Followers

Friday 7 February 2014

శ్రీమద్భాగవతం చతుర్థ స్కంధం పదిహేనవ అధ్యాయం



మైత్రేయ ఉవాచ
అథ తస్య పునర్విప్రైరపుత్రస్య మహీపతేః
బాహుభ్యాం మథ్యమానాభ్యాం మిథునం సమపద్యత

ఇప్పుడు పాపము పోయింది కాబట్టి రెండు బాహువులనూ మదించారు. అప్పుడు కవలల జంట పుట్టింది

తద్దృష్ట్వా మిథునం జాతమృషయో బ్రహ్మవాదినః
ఊచుః పరమసన్తుష్టా విదిత్వా భగవత్కలామ్

అది చూసి భగవానుని అంశ ఆవిర్భవించిందని ఆనందముగా తెలుసుకొని

ఋషయ ఊచుః
ఏష విష్ణోర్భగవతః కలా భువనపాలినీ
ఇయం చ లక్ష్మ్యాః సమ్భూతిః పురుషస్యానపాయినీ

సకల జగత్తునూ కాపాడవలసిన పరమాత్మ అంశ ఈయన. ఈమె లక్ష్మి అంశ. ఎందుకంటే అమ్మవారు స్వామిని విడిచిపెట్టి ఉండదు.

అయం తు ప్రథమో రాజ్ఞాం పుమాన్ప్రథయితా యశః
పృథుర్నామ మహారాజో భవిష్యతి పృథుశ్రవాః

రాజుల వంశమంతరించిపోయిందన్న మహా ఆపద సమయములో ప్రథమ రాజుగా పుట్టాడు. అన్ని లోకములలో మంచి కీర్తిని పొందుతాడు. ఇతను పృధు చక్రవర్తి. పృధు అంటే ప్రధముడు మొదటివాడు, ప్రసిద్ధి పొందేవాడు.

ఇయం చ సుదతీ దేవీ గుణభూషణభూషణా
అర్చిర్నామ వరారోహా పృథుమేవావరున్ధతీ

ఈమె గుణములు ఈమెకున్న అలంకారములకు అలంకారములు. ఈమె పేరు అర్చి (తేజస్సు, కాంతి). ఈమె పృధువుని వివాహమాడుతుంది

ఏష సాక్షాద్ధరేరంశోజాతో లోకరిరక్షయా
ఇయం చ తత్పరా హి శ్రీరనుజజ్ఞేऽనపాయినీ

ఇతను సాక్షాత్తు భగవానుడు సకల లోకాలని కాపాడటానికి అవతరించాడు. నిత్యానపాయినీ అయిన అమ్మవారు కూడా అవతరించారు

మైత్రేయ ఉవాచ
ప్రశంసన్తి స్మ తం విప్రా గన్ధర్వప్రవరా జగుః
ముముచుః సుమనోధారాః సిద్ధా నృత్యన్తి స్వఃస్త్రియః

బ్రాహ్మణులందరూ ఈ పృధువును కీర్తించారు, గంధర్వులు గానమూ, దేవతలు పుష్ప వృష్టీ, అప్సరలసు నాట్యమూ చేసారు

శఙ్ఖతూర్యమృదఙ్గాద్యా నేదుర్దున్దుభయో దివి
తత్ర సర్వ ఉపాజగ్ముర్దేవర్షిపితౄణాం గణాః

బ్రహ్మా జగద్గురుర్దేవైః సహాసృత్య సురేశ్వరైః
వైన్యస్య దక్షిణే హస్తే దృష్ట్వా చిహ్నం గదాభృతః

దేవతలందరితో కలిసి బ్రహ్మ వేంచేసారు. ఇతడు వేన పుత్రుడు.  ఇతని కుడి చేతిలో చక్రము యొక్క గుర్తు ఉంది

పాదయోరరవిన్దం చ తం వై మేనే హరేః కలామ్
యస్యాప్రతిహతం చక్రమంశః స పరమేష్ఠినః

పాదములలో పద్మాన్ని చూచాడు. ఇతను సాక్షాత్తు పరమాత్మ. చక్రం చేతిలో ఉంటే అది పరమాత్మ అంశే.

తస్యాభిషేక ఆరబ్ధో బ్రాహ్మణైర్బ్రహ్మవాదిభిః
ఆభిషేచనికాన్యస్మై ఆజహ్రుః సర్వతో జనాః

బ్రాహ్మణోత్తములూ బ్రహ్మా కలసి రాజ్యాభిషేకం చేసారు. ప్రజలూ దేవతలూ అభిషేక సంబారాలు తీసుకొచ్చారు

సరిత్సముద్రా గిరయో నాగా గావః ఖగా మృగాః
ద్యౌః క్షితిః సర్వభూతాని సమాజహ్రురుపాయనమ్

అన్ని ప్రాణులూ కానుకలు తెచ్చాయి.

సోऽభిషిక్తో మహారాజః సువాసాః సాధ్వలఙ్కృతః
పత్న్యార్చిషాలఙ్కృతయా విరేజేऽగ్నిరివాపరః

పృధు రాజ్య పట్టభిషేకం జరిగింది. మంచి వస్త్రాలతో అలంకారముతో, స్వాహాతో అగ్నిహోత్రునిలా అర్చితో పృధు చక్రవర్తి ఉన్నాడు.

తస్మై జహార ధనదో హైమం వీర వరాసనమ్
వరుణః సలిలస్రావమాతపత్రం శశిప్రభమ్

కుబేరుడు ఉత్తమమైన బంగారు సింహాసనం. వరుణుడు నిరంతరం నీరు పక్కన పడే గొడుగును ఇచ్చాడు. వాయువు వింజామరలనూ, ధర్మము పుష్పమాలనూ, ఇంద్రుడు కిరీటాన్ని, యముడు దండాన్ని, బ్రహ్మ వేద కవచాన్ని ఇచ్చాడు, సరస్వతి హారాన్ని, శ్రీమన్నారాయణుడు చక్రాన్నీ, లక్ష్మీ దేవి అవ్యాహతమైన సంపదనూ ఇచ్చింది, శంకరుడు పది చంద్రులతో ప్రకాశించే ఖడ్గాన్ని, పార్వతి నూరుచంద్రులతో ప్రసాదించే ఖడ్గాన్నీ, చంద్రుడు గుర్రాలనూ, త్వష్ట రథాన్నీ ఇచ్చడు, అగ్ని రథాన్నిచ్చాడు, సూర్యుడు బంగారాన్నిచ్చాడు, భూమి పాదుకలనూ, ఆకాశం పుష్పాలని, ఖేచరులు మంగళ వాద్యాలనూ అంతర్ధాన విద్యను ఇచ్చారు, ఋషులు ఆశీర్వాదాన్నిచ్చారు, సముద్రుడు తనలో పుట్టిన శంఖాన్నీ, నదులూ మొదలైనవి రథమారగాన్ని ఇచ్చారు

వాయుశ్చ వాలవ్యజనే ధర్మః కీర్తిమయీం స్రజమ్
ఇన్ద్రః కిరీటముత్కృష్టం దణ్డం సంయమనం యమః

బ్రహ్మా బ్రహ్మమయం వర్మ భారతీ హారముత్తమమ్
హరిః సుదర్శనం చక్రం తత్పత్న్యవ్యాహతాం శ్రియమ్

దశచన్ద్రమసిం రుద్రః శతచన్ద్రం తథామ్బికా
సోమోऽమృతమయానశ్వాంస్త్వష్టా రూపాశ్రయం రథమ్

అగ్నిరాజగవం చాపం సూర్యో రశ్మిమయానిషూన్
భూః పాదుకే యోగమయ్యౌ ద్యౌః పుష్పావలిమన్వహమ్

నాట్యం సుగీతం వాదిత్రమన్తర్ధానం చ ఖేచరాః
ఋషయశ్చాశిషః సత్యాః సముద్రః శఙ్ఖమాత్మజమ్

సిన్ధవః పర్వతా నద్యో రథవీథీర్మహాత్మనః
సూతోऽథ మాగధో వన్దీ తం స్తోతుముపతస్థిరే

వందిమాగధులు స్తోత్రం చేయడానికి వచ్చినపుడు

స్తావకాంస్తానభిప్రేత్య పృథుర్వైన్యః ప్రతాపవాన్
మేఘనిర్హ్రాదయా వాచా ప్రహసన్నిదమబ్రవీత్

ప్రతాపుడైన పృధువు గంభీరమైన వాక్కుతో ఇలా అన్నాడు

పృథురువాచ
భోః సూత హే మాగధ సౌమ్య వన్దిన్లోకేऽధునాస్పష్టగుణస్య మే స్యాత్
కిమాశ్రయో మే స్తవ ఏష యోజ్యతాం మా మయ్యభూవన్వితథా గిరో వః

సూతా మాగధా, నేను ఎలాంటి వాణ్ణో లోకానికి తెలియదు. అది తెలియకుండా మీరేమి స్తోత్రం చేస్తారు? మీరు స్తోత్రం చేస్తే దానికి నేను విపర్యయముగా ఉంటే మీ వాక్కు అబద్దం కాకూడదు. గుణము తెలియకుండా స్తోత్రం చేయవలదు

తస్మాత్పరోక్షేऽస్మదుపశ్రుతాన్యలం కరిష్యథ స్తోత్రమపీచ్యవాచః
సత్యుత్తమశ్లోకగుణానువాదే జుగుప్సితం న స్తవయన్తి సభ్యాః

మీరు సుందర వాక్కులు, అలాంటి మీరు మా చాటున మా గురించి ఏమి చెప్పుకుంటారో వాటిని స్తోత్రం చేయాలి. కొన్నాళ్ళు మేము పరిపాలన చేస్తే ప్రజలు చాటున మాట్లాడుకుంటున్నవి మీరు స్తోత్రం చేయాలి. లోకములో అందరూ స్తోత్రం చేస్తున్నారని స్తోత్రం చెయ్యొద్దు. అన్ని వేళలా అందరి చేతా స్తోత్రం చేయదగిన వాడు ఒకడు ఉండగా ఆయనని విడిచి మనలాంటి జుగుప్సితులని స్తోత్రం చేయడం భావ్యము కాదు. ఉత్తములు దీన్ని అంగీకరించరు. సభ్యులెవ్వరూ తమను తాము స్తోత్రం చేయించుకోరు.

మహద్గుణానాత్మని కర్తుమీశః కః స్తావకైః స్తావయతేऽసతోऽపి
తేऽస్యాభవిష్యన్నితి విప్రలబ్ధో జనావహాసం కుమతిర్న వేద

లేని గుణాలను ఉన్నట్లు ఏ బుద్ధిమంతుడు స్తోత్రం చేయించుకుంటాడు? లేని గుణాలను ఎదుట ఉన్న వారు పొగడుతూ స్తోత్రం చేస్తూ ఉంటే, అది విన్న రాజు ఆనందిస్తే, ఆ స్తోత్రం చేసిన వారి వెనక ఉన్న వారు నవ్వుకోరా? అవహేళన చేయరా?

ప్రభవో హ్యాత్మనః స్తోత్రంజుగుప్సన్త్యపి విశ్రుతాః
హ్రీమన్తః పరమోదారాః పౌరుషం వా విగర్హితమ్

అందుకే నిజముగా బుద్ధిమంతులైన వారు తమ స్తోత్రాన్ని తాము అసహ్యించుకుంటారు. సిగ్గు ఉన్న వారు స్తోత్రాన్ని ఒప్పుకోరు. లేని గుణాలను ఎదుటివారు చెబుతూ ఉంటే సిగ్గు ఉన్న వారు ఒప్పుకోరు.

వయం త్వవిదితా లోకే సూతాద్యాపి వరీమభిః
కర్మభిః కథమాత్మానం గాపయిష్యామ బాలవత్

అసలు నేనేమిటో ఈ లోకానికి ఇంకా తెలియదు. మంచి పనులను చేసానని ఎలా చెప్పుకుంటాను చిన్నపిల్లవాడిలాగ

Popular Posts