బ్రహ్మోవాచ
జ్ఞాతోऽసి మేऽద్య సుచిరాన్నను దేహభాజాం
న జ్ఞాయతే భగవతో గతిరిత్యవద్యమ్
నాన్యత్త్వదస్తి భగవన్నపి తన్న శుద్ధం
మాయాగుణవ్యతికరాద్యదురుర్విభాసి
స్వామీ తెలిసింది నీవెవరో. ఇంతకాలం లోకములో శరీరం గలవారెవరికి తెలియనటువంటి నీవు నాకు ఈనాడు తెలిశావు. నీకంటే వేరైన వస్తువు లోకములో లేదని తెలిసింది. ఏ వస్తువును చూచినా ఆయన లోపల లేని వస్తువు లేదు అని మనకు తెలిస్తే అది జ్ఞ్యానం. అది పరిశుద్దమైన వస్తువు. కానీ వస్తువులన్నింటిలోనూ ఉన్నది . బయట ఉన్న అన్ని వస్తువులలోనూ సత్వమూ రజస్సు తమస్సు అని మూడు గుణములు ఉంటాయి. ఈ మూడు గుణములు గల ప్రకృతిని మార్చి తాను అనేక గుణములతో భాసిస్తూ ఉంటాడు సర్వేశ్వరుడు . కానీ అటువంటివాడు మనకు విశ్వములో అంతటా కనిపించేవాడు తన రూపంతో తాను భాసించినపుడు, తాను ఏ విధమైన గుణముల యొక్క సంపర్కం లేకుండా తాను పరిశుద్దమైన జ్ఞ్యాన స్వరూపుడై ఆనందస్వరూపుడై ఉంటాడు. అట్టివాడే మనని అనుగ్రహించడానికి అవతారములు దాలుస్తాడు. అట్టి అవతారములన్నింటికీ బీజమైన అవతారం ఆ మొట్టమొదట సముద్రములో పండుకొనిన అవతారం. ఆయన నాభి పద్మము నుండి నేను వచ్చాను. అందుచే స్వామీ నీ యొక్క రూపాన్ని నేను దర్శిస్తున్నాను, అందుచే నేను నీకు నమస్కారం చేస్తున్నాను. లోకములన్నిటికీ క్షేమం కలిగించే వాడా అటువంటి నీకు నంస్కరించుచున్నాను.
రూపం యదేతదవబోధరసోదయేన
శశ్వన్నివృత్తతమసః సదనుగ్రహాయ
ఆదౌ గృహీతమవతారశతైకబీజం
యన్నాభిపద్మభవనాదహమావిరాసమ్
నాతః పరం పరమ యద్భవతః స్వరూపమ్
ఆనన్దమాత్రమవికల్పమవిద్ధవర్చః
పశ్యామి విశ్వసృజమేకమవిశ్వమాత్మన్
భూతేన్ద్రియాత్మకమదస్త ఉపాశ్రితోऽస్మి
తద్వా ఇదం భువనమఙ్గల మఙ్గలాయ
ధ్యానే స్మ నో దర్శితం త ఉపాసకానామ్
తస్మై నమో భగవతేऽనువిధేమ తుభ్యం
యోऽనాదృతో నరకభాగ్భిరసత్ప్రసఙ్గైః
యే తు త్వదీయచరణామ్బుజకోశగన్ధం
జిఘ్రన్తి కర్ణవివరైః శ్రుతివాతనీతమ్
భక్త్యా గృహీతచరణః పరయా చ తేషాం
నాపైషి నాథ హృదయామ్బురుహాత్స్వపుంసామ్
భగవత్ పాదారవింద గంధమును ఎవరితే చెవులతో వాసన చూస్తారో (అంటే ఆయన కథలను వింటారో). ఆయన గూర్చిన కథలను ఎవరు వింటారో, కథల ద్వారా వచ్చిన గాలి (శ్రుతివాతనీతమ్) శ్రుతులనే వాటి నుంచి పెద్దల సూక్తుల నుంచి చెవులలో పడి లోపలకు దిగి, దిగగానే దాన్ని మనసులోపల ధరిస్తే దాని వలన నీ మనసులోంచి భగవంతుడు కదలకుండా నిశ్చలంగా నిలిచి ఉంటాడు. ఎంతకాలం మన మన్సులో భగవంతుని గూర్చి, ఆయన పాదముల గూర్చీ భాసించదో భగవంతుని స్మరించమో అంతవరకూ మనం దబ్బు ఇల్లు వాకిలి పిల్లలూ అన్ని మనకు బాధలే కలిగిస్తాయి గానీ సుఖం కలిగించరు.
తావద్భయం ద్రవిణదేహసుహృన్నిమిత్తం
శోకః స్పృహా పరిభవో విపులశ్చ లోభః
తావన్మమేత్యసదవగ్రహ ఆర్తిమూలం
యావన్న తేऽఙ్ఘ్రిమభయం ప్రవృణీత లోకః
ఏనాడు భగవంతుని పాదారవిందముల గూర్చిన స్మరణ మనలోపల కలుగుతుందో అప్పుడు ద్రవిణదేహసుహృన్నిమిత్తం భయం ఉండదు. స్పృహా - ప్రతీ దాని మీదా కోరికలు బయలుదేరవు, పరిభవో - అవమానం జరగదు విపులశ్చ లోభః - విశాలమైన జ్ఞ్యానం కలుగుతుంది. తండ్రీ లోకంలో ఇంతగొప్పదైన భగవంతుని దగ్గరకు అందరూ ఎందుకు రారు. శొకము లేదు భయమూ లేదు ఆనందమూ కలుగుతుంది అని చెబుతున్నా వారికి భగవదనుగ్రహం లేదు. రజో గుణ తమో గుణాలు విజృంభించాయి. దాని వలన అహంకారమమకారములు వస్తాయి. దాని వలన నేనే స్వతంత్ర్యుడన్న బుద్ధి కలుగుతుంది, నాకు మరి వేరేది ఒకటి కారణం కాదు అనే బుద్ధి కలుగుతుంది.అట్లాంటి వారు సమస్తమైన అమంగళములను తగ్గించేటువంటి భగవంతుని పాదారవిందములయందు ఇంద్రియములు ప్రసరించని వారు అయి ఉంటారు .
దైవేన తే హతధియో భవతః ప్రసఙ్గాత్
సర్వాశుభోపశమనాద్విముఖేన్ద్రియా యే
కుర్వన్తి కామసుఖలేశలవాయ దీనా
లోభాభిభూతమనసోऽకుశలాని శశ్వత్
వారు కేవలం లోకంలో కామ సుఖలేశ లవాయ. ఆ కామం వల్ల వచ్చే సుఖం లేశంలో లవం.కామం యొక్క లేశములో లవమైన భాగాన్ని అనుభవిస్తూ. దీని గురించి లోభపడుతూ, ఆ లోభపడటం చేత మనసంతా చెదిరి బాధలనుభవిస్తూ, లోకంలో సమస్త దుఃఖములనుభవిస్తూ తాను కోరికలు కోరుతూ సుఖముననుభవిస్తున్నాడే ఈ సుఖములనుభవించాలని తాను పడే శ్రమలో తాను పడే దుఃఖమును అనుభవిస్తూ ఉంటాడు. ఆ దు@ఖం తొలగాలంటే సర్వేశ్వరున్ని ఎల్లప్పుడూ ఒకే రూపముగా సుఖమైనటువంటి ఆనందస్వరూపుడైన భగవానుని తలంచరు వీరు.
క్షుత్తృట్త్రిధాతుభిరిమా ముహురర్ద్యమానాః
శీతోష్ణవాతవరషైరితరేతరాచ్చ
కామాగ్నినాచ్యుతరుషా చ సుదుర్భరేణ
సమ్పశ్యతో మన ఉరుక్రమ సీదతే మే
లోకంలో మనమెవ్వర్మూ భగంతుని విషయం తలచం. సుఖపడుతున్నామా? ఆకలి దాహం శరీరంలో ఉండే అనేక రోగములూ, లోకములో ఉండే కపవాత పైత్యములచే పీడించబడుతూ చలి వేడి గాలి వర్షం , వీటన్నిటి వలన బాధ పడుతూ కోరికలు లోపల పెనవేసుకుక్పోతూ, ఆ కోరికలు అగ్నిహోత్రములా దహించివేస్తూ ఉంటే దుర్భరమైన భరించరానికి శక్యము గానటువంటి పగలు పెట్టుకుని బాధలు పడుతున్నారు గానీ భగవంతుని పాద పద్మాలపై మనసు పెట్టరే? అది గాని ఉంటే న వాసుదేవ భక్తానా మశుభం విద్యతే క్వచ్చిత్ జన్మమృత్యు జరావ్యాధి భయం నైవోపజాయతే, నక్రోథో నచ మాత్సర్యం న లోభో నాశుభా మతిః భవంతి కృతపుణ్యానాం భక్తానాం పురుషోత్తమం. భగవంతుని యందు మనసు నిలిపి, ఆయన లేని పదార్థం లేదని తెలుసుకొంటే లోకములో ఏ వస్తువును చూచినా అందులో భగవంతుడు ఉన్నట్లు దర్శనమైతే దేనిని ద్వేషితాము? భగవంతుని కంటే వేరైన రెండవ వస్తువు లేదు భగవంతునికి చెందని వస్తువు లేదు, అంతా నీదే అయినపుడు అంతా నీ శరీరంలో ఒక భాగమే అయినపుడు, శరీరంలో ఒక దేశమందు ప్రేమా ఒక దేశమందు ద్వేషముంటుందా.
యావత్పృథక్త్వమిదమాత్మన ఇన్ద్రియార్థ
మాయాబలం భగవతో జన ఈశ పశ్యేత్
తావన్న సంసృతిరసౌ ప్రతిసఙ్క్రమేత
వ్యర్థాపి దుఃఖనివహం వహతీ క్రియార్థా
విశ్వమంతా భగవానుని శరీరమని తెలుసుకుంటే అన్నిటియందు ద్వేషముండదు కోపముండదూ అసూయా ఉండదు. భగవత్ సంబంధం విశ్వంలో ప్రతీ పదార్థముకూ ఆత్మగా ఉందన్న భావన లేకపోవడం వలన ఈ భేధ భావన కలుగుతోంది. దాని వలన క్రోధమూ మాత్స్రయ్మూ అసూయాదులు కలుగుతున్నయి గనుక త్భగవత్ భావన కలగాలి భగవంతుడు సర్వత్రా ఉన్నాడని తెలియాలి. సర్వత్రా ఉన్న భగవంతునికి లోకమంతా శరీరం అని తెలియాలి. తాను భగవత్ దర్శనం చేసినవాడైన నాడు వాడికి ఏ లోటూ ఉండదు కదా. దీనిని తెలుసుకోకుండా పృధక్ భావం చేస్తూ ఉంటారు లోపల. దీని వలన మాయ అవిద్య అజ్ఞ్యానం (ఉన్నదాన్ని ఉన్నట్లు గుర్తించకపోవడం చేత) ఇంద్రియ ప్రియమే పురుషార్థమనుకొని, ఈ లోకమనే సంసారంలో గిర గిరా తిరుగుతున్నాడు.
అహ్న్యాపృతార్తకరణా నిశి నిఃశయానా
నానామనోరథధియా క్షణభగ్ననిద్రాః
దైవాహతార్థరచనా ఋషయోऽపి దేవ
యుష్మత్ప్రసఙ్గవిముఖా ఇహ సంసరన్తి
పగలు పని ఎక్కువ, రాత్రి నిద్రెక్కువ. తీరుబాటు ఉండదు. పగలంతా వ్యాపారాలే (కంటికి పనీ చేతికి పని చెవికి పనీ మనసుకి పనీ మనిషికి పనీ) రాత్రి ఐతే అలసిపోయి నిద్రతోనూ, పడుకుని వెంటనే తెలివి వచ్చి నిద్రపట్టదు. లోకంలో తాము పొందవలసిందై పొందడానికి అవకాశం లేకుండా బాధపడుతూ ఉంటారు ఈ ప్రజలు. అటువంటి వారంతా బాధను కలిగించే దాని మీద మనసు లగ్నం చేస్తున్నరు గానీ బాధను తొలగించే దాని మీద మనసు లగ్నం చేయడంలేదే. భగవంతుని స్మరిస్తే ఆయన జ్ఞ్యానాంద స్వరూపుడు గనుక జ్ఞ్యానమూ ఆనందమూ కలుగుతుంది. లోకములో వస్తువులు రజస్సు తమస్సు గలవి గనక రాజస తామస వృత్తులు పెరుగుతాయి,దు@ఖం కలుగుతుంది.
త్వం భక్తియోగపరిభావితహృత్సరోజ
ఆస్సే శ్రుతేక్షితపథో నను నాథ పుంసామ్
యద్యద్ధియా త ఉరుగాయ విభావయన్తి
తత్తద్వపుః ప్రణయసే సదనుగ్రహాయ
ఎవరైతే మనసులో భగవంతున్నే భావన చేస్తూ, తన సర్వ వ్యాపారాలు తాను చేసుకుంటూ, ఇంద్రియములు వ్యాపారములు మానక్కర్లేదు చేతితో చేయవలసిన పనులు కంటితో చూడవలసినవి అన్నీ చూడవచ్చును, గనీ మనసులోపల వానిని నిలపండి. మనసులో వానిని నిలిపి, అన్నింటిలో వాడు ఉన్నాడని భావించి, చెవుల ద్వారా విన్నదానిని చూడటానికి ప్రయత్నిస్తే ఏ రూపంలో ధ్యానిస్తే, ఆ రూపములోనే ఆయన, సమస్త రూపములు గలవాడు గనుక, ఆయన రూపం కానిది లోకములో లేదు గనుక, ఆ రూపములో దర్శనమిస్తాడు.
నాతిప్రసీదతి తథోపచితోపచారైర్
ఆరాధితః సురగణైర్హృది బద్ధకామైః
యత్సర్వభూతదయయాసదలభ్యయైకో
నానాజనేష్వవహితః సుహృదన్తరాత్మా
భగవదారాధన చేయాలంటే మంచి పూలివ్వాలా పళ్ళివాలా? జలాలు పోయాలా, అభిషేకం చేయాలా, పన్నీరు అత్తరూ తెచ్చి పోయాలా? పాలూ పెరుగూ ఉండాలా? వీటన్నిన్నిటినీ ఎన్ని సమర్పించిన భగవంతుడు ఆరాధించబడటానికి సంతోషించడు. మరి దేని వలన సంతోషిస్తాడు? యత్సర్వభూతదయయా "నీకు కనిపించిన ఏ వస్తువును చూచిన ఆ వస్తువులోపల భగవంతుడు ఉన్నాడు అని, దానికి ఏ మాత్రం బాధ కలిగినా ఆపద కలిగినా, అయ్యో నేను తొలగించాలి అని, తన కొరకు ప్రయోజనం లేకుండా, స్వప్రయోజనమును కాంక్షించకుండా పరులకు కలిగిన దు@ఖమును తొలగించాలి అన్న కోరిక ఎవరికి ఉంటుందో వాడు దయ గల వాడు. దయ అవసర్మ్". సర్వ భూత దయ లేనిదే ఎన్ని పూలు వేసినా ఎన్ని పూజలు చేసినా భగవంతుడు సేవింపబడిన వాడు కాదు. అందరినీ ద్వేషిస్తూ ఉంటే భగవంతుని దయ లభించదు. ఆ సర్వభూత దయ పండాలి. అది పండడానికి జ్ఞ్యానం కావాలి. ఆ దయ దేవతార్చన లేనిదే రాదు. లోపల అంటుకున్న అహంకార మమకారాలు తొలగి, నాదీ - నేనూ అన్న భేధ భావం తొలగి, రజస్ తమస్సులు తొలగి, తన మనసుకంటి మాలిన్యములు తొలగి, తానెవడో తనకి తెలిసి, అన్నిటిలో భగవంతుడు ఉన్నాడన్న జ్ఞ్యానం కలగాలి. అది ఈ జన్మలో సంపాదించలేకపోవచ్చు. జన్మాంతరంలో సంపాదించవచ్చు. గీతలో నిర్వైర సర్వ భూతానాం అన్నట్లు, ఏ ప్రాణికి కష్టం కలిగినా మనసులో అయ్యో అన్న భావన కలిగితే భక్తి ఉన్నట్లు. చూచే ప్రతీ వాటిలో భగవంతుని చూడగలిగినపుడు ఆ భాగానికి దెబ్బతగిలితే తన స్వామికి శరీరానికి తగిలినట్లు భావిస్తే అది నిజమైన భక్తి
పుంసామతో వివిధకర్మభిరధ్వరాద్యైర్
దానేన చోగ్రతపసా పరిచర్యయా చ
ఆరాధనం భగవతస్తవ సత్క్రియార్థో
ధర్మోऽర్పితః కర్హిచిద్మ్రియతే న యత్ర
దీనికి ముందు మెట్లు యజ్ఞ్యాలు. ఎందుకు యజ్ఞ్యాలు? యాగాలు? మనలోపల అహంకార మమకారాలు తగ్గడానికి. యజ్ఞ్య్నానికి డబ్బు ఇవ్వాలంటే "ఆ డబ్బు నాది", "ఈ నెయ్యి నాది"స్థలం కావాలంటే " ఈ స్థలం నాది" యజ్య్నానికి రమ్మంటే "కాలం నాది". ఈ "నాది నాది" అనే దాన్ని కోసుకోవడమే దానం. దా అంటే ఖండించడం. ఇది నాది అనే భావాన్ని లోపల కోసుకోవాలి. ఏది మనం ఇస్తున్నామో అది వాడిది. వాడి వస్తువు వాడికే సమర్పిస్తున్నాము. ఈ భావం కలగడానికి మనలోపల అంటిన రజస్సు తమస్సులు తగ్గాలి, మాలిన్యాలు కడగబడాలి. మనసులో మాలిన్యాలు తొలగాలి. దానికి మనం ఆచరించ వలసిన కర్మలు ఆచరించాలి. యజ్ఞ్యమూ దానమూ తపస్సు, ఈ మూడూ చేయాలి. ఈ మూడూ చేస్తే, అప్పుడు మనసు పరిశుద్దమైతే, అప్పుడు పరిశుద్దమైన మనసులో ఆత్మ స్వరూపం దర్శనమైతే, అప్పుడు తపస్సు, వ్రతములూ చేస్తే అపుడు మరల ఏనాటికి చెదిరిపోని ఆత్మ వస్తువు దర్శనమవుతుంది. "నేనేవడనో తెలుస్తుంది". మనకి "నేను" తెలీదు. ఆ నేను అనేది భగవంతునికి పరతత్రమై ఉంది. లోపల ఒకడు ఉండి, అధికారిలాగా మనకి ప్రేరణ ఇస్తున్నాడు. అది తెలియక అహంకారంతో "నేను చేస్తున్నాను" అంటున్నాము. ఏ పని చేస్తున్నా, విశ్వమంతా భగవంతుని శరీరమైతే విశ్వాత్మకుడైన పరమాత్మ ఉంటే, ఆ పరమాత్మ యొక్క వ్యాపారాన్ని నీ చేత చేయించుకుంటూ ఉంటే "నేను చేస్తున్నా " అనడం ఎంత అవివేకం. ఈ రెండూ ఎప్పుడు తొలగుతాయో అపుడు మనలోపల ఉన్న "నేను" ఎవరో మనకు తెలుస్తుంది.
"నేను" తెలియడమంటే ఏమి చేస్తున్నా అందరిలో ఉన్న ఆత్మలు అన్నీ ఏకరూపం అని అనుభవం అవుతుంది. అందుకే భగవత్గీతలో సమదర్శినః అంటారు. అంటే కుక్క అనే శరీరంలో ఉన్న ఆత్మ, ఏనుగ అనే శరీరంలో ఉన్న ఆత్మా ఒక్కటే. కనిపించే భేధం శరీరమూ కర్మ వలన వచ్చిన భేధం. లోపల ఉన్న ఆత్మ జ్ఞ్యాన స్వరూపం అయినది ఒక్కటే. ఏకరూపమైంది. అట్టి ఏకరూపమైన ఆత్మ భగవంతునికి పరతంత్రమైనది.భగవంతునికి ఆధీనమై పని చేస్తుంది. "దీనికి కర్మానుగుణంగా దీనికి ఈ శరీరం వచ్చింది " అని జాలి కలగాలి గానీ ఏవగింపు కలగకూడదు. దానిలో ఉన్న వస్తువు తత్వం తెలిస్తేనే గానీ ఏవగింపు కలగడం మానదు. దాని మీద ఏవగింపు తొలగాలంటే దానిలోపల ఏముందో తెలియాలి.
ఈ ఆత్మ స్వరూప జ్ఞ్యానం కలిగితే దాని ముందు కర్మాచరణం చేస్తే శాస్త్రంలో పెద్దలూ గురువుల చేత " దేహ స్వరూపం ఇది, ఆత్మ స్వరూపం ఇది " అని తెలిస్తే , దానితో బాటు కర్మలాచరించి. ఆ ఆచరించేప్పుడు పరమాత్మ ఆయన పనిని ఆయనకొరకు చేయించుకుంటున్నాడన్న భావన కలిగి, కోరికలేకుండా కర్మలాచరిస్తే, దాని వలన మనసులో రజో గుణ తమో గుణాలు తగ్గి, అహంకారం తగ్గితే, నేను భగవంతునికి చెంది ఆయనకొరకు సర్వ వ్యాపారాలు చేస్తున్నా అన్న భావన కలిగితే, అప్పుడు భక్తి కలుగుతుంది. స్వామి నాకు అటువంటి భక్తిని కలిగించాడు.
శశ్వత్స్వరూపమహసైవ నిపీతభేద
మోహాయ బోధధిషణాయ నమః పరస్మై
విశ్వోద్భవస్థితిలయేషు నిమిత్తలీలా
రాసాయ తే నమ ఇదం చకృమేశ్వరాయ
సమస్త లోకాలకీ కారణమైన వాడు, (ఎప్పుడు కారణమైన దానిని ధ్యానించాలి. అన్నిటికీ మూలభావమేదో తెలుసుకుంటే గానీ భేధభావం నశించదు. కారణవస్తువుని తెలుసుకోవాలీ, సర్వాత్మకమైన పరమాత్మని తెలుసుకోవాలి. ఈ రెండూ తెలియాలి. ముందు ఎవడు ఉన్నాడు? ఇప్పుడున్న దానిలోపల ఏమున్నది, ఈ భేధమంతా నిజమైన భేధమా కాదా? ఇవన్నీ తెలియాలి) , ఈ భావం కలగడానికి ఎవరు కారణమో, ఎవరు సర్వ జగద్ కారణమో ఎవరు లోపల ఉండి నియమిస్తున్నాడో, అట్టి వానికి నమస్కారం. రామ కృష్ణ్యాది అవతారాలు ఉన్నాయి. ఈ కథలన్నీ చెప్పుకుంటూ ఉంటే ప్రాణం వదిలేప్పుడు ఆ కథలే జ్ఞ్యాపకం వస్తాయి. లోక కథల వలన మనసు పాడవుతుంది. శుద్ధ సత్వ స్వరూపుడైన భగవంతుడు మన మనసులోకి దిగుతాడు. ఆ రామ కృష్ణ రూపంలో చరిత్రలు మన మనసుకు అందుబాటులోనివి
యస్యావతారగుణకర్మవిడమ్బనాని
నామాని యేऽసువిగమే వివశా గృణన్తి
తేऽనైకజన్మశమలం సహసైవ హిత్వా
సంయాన్త్యపావృతామృతం తమజం ప్రపద్యే
ప్రాణం వదిలేప్పుడు మనకి ఆ నామములే జ్ఞ్యాపకం వస్తాయి. ఆ భగవానుని రూపాలని గుణాలని స్మరిస్తే మనలో ఉన్న పాపములు తొలగిపోతాయి. లోపల భగవన్నామాన్ని ఉచ్చరిస్తూ ఉండాలి. కృష్ణ కథని చదివి, కృష్ణ నామం జపించి, కృష్ణ పాదములయందు పుష్పం ఉంచి, రోజూ కొంతసేపు చేస్తే దాని వలన మన దు@ఖములూ మనలో పాపములూ తొలగిపోతాయి
యో వా అహం చ గిరిశశ్చ విభుః స్వయం చ
స్థిత్యుద్భవప్రలయహేతవ ఆత్మమూలమ్
భిత్త్వా త్రిపాద్వవృధ ఏక ఉరుప్రరోహస్
తస్మై నమో భగవతే భువనద్రుమాయ
నన్నూ రుద్రున్నీ సృష్టి లయములకు నియమించిం, నీవే స్వయంగా రక్షకత్వం వహించావు మాతో సమానుడిలాగ. మా కంటే పైగా వ్యాపించి ఉన్నావు నీవు. లోకమంతా ఒక చెట్టైతే ఆ చెట్టుకు మూలం నీవు.
లోకో వికర్మనిరతః కుశలే ప్రమత్తః
కర్మణ్యయం త్వదుదితే భవదర్చనే స్వే
యస్తావదస్య బలవానిహ జీవితాశాం
సద్యశ్ఛినత్త్యనిమిషాయ నమోऽస్తు తస్మై
లోకములో అందరికీ చేయకూడని పనులు చేయడంలో ఆసక్తి ఎక్కువ. చేయవలసిన పనిలో శ్రద్ధ తక్కువ ( కుశలే ప్రమత్తః)
అట్లాంటి భగవంతుని స్వరూపాన్ని తెలుసుకొని, భగవంతుని ఆరాధించి, భగవంతుని గుణములు తెలుసుకొని, భగవంతుని చరిత్రలు స్మరించి ఎవరైతే ఒక్కసారి భగవానుని మీద మనసు నిల్పుతారో, వారికి ఈ ప్రపంచం మీద మనసు లగ్నం కాదు.
యస్మాద్బిభేమ్యహమపి ద్విపరార్ధధిష్ణ్యమ్
అధ్యాసితః సకలలోకనమస్కృతం యత్
తేపే తపో బహుసవోऽవరురుత్సమానస్
తస్మై నమో భగవతేऽధిమఖాయ తుభ్యమ్
నిన్ను జ్ఞ్యాపకం ఉంచుకోగలనో లేనో అని నేను భయపడుతూ ఉంటాను. ఎక్కడ "నేనే సృష్టి కర్తను అని అహంకరిస్తానో" అని భయపడుతూ ఉంటాను. అట్లాంటి నన్ను భగవంతుడు ఎప్పుడూ అనుగ్రహించి నాలో అహంకారం కలగకుండా రక్షించు గాక. అటువంటి భగవానునికి నమస్కారం.
తిర్యఙ్మనుష్యవిబుధాదిషు జీవయోనిష్వ్
ఆత్మేచ్ఛయాత్మకృతసేతుపరీప్సయా యః
రేమే నిరస్తవిషయోऽప్యవరుద్ధదేహస్
తస్మై నమో భగవతే పురుషోత్తమాయ
వేదములు పోతే మనకోసమని చేప అయ్యి, భూమి మునిగిపోతే వరాహమై, హిరణ్యకశిపుడు విజృంభిస్తే సిమ్హమై వచ్చాడు. కేవలం లోకములో అధర్మం పెరుగుతూ ఉంటే రాముడై వచ్చాడు, అధర్మంతో కూడిన రాజుల పేరుతో ఉన్న రాక్షసులని సంహరించడానికి కృష్ణుడిలా వచ్చాడు, దేవతలలో వామనుడిగా వచ్చాడు, ఇలా వచ్చి తాను ఏర్పరచిన ధర్మాన్ని నిలబెట్టడానికి వచ్చాడు.
యోऽవిద్యయానుపహతోऽపి దశార్ధవృత్త్యా
నిద్రామువాహ జఠరీకృతలోకయాత్రః
అన్తర్జలేऽహికశిపుస్పర్శానుకూలాం
భీమోర్మిమాలిని జనస్య సుఖం వివృణ్వన్
స్వామి నిద్రపోతున్నాడు పాల కడలిలో. పరమాత్మ నిద్రపోతాడా? ఒక మంచి మెత్తని పాంపు మీద పడుకున్నాడు. చుట్టూ నీరు, మధ్యలో పాము, పాము మీద స్వామి. ఇదీ మన జీవితం. విషయములు అనే అగాధమైన జలములో, విషయములలో ఉండే విషముతో కూడినటువంటిది పాము, అలాంటి విషపూరితమైన అంతఃకరణ ఇంద్రియప్రవృత్తులతో నిండి ఉన్న దానిలో భగవానుడు ఉన్నాడు అనే భావన మనలో కలగాలి. నేనే ఉన్నాను నేనే నడుపుతున్నాను అనే భావన ప్రమాదకరం.
ఇంద్రియములు పని చేయడం మానేస్తే నిద్ర. ఇంద్రియములు పని చేయడం మానేస్తే సుఖంగా ఉంటుందని మనకెప్పుడూ తెలుసు. కానీ దానికి ఎవరూ ఒప్పుకోరు. కనులు చూడకుండా చెఉవులు వినకుండా మనసు ఆలోచించకుండా ఉండాలి. మేలుకొని ఉండగా నిదురపోవాలి. చూస్తున్న కన్ను చూడకూడదు. మనసు కంటితో కలవకపోతే మనసు చూడదు. అలాగే మన మనసులో భగవంతుని నిలిపితే లోకంలో చూసేవి చూస్తున్నా లోపలకి దిగవు, వింటున్నా లోపలకి దిగవు. ఇంద్రియములు వెనుకకు వెళ్ళి బయట విషయములను చూడకుండా ఉండుటే నిద్ర. ఇదే మానవునికి సుఖమూ.
స్వామి పాల కడలిలో ఆదిశేషుని మీద పడుకుని, మనల్ని కూడా అలాగే చేయమంటున్నాడు. అంటే? లోకములో ఉండి, ఆ విషయములను అనుభవిస్తూ, ఆ అనుభవిస్తున్న విషయములు అనుభవించేది పరమాత్మే అన్న భావనతో ఉంటే బాహ్య విషయములలో వచ్చిన దోషం మనకు అంటదు. అందుకే ఏ పని చేసిన భగవన్నామం చెప్పమని పెద్దలు చెబుతారు. ఇంట్లో ఏది వండుకున్నా దేవుని కోసం వండుకోమని అంటారు. దాని వలన అహంకార మమకారాలు తగ్గుతాయి. ఇది మరొకడిది అనుకోవడం వలననే అహంకార మమకారాలు తగ్గుతాయి.
అలా నిదురపొమ్మనే చెబుతున్నాడు. బాహ్యమైన విషయములను తాను చూస్తూ వింటూ, వాటి మీద ఇంద్రియములు ప్రవర్తించకుండా వెనక్కు మళ్ళాలి. ఇంద్రియాలు తమ తమ వ్యాపారలు మనడమే నిద్ర. అదే మనకు సుఖము. ఇంద్రియములు విషయ్ములను అనుభవిస్తూ అనిభవించకుండా లోపల ఉన్న భగవంతుని లోపల చేరి ఉండటం మన ఇంద్రియాలకు నేర్పు అని స్వామినకు పాఠం చెబుతున్నాడు.
మనకు తమో గుణం ఆవహించినపుడు నిద్ర వస్తుంది. మనమందరం అవిద్య ఉపహతులం. అవిద్య అయిదురకాలుగా ఉంటుంది. 1.తామిశ్రము 2.అంధ తామిశ్రము 3. మోహము 4. మహా మోహమూ 5. తమస్సు అనే అయిదు అవిద్య యొక్క స్వరూపాలు. తామిశ్రమంటే చీకటి. చీకటి నాలుగు రకాలుగా ఉంటుంది. 1. వెలుగు లేకపోవుటా 2. వెలుగు ఉన్నా మనం చూడలేకపోవుట 3. వెలుగూ ఉండి మనమూ చూడగలిగీ వస్తువు లేకపోవుటా 4. ఈ మూడూ ఉన్నా చూడాలన్న సంకల్పం లేకపోవుట.
అంధ తామిశ్రం అంటే చీకటిలో చీకటి, కళ్ళూ లేవూ, సూర్యుడూ లేడు. మోహమంటే ఉన్న దాన్ని ఇంకోదానిగా చూచే స్వభావం. మహా మోహం అంటే వస్తువు వాస్తువుగా ఉన్న గుర్తిచకపోవడం. తామస్సు అంటే అజ్ఞ్యానం. పరమాత్మ స్వరూపాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిచకపోవుట. ఈ ఐదు రకములైన అవిద్యచే కొట్టబడకపోయినా స్వామి నిద్రపోయాడు
ఈ స్వామి పదునాలుగు లోకాలను కడుపులో దాచుకుని నిదురపోతున్నాడు. సకల జగద్రక్షణ చేస్తూనే నిద్రపోతున్నాడు. మనం నిద్రపోతే మన పని మనం చేయలేము. పరమాత్మ నిద్రూపోతూ గూడా పని చేయగలడు. ఎందుకంటే అక్కడ అవిద్య లేదు. మన దగ్గర అవిద్య ఉంది. ఈయన పడుకున్న పరుపు నీటిలో ఉంది. స్వామికి ఎలాంటి స్పర్శ కావాలంటే అలాంటి స్పర్శ ఇచ్చే పరుపు అయిన ఆదిశేషువు. తెల్లగా చల్లగా మెత్తగా ఎత్తుగా విశాలంగా ఉండే పరుపు అది (అశి కశిపు). ఆయన పడుకున్నది సముద్రములో.
లోకములో మానవుల నిద్రాసుఖం ఇలా ఉంటుందని బోధిస్తున్నట్లుగా పడుకున్నాడు. నిరంతర్మ్ కదిలే స్వభావం గల సర్పం పరుపు, ఉవ్వెత్తున ఎగిసిపడే అలల మధ్య పడుకున్నాడు. మానవుల నిద్ర ఎలాంటి స్వరూపంలో ఉంటుందో మనకు చెబుతున్నట్లుగా పడుకున్నాడు.
యన్నాభిపద్మభవనాదహమాసమీడ్య
లోకత్రయోపకరణో యదనుగ్రహేణ
తస్మై నమస్త ఉదరస్థభవాయ యోగ
నిద్రావసానవికసన్నలినేక్షణాయ
నీ నాభిపద్మమనే మహా పద్మం నుండి నేను పుట్టాను. మూడు లోకాలను సృష్టించడానికి పనికి వచ్చే నేను నీ అనుగ్రహంతో ఆవిర్భవించాను. సకల ప్రపంచమునూ కడుపులో దాచుకున్న, యోగ నిదుర పూర్తి అయిన తరువాత, అపుడే విచ్చుకుంటున్నా పద్మముల వంటి కనులు గలవాడి వైన నీకు నమస్కారము.
అటువంటి స్వామికి నేను నమస్కరిస్తున్నాను
సోऽయం సమస్తజగతాం సుహృదేక ఆత్మా
సత్త్వేన యన్మృడయతే భగవాన్భగేన
తేనైవ మే దృశమనుస్పృశతాద్యథాహం
స్రక్ష్యామి పూర్వవదిదం ప్రణతప్రియోऽసౌ
లోకంలో ఉన్న కదిలే ప్రతీ వస్తువుకీ, మారే ప్రతీ వస్తువుకీ, శరీరములో ఉన్న ప్రతీ ప్రాణికీ, ఆయనొక్కడే సుహృత్. సర్వలోక సుహృత్ ఆయనే. మన మేలు కోరే వారు ఇంకెవరూ లేరు. అన్ని ఆత్మలకూ ఆత్మ ఆయన. లోపల ఉండి నియమించే వాడు ఆయన. అట్టి ఆ భగవంతుని చూచి, ఆ దర్శనం చేత మనలో ఉండే మాలిన్యాలన్నీ తొలగితే ఆ స్వామి మనకు ప్రీతి పాత్రుడైతే మనని ఆయన ప్రేమిస్తాడు
సుహృత్ - చక్కని హృదయమును ఇచ్చేవాడు, చక్కని హృదయములో చక్కని హృదయముగా ఉండేవాడు. ఇటువంటి సుహృత్తులు చాలా మంది ఉండరు. ఒక్కడే ఉంటాడు. ఆరుగుణములు (భగము) కలవాడు అయిన నీవు భగ శబ్దవాక్యమైన ఐశ్వర్యంతో, సహజమైన సత్వముతో మొత్తం ప్రపంచాన్ని వ్యాపింపచేస్తున్నావు. ఈ సకల చరాచర జగత్తును ఏ చక్కని దృష్టితో చూసి వృద్ధిపొందిస్తున్నారో, ఆ చూపు నన్ను కూడా తాకనీ. ప్రణత ప్రియుడివి నీవు - ఆశ్రయించినవారి యెడల ప్రీతి కలవాడవు. ప్రణత అర్తి అర్థ ప్రదుడు అని కంచి వరదరాజ స్వామికి పేరు. అటువంటి నీ చూపు నన్ను తాకితే నేను సృష్టి చేయగలను
ఏష ప్రపన్నవరదో రమయాత్మశక్త్యా
యద్యత్కరిష్యతి గృహీతగుణావతారః
తస్మిన్స్వవిక్రమమిదం సృజతోऽపి చేతో
యుఞ్జీత కర్మశమలం చ యథా విజహ్యామ్
నీ ఆత్మ శక్తి అయిన తల్లి లక్ష్మితోటి అన్ని పనులూ చేస్తున్నావు. ఒక్కొక్క గుణం తీసుకుని ఆ గుణముతో పని చేస్తున్నావు . ప్రసన్నమైన ముఖ మండలం దర్శనమైతే , లక్షీ దేవి అనుసరించి వస్తే, లోకములో అనేక రూపములు కలిగి మనని రక్షించడానికి అనేక రూపములో వస్తున్నాడు. స్వామి నాకు మకరందమైన ఆయన వాక్కుని నాకు వినిపిస్తూ నా దుఃఖాన్ని తొలగించుగాక. ఆశ్రయించిన వారికి వరములు ఇచ్చేవాడివి నీవు. నీ విక్రమముతో (ప్రభావముతో), నీ మహిమతో, నేను సృష్టిస్తూ ఉంటే, "నేనే సృష్టిస్తున్నాను" అన్న అహంకారం నన్ను తాకకుండా ఉండేట్టు చేయి. అందుకు నీ దృష్టి కావాలి. ఇంత చేస్తూ ఉన్నా నా చిత్తం అక్కడ కాకుండా, నీ యందే లగ్నమవ్వాలి. ఈ సృష్టి అనే కర్మ చేస్తున్నందువలన సంసారములో ఉన్న నాకు మురికి అంటకుండా ఉండాలి. కర్మలని ఆచరించడం వలన ఎలా నేను తొలగించుకుంటానో అలా అనుగ్రహించు
నాభిహ్రదాదిహ సతోऽమ్భసి యస్య పుంసో
విజ్ఞానశక్తిరహమాసమనన్తశక్తేః
రూపం విచిత్రమిదమస్య వివృణ్వతో మే
మా రీరిషీష్ట నిగమస్య గిరాం విసర్గః
నీ నభి అనే సరస్సు నుండి నేను సృజించబడ్డాను. విజ్ఞ్యాన శక్తిగా నేను ఆవిర్భవించాను. నీ అనంతశక్తిలో ఒకటిగా నేను వచ్చాను. నీవు నీ నాభి పద్మం నుండి నన్ను ఎందుకు సృష్టించావో ప్రపంచం యొక్క విశిష్ట రూపాన్ని, సకల చరాచర జగత్తుని ఏర్పరుస్తున్న నాకు, వేద వాక్కుల విశిష్టమైన జ్ఞ్యానం నశించకుండుగాక. జగత్తు యొక్క సృష్టి చేస్తున్న నేను ఆ పనిలో పడి వేదాన్ని మరచిపోకూడదు. నా మనసు నీలోనే ఉండాలి. అహంకారం తాకకూడదు.
సోऽసావదభ్రకరుణో భగవాన్వివృద్ధ
ప్రేమస్మితేన నయనామ్బురుహం విజృమ్భన్
ఉత్థాయ విశ్వవిజయాయ చ నో విషాదం
మాధ్వ్యా గిరాపనయతాత్పురుషః పురాణః
అమోఘమైన గొప్ప దయగల మాహానుభావుడవు నీవు. పెరిగిన ప్రేమతో కలిగిన చిరునవ్వుతో నన్ను చూడాలి. ప్రపంచాన్ని సృష్టించాలి కాబట్టి, ఈ పనికోసం నీవు లేచి, నా విషాదాన్ని తేనెలొలికే నీ మాటలతో తొలగించు. నీవు పురాణ పురుషుడివి (అందరికన్న ముందు ఉన్నవాడివి).
మైత్రేయ ఉవాచ
స్వసమ్భవం నిశామ్యైవం తపోవిద్యాసమాధిభిః
యావన్మనోవచః స్తుత్వా విరరామ స ఖిన్నవత్
ఇలా స్తోత్రం చేసి అలసిపోయిన వాడిలాగ ఆగిపోయాడు. తన పుట్టుకను పరమాత్మకు ఆవిష్కరించాడు. పరమాత్మ ప్రసాదించిన తపసు విద్యా సమాధులతో తన మనసు వాక్కు ఎంత దూరం వెళ్ళగలదో అంతవరకూ వెళ్ళి (అందినంతవరకూ స్తోత్రం చేసి) స్తోత్రం చేసి అలసిపోయినవాడిలాగ
అథాభిప్రేతమన్వీక్ష్య బ్రహ్మణో మధుసూదనః
విషణ్ణచేతసం తేన కల్పవ్యతికరామ్భసా
బ్రహ్మ యొక్క అభిప్రాయాన్ని తెలుసుకొని, మధుసూదనుడు (మధుకైటబులను సంహరించినవాడు. బ్రహ్మకు ప్రసాదించిన వేదములను అపహరించిన రాక్షసుడు మధువు, వాడిని హయగ్రీవావతారములో సంహరించాడు)
ఈ స్తోత్రమంతా చేసి బడలిపోయి "స్వామిని నేను స్తోత్రం చేయగలనా" అని చాలా దిగులుపడి,
లోకసంస్థానవిజ్ఞాన ఆత్మనః పరిఖిద్యతః
తమాహాగాధయా వాచా కశ్మలం శమయన్నివ
ప్రపంచమును సృష్టించడానికి కావలసిన విజ్ఞ్యానం నాకెలా కలుగుతుంది అని పరితపిస్తున్న బ్రహ్మగారితో ఆయన యొక్క బాధను తొలగిస్తున్నట్లుగా గంభీరమైన వాకుతో ఇలా అన్నాడు
శ్రీభగవానువాచ
మా వేదగర్భ గాస్తన్ద్రీం సర్గ ఉద్యమమావహ
తన్మయాపాదితం హ్యగ్రే యన్మాం ప్రార్థయతే భవాన్
ఓ వేద గర్భా, నీవు విషాదాన్ని పొందకు, అలసటనీ సోమరితనాన్ని పొందకు. సృష్టి యందు ప్రయత్నం మొదలుపెట్టు. నీకేమేమి కావాలని ప్రార్థిస్తున్నావో, అవి అన్నీ నీకు ముందే ఇచ్చాను.
బడలిక చెందకు, సృష్టికి ఉపక్రమించు. ఇవాళా నీవు కొత్తగా సృష్టించక్కర్లేదు. నేను ముందే అండ సృష్టి చేసాను. వాటిని విడి విడిగా చేయి.
భూయస్త్వం తప ఆతిష్ఠ విద్యాం చైవ మదాశ్రయామ్
తాభ్యామన్తర్హృది బ్రహ్మన్లోకాన్ద్రక్ష్యస్యపావృతాన్
ఇచ్చినా, ఇచ్చినట్లు తెలియాలంటే మళ్ళీ తపసు చేయి. నన్ను గూర్చి విద్యను ఉపాసించు, నన్ను దర్శిస్తావు. లోకాలనీ నీకు దర్శనమవుతాయి.తపస్సు చేసి నీవు విద్యనూ జ్ఞ్యానమునూ సంపాదిస్తే ఈ తపో విద్యతో, నాలో ఉన్న అన్ని లోకములనూ చూడగలవు.
తత ఆత్మని లోకే చ భక్తియుక్తః సమాహితః
ద్రష్టాసి మాం తతం బ్రహ్మన్మయి లోకాంస్త్వమాత్మనః
అప్పుడు నా యందు, నాలోని లోకముల యందు భక్తి కలిగి, సావధానంతో (సమాహితః) ఉంటే, నాలో విస్తరించబడి ఉన్న జగత్తునూ, నన్నూ, చూస్తావు. తపసుతో నన్నూ, విద్యతో నాలోకాలను చూస్తావు.
అపుడు నీవు చేయవలసిన పని ఏమిటంటే, లోకాలను సృష్టిస్తున్నావు కదా అని నన్ను మరచిపోకు. నన్ను ధ్యానిస్తున్నావు గనుక లోకాన్ని మరచిపోకు. నీకు ఆత్మ అయి ఉన్న నా యందు, ఇవతల నీ చేత సృష్టింపబడే నా విభూతి అయిన నా శరీరం యందు కూడా భక్తి గలవాడివైతే అప్పుడు నన్ను చూచిన వాడివవుతావు. పరబ్రహ్మమైన నన్ను, నాయందే ఆధారపడి ఉన్న జీవులను వీరందరినీ నీవు చూస్తావు. అప్పుడు లోకములో సమస్త జీవులూ మన్షులూ కనిపిస్తారు నీకు. ఆ కనిపించిన వారిలో నేనున్నాను. అది గుర్తుంచుకో.
యదా తు సర్వభూతేషు దారుష్వగ్నిమివ స్థితమ్
ప్రతిచక్షీత మాం లోకో జహ్యాత్తర్హ్యేవ కశ్మలమ్
కర్రలో అగ్ని ఉన్నట్లు నేను ఉంటాను(కట్టెలో ఉన్న నిప్పులో కనపడే వికారాలన్నీ కట్టెవే గనీ నిప్పువి కాదు. కట్టె పొడుగ్గా ఉంటే మంట పొడుగ్గా సాగుతుంది. వంకరా పొట్టి పొడుగూ, ఈ అవస్థలన్నీ కట్టెవు. మనలో ఉన్న పరమాత్మకి మనలో ఉన్న బాల్య వృద్ధాపయం కౌమారం యవ్వనం ఇవేమీ అంటవు. శరీరానికి అవస్థలు తప్ప జీవుడికి, జీవుడిలో ఉన్న పరమాత్మకీ ఎటువంటి అవస్థలూ ఉండవు. ఆత్మకు ఏమీ అంటదు, అంటినట్టు కనపడుతుంది. ) . నన్ను ఒక్కడినే చూస్తే నీ పాపములు తొలగవు. నీవు చూసే సమస్త జీవులలో నేనున్నాను నీవు చూచిన నాడు నీ మాలిన్యం తొలగుతుంది. కాబట్టి అంతర్యామి తత్వాన్ని, వాసుదేవ తత్వాన్ని దర్శించాలి. నీవు చూసే ప్రతీ వస్తువులో అంతర్యామిగా నేనున్నానన్న భావన కలగాలి. ఈ ఇంద్రియములు, పంచమహాభూతములూ, మనసు, ఇవి లేని నన్ను దర్శించు. అలాగే వీటన్నిటితో కూడిన విశ్వములో నన్ను దర్శించు. ఇవి రెండు రకాలైన దర్శనాలు. ప్రకృతి సంబంధము లేని పరబ్రహ్మ దర్శనం. రెండవది స్థూల రూపమైన జగత్తులో అంతర్యామిగా ఉన్న భగవత్ దర్శనం. ఈ రెండూ చేస్తే నీకు స్వారాజ్యం (కర్మ యొక్క బంధములు తొలగుతాయి). స్వరాట్ అంటే కర్మ చేత గాక తనతట తానే జ్ఞ్యానముతో ప్రకాశించినవాడు , పరమాత్మ. పరమాత్మతో సమానమైన గుణం మన ఆత్మకు కూడా ఉంది. ఆత్మ కర్మ చేత మూతబడి పోయింది. తన రూపముతో తాను ప్రకాశించుట స్వారాజ్యం. ఇలా చేస్తే స్వారాజ్యం పొందుతాడు.
నీవు ఇందులో ఒక్కటే చూస్తే పని చేయలేవు. లోకాలను చూడాలి. లోకాలలో నన్ను చూడాలి. నాలో ఉన్న లోకాలు చూడాలి. ఇలా చూసిన నాడు ఆ లోకుల యొక్క దుఃఖం తొలగుతుంది.
యదా రహితమాత్మానం భూతేన్ద్రియగుణాశయైః
స్వరూపేణ మయోపేతం పశ్యన్స్వారాజ్యమృచ్ఛతి
పరమాత్మ యొక్క స్వారాజ్యం ఈ జగత్తంతా. అది పొందాలంటే, ఆత్మకు పంచ్భూతాలతో గానీ, కర్మేంద్రియాలతో గానీ, సత్వాది గుణత్రయానితో గానీ, దేనితో సంబంధం లేదు అని తెలుసుకోవాలి. నా స్వరూపాన్ని తెలుసుకుని ప్రపంచమంతా నాలో ఉన్నది, ప్రపంచమంతా నేను ఉన్నానని, నాకేవీ ఇవి అంటవు అని తెలుసుకుంటాడో, ఇవేవీ లేకుండా ఈ జగత్తులో నేనుంటానని తెలుసుకుంటాడో వాడు స్వారాజ్యాన్ని పొందుతాడు
నానాకర్మవితానేన ప్రజా బహ్వీః సిసృక్షతః
నాత్మావసీదత్యస్మింస్తే వర్షీయాన్మదనుగ్రహః
ఈ విషాలమైన విస్తృతమైన జీవులని సృష్టిస్తావు నీవు. ఆ జీవులు నానా కర్మలు గలవి. నీవు ఇందులో చిక్కుబడవు. అనేకమైన కర్మ విస్తారములతో ఎంతో మంది జీవులను సృష్టించే నీవు శ్రమను పొందవు, అలసటను పొందవు. నీకు నా అనుగ్రహం చాలా ఉంది. అది వృద్ధి పొందుతుంది. నా అనుగ్రహం ఉన్నవాడు విషాదాన్ని అలసటని పొందడు.
ఋషిమాద్యం న బధ్నాతి పాపీయాంస్త్వాం రజోగుణః
యన్మనో మయి నిర్బద్ధం ప్రజాః సంసృజతోऽపి తే
ప్రపంచాన్ని చూచిన మొట్టమొదటి జీవుడు బ్రహ్మ. నీవు మొదటి ఋషివి. (ఋషి అంటే ద్రష్ట. సామాన్యులు చూడలేని దాన్ని చూసేవారు ఋషులు). నీకు పాపిష్టి రజోగుణం అంటదు. ప్రజలను సృష్టిస్తున్నా నీ మనసు నా యందే లగ్నమయి ఉంటుంది కాబట్టి నీకు రజో గుణం అంటదు. మనమే పని చేస్తున్నా పరమాత్మ యందు మనసు నిలుపగలిగితే మనకు కూడా రజో గుణం అంటదు
జ్ఞాతోऽహం భవతా త్వద్య దుర్విజ్ఞేయోऽపి దేహినామ్
యన్మాం త్వం మన్యసేऽయుక్తం భూతేన్ద్రియగుణాత్మభిః
ఇంతవరకూ ఎవరికీ తెలియరాని నేను నీకు తెలిసాను. నన్ను నీవు చూసావని ఎందుకు చెబుతున్నానంటే , నీవు చేసిన స్తోత్రములో నాకు 25 తత్వాలు (5 భూతాలు 10 ఇంద్రియాలు గుణాలూ) అంటవు అని చెప్పావు కాబట్టి, భూతేంద్రియ గుణాలతో సంబంధం లేని వాడిగా నన్ను తెలుసుకున్నావు
తుభ్యం మద్విచికిత్సాయామాత్మా మే దర్శితోऽబహిః
నాలేన సలిలే మూలం పుష్కరస్య విచిన్వతః
నీకు నన్ను చూపడానికి కారణం, వెయ్యి ఏళ్ళు నన్ను చూడాలని తపించావు. అందుకు నీ మనసులో సాక్షాత్కరించాను. నన్ను వెతకడానికి పద్మం యొక్క నాలములోకి వెళ్ళావు.
యచ్చకర్థాఙ్గ మత్స్తోత్రం మత్కథాభ్యుదయాఙ్కితమ్
యద్వా తపసి తే నిష్ఠా స ఏష మదనుగ్రహః
నన్ను స్తోత్రం చేసావు. ఆ స్తోత్రములో నా కథా, నా విజయం, నా గుణాలూ ఉన్నాయి. నా అనుగ్రహం వలన నీవు చేసిన ఈ రెండిటి వలనా (తపసు వలనా, స్తోత్రము వలనా) నేను సంతోషించాను
ప్రీతోऽహమస్తు భద్రం తే లోకానాం విజయేచ్ఛయా
యదస్తౌషీర్గుణమయం నిర్గుణం మానువర్ణయన్
నేను ఇచ్చిన దానితో నా సంకల్పంతో నా స్తోత్రం చేసి నన్ను సకలలోక అంతర్యామిగా తెలుసుకున్నావు. సృష్టి చేయాలన్న నీ సంకల్పానికి శుభం, మంగళం. నేను గుణమయున్ని(కళ్యాణ గుణములు కలవాడిని) గుణములు లేని వాడిని (ప్రాకృతిక గుణాలు లేని వాడిని)
య ఏతేన పుమాన్నిత్యం స్తుత్వా స్తోత్రేణ మాం భజేత్
తస్యాశు సమ్ప్రసీదేయం సర్వకామవరేశ్వరః
ఈ స్తోత్రంతో ఎవరు నన్ను పూజిస్తారో వాడికి నేను ప్రసన్నుడనవుతాను, అడిగిన వరాలు ఇస్తాను. అన్ని కోరికలూ తీరుస్తాను. ఇక్కడ అన్ని కోరికలూ అంటే సర్వకామ. సర్వకామ అని పరమాత్మకు పేరు. అంటే ఈ స్తోత్రం చేస్తే వారికి సర్వకామ స్వరూపుడైన నన్ను ప్రసాదిస్తాను. వాడికి నేను వశుడనై ఉంటాను.
పూర్తేన తపసా యజ్ఞైర్దానైర్యోగసమాధినా
రాద్ధం నిఃశ్రేయసం పుంసాం మత్ప్రీతిస్తత్త్వవిన్మతమ్
యజ్ఞ్య యాగాదులూ చేసి, తోటలూ దేవాలయాలు, చెరువులూ బావులు నిర్మించడం - ఇలా పూర్తములతో, దానములతో యోగములతో సమాధులతో, వీటన్నిటి వలన కలిగే ఉత్తమ శ్రేయస్సు ఒకటే. నేను సంతోషించుటే. నేను సంతోషించుటే దేనికైనా ఫలము. (పరమ శివుడు హాలాహలాన్ని తాగుతూ "ఇలా చేస్తే హరి సంతోషితాడు" అని అంటారు). ప్రపంచంలో చేసే అన్ని పనులకూ ఏకాంత ఫలం నా సంతోషమే అని తత్వము తెలిసిన వారి సిద్ధాంతం. అందుకే మనం భగవదాజ్ఞ్యతో భగవంతుని ప్రీతి కొరకు భగవంతుని కైంకర్యముగా పనులు చేస్తాము.
అహమాత్మాత్మనాం ధాతః ప్రేష్ఠః సన్ప్రేయసామపి
అతో మయి రతిం కుర్యాద్దేహాదిర్యత్కృతే ప్రియః
ఇదొక్కటే పరమ సిద్ధాంతం. అన్ని ఆత్మలకూ నేనే ఆత్మను. పని చేస్తే కలిగే ఆత్మ ప్రీతి నేనే. ప్రీతి కలవారందరిలో నేనే ఎక్కువ ప్రేమించబడుతున్నాను. కాబట్టి అందరూ నా మీదే ప్రీతి కలిగి ఉండాలి (ఉంటున్నారు కూడా). నా మీద ఇష్టమే ఆత్మ మీదా. ఆత్మ మీద ఇష్టమే శరీరం మీద చూపుతున్నారు లోకులు.
సర్వవేదమయేనేదమాత్మనాత్మాత్మయోనినా
ప్రజాః సృజ యథాపూర్వం యాశ్చ మయ్యనుశేరతే
ఇపుడు సర్వ వేదమయుడవైన నాలో ఉన్న నీవు, నీలో ఉన్న నన్ను చూచి, నీ మనసులో నన్ను తెలుసుకుని నీ బుద్ధితో నేను ఉన్న ప్రపంచాన్ని, నాలో ఉన్న ప్రపంచాన్ని సృష్టించు. (ఆత్మయోనిన - బ్రహ్మతో ఆత్మనా - మనసుతో ఆత్మ - ఈ జగత్తును. ఆత్మయోనినా ఆత్మనా ఆత్మ). సకల చరాచర జగత్తునూ నేనిచ్చిన జ్ఞ్యానముతో, నాలో ఉన్న జగత్తును నీవు చూచి, సృష్టించు.
మైత్రేయ ఉవాచ
తస్మా ఏవం జగత్స్రష్ట్రే ప్రధానపురుషేశ్వరః
వ్యజ్యేదం స్వేన రూపేణ కఞ్జనాభస్తిరోదధే
ప్రధానపురుషేశ్వరః - ప్రకృతికీ జీవుడికీ, అచిత్తుకూ చిత్తుకూ ప్రధానం. ఈ పరమాత్మ తన స్వరూపముతో సకల చరాచర జగత్తునూ బ్రహ్మకు సాక్షాత్కరింపచేసాడు. అలా చేసి ఆ పద్మనాభుడు (కఞ్జనాభస్తిరోదధే) అంతర్ధానం చెందాడు. ఇలా అనేక వరములిచ్చి బ్రహ్మకు వరములిచ్చి స్వామి అంతర్ధానం చెందాడు.