తైత్తిరీయ అరణ్యకంలో చెప్ప బడిన నారాయణ సూక్తంలో ఈ స్థూల శరీరంలో ఆ పరమాత్ముని చిరునామా, ఆయన ధ్యానించే పధ్ధతి విస్పష్టంగా చెప్పబడింది. నారాయణ సూక్తం పురుష సూక్తానికి ఉత్తర పీఠిక లాంటింది. పురుష సూక్తంలోని విశ్వవ్యాప్తమైన పరబ్రహ్మ స్వరూపాన్ని నారాయణ సూక్తం నారాయణుని రూపంలో విశదీకరిస్తుంది. ఆ విశ్వమంతటా ఉన్నవాడిని అణురూపంలో విశ్లేషించి చెపుతుంది. వైదిక విధులలో పురుష సూక్తము, నారాయణ సూక్తము, మంత్ర పుష్పము కలిపి చదవటం ఆనవాయితీ.
ధ్యానము చేయటానికి ముందు ఈ సూక్తాన్ని పారాయణ చేసి దీని భావాన్ని చింతన చేస్తూ ఉండటం ప్రగాఢ ధ్యానానికి దోహదం చేస్తుందిట. ఇందులో మొదట భగవంతుని మహిమ తెలుప బడినది. పిదప ఆయనను ఎక్కడ, ఎలా ధ్యానిన్చాలో, క్రమంగా ధ్యానంలో మనస్సును ఎలా లగ్నం చేయాలో అన్న విషయం ఈ సూక్తంలో అద్భుత రీతిలో వివరించబడింది.
నారాయణ సూక్తం, తాత్పర్యము, శ్రవణం
విశ్వం నారాయణం దేవం
అథ శ్రీ నారాయణ సూక్తం
ఓం | సహస్ర శీర్షం దేవం విశ్వాక్షం విశ్వశంభువం |
విశ్వం నారాయణం దేవం అక్షరం పరమం పదం ||
విశ్వతః పరమాన్నిత్యం విశ్వం నారాయణగ్ం హరిం |
విశ్వ మేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి ||
పతిం విశ్వస్య ఆత్మేశ్వరగ్ం శాశ్వతగ్ం శివమచ్యుతం |
నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం ||
నారాయణ పరో జ్యోతిరాత్మా నారాయణః పరః |
నారాయణ పరం బ్రహ్మ తత్త్వం నారాయణః పరః |
నారాయణ పరో ధ్యాతా ధ్యానం నారాయణః పరః ||
యచ్చ కించిత్ జగత్సర్వం దృశ్యతే శ్రూయతేఽపి వా |
అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణః స్థితః ||
అనంతమవ్యయం కవిగ్ం సముద్రేఽన్తం విశ్వ శంభువం |
పద్మ కోశ ప్రతీకాశగ్ం హృదయం చాప్యధోముఖం ||
అధో నిష్ఠ్యా వితస్త్యాన్తే నాభ్యా ముపరి తిష్ఠతి |
జ్వాలామాలాకులం భాతీ విశ్వస్యాఽయతనం మహత్ ||
సంతతగ్ం శిలాభిస్తు లంబత్యా కోశసన్నిభం |
తస్యాన్తే సుషిరగ్ం సూక్ష్మం తస్మిన్ సర్వం ప్రతిష్ఠితం ||
తస్య మధ్యే మహానగ్నిర్విశ్వార్చిర్విశ్వతో ముఖః |
సోఽగ్రభుగ్విభజన్ తిష్ఠన్నాహార మజరః కవిః ||
తిర్యగూర్ధ్వమధశ్శాయీ రశ్మయ స్తస్య సంతతా |
సంతాపయతి స్వం దేహమాపాదతల మస్తకః |
తస్య మధ్యే వహ్నిశిఖా అణీయోర్ధ్వా వ్యవస్థితాః ||
నీలతో యదమధ్యస్థ ద్విద్యుల్లేఖేవ భాస్వరా |
నీవారశూకవత్తన్వీ పీతాభా స్వత్యణూపమా ||
తస్యాః శిఖాయా మధ్యే పరమాత్మా వ్యవస్థితః |
స బ్రహ్మ స శివః స హరిః స్సేన్ద్ర స్సోఽక్షరః పరమ స్స్వరాట్ ||
ఓం తద్బ్రహ్మ | ఓం తద్వాయుః | ఓం తదాత్మా | ఓం తత్సత్యం | ఓం తత్సర్వం | ఓం తత్పురోర్నమః |
అంతశ్చరతి భూతేషు గుహాయాం విశ్వమూర్తిషు |
త్వం యజ్ఞస్త్వం వషట్కారస్త్వమింద్రస్త్వగ్ం
రుద్రస్త్వం విష్ణుస్త్వం బ్రహ్మత్వం ప్రజాపతిః |
త్వం తదాప ఆపో జ్యోతి రసోఽమృతం బ్రహ్మ భూర్భువస్సువరోమ్ |
ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి |
తన్నో విష్ణుః ప్రచోదయాత్ ||
తాత్పర్యము:
వేలాది తలలు కలవాడు, ప్రకాశిస్తున్న వాడు, సమస్తాన్ని చూస్తున్న వాడు, యావత్ప్రపంచానికీ మంగళకారుడు, నాశనము లేని వాడు, అత్యున్నత స్థితి అయిన వాడు అయిన నారాయణుడనే దైవాన్ని ధ్యానిస్తాను.
ఈ విశ్వాని కన్నా ఉన్నతుడు, నిత్యుడు, ఈ విశ్వమై ఉంటున్న వాడు, భక్తుల కష్టాలను బాపు వాడు అయిన నారాయణుని ధ్యానిస్తాను.
విశ్వానికి నాథుడు, జీవులకు ఈశ్వరుడు, శాశ్వతుడు, మంగళ రూపుడు, వినాశము లేని వాడు, విశిష్టముగా తెలుసుకోవలసిన వాడు, సమస్తానికి ఆత్మయైన వాడు, శరణు పొందదగిన ఉత్క్రుష్టుడు అయిన నారాయణుని ధ్యానిస్తున్నాను.
నారాయణుడే పరంజ్యోతి, నారాయణుడే పరమాత్మ, నారాయణుడే పరబ్రహ్మం, నారాయణుడే పరతత్త్వము, ధ్యానించే వారిలో శ్రేష్ఠుడు నారాయణుడే. నారాయణుడే ఉత్ర్క్రుష్టమైన ధ్యానం.
ఈ ప్రపంచం అంతటా కనిపిస్తూ ఉన్నది ఏదైనా, వినిపిస్తూ ఉన్నది ఏదైనా, వాటన్నిట లోపల వెలుపల పరివ్యాపించి నారాయణుడే నెలకొని ఉన్నాడు.
(ఇది ధ్యానం తదుపరి మెట్టు. మొదట మనస్సు సర్వవ్యాపియైన భగవంతుని స్మరించడంలో నిమగ్నం అయింది. ఇప్పుడు దాని పరిధి సంకోచింప బడింది. వ్యాపితమైన మనస్సు మనలో ఒకటిగా కలిసిపోయింది. ధ్యానం తుది మెట్టు మనస్సు హృదయ సీమలో కేంద్రీకృతం కావడం).
అనంతుడు, అవినాశుడు, సర్వజ్ఞుడు, సంసార సాగర అంతాన ఉండే వాడు, ప్రపంచం మొత్తానికీ మంగళ కారుడు అయిన నారాయణుని అదోముఖమైన తామర మొగ్గలా ఉన్న హృదయంలో ధ్యానిస్తాను.
(సముద్రే అంతం అనే పదం ఇక్కడ గమనించ దగినది - సంసార సాగరాంతన భగవంతుడు ఉన్నట్లుగా తెలుపబడింది. కోరికలు భావోద్వేగాలు అనే అలలతో అల్లకల్లోలమైన జీవితమే సంసార సాగరంగా పేర్కొన బడింది. ఈ అలలు ఉధృతమై ఉన్నంత వరకు ధ్యానం మూలంగా భగవంతుని దరి చేరలేము. మనస్సు ప్రశాంత మైనప్పుడే ధ్యానము కుదురుతుంది).
అధో నిష్ట్యా....అనే మంత్రములో హృదయం గురించి చెప్పబడింది. లబ్ డబ్ అని కొట్టుకునే భౌతిక హృదయం కాదు ఇది. ఇది పారమార్థిక హృదయం. దీనికి మూడు లక్షణాలు. ఒకటి, నాభికి జానెడు దూరంలో ఉండి. భౌతిక హృదయము కూడా అంటే దూరంలో ఉండి కాని అది కాస్త ఎడమ వైపు ఉంది. కానీ, ఆధ్యాత్మిక హృదయం మధ్యలో ఉంది. రెండవది, దీపశిఖల వరుసతో ఆవృతమై ఉంది. మూడవది, ఆ హృదయం దేదీప్యమానమైనది. ఈ మూడు లక్షణములు భౌతిక హృదయానికి వర్తించవు. కానీ దీనిని మనము గ్రహించకున్నాము. గ్రహించకున్నప్పటికీ అది అక్కడ ఉండనే ఉంది.
తామర మొగ్గ వంటి ఈ హృదయం నలువంకల నాడులతో ఆవృతమై వ్రేలాడుచున్నది. దాని లోపల సూక్ష్మాకాశము ఉన్నది. అంతా దానిలో నెలకొని ఉన్నది.
సర్వత్రా ప్రకాశిస్తూ, అన్ని దిశలా వ్యాపిస్తున్న మహోన్నతమైన అగ్ని ఆకాశానికి నడుమన ఉన్నది. ప్రాణం అయిన ఆ అగ్ని మొట్టమొదట భుజించేదిగాను, ఆహారాన్ని విభజించి ఇచ్చేదిగాను, దృఢమైనది గాను, పాతపడనిది గాను, అన్నింటినీ చూసేదిగాను ఉంది.
ఆ ప్రాణం యొక్క కిరణాలు అడ్డదిడ్డంగా, ఊర్ధ్వంగా, అధోముఖంగా ప్రసరిస్తూ, సర్వత్రా వ్యాపించి ఉన్నాయి, పాదం నుండి తల వరకు తన శరీరాన్ని వెచ్చగా ఉండేట్లు చేస్తుంది. దీని మధ్య అణుప్రమాణమైన అగ్ని జ్వాల ఊర్ధ్వ ముఖంగా అమరి ఉంది.
కారు మేఘం మధ్యనుండి వెలుగును విరజిమ్మే మెరపు తీగలా, వరి మొలకలా, సన్నమైనదిగా, బంగారు చాయగాను, అనువులా సూక్ష్మమైనదిగాను ఆ ఆత్మ ప్రకాశిస్తూ ఉంది.
ఆ అగ్నిశిఖ మధ్యన పరమాత్మ సుప్రతిష్ఠుడై ఉన్నాడు. ఆయనే బ్రహ్మ, శివుడు, విష్ణువు. ఆయనే ఇంద్రుడు. ఆయన నాశనము లేని వాడు, స్వప్రకాశుడు. ఆయన కంటే అధికుడు ఎవరూ లేని వాడు.
కానవచ్చే వస్తుజాతాన్ని అందంగాను, దృశ్యానికి ఆధారం గాను ఉన్న భగవంతుని ప్రతి శరీరం అంతటా నిండిఉన్న వాణ్ణి, నల్లని మేను విష్ణువు తెల్లని మేని శివుడు ఒకరుగా మిశ్రితమైన రూపాన్ని, పూర్ణ పవిత్రుని, త్రినేత్రుని, సమస్తాన్ని తన స్వరూపంగా పరిగ్రహించిన వానిని పదే పదే నమస్కరిస్తున్నాను.
నారాయణుని తెలుసుకుందాము. అందుకోసం ఆ వాసుదేవుని ధ్యానిద్దాము. ఆ విష్ణువు మనలను ఈ ధ్యాన ప్రయత్నములో ప్రేరేపించు గాక!
ఓం శాంతి శాంతి శాంతి