Followers

Friday, 7 February 2014

శ్రీమద్భాగవతం తృతీయ స్కంధం మొప్పై రెండవ అధ్యాయం


కపిల ఉవాచ
అథ యో గృహమేధీయాన్ధర్మానేవావసన్గృహే
కామమర్థం చ ధర్మాన్స్వాన్దోగ్ధి భూయః పిపర్తి తాన్

ప్ర్కృతియందు వైరాగ్యం కలగడానికి పుట్టుకలో ఉన్న కష్టాలు, వార్ధక్యమూ, అర్థము సంపాదించలేనివాడు పడే అవస్థలూ చెప్పాడు. ఇలాంటి విరక్తి కోసం గర్భ జన్మ జర రోగ మరణముల గురించి చెప్పాడు. ఇష్టాపూర్తములు చేసే వారు కొందరు పుణ్యము చేయడం వలన మంచి జన్మ పొందుతారు. అదే ఇష్టాపూర్తములు పరమాత్మ ఆరాధనగా చేస్తే వచ్చే ఫలితం చెప్పడానికి - గృహమేధీయాన్ధర్మానేవావసన్గృహే. గృహస్థాశ్రములో ఉన్న వారు గృహస్థశ్రమ ధర్మాలను ఆచరిస్తే అర్థకామములు వస్తాయి గానీ మోక్షాన్ని పొందలేడు. అర్థ కామములను పొందించే ధర్మములను ఆచరిస్తూ ఉంటాడు. 

స చాపి భగవద్ధర్మాత్కామమూఢః పరాఙ్ముఖః
యజతే క్రతుభిర్దేవాన్పిత్ంశ్చ శ్రద్ధయాన్వితః

ఫాలాలను ఆశించి ఆచరిస్తే తప్పేంటి? అలాంటి వాడు కామ మూఢుడై, మొహాన్ని పొంది, భగవంతుని వైపు ఉన్ముఖుడు కాలేడు. యజ్ఞ్యములతో దేవతలను, శ్రాధములతో పితృదేవతలను ఆరాధిస్తాడు. 

తచ్ఛ్రద్ధయాక్రాన్తమతిః పితృదేవవ్రతః పుమాన్
గత్వా చాన్ద్రమసం లోకం సోమపాః పునరేష్యతి

పితృ దేవ వ్రతములను ఆచరించేవాడికి చంద్ర లోకం వస్తుంది. అక్కడ సోమ రసాన్ని పానం చేసి మళ్ళీ భూలోకానికి వస్తాడు. 

యదా చాహీన్ద్రశయ్యాయాం శేతేऽనన్తాసనో హరిః
తదా లోకా లయం యాన్తి త ఏతే గృహమేధినామ్

ఈ చంద్రాదిలోకాలన్నీ మనం పొందడం తప్పు కాదు గానీ, ఈ లోకాలు కూడా శాశ్వతం కాదు. ఈ లోకాలన్నీ నశించేవే. ఎలా ఐతే శ్రీమన్నారాయణుడు వ్రతపత్రం మీద పడుకుని, అహీంద్ర శయ్యలో ఎప్పుడైతే యోగనిద్రలోకి వెళతాడో, గృహస్థాశ్రమములో ఉండి ఆచరించే కర్మలన్నీ లీనమవుతాయి. ఇన్ని ధర్మాలు ఆచరించి పోయే లోకాలు ఎందుకు? నిత్య సత్య లోకాన్ని పొందే ప్రయత్నం చేయాలి. 

యే స్వధర్మాన్న దుహ్యన్తి ధీరాః కామార్థహేతవే
నిఃసఙ్గా న్యస్తకర్మాణః ప్రశాన్తాః శుద్ధచేతసః

నిష్కామ కర్మను ఆచరించే వారు పొందే మార్గం: వర్ణాశ్రమాచారాలను ఫలాకాంక్షతో ఆచరించరు. ధర్మము యందు సాధనత్వ బుద్ధిని విడిచిపెట్టి ("నేను చేసే ఈ పని నాకు ఫలానా ఫలితాన్ని ఇస్తుంది) చేయడం. చేసే ధర్మాలన్నీ భగవదారాధన రూపములో చేయాలి. కామార్థాల కోసం ఆచరించరు. దేని యందూ ఆసక్తి లేకుండా కర్మలు పరమాత్మ యందు అర్పించి, వికారములు లేకుండా, పరిశుద్ధమైన మనసు కలవారు

నివృత్తిధర్మనిరతా నిర్మమా నిరహఙ్కృతాః
స్వధర్మాప్తేన సత్త్వేన పరిశుద్ధేన చేతసా

పరమాత్మ యొక్క గుణ కథ నామ సంకీర్తనలు చేయడములో ఆసక్తి ఉన్నవారు, సంసారం యందు ఆసక్తి లేనివారు, దేహాత్మాభిమానం లేనివారు. స్వధర్మాలతో (ఐదు యజ్ఞ్యములనీ) సత్వ గుణముతో భగవంతుని యందు లగ్నమైన వారు

సూర్యద్వారేణ తే యాన్తి పురుషం విశ్వతోముఖమ్
పరావరేశం ప్రకృతిమస్యోత్పత్త్యన్తభావనమ్

సూర్యుని మార్గములో వెళతారు. సర్వాంతర్యామి అయిన పరమాత్మని వారు చేరతారు. పరమాత్మ సంకల్పముతోటే సంసారము కలుగుతుంది, మోక్షమూ కలుగుతుంది. సృష్టి స్థితులు ఎవరి వలన కలుగుతాయో అలాంటి పరమాత్మ వద్దకు వెళతారు.

ద్విపరార్ధావసానే యః ప్రలయో బ్రహ్మణస్తు తే
తావదధ్యాసతే లోకం పరస్య పరచిన్తకాః

చంద్రలోకానికి వెళ్ళినవారు తిరిగివస్తారు. సూర్యమార్గములో వెళ్ళినవారు తిరిగిరారు. కేవలులు (కైవల్యం కోరిన వారు) సత్యలోకాన్ని చేరి, సత్య లోకం ప్రళయానికి గురైనపుడు వారు పరమాత్మలో లీనమవుతారు. బ్రహ్మలోకమునుంచి ముక్తి పొందుతారు.(బ్రహ్మలోకానికి కూడా ద్విపరార్థ కాలములో ప్రళయం వస్తుంది)

క్ష్మామ్భోऽనలానిలవియన్మనైన్ద్రియార్థ
భూతాదిభిః పరివృతం ప్రతిసఞ్జిహీర్షుః
అవ్యాకృతం విశతి యర్హి గుణత్రయాత్మాకాలం
పరాఖ్యమనుభూయ పరః స్వయమ్భూః

భూమి, జలం అగ్ని వాయువు ఆకాశం (వియత్) మనసు ఇంద్రియములు పంచభూతములూ, (ఇవన్నీ కలిపితే ప్రకృతి). వీటిని సంహరింప చేయ దలచుకున్నప్పుడు, ఈ బ్రహ్మలోకం కూడా ప్రకృతియొక్క అసలు స్వరూపాన్ని పొందుతారు. బ్రహ్మలోకం వారు కూడా పరమాత్మను పొందుతారు. 

ఏవం పరేత్య భగవన్తమనుప్రవిష్టాయే
యోగినో జితమరున్మనసో విరాగాః
తేనైవ సాకమమృతం పురుషం పురాణం
బ్రహ్మ ప్రధానముపయాన్త్యగతాభిమానాః

ఇంద్రియాలను జయించాలంటే శ్వాసను ముందు జయించాలి. ఏ పని చేస్తున్నా మన మనసు శ్వాస మీద లగ్నమయి ఉండాలి. శ్వాసను జాగ్రత్తగా గమనిస్తే మన శరీరములో జరిగే ప్రతీ పరిణామం (వికారం) మనకు తెలుస్తుంది. అప్పుడు ఏ ప్రాంతానికి వాయువు వెళితే అనర్థం వస్తుందో, ఆ ప్రాంతానికి వాయువు వెళ్ళకుండా అరికడతాము. మూలాధారానికి రెండు పక్కలా ఇడ పింగళ అని రెండు ఉంటాయి. మూలాధారం అంటే గణపతి బీజం, గం. ఇడ అంటే జ్ఞ్యానం (సిద్ధి), పింగళ అంటే సిద్ధి.  మూలాధరం నుండి సుషుమ్న బయలు దేరి సహస్రారం వరకూ కదలిక రావాలి. సహస్రారం అంటే అనంతాసనుడు. సహస్ర - అరం అంటే వేయి శిరస్సులు - ఆది శేషుడు. మూలాధరం నుండి సుషుమ్నను కదిలించి సహస్రారం వరకూ వెళ్ళాలి. మూలాధరం - నాభి - ఉదరం- హృదయం -ఉరస్సు - కంఠం - నాసిక - లలాటం - బ్రహ్మకపాలం. ఈ రీతిలో శ్వాసను పయనింపచేయాలి. మనం అనుకున్నప్పుడూ ఆపగలగాలి. హృదయములో (స్వాధిష్టానములో) శ్వాసను ఆపగలిగిన వాడు భూమిని స్పృశించకుండా ఆకాశములో సంచరించగలడు. శ్వాసను నియమించాలంటే ఆహారాన్ని నియమించాలి. పానీయాన్నీ నియమించాలి. 
అలా శ్వాసను మనసుని నియమించి విరక్తుడై దేహాత్మాభిమానం పోయిన తరువాత అమృత స్వరూపుడైన పరమాత్మను చేరతారు

అథ తం సర్వభూతానాం హృత్పద్మేషు కృతాలయమ్
శ్రుతానుభావం శరణం వ్రజ భావేన భామిని

ప్రతీ ప్రాణి యొక్క హృదయ పద్మములో ఉన్న స్వామిని శరణు వేడు. ఇదే పరమపదం. దీన్ని పొందడానికి ప్రతీ ప్రాణిలో అంతర్యామిగా ఉన్న పరమాత్మనూ, జ్ఞ్యానులందరి చేతా విశేషముగా కొలవబడుచున్న పరమాత్మను శరణు వేడు. 

ఆద్యః స్థిరచరాణాం యో వేదగర్భః సహర్షిభిః
యోగేశ్వరైః కుమారాద్యైః సిద్ధైర్యోగప్రవర్తకైః

ఆయన్ని శరణు వేడనంత కాలం స్థావర జంగమములకన్నా ముందు పుట్టిన స్త్చతుర్ముఖ బ్రహ్మకు కూడా మోక్షం లేదు. అభిమానం లేదు అనడానికి గుర్తే ఈ శరణాగతి. 

భేదదృష్ట్యాభిమానేన నిఃసఙ్గేనాపి కర్మణా
కర్తృత్వాత్సగుణం బ్రహ్మ పురుషం పురుషర్షభమ్

భేద సృష్టితో అభిమానం కలిగి నిస్సంగము లేకుండా పని చేసినా కర్తృత్వాభిమానం పోదు. అలాంటివారు కూడా బ్రహ్మలోకం వరకూ వెళతారు. 

స సంసృత్య పునః కాలే కాలేనేశ్వరమూర్తినా
జాతే గుణవ్యతికరే యథాపూర్వం ప్రజాయతే

అక్కడి దాకా వెళ్ళి ప్రళయము వచ్చాక వారు పరమాత్మలో లీనమయి, సృష్టి వచ్చినపుడు మళ్ళీ పుడతారు. అలా కాకుండా మళ్ళీ పుట్టకుండా ఉండాలంటే భేదాన్నీ, అభిమానాన్ని వదిలిపెట్టి నివృత్తి కర్మ (ఫాలాపేక్ష కర్మ) ఆచరించాలి 
ప్రళయములో జగత్తంతా పరమాత్మలో కలిసినా, అందులోనే వారి వారి కర్మలు ఉంటాయి. 

ఐశ్వర్యం పారమేష్ఠ్యం చ తేऽపి ధర్మవినిర్మితమ్
నిషేవ్య పునరాయాన్తి గుణవ్యతికరే సతి

బ్రహ్మలోకములో అన్ని భోగాలను అనుభవించి మళ్ళీ వస్తారు. గుణ వ్యతికరం (సృష్టి) వచ్చినపుడు మళ్ళీ వస్తారు.

యే త్విహాసక్తమనసః కర్మసు శ్రద్ధయాన్వితాః
కుర్వన్త్యప్రతిషిద్ధాని నిత్యాన్యపి చ కృత్స్నశః

నిష్కామ కర్మలు ఆచరిస్తున్నా అభిమానం కలవారు పుడతారు. కొంతమంది నిష్కామ కర్మని ఆచరించడానికి ప్రయత్నించి విఘ్నములు వచ్చి అది ఆచరించలేక, ఇటు లౌక కర్మలూ చేయలేక, ఉభయభ్రష్టులవుతారు. దానికి కారణం అభిమానం పోకపోవడం. పరమాత్మ యందే ఆసక్తి ఉండి, కర్మల యందు పూర్తిగా ఆసక్తిలేకుండా ఉండేవారు కొందరు ఉన్నారు - వారు మోక్షం పొందుతారు. కొందరు పరమాత్మ వలన మోక్షం పొందుతామని తెలిసి కూడా పరమాత్మ కథను విడిచిపెట్టి అర్థ కామముల యందే ఆసక్తి కలిగి ఉంటారో వారు కీటకములుగా పుడతారు

రజసా కుణ్ఠమనసః కామాత్మానోऽజితేన్ద్రియాః
పిత్న్యజన్త్యనుదినం గృహేష్వభిరతాశయాః

ఇంకొంతమంది రజో గుణం బాగా నిండి, కోరికలను పెంచుకొని, ఇంద్రియములను నిగ్రహించుకోలేక, పితృ దేవతలను ఆరాధించి దాన్ని పొందుతారు. భార్య యందు అతి ప్రీతి కలిగిన వారిని పితృ దేవారాధకులు అంటారు (సంతానం కలిగితేనే పితృదేవతలు తరించేది. ఎప్పుడు భార్యా సంగమాన్నే కోరేవారు ఒక రకముగా పితృదేవతారాధన చేఇనట్లే)

త్రైవర్గికాస్తే పురుషా విముఖా హరిమేధసః
కథాయాం కథనీయోరు విక్రమస్య మధుద్విషః

వీరంతా ధర్మార్థ కామముల యందే ఆసక్తి కలిగి ఉంటారు. భగవదారాధనలో వైముఖ్యం కలిగి ఉంటారు. పరమాత్మ కథలు చెప్పుకోవాలనుకుంటే, చెప్పుకోదగిన కథలలో ప్రథానమైన శ్రీమన్నారాయణుడి కథలయందు విముఖులు. భగవానుడు మధుసూధనుడు. మధు అంటే సంసారమూ, కోరిక. ఆయన మధుద్విషః. పరమాత్మ మధు అనే రాక్షసున్ని సంహరించిన వాడు, మధు అనే దానిని ద్వేషించిన వాడు. సంసారాన్నీ కామాన్నీ దూరముగా ఉంచేవాడు పరమాత్మ. 

నూనం దైవేన విహతా యే చాచ్యుతకథాసుధామ్
హిత్వా శృణ్వన్త్యసద్గాథాః పురీషమివ విడ్భుజః

ఇలాంటి వారందరూ, దైవము చేతా, విధిచేతా కొట్టబడ్డారు. భగవానుని కథ వినకపోతే ఏమవుతుంది?పరమాత్మ కథను విడిచి సాంసారికమైన్ మిగతా దుష్ట కథలను సేవించే వారు పంచభక్ష పరమాన్నాలను విడిచిపెట్టి పురుగులలా మలాన్ని భుజించేవారితో సమానం. 

దక్షిణేన పథార్యమ్ణః పితృలోకం వ్రజన్తి తే
ప్రజామను ప్రజాయన్తే శ్మశానాన్తక్రియాకృతః

ఇలాంటి వారు దక్షిణ మార్గములో వెళతారు. దీని వలన పితృలోకాన్ని పొందుతారు. వీళ్ళు పుడతారు, మళ్ళీ శ్మశానానికి వేలతారు, పితృలోకానికి వెళతారు, మళ్ళీ పుడతారు. 

తతస్తే క్షీణసుకృతాః పునర్లోకమిమం సతి
పతన్తి వివశా దేవైః సద్యో విభ్రంశితోదయాః

వారు చేసుకున్న పుణ్యమైపోగానే ఈ భూలోకానికి వచ్చి పతనమవుతారు. వారి జీవితములో వృద్ధి అనేది ఉండదు. 

తస్మాత్త్వం సర్వభావేన భజస్వ పరమేష్ఠినమ్
తద్గుణాశ్రయయా భక్త్యా భజనీయపదామ్బుజమ్

పరిపూర్ణ భావముతో పరమాత్మనే సేవించు. సకల చరాచర లోకములు సేవించదగిన పరమాత్మ పాదములను భక్తితో ఆరాధించు. పరమాత్మ గుణములనాశ్రయించిన భక్తితో ఆరాధించు

వాసుదేవే భగవతి భక్తియోగః ప్రయోజితః
జనయత్యాశు వైరాగ్యం జ్ఞానం యద్బ్రహ్మదర్శనమ్

శ్రీమన్నారాయణుని యందు భక్తియోగం వైరాగ్యాన్ని కలిగిస్తుంది, జ్ఞ్యానన్నీ కలిగిస్తుంది,పరమాత్మ సాక్షాత్కారం లభిస్తుంది, భక్తి వలననే మోక్షం వస్తుంది. తత్వ జ్ఞ్యానం భక్తి వలననే వస్తుంది, ఆ జ్ఞ్యానం వలన మోక్షం వస్తుంది.

యదాస్య చిత్తమర్థేషు సమేష్విన్ద్రియవృత్తిభిః
న విగృహ్ణాతి వైషమ్యం ప్రియమప్రియమిత్యుత

వైరాగ్యం ఎలా వస్తుంది? ఇంద్రియ వృత్తుల (జ్ఞ్యానేంద్రియాలు) యందు ( గ్రహించే వస్తువుల యందు సమభావముతో ఉండాలి) ఇది నాకు ప్రియమూ, ఇది నాకు అప్రియమూ అన్న భావనతో ఉండకపోవడం. అలా ఉండగలిగితే వాడు నిస్సంగుడూ, సమదర్శనుడు. 

స తదైవాత్మనాత్మానం నిఃసఙ్గం సమదర్శనమ్
హేయోపాదేయరహితమారూఢం పదమీక్షతే

దేని యందు కోరికలేకుండా అన్నింటినీ సమానముగా చూస్తూ, చేయవలసినది ఏదీ లేకుండా ఉన్నవాడే పరమాత్మ పదమును సాధించగలడు

జ్ఞానమాత్రం పరం బ్రహ్మ పరమాత్మేశ్వరః పుమాన్
దృశ్యాదిభిః పృథగ్భావైర్భగవానేక ఈయతే

పరమాత్మ ఎప్పుడూ జ్ఞ్యాన స్వరూపం. అతనే ఈశ్వరుడుం అతనే పురుషుడు అతనే జ్ఞ్యానం. ఐదు ఇంద్రియాలతో చేయబడే విషయం మాత్రం ఒక్కటే - భగ్వవానుడే. 

ఏతావానేవ యోగేన సమగ్రేణేహ యోగినః
యుజ్యతేऽభిమతో హ్యర్థో యదసఙ్గస్తు కృత్స్నశః

ఇదే యోగం. అన్నీ పరమాత్మ ఒక్కడే. మనం చేసే ప్రతీ పనిలో పొందదగిన వాడు పరమాత్మే. ఆయన కంటే వేరుగా ఏమీ లేదు,. అది తెలుసుకోవడమే యోగం. ఇదే సమగ్రమైన యోగం. ఇలాంటి యోగికే ఇష్ట సిద్ధి కలుగుతుంది. ప్రకృతియందు కోరిక లేకుండా ఉండుటే సిద్ధి. అదే ఇష్టము. సంసారములో ఉండి సంసారం కోరకుండుట ఇష్టం. ప్రకృతిలో ఉండి ప్రకృతిని కోరకుండా ఉండుట ఇష్ట సిద్ధి. 

జ్ఞానమేకం పరాచీనైరిన్ద్రియైర్బ్రహ్మ నిర్గుణమ్
అవభాత్యర్థరూపేణ భ్రాన్త్యా శబ్దాదిధర్మిణా

సత్వాది గుణములు లేకుండా ఉండే జ్ఞ్యాన స్వరూపమైన పరమాత్మ్ అఒక్కడే. బుద్ధికి ఆత్మకీ గోచరమైనది పరమాత్మ, ఆయన ఇంద్రియాలకూ మనసుకూ  అందడు. ఇంద్రియములన్నీ ఆత్మ వైపు అడుగు వేస్తే, అవి పరాధీనమవుతాయి. అప్పుడు పరమాత్మ వాటికి అందుతాడు. శబ్దాదులకి అందకుండా, పంచభూతములతో చేయబడని పరమాత్మ, పంచభూతాలతో ఉన్న మనం అందుకోగలమా. 

యథా మహానహంరూపస్త్రివృత్పఞ్చవిధః స్వరాట్
ఏకాదశవిధస్తస్య వపురణ్డం జగద్యతః

త్రివృత్ - సత్వ రజ తమ. పంచ విధ: పంచభూతాలు, ఇంద్రియాలు మనసు మహత్ తత్వమూ , అహంకారమూ ఇవన్నీ కలిస్తే అండం అయ్యింది. మనం అందరం ఉండేది అక్కడ. మనం అండములోంచి వచ్చిన వారి నుండి వచ్చిన వారం. పరమాత్మ ఆ అండానికి అవతల ఉంటాడు. 

ఏతద్వై శ్రద్ధయా భక్త్యా యోగాభ్యాసేన నిత్యశః
సమాహితాత్మా నిఃసఙ్గో విరక్త్యా పరిపశ్యతి

ఇంత వరకూ ఏ ఏ విషయాలౌ చెప్పమో, ఇవి విన్నవారికి అర్థం కాదు, అర్థం అయినా గుర్తుంచుకోరు, గుర్తుంచుకున్నా అనుష్ఠానం ఉండదు. ఇది కేవలం నిత్యమూ శ్రద్ధగా ఉన్నవారికి, సావధాన మనస్కులై ఉండి, ఆసక్తి లేకుండా ఉండాలీ, విరక్తితో ఉండాలి. నిస్సంగం ఉండాలి. 

ఇత్యేతత్కథితం గుర్వి జ్ఞానం తద్బ్రహ్మదర్శనమ్
యేనానుబుద్ధ్యతే తత్త్వం ప్రకృతేః పురుషస్య చ

పరమాత్మను చూపే జ్ఞ్యానాన్ని వివరించాను. ఈ జ్ఞ్యానముతో ప్రకృతంటే పురుషుడంటే పరమాత్మ అంటే ఏమిటో తెలుసుకోవచ్చు. 

జ్ఞానయోగశ్చ మన్నిష్ఠో నైర్గుణ్యో భక్తిలక్షణః
ద్వయోరప్యేక ఏవార్థో భగవచ్ఛబ్దలక్షణః

నా యందు ఉండే భక్తి లక్షణమే జ్ఞ్యాన యోగం. ఆ భక్తి నిర్గుణమైన భక్తి అయి ఉండాలి. అలాంటి భక్తిని చెప్పే జ్ఞ్యాన యోగమూ రెండూ ఒకటే. జ్ఞ్యాన యోగమైనా, భక్తియోగమైనా ఒక్కటే - నాచే చెప్పబడేవే

యథేన్ద్రియైః పృథగ్ద్వారైరర్థో బహుగుణాశ్రయః
ఏకో నానేయతే తద్వద్భగవాన్శాస్త్రవర్త్మభిః

రూప రస గ్రంధ స్పర్శాది భావాలని ఒక్కొక్క ఇంద్రియముతో ఒకే విషయాన్ని ఎలా తెలుసుకుంటామో (ఒకే పండు యొక్క రూపమూ, రసమూ, గంధమూ మొదలినవి) , ప్రకృతిలో ఉన్న అనేకమైన వాటితో తెలియబడే వాడైన  భగవానుడు ఒకటే. ఎన్ని యోగాలున్నా తెలియబడే పరమాత్మ ఒక్కడే. ఒకే విషయం పలు విధాలుగా గ్రహించబడినట్లు, ఒకే పరమాత్మ అనేక మార్గములలో గ్రహించబడతాడు. 

క్రియయా క్రతుభిర్దానైస్తపఃస్వాధ్యాయమర్శనైః
ఆత్మేన్ద్రియజయేనాపి సన్న్యాసేన చ కర్మణామ్

పరమాత్మ తెలియాలంటే ఆరాధనతో యజ్ఞ్యములతో దానములతో తపసు స్వాధ్యాయముతో ఇంద్రియ జయముతో సన్యాసముతో

యోగేన వివిధాఙ్గేన భక్తియోగేన చైవ హి
ధర్మేణోభయచిహ్నేన యః ప్రవృత్తినివృత్తిమాన్

వివిధాంగాల యోగముతో, పరమాత్మ సేవ ఒకటి, ఆత్మ జ్ఞ్యానమున్ ఒకటి, ఇలా రెండు విధాల ధర్మముతో, నిస్సంగమైన నివృత్తి ధర్మముతో

ఆత్మతత్త్వావబోధేన వైరాగ్యేణ దృఢేన చ
ఈయతే భగవానేభిః సగుణో నిర్గుణః స్వదృక్

పరమాత్మ వీటి వలన తెలియబడతాడు. భక్తుడు ఎలా చూస్తే అలా తెలియబడతాడు (సగుణ నిర్గుణ)

ప్రావోచం భక్తియోగస్య స్వరూపం తే చతుర్విధమ్
కాలస్య చావ్యక్తగతేర్యోऽన్తర్ధావతి జన్తుషు

తామస రాజస సాత్విక నిర్గుణ భక్తి యోగాలని వివరించాను. కాల స్వభావం చెప్పాను. ప్రతీ ప్రాణిలో అది ప్రవర్తిస్తూ ఉంటుంది

జీవస్య సంసృతీర్బహ్వీరవిద్యాకర్మనిర్మితాః
యాస్వఙ్గ ప్రవిశన్నాత్మా న వేద గతిమాత్మనః

అవిద్య చేత జీవుని యొక్క వివిధ యాత్రలు చెప్పాను. ఇలాంటి బహు విధ సంసారములో ప్రవేశించిన ఆత్మ తన స్వరూపాన్ని తెలుసుకోలేదు. 

నైతత్ఖలాయోపదిశేన్నావినీతాయ కర్హిచిత్
న స్తబ్ధాయ న భిన్నాయ నైవ ధర్మధ్వజాయ చ

ఈ విషయం నీకు తెలిసింది కదా అని దుర్మార్గులకీ వినయం లేనివారికీ సోమరులకూ చిన్నవారికీ ధర్మాన్ని ఆచరిస్తున్నట్లు ఉన్న వారికి,  లోభికీ, సంసారములో పూర్తిగా మునిగి ఉన్నవారికి భక్తి లేనివారికీ, భక్తులని ప్రేమించని వారికీ చెప్పకు

న లోలుపాయోపదిశేన్న గృహారూఢచేతసే
నాభక్తాయ చ మే జాతు న మద్భక్తద్విషామపి

శ్రద్దధానాయ భక్తాయ వినీతాయానసూయవే
భూతేషు కృతమైత్రాయ శుశ్రూషాభిరతాయ చ

శ్రద్ధాళువులకీ భక్తి కలిగిన వారికి వినయం కలిగిన వారికీ పెద్దలను సేవించే వారికీ 

బహిర్జాతవిరాగాయ శాన్తచిత్తాయ దీయతామ్
నిర్మత్సరాయ శుచయే యస్యాహం ప్రేయసాం ప్రియః

లోపల వైరాగ్యం లేక పోయినా బయటకు విరాగిగా కనిపించినవాడికి కూడా చెప్పు, శాంత చిత్తముతో బుద్ధి ఉన్నవాడికీ, మాత్సర్యం లేని వాడికీ, ప్రీతి పాత్రములైన వారన్నిటికంటే ఎవరికి నేను ప్రియుణ్ణో వాడికి చెప్పూ

య ఇదం శృణుయాదమ్బ శ్రద్ధయా పురుషః సకృత్
యో వాభిధత్తే మచ్చిత్తః స హ్యేతి పదవీం చ మే

అమ్మా! ఒక్క సారైన ఇది శ్రద్ధగా వింటే నా యందే మనసు లగ్న్మై చెబితే అలాంటి వారు నా స్థానాన్ని పొందుతారు.

Popular Posts