శ్రీశుక ఉవాచ
ఇతి భాగవతః పృష్టః క్షత్త్రా వార్తాం ప్రియాశ్రయామ్
ప్రతివక్తుం న చోత్సేహ ఔత్కణ్ఠ్యాత్స్మారితేశ్వరః
విదురుని ప్రశ్న విన్న ఉద్ధవుడు పరమాత్మ యందు తనకున్న సహజమైన భక్తిచే అతని గొంతు పూడుకుపోయింది
యః పఞ్చహాయనో మాత్రా ప్రాతరాశాయ యాచితః
తన్నైచ్ఛద్రచయన్యస్య సపర్యాం బాలలీలయా
శ్రీ కృష్ణుని పేరు వింటే పులకించిపోయేవాడు ఉద్ధవుడు. ఐదేళ్ళ వయసులో ఉపాహారానికి (ప్రాతరాశాయ - బాల భోగం అని అంటారు) పిలిస్తే వచ్చేవాడు కాడు. కృష్ణపరమాత్మ లీలలనే బాల్యక్రీడలుగా ఆడుకొనేవాడు. అలా నిమగ్నమై ఉండి తల్లి పిలిస్తే వచ్చేవాడు కాడు.
స కథం సేవయా తస్య కాలేన జరసం గతః
పృష్టో వార్తాం ప్రతిబ్రూయాద్భర్తుః పాదావనుస్మరన్
పరమాత్మ సేవలో పూర్తిగ తన వయసు ఉడిగిపోయింది. కృష్ణుణ్ణి ఆరాధించుటలోనే వార్ధక్యాన్ని పొందాడు. అలాంటి భాగవతోత్తముడైన ఉద్ధవుడు "కృష్ణుడు ఎలా ఉన్నాడన్న " ప్రశ్నకు ఏమి చెప్పాలో తెలియక కృష్ణపాదపద్మములను స్మరించాడు
స ముహూర్తమభూత్తూష్ణీం కృష్ణాఙ్ఘ్రిసుధయా భృశమ్
తీవ్రేణ భక్తియోగేన నిమగ్నః సాధు నిర్వృతః
అడిగిన దానికి సమాధానం చెప్పేముందు పరమాత్మ పాదం స్మరించడంతో అన్ని ఇంద్రియములకూ విశ్రాంతి లభించింది. ఏ పని చేస్తే ఇంద్రియాలకు ఇష్టమో అది చేయడమే విశ్రాంతి. దేని వలన మనో ఇంద్రియాలు ప్రశాంతతను పొందుతాయో అదే విశ్రాంతి. ఒక్క సారి తీవ్రమైన భక్తియోగములో మునిగిపోయాడు.
పులకోద్భిన్నసర్వాఙ్గో ముఞ్చన్మీలద్దృశా శుచః
పూర్ణార్థో లక్షితస్తేన స్నేహప్రసరసమ్ప్లుతః
శరీరం అంతా పులకింతలు వచ్చాయి. ఒక్క సారి కనులు మూసుకున్నాడు. ఆనందబాష్పాలు రాలుస్తూ, ఎదురుగా ఉన్నవాడు, అడిగిన వాడు, అడిగిన ప్రశ్న విన్నవారు, ఒకే విధమైన అనుభూతి పొందుతారు. వారి "అర్థం" పరిపూర్ణమైనది. ఆనందబాష్పాలతో అభిషేకం చేసుకున్నట్లు కనిపించాడు
శనకైర్భగవల్లోకాన్నృలోకం పునరాగతః
విమృజ్య నేత్రే విదురం ప్రీత్యాహోద్ధవ ఉత్స్మయన్
ఉద్ధవుడు మెల్లగా ఈ లోకానికి వచ్చాడు. ఒక సారి తన కళ్ళను తుడుచుకున్నాడు. పరమాశ్చర్యాన్ని పొందుతూ (కలియుగం వచ్చినా కృష్ణుడి గురించి అడిగినందుకు)
ఉద్ధవ ఉవాచ
కృష్ణద్యుమణి నిమ్లోచే గీర్ణేష్వజగరేణ హ
కిం ను నః కుశలం బ్రూయాం గతశ్రీషు గృహేష్వహమ్
నీవు అందరి క్షేమం అడిగావు. ఏమి చెప్పమంటావు. కాలం అనే పెద్ద కొండచిలువ శ్రీకృష్ణుడనే సూర్యున్ని మ్రింగివేసింది. ఇంకా కుశలం అనేది ఏముంటుంది. ఆయన ఉంటేనే ఇంటికి ఒక కళ. ఇక క్షేమం గురించి ఇపుడు చెప్పేదేముంది
దుర్భగో బత లోకోऽయం యదవో నితరామపి
యే సంవసన్తో న విదుర్హరిం మీనా ఇవోడుపమ్
ప్రపంచం దౌర్భాగ్యం అయింది. లోకం కన్నా యాదవులు మరీ దౌర్భాగ్యులు. కృష్ణ పరమాత్మతో కలిసి మెలిసి తిరిగినా ఆయన తమ లాంటి మానవుడనుకున్నారు కానీ పరమాత్మ అనుకోలేదు. ఒక నదిలో చేపలుంటాయి, అదే నీటిలో పడవకూడా ఉంటుంది. తమకు అడ్డం వచ్చిన పడవను చేపలు ఇంకో చేప అనుకుంటాయి గానీ, అది నీటి నుంచి దాటించే పడవ అనుకోరు. సంసారం నుంచి ఉద్ధరించే పరమాత్మ సంసారంలో ఉంటటం చూచి "ఆయన కూడా మాలాంటి మనిషే" అనుకున్నారు
ఇఙ్గితజ్ఞాః పురుప్రౌఢా ఏకారామాశ్చ సాత్వతాః
సాత్వతామృషభం సర్వే భూతావాసమమంసత
పరమాత్మ హృదయాన్ని, ఎదుటివారి అభిప్రాయాన్ని, ఈ రెండూ తెలుసుకున్న వారు ఉత్తమ పరిజ్ఞ్యానం కలవారు. జ్ఞ్యానులకు అధిపతి అయిన స్వామిని ప్రాణులతో కలిసి ఈ లోకంలో ఉండేవానిగా తలిచారు గానీ, సకల భూతములలో ఉండేవాడు అని గానీ, సకల భూతములకూ నివాసమని గానీ తెలుసుకోలేకపోయారు. ఆయన శ్రీమన్నారాయనుడని జ్ఞ్యానులు కూడా తెలుసుకోలేకపోయారు. యాదవులు అసలు తెలుసుకోలేకపోయారు
దేవస్య మాయయా స్పృష్టా యే చాన్యదసదాశ్రితాః
భ్రామ్యతే ధీర్న తద్వాక్యైరాత్మన్యుప్తాత్మనో హరౌ
పరమాత్మ మాయచేత ఆవరింపబడిన వారు కాబట్టి దుర్జనుల సావాసం చేసి ఉంటారు. పరమాత్మ యందే మనసు అర్పించిన వారు ఇలాంటి దుర్జనులు మాట్లాడిన మాటలకు చలించరు.
ప్రదర్శ్యాతప్తతపసామవితృప్తదృశాం నృణామ్
ఆదాయాన్తరధాద్యస్తు స్వబిమ్బం లోకలోచనమ్
పరమాత్మ దివ్య మంగళ విగ్రహాన్ని దర్శించుకుంటూనే ఉండాలి అన్న కోరికతో చాలా మంది చాలా కాలము తపసు చేసారు, అలా చేసి కృష్ణ పరమాత్మ ఉన్న చోట పుట్టారు, కృష్ణ పరమాత్మను నిరంతరమూ దర్శనం చేసుకుంటూనే ఉన్నారు. అయినా వారికి తృప్తి కలగలేదు. ఎంతమంది భార్యలున్నా చాలు అని అనుకోలేనట్లు, ఎంత కాలం పరమాత్మ దివ్య విగ్రహాన్ని దర్శనం చేసుకున్నా కనులకు తృప్తి కలగదు. అంతలోనే ఆ దివ్య మంగళ విగ్రహాన్ని తీసుకుని స్వామి అంతర్ధానం చెందాడు.
యన్మర్త్యలీలౌపయికం స్వయోగ మాయాబలం దర్శయతా గృహీతమ్
విస్మాపనం స్వస్య చ సౌభగర్ద్ధేః పరం పదం భూషణభూషణాఙ్గమ్
మానవలోకానికి తగిన యోగమాయా బలాన్ని స్వీకరించి అందరికీ చూపడానికి, చూచిన ప్రతీ వారు అత్యాశ్చర్యం పొందే ఆయన విగ్రహం, అన్ని రకాల సౌభాగ్యాలకి పరమపదమైన ఆయన శరీరం, ఆభరణాలకే ఆభరణమైన ఆయన శరీరం,
యద్ధర్మసూనోర్బత రాజసూయే నిరీక్ష్య దృక్స్వస్త్యయనం త్రిలోకః
కార్త్స్న్యేన చాద్యేహ గతం విధాతురర్వాక్సృతౌ కౌశలమిత్యమన్యత
అటువంటి కృష్ణ పరమాత్మ యొక్క అతిలోక మోహమైన శరీరాన్ని ధర్మరాజు చేసిన రాజసూయయాగములో చూచారు, దానికి దేవలోకం వారు కూడా వచ్చారు. కన్నులకు మంగళకరమైన, నేత్రములకు శుభము యొక్క నిలయం అయిన స్వామిని చూచి "కృష్ణుని శరీరం నిర్మించిన తరువాత బ్రహ్మగారు ఇంక సృష్టి చేసి ఉండకపోవచ్చు" అని అనుకున్నారు. ఆయన సౌందర్య పరాకాష్టలో అన్ని విషయాలు మర్చిపోయి, కృష్ణుడు కూడా బ్రహ్మగారి సృష్టిలో భాగం అనుకున్నారు. (గోపికలు కూడా స్వామిని కనులారా చూస్తూ రెప్పలు పడటంతో బ్రహ్మగారు కంటికి రెప్పలు సృష్టించకుండా ఉండవలసింది అనుకున్నారు). బ్రహ్మగారి సృష్టిలో చాతుర్యం ఇంతటితో అయిపోయింది అనుకున్నారు
యస్యానురాగప్లుతహాసరాస లీలావలోకప్రతిలబ్ధమానాః
వ్రజస్త్రియో దృగ్భిరనుప్రవృత్త ధియోऽవతస్థుః కిల కృత్యశేషాః
పరమాత్మ విలాసవంతమైన కటాక్షం (రాస లీలావలోకం) నిరంతరం గోపికలమీద పడి (ఉదాహరణకు రామాయణంలో యశ్చ రామం న పశ్యేత్తు యం చ రామో న పశ్యతి | నిందితస్స జనో లోకే స్వాఽఽత్మాప్యేనం విగర్హతే ||) ప్రేమతో నిండిన, చిరునవ్వుతో కలిగ్నటువంటి రసిక హృదయంతో ఏర్పడిన లీలను కురిపించే చూపు. పరమాత్మ లీలలో విలాసము ప్రేమ, రాసము, లీల ఇవన్నీ కలిసి ఉన్న చూపు వారి మీద పడింది. సహజముగా లోకములో బుద్ధినిన్ కనులు అనుసరిస్తాయి. గోపికలకు మాత్రం కన్నులనే బుద్ధి అనుసరించింది. జడమైన అవయవాలకే చైతన్యం వస్తుంది. చూపులవెంట బుద్ధి పోయింది గానీ, బుద్ధి వెంట చూపులు పోలేదు. తాము చేయవలసిన పనులు అంటూ ఏమీ లేని వారు గోపికలు (కిల కృత్యశేషాః)
స్వశాన్తరూపేష్వితరైః స్వరూపైరభ్యర్ద్యమానేష్వనుకమ్పితాత్మా
పరావరేశో మహదంశయుక్తో హ్యజోऽపి జాతో భగవాన్యథాగ్నిః
అందరూ తమ సంకల్పముతోటే పుట్టిన వారు, తమ సేవతో తమ ధ్యానంతో తమ స్మరణతో ప్రశాంతముగా జీవితం గడపాలనుకునే వారు ఇతరులచే పీడించబడుతుండగా, వారి ప్రాథనవలన, దయకలిగిన వాడై, పరావరేశుడై (పెద్దవారికీ పెద్దవాడు, చిన్నవారికీ ఈశుడే) మహదంశతో (బలరామునితో - బలరాముడు మహత్ తత్వం) అవతరించాడు. పుట్టుకలేనివాడు అయి ఉండి పుట్టాడు. ఎలా అయితే కట్టెలోంచి అగ్ని పుడుతుందో. పరమాత్మ అవతరించాడంటే ఆయన వైకుంఠములో లేడా? రెండు కట్టెలను రాపిడి చేస్తే అగ్ని పుడుతుంది. మరి అగ్ని పుట్టింది కాబట్టి కట్టెలో ఇంక అగ్ని లేదు అనగలమా...ఎన్ని సార్లు కట్టెలోంచి అగ్ని పుట్టినా ఆ కట్టెలలో అగ్ని ఉంటూనే ఉంటుంది. అలాగే స్వామి అవతరించినా వైకుంఠములో కూడా ఆయనే ఉంటాడు
మాం ఖేదయత్యేతదజస్య జన్మ విడమ్బనం యద్వసుదేవగేహే
వ్రజే చ వాసోऽరిభయాదివ స్వయం పురాద్వ్యవాత్సీద్యదనన్తవీర్యః
ఇంతటి మహానుభావుడైన వాడు, సకల జగత్తుని సంకల్పమాత్రం చేత ఇంతటి అనంతకోటి బ్రహ్మాండాలను సృష్టించి కాపాడే పరమాత్మ వసుదేవుడి ఇంటిలో చెరసాలలో పుట్టాడు (ఇదే అర్థాన్ని భావించి నమ్మాళ్వారు మూర్చపోయారు). పుట్టుక లేని పరమాత్మ వసుదేవుని ఇంటిలో పుట్టినట్టు చూపాడు. శత్రువులకు భయపడి అక్కడినుంచి తప్పించుకుని రేపల్లెలో దాక్కున్నాడు. అనంత పరాక్రమం గలవాడు భయపడినట్లు నటించాడు. అది తలచుటచేతనే నా మనసు బాధపడుతోంది.
దునోతి చేతః స్మరతో మమైతద్యదాహ పాదావభివన్ద్య పిత్రోః
తాతామ్బ కంసాదురుశఙ్కితానాం ప్రసీదతం నోऽకృతనిష్కృతీనామ్
గుండెను పిండివేసే (దునోతి చేతః ) ఇంకో ఉదంతం దేవకీ వసుదేవల పాదములు పట్టుకుని కన్నీళ్ళతో "కంసునికి భయపడి ఇంతవరకూ మిమ్ములను సరిగా సేవించలేకపోయాము క్షమించండి " అన్న మాటను వింటే నా గుండె పిండి వేసినట్లు అవుతోంది. ప్రేమతో వెళ్ళి పిల్లలు తల్లి ఒడిలో కూర్చుని పాలు త్రాగడమే సేవ, దుమ్ము పోసుకుని తండ్రి ఒడిలో పొర్లడమే సేవ. అలాంటి సేవ కృష్ణుడు దేవకీ వసుదేవులకు చేయలేకపోయాడు
కో వా అముష్యాఙ్ఘ్రిసరోజరేణుం విస్మర్తుమీశీత పుమాన్విజిఘ్రన్
యో విస్ఫురద్భ్రూవిటపేన భూమేర్భారం కృతాన్తేన తిరశ్చకార
ఒక్క సారి ఈయన పాదపద్మాలను అఘ్రాణించినవాడు మరచిపోగలడా, దుర్మార్గులతో భూమి చాలా బరువెక్కిందని అందరూ విలపిస్తే, ప్రకాశించే కనుబొమ్మలతో (యముడుగా ఉన్న కనుబొమ్మల కదలికతో) సకల భూభారాన్ని తొలగించాడు.
దృష్టా భవద్భిర్నను రాజసూయే చైద్యస్య కృష్ణం ద్విషతోऽపి సిద్ధిః
యాం యోగినః సంస్పృహయన్తి సమ్యగ్యోగేన కస్తద్విరహం సహేత
రాజసూయ యాగములో క్ర్ష్ణపరమాత్మకు అగ్రపూజ జరుగుతుంటే చూసి సహించని శిశుపాలునికి కూడా, మహాయోగులు కూడా "మాకిది లభించాలని" అభిలషించే మోక్షమును ప్రసాదించాడు. లోకములో పొగడినవాడికే మేలు జరుగుతుంది. పరమాత్మ విషయములో పొగడినా తెగడినా మోక్షమే వస్తుంది. మనదగ్గర ఉనందాన్ని ఇస్తే, ఏమి ఇచ్చినా ఆయన మోక్షము ఇస్తాడు. ఒక్క సారి చూస్తే ఈయనని మరచిపోలేము. రాజసూయ యాగములో ద్వేషించిన శిశుపాలునికి కూడా సిద్ధి పొందడం చూసరు కద. ద్వేషించిన వారికి కూడా మోక్షమిచ్చ్చే స్వామిని ఎవరైనా ఎలా మరచిపోతారు.
తథైవ చాన్యే నరలోకవీరా య ఆహవే కృష్ణముఖారవిన్దమ్
నేత్రైః పిబన్తో నయనాభిరామం పార్థాస్త్రపూతః పదమాపురస్య
కౌరవ పాండవ మహాసంగ్రామంలో శరవర్షం కురిపిస్తున్న అర్జనుని వద్దకే సైన్యం వస్తోంది. దానికి కారణం "ఒక్క సారి కృష్ణుణ్ణి చూసి మరణిద్దాం" అని అనుకున్నారు. కృష్ణపరమాత్మ ముఖాన్ని చూస్తూ పార్థుని బాణాలతో కొట్టబడి మరణించారు. కనులకు తృప్తినిచ్చే పరమాత్మ ముఖ పద్మాన్ని కనులతో త్రాగుతూ మోక్షాన్ని పొందారు. మామూలు యుద్ధంలో మరణిస్తే స్వర్గం వస్తుంది. ఈ యుద్ధంలో మరణిస్తే మోక్షం వస్తుంది. బహుశా అందుకే కృష్ణుడు తన సైన్యం మొత్తాన్ని కౌరవులకు ఇచ్చాడేమో. మొత్తం కౌరవ సైన్యాలకు మోక్షం ఇచ్చాడు. కృష్ణుడు పరమాత్మ అవతారం అని అందరికీ పరిపూర్ణ విశ్వాసం ఉంది.
స్వయం త్వసామ్యాతిశయస్త్ర్యధీశః స్వారాజ్యలక్ష్మ్యాప్తసమస్తకామః
బలిం హరద్భిశ్చిరలోకపాలైః కిరీటకోట్యేడితపాదపీఠః
సామ్యంలో కానీ ఆధిక్యంలో గానీ ఆయనకు సాటి ఇంకొకరు లేరు. మూడు లోకాలకు మూడు గుణాలకు, మూడు వేదాలకు అధిపతి ఆయన. తనలో తానే రమించేవాడు (స్వారాజ్యలక్ష్మ్యా), ఆయన స్వయం ప్రకాశకుడు, ఆయన మీద నమ్మకాన్ని ఆయనే కలిగిస్తాడు (శ్రీమద్రామాయణంలో రామసుగ్రీవ మైత్రిలో ఈ విషయం తెలుస్తుంది. శ్రీరాముడు సుగ్రీవుడు నమ్మడానికి సుగ్రీవుడు పెట్టిన పరీక్షలకు తల వొగ్గి తనను తాను నిరూపించుకున్నాడు రామచంద్రప్రభువు.). లోకపుర కిరీటముల మణుల కాంతిచే ప్రకాశించే పాద పద్మములు కలవాడు
తత్తస్య కైఙ్కర్యమలం భృతాన్నో విగ్లాపయత్యఙ్గ యదుగ్రసేనమ్
తిష్ఠన్నిషణ్ణం పరమేష్ఠిధిష్ణ్యే న్యబోధయద్దేవ నిధారయేతి
కంసున్ని సంహరించి రాజ్య సిమ్హాసనంలో ఉగ్రసేనున్ని కూర్చోబెట్టి "నేను నీ రాజ్య పాలకుడుగా ఉంటున్నాను. " అని చెప్పి "మహారాజా కటాక్షించు" (దేవా నిధారయ) అని చేతులు జోడించి అడిగిన సన్నివేశాన్ని చూచిన నా మనసు విలపిస్తోంది. అది నా మనసుని చీల్చి వేస్తోంది. ఇంద్ర సిమ్హాసనంలో ఉగ్రసేనుడు కూర్చుంటే కృష్ణుడు నిలబడ్డాడు.
అహో బకీ యం స్తనకాలకూటం జిఘాంసయాపాయయదప్యసాధ్వీ
లేభే గతిం ధాత్ర్యుచితాం తతోऽన్యం కం వా దయాలుం శరణం వ్రజేమ
పూతన (బకీ) తన స్తనములలో ఉన్న కాలకూటాన్ని చంపడానికి ఇస్తే, తనను పెంచిన తల్లి చేరిన మోక్షాన్ని పొందింది. ఏ కొంచెం బుద్ధి ఉన్నా ఇతని కన్నా వేరైన వారెవరు మనకు శరణు ఇవ్వగలరు. చంపుతా అన్న వారికి మోక్షం ఇచ్చాడు.
మన్యేऽసురాన్భాగవతాంస్త్ర్యధీశే సంరమ్భమార్గాభినివిష్టచిత్తాన్
యే సంయుగేऽచక్షత తార్క్ష్యపుత్రమంసే సునాభాయుధమాపతన్తమ్
కృష్ణ పరమాత్మ చక్రంతో మరణించిన వారంతా భాగవతులు. స్వామిని తలుచుకుంటేనే మోక్షం వస్తుంది. అలాంటిది వీరు పరమాత్మ యానాన్ని (గరుడున్ని), ఆయుధాన్ని (చక్రాన్ని) , పరమాత్మనీ చూస్తూ మోక్షాన్ని పొందారు కాబట్టి రాక్షసులందరూ పరమభాగవతులే. క్రోధ మార్గంలో చిత్తాన్ని పెట్టిన ఈ రాక్షసులు గరుడుడి (తార్క్ష్యపుత్ర) భుజాల మీద కూర్చుని చక్రాయుధం మీద కూర్చున్న పరమాత్మని దర్శించిన రాక్షసులు భాగవతోత్తములని నేను అనుకుంటున్నాను.
వసుదేవస్య దేవక్యాం జాతో భోజేన్ద్రబన్ధనే
చికీర్షుర్భగవానస్యాః శమజేనాభియాచితః
ఈయన బ్రహ్మ ప్రార్థిస్తే లోకానికి మంగళం కలిగించాలని దేవకీ వసుదేవులకు సంభవించాడు
తతో నన్దవ్రజమితః పిత్రా కంసాద్విబిభ్యతా
ఏకాదశ సమాస్తత్ర గూఢార్చిః సబలోऽవసత్
కంసుని వలన భయపడుతున్న తల్లి తండ్రుల కోరిక తీర్చడానికి రేపల్లె జేరి పదకొండు సంవత్సరాలు తన తేజస్సును దాచుకున్నాడు
పరీతో వత్సపైర్వత్సాంశ్చారయన్వ్యహరద్విభుః
యమునోపవనే కూజద్ ద్విజసఙ్కులితాఙ్ఘ్రిపే
కౌమారీం దర్శయంశ్చేష్టాం ప్రేక్షణీయాం వ్రజౌకసామ్
రుదన్నివ హసన్ముగ్ధ బాలసింహావలోకనః
స ఏవ గోధనం లక్ష్మ్యా నికేతం సితగోవృషమ్
చారయన్ననుగాన్గోపాన్రణద్వేణురరీరమత్
ప్రయుక్తాన్భోజరాజేన మాయినః కామరూపిణః
లీలయా వ్యనుదత్తాంస్తాన్బాలః క్రీడనకానివ
విపన్నాన్విషపానేన నిగృహ్య భుజగాధిపమ్
ఉత్థాప్యాపాయయద్గావస్తత్తోయం ప్రకృతిస్థితమ్
అయాజయద్గోసవేన గోపరాజం ద్విజోత్తమైః
విత్తస్య చోరుభారస్య చికీర్షన్సద్వ్యయం విభుః
వర్షతీన్ద్రే వ్రజః కోపాద్భగ్నమానేऽతివిహ్వలః
గోత్రలీలాతపత్రేణ త్రాతో భద్రానుగృహ్ణతా
దూడలతోటీ గోపాలురతోటీ కలిసి బృందావనంలో యమునాతీరములో విహరించాడు. రేపల్లెలో ఉన్నవారికి బాల చేష్టలు చూపించడానికి, రేపల్లెలో ఉన్నవారిని నవ్వడానికి స్వామి ఏడిచాడు. ఏడుస్తున్నట్లుగా ఉన్నటువంటి నవ్వుని చూపాడు. చిన్న బాలసిమ్హం లాంటి చూపులు చూసిన మహానుభావుడు. వేణువును వాయిస్తూ, లక్ష్మీ నివాసమైన గోధనాన్ని కాపాడుతూ, బొమ్మలని తీసి పారేసినట్లుగా కంసుడు పంపిన రాక్షసులని సంహరిస్తూ. కాళీయ హ్రదంలో ఆ విషం తాగి మరణించిన గోపాలురని తన దివ్య కటాక్షంతో బ్రతికించాడు. నదునితో గోరసంతో (పాలు పెరుగు వెన్న నెయ్యి) యజ్ఞ్యం చేయించాడు, తద్వారా బాగా పెరిగిన ధనాన్ని ఎలా సద్వినియోగం చేయాలో నేర్పాడు. నాకు ఆచరించే యజ్ఞ్యాన్ని భంగం చేస్తారా అని ఇంద్రుడు కోపించి వర్షం కురిపిస్తే ఇంద్రున్ని గోపాలురనీ, ఉభయులనూ అనుగ్రహించాలని గోవధన పర్వతాన్ని గొడుగులా ఎత్తి కాపాడిన మహానుభావుడు
శరచ్ఛశికరైర్మృష్టం మానయన్రజనీముఖమ్
గాయన్కలపదం రేమే స్త్రీణాం మణ్డలమణ్డనః
శరత్కాలంలో అహ్లాదాన్ని కలిగించే చంద్రుని కిరణములచే అలంకరించబడిన బృందావనంలో రాత్రిని అతి మధురంగా గానం చేస్తూ గోపికా మండలం (రాసమండలం) ఏర్పరచుకుని గోపికలను ఆనందింపచేసిన మహానుభావుడు
ఈ అధ్యాయం అంతా పరమాత్మ కొన్ని లీలలను తలచుకోవడమే. పరమాత్మ విరహాన్ని భరించలేని విదురుడు చేసిన స్తోత్రమే ఇది.