దేవాలయాల్లో ఈ మధ్యన అర్చనలు చేయించేటప్పుడు
ప్రదక్షిణ నమస్కారాలని చెప్పి ఆత్మ ప్రదక్షిణ
నమస్కారాలు చేయిస్తున్నారు. అక్కడ ఆత్మ ప్రదక్షిణం
చేయకూడదు అంటారు. అది ఎంతవరకు సబబు?
ఎప్పుడైనా సరే చుట్టూ తిరగడమే ప్రదక్షిణం. మన
ఇళ్లలో అది సాధ్యం కాదు కనుక, ఆత్మ ప్రదక్షణం అనే
విధానాన్ని మనకు అనుమతించారు. గుళ్లలో చక్కగా
చుట్టూరా తిరిగొచ్చే ఏర్పాటు వుంటుంది. ఒకోసారి
గుళ్లల్లో కూడా ఆ దారులు కట్టేస్తూ వుంటారు.
అలాంటప్పుడు ఆత్మప్రదక్షిణం చేసుకుంటే
చేసుకోవచ్చునేమోగానీ గుళ్లల్లో ప్రదక్షిణం చేసేందుకు
ఆవకాశం ఉన్నప్పుడు మాత్రం ఆత్మ ప్రదక్షిణలు
మంచిదికాదు. కానీ, అలా పూర్తి ప్రదక్షిణం పెట్టుకుంటే
పూజలు ఆలస్యం అయిపోతాయి అనే అసౌకర్యం కోసం
కొన్ని గుళ్లల్లో మరికొన్ని వ్యవస్థలు ఏర్పాటు చేయాల్సి
వస్తుంది. అప్పుడు ఆత్మ ప్రదక్షిణ కాకుండా వట్టిగా
శిరస్సు వంచి నమస్కారం చేసుకోవాలి తప్పితే దేవుడి
ఎదురుగుండా సాష్టాంగ నమస్కారం చేయకూడదు.
చేసినట్టయితే వాహనానికి కాళ్లొచ్చేస్తాయి. వెనకాల
వున్న ఆంజనేయుడో, గరుత్మంతుడో ఎవరో వుంటారు.
అంచేత ఇటువంటి కొత్త సంప్రదాయాలను
తయారుచేసేటప్పుడు ఆలయ వ్యవస్థ వాళ్లే ఎక్కువ
జాగ్రత్తలు తీసుకోవాలి. మొత్తంమీద తేలిందేమిటంటే
గుడికి చుట్టూ ప్రదక్షిణ చేయడం ఉత్తమం.
లేకపోయినట్టయితే పూజ పూర్తి చేసుకుని ఆ ప్రసాదం
కూడా పుచ్చుకున్నాక చివరకు గుడి ప్రదక్షిణ
చేసుకున్నా తప్పేమీ కాదు. కానీ లోపల ప్రదక్షిణం
చేయడం మాత్రం అంత ఉత్తమం కాదు. గర్భగుడిలో
సాష్టాంగపడడం అంటే తోటి భక్తులకు ఇబ్బందికరంగా
ఉంటుంది. వీరిని ఎవరైనా తొక్కినా తొక్కవచ్చు. మనం
ఇంకొకళ్లకు ఇబ్బంది కలగకుండా మన కష్టాన్ని
దేవుడికి విన్నవించుకోవాలి కదా!