్య తైః సంసృజ్య విజహ్రతుః
వాద్యమానేషు తూర్యేషు వల్గన్తౌ రుతనూపురౌ
జనాః ప్రజహృషుః సర్వే కర్మణా రామకృష్ణయోః
ఋతే కంసం విప్రముఖ్యాః సాధవః సాధు సాధ్వితి
అక్కడ అంతా అరుపులూ కేకలతో నిండిపోయింది. మంగళ వాద్యాలు వాయిస్తున్నారు. బలరామ కృష్ణుల ఈ వీర కృత్యముతో కంసుడు తప్ప ప్రజలందరూ పరమానందాన్ని పొందారు. బ్రాహ్మణులూ సాధువులూ మెచ్చుకున్నారు.
హతేషు మల్లవర్యేషు విద్రుతేషు చ భోజరాట్
న్యవారయత్స్వతూర్యాణి వాక్యం చేదమువాచ హ
మల్లులు చనిపోయారు. మిగిలినవారు పారిపోతున్నారు. కంసుడు కోపముగా మంగళ వాద్యాలను ఆపమన్నాడు. ఇలా అన్నాడు కంసుడు
నిఃసారయత దుర్వృత్తౌ వసుదేవాత్మజౌ పురాత్
ధనం హరత గోపానాం నన్దం బధ్నీత దుర్మతిమ్
ఈ బలరామ కృష్ణులను నగరము నుండి బయటకు వెళ్ళగొట్టండి. గోపాలుర ధనాన్ని హరించండి. నందున్ని బంధించండి
వసుదేవస్తు దుర్మేధా హన్యతామాశ్వసత్తమః
ఉగ్రసేనః పితా చాపి సానుగః పరపక్షగః
దుర్మార్గుడైన వసుదేవున్ని చంపండి. పేరుకు తండ్రి అయినా పర పక్షాన్ని ఆశ్రయించి ఉన్న ఉగ్రసేఉన్ని చంపండి
ఏవం వికత్థమానే వై కంసే ప్రకుపితోऽవ్యయః
లఘిమ్నోత్పత్య తరసా మఞ్చముత్తుఙ్గమారుహత్
ఇలా గర్విస్తున్న కంసున్ని చూచి కృష్ణుడు కోపముతో ఒక గంతుతో కంసుడి వద్దకు వెళ్ళాడు
తమావిశన్తమాలోక్య మృత్యుమాత్మన ఆసనాత్
మనస్వీ సహసోత్థాయ జగృహే సోऽసిచర్మణీ
అది చూసిన కంసుడు లేచి నిలబడ్డాడు. ఖడ్గం డాలూ తీసుకు కృష్ణుని మీదకు వచ్చాడు
తం ఖడ్గపాణిం విచరన్తమాశు శ్యేనం యథా దక్షిణసవ్యమమ్బరే
సమగ్రహీద్దుర్విషహోగ్రతేజా యథోరగం తార్క్ష్యసుతః ప్రసహ్య
అలా కత్తీ డాలూ తీసుకు తన మీదకు వస్తున్న కంసున్ని గరుత్మంతుడు పాముని పట్టుకున్నట్లుగా పట్టుకుని, మొదలు కిరీటాన్ని కిందపడేసి, ఆ పెద్ద సింహాసనం నుండి కింద పడవేసి.
ప్రగృహ్య కేశేషు చలత్కిరీతం నిపాత్య రఙ్గోపరి తుఙ్గమఞ్చాత్
తస్యోపరిష్టాత్స్వయమబ్జనాభః పపాత విశ్వాశ్రయ ఆత్మతన్త్రః
పద్మనాభుడైన, పదునాలుగు లోకాలు కడుపులో ఉన్న కృష్ణుడు కంసుని మీద పడ్డాడు.
తం సమ్పరేతం విచకర్ష భూమౌ హరిర్యథేభం జగతో విపశ్యతః
హా హేతి శబ్దః సుమహాంస్తదాభూదుదీరితః సర్వజనైర్నరేన్ద్ర
ఇలా చనిపోయిన కంసుని చుట్టూ లాగుకుని వెళ్ళాడు. ఏనుగును సింహం లాగినట్లుగా అందరూ చూస్తుండగా అందరూ హాహాకారాలు చేస్తుండగా
స నిత్యదోద్విగ్నధియా తమీశ్వరం పిబన్నదన్వా విచరన్స్వపన్శ్వసన్
దదర్శ చక్రాయుధమగ్రతో యతస్తదేవ రూపం దురవాపమాప
కంసుడు పుట్టినప్పటినుంచీ ఇప్పటిదాకా పరమాత్మను మరచిపోలేదు. తాగుతూ చెప్పుచూ నిదురపోతూ నడుస్తూ ఏమి చేసినా తన ముందర ఏ చక్రాయుధున్ని చూస్తూ ఉన్నాడో చనిపోయిన తరువాత ఆయననే పొందాడు(స్వారూప్య మోక్షం)
తస్యానుజా భ్రాతరోऽష్టౌ కఙ్కన్యగ్రోధకాదయః
అభ్యధావన్నతిక్రుద్ధా భ్రాతుర్నిర్వేశకారిణః
అతనికి ఇంకా ఎనిమిది మంది తమ్ములు ఉన్నారు. అన్నగారికి ప్రతీకారం చేద్దామని వారందరూ వచ్చారు
తథాతిరభసాంస్తాంస్తు సంయత్తాన్రోహిణీసుతః
అహన్పరిఘముద్యమ్య పశూనివ మృగాధిపః
బలరాముడు తన పరిఘను తీసుకుని వారందరినీ సంహరించాడు.
నేదుర్దున్దుభయో వ్యోమ్ని బ్రహ్మేశాద్యా విభూతయః
పుష్పైః కిరన్తస్తం ప్రీతాః శశంసుర్ననృతుః స్త్రియః
ఆకాశములో మంగళ వాద్యాలు మోగాయి, బ్రహ్మేశాది దేవతలు పుష్పవర్షాన్ని కురిపించారు, స్త్రీలూ అప్సరలసు నాట్యం చేసారు
తేషాం స్త్రియో మహారాజ సుహృన్మరణదుఃఖితాః
తత్రాభీయుర్వినిఘ్నన్త్యః శీర్షాణ్యశ్రువిలోచనాః
ఆ కంసుని యొక్క భార్యలు వక్షస్థలాన్ని శిరసునూ కొట్టుకుంటూ వచ్చారు.
శయానాన్వీరశయాయాం పతీనాలిఙ్గ్య శోచతీః
విలేపుః సుస్వరం నార్యో విసృజన్త్యో ముహుః శుచః
మాటిమాటికీ దుఃఖిస్తూ కన్నీరు విడిచిపెడుతూ "నీవు చావడం కాదు, మమ్మూ మా పిల్లలనూ చంపేసావు, మా సౌభాగ్యం మా జీవితం అంతా పోయింది, " అన్నారు
హా నాథ ప్రియ ధర్మజ్ఞ కరుణానాథవత్సల
త్వయా హతేన నిహతా వయం తే సగృహప్రజాః
నీవు లేకుంటే ఈ నగరం కూడా మాలాగే ఏ పండుగా లేకుండా శోభించదు
త్వయా విరహితా పత్యా పురీయం పురుషర్షభ
న శోభతే వయమివ నివృత్తోత్సవమఙ్గలా
అనాగసాం త్వం భూతానాం కృతవాన్ద్రోహముల్బణమ్
తేనేమాం భో దశాం నీతో భూతధ్రుక్కో లభేత శమ్
ఏ తప్పూ చేయని ఎంతో మంది ప్రాణులకు నీవు భయంకరమైన తీవ్రమైనన్ (ఉల్బణం) ద్రోహం చేసావు.
దాని వలననే నీవీస్థితిని పొందావు. ప్రపంచములో ప్రాణులకు ద్రోహం చేసిన వాడెవడు శుభాన్ని పొందుతాడు.
సర్వేషామిహ భూతానామేష హి ప్రభవాప్యయః
గోప్తా చ తదవధ్యాయీ న క్వచిత్సుఖమేధతే
ప్రపంచములో సకల ప్రాణులకూ పుట్టుకకూ నాశానికీ స్థితికీ అన్నిటికీ ఈయనే (కృష్ణుడే) కారణం . ఇటువంటి వానికి ద్రోహం చేసిన వాడికి ఎక్కడా సుఖం ఉండదు.
శ్రీశుక ఉవాచ
రాజయోషిత ఆశ్వాస్య భగవాంల్లోకభావనః
యామాహుర్లౌకికీం సంస్థాం హతానాం సమకారయత్
మేనల్లుడు కాబట్టి, అలా ఏడుస్తున్న రాజ పత్నులను ఓదార్చి చనిపోయిన వారికి చేయవలసిన అంత్య క్రియలు దగ్గర ఉండి చేసాడు
మాతరం పితరం చైవ మోచయిత్వాథ బన్ధనాత్
కృష్ణరామౌ వవన్దాతే శిరసా స్పృశ్య పాదయోః
తల్లి తండ్రులను బంధనం నుండి విడిపించి రామ కృష్ణులు వారి పాదములను శిరస్సుతో తాకి నమస్కరించారు
దేవకీ వసుదేవశ్చ విజ్ఞాయ జగదీశ్వరౌ
కృతసంవన్దనౌ పుత్రౌ సస్వజాతే న శఙ్కితౌ
ఇదంతా చూసిన దేవకీ వసుదేవులకు వీరిద్దరూ జగన్నాధులని తెలిసింది. వారిని గట్టిగా ఎలాంటి శంకా (కంసుడు ఏమి చేస్తాడో అన్న భయం లేకుండా) లేకుండా ఆలింగనం చేసుకున్నారు.
సర్వం శ్రీకృష్ణార్పణమస్తు