Followers

Friday, 7 February 2014

శ్రీమద్భాగవతం చతుర్ధ స్కంధం పద్నాల్గవ అధ్యాయం



మైత్రేయ ఉవాచ
భృగ్వాదయస్తే మునయో లోకానాం క్షేమదర్శినః
గోప్తర్యసతి వై నౄణాం పశ్యన్తః పశుసామ్యతామ్

లోకుల యొక్క క్షేమము కోరి మునులందరూ, "రక్షకుడు లేకుంటే ప్రజలందరూ పశువుల్లా అవుతారు (అంటే పశువుల్లా కొట్టుకుంటారు) అని 

వీరమాతరమాహూయ సునీథాం బ్రహ్మవాదినః
ప్రకృత్యసమ్మతం వేనమభ్యషిఞ్చన్పతిం భువః

తల్లి అయిన సునీధిని పిలిచారు ఋషులందరూ. వేనుడు రాజ్యానికి యోగ్యుడు కాడు. ప్రజలు కూడా ఒప్పుకోరు. అయినా రాజు అనేవాడొకడుండాలి కాబట్టి ప్రజలకిష్టం లేని వాడిని రాజు చేసారు

శ్రుత్వా నృపాసనగతం వేనమత్యుగ్రశాసనమ్
నిలిల్యుర్దస్యవః సద్యః సర్పత్రస్తా ఇవాఖవః

పాముకు బయపడే ఎలుకవలే దొంగలందరూ దాక్కున్నారు. ఎలుకా పామూ రెండూ దొంగలే. కానీ ఎలుకకు పామంటే భయం. అంటే ఎలుక వంటి దొంగలు పాము వంటి రాజును చూసి భయపడ్డారు. పామంటే పెద్ద దొంగ. తన రాజరికాన్ని బాగా చాటుకున్నాడు. 

స ఆరూఢనృపస్థాన ఉన్నద్ధోऽష్టవిభూతిభిః
అవమేనే మహాభాగాన్స్తబ్ధః సమ్భావితః స్వతః

అష్టదిగ్పాలకుల శక్తులు కూడా తెచ్చుకుని, నేనే దేవున్ని అని అహంకారం కలవాడై తనను తాను ఎక్కువగా గౌరవించుకుంటూ మహాత్ములను అవమానించే వాడు. 

ఏవం మదాన్ధ ఉత్సిక్తో నిరఙ్కుశ ఇవ ద్విపః
పర్యటన్రథమాస్థాయ కమ్పయన్నివ రోదసీ

అంకుశములేని ఏనుగులాగ మధాంధుడై గర్వించి భూమ్యాకాశలను స్తంభింపచేస్తున్నట్లుగా రథము ఎక్కి సంచరిస్తూ 

న యష్టవ్యం న దాతవ్యం న హోతవ్యం ద్విజాః క్వచిత్
ఇతి న్యవారయద్ధర్మం భేరీఘోషేణ సర్వశః

యజ్ఞ్యమూ దానమూ హోమమూ మీరెవ్వరూ చేయడానికి వీలు లేదు అని చాటింపు చేయించాడు. 

వేనస్యావేక్ష్య మునయో దుర్వృత్తస్య విచేష్టితమ్
విమృశ్య లోకవ్యసనం కృపయోచుః స్మ సత్రిణః

అతన్ని రాజుగా చేసిన మునులు అతని దుష్ట చేష్టీములు చూసి లోకానికి ఇంత బాధ కలిగిందే అన్న దయతో 

అహో ఉభయతః ప్రాప్తం లోకస్య వ్యసనం మహత్
దారుణ్యుభయతో దీప్తే ఇవ తస్కరపాలయోః

"ఇప్పుడు రెండు రకాల కష్టం ప్రజలకు వచ్చింది. దొంగల వలనా బాధ, రాజులవలనా బాధ. పొయ్యిలో పెట్టిన కొన్ని కట్టెలకు రెండు కొనలకూ నిప్పు అంటుకుంటుంది. అలా రెండు కొనలకూ నిప్పు అంటుకుంటే ఆ కట్టెకు మధ్యలో ఉన్న పురుగులు ఎటూ వెళ్ళలేక ఎలా బాధపడతారో అలా అయ్యింది ఇక్కడ ప్రజల విషయం"

అరాజకభయాదేష కృతో రాజాతదర్హణః
తతోऽప్యాసీద్భయం త్వద్య కథం స్యాత్స్వస్తి దేహినామ్

"రాజపదివికి అర్హుడు కాడని తెలిసీ దొంగల భయము వలన వీనిని రాజుని చేస్తే ఇప్పుడు ఆ భయం రాజునుంచే వచ్చింది. ప్రజలకు శుభం ఎలా కలుగుతుంది"

అహేరివ పయఃపోషః పోషకస్యాప్యనర్థభృత్
వేనః ప్రకృత్యైవ ఖలః సునీథాగర్భసమ్భవః

పాముకు పాలు పోసి పెంచితే ఆ పెంచినవాడికే ఆపద వస్తుంది. వేనుడు పుట్టినప్పటినుండే దుర్మార్గుడు. సునీధ కడుపులో పుట్టాడు (ఆమె మృత్యువుకి కూతురూ అధర్మానికి మనవరాలు)

నిరూపితః ప్రజాపాలః స జిఘాంసతి వై ప్రజాః
తథాపి సాన్త్వయేమాముం నాస్మాంస్తత్పాతకం స్పృశేత్

ప్రజలని పోషించమని నియమిస్తే ఆ రాజు ప్రజలను భక్సిస్తున్నాడు. రాజుగా చేసిన వాడు ప్రజలను బాధపెడుతూ ఉంటే ఆ పాపం ఆయన్ని రాజుగా చేసిన మనదే. అందుకు రాజును మంచివాడిగా చేసే ప్రయత్నం చేద్దాము

తద్విద్వద్భిరసద్వృత్తో వేనోऽస్మాభిః కృతో నృపః
సాన్త్వితో యది నో వాచం న గ్రహీష్యత్యధర్మకృత్

దుర్మార్గుడనీ రాజుగా పనికిరాడనీ అందరినీ బాధిస్తాడనీ తెలిసీ అతన్ని రాజుగా చేసాము. ఒక వేళ మనము ఎంత చెప్పినా ఆ రాజు వినకుంటే 

లోకధిక్కారసన్దగ్ధం దహిష్యామః స్వతేజసా
ఏవమధ్యవసాయైనం మునయో గూఢమన్యవః
ఉపవ్రజ్యాబ్రువన్వేనం సాన్త్వయిత్వా చ సామభిః

ఆ చచ్చినవాడిని మనము చంపుదాము. ఇలా నిర్ణయించుకుని కోపాన్ని లోపల దాచుకుని మునులు రాజు వద్దకు వెళ్ళారు. అతన్ని మంచి మాటలతో ఓదార్చి ఇలా మాట్లాడారు. 

మునయ ఊచుః
నృపవర్య నిబోధైతద్యత్తే విజ్ఞాపయామ భోః
ఆయుఃశ్రీబలకీర్తీనాం తవ తాత వివర్ధనమ్

మా విజ్ఞ్యాపనను అర్థం చేసుకో. మా మాటల వలన ఆయుష్షూ సంపదా కీర్తీ బలమూ నీకు పెంచుతాయి. 

ధర్మ ఆచరితః పుంసాం వాఙ్మనఃకాయబుద్ధిభిః
లోకాన్విశోకాన్వితరత్యథానన్త్యమసఙ్గినామ్

లోకములో మానవులు చతుష్కరణములతో ధర్మాన్ని ఆచరించాలి. త్రికరణ శుద్ధి అంటే మనసు వాక్కూ కాయం. నాలగవది బుద్ధి. ఈ నాలిగింటితో ధర్మం ఆచరిస్తే ప్రజలందరికీ దుఃఖం లేకుండా చేస్తుంది. ఆచరించే వాడు ఆశ లేకుండా చేస్తే ఆ ఆచరించే వాడికి పరమపదమే వస్తుంది. 

స తే మా వినశేద్వీర ప్రజానాం క్షేమలక్షణః
యస్మిన్వినష్టే నృపతిరైశ్వర్యాదవరోహతి

ప్రజలకు క్షేమాన్ని కలిగించడానికి కావలసిన ధర్మం నీ దగ్గర నశించకూడదు. అలాంటి ధర్మం నశిస్తే ఆ రాజు పదవిలో ఉండడు. 

రాజన్నసాధ్వమాత్యేభ్యశ్చోరాదిభ్యః ప్రజా నృపః
రక్షన్యథా బలిం గృహ్ణన్నిహ ప్రేత్య చ మోదతే

రాజు ప్రజలను దొంగ మంత్రులనుండి కూడా కాపాడాలి, దొంగల నుండీ కాపాడాలి. అలా కాపాడితేనే ఆ ప్రజల నుండి పన్ను తీసుకునే హక్కు రాజుకుంటుంది. అలాంటి రాజు ఇహ పరాలలో సుఖముగా ఉంటాడు. లేకుంటే ఉభయభ్రష్టుడవుతాడు

యస్య రాష్ట్రే పురే చైవ భగవాన్యజ్ఞపూరుషః
ఇజ్యతే స్వేన ధర్మేణ జనైర్వర్ణాశ్రమాన్వితైః

ప్రతీ వాని రాజ్యములో ప్రజలు యజ్ఞ్యముని చేస్తూ పరమాత్మను ఆరాధించాలి. యజ్ఞ్యములు వర్ణాశ్రమ ధర్మాలలో భాగం.

తస్య రాజ్ఞో మహాభాగ భగవాన్భూతభావనః
పరితుష్యతి విశ్వాత్మా తిష్ఠతో నిజశాసనే

అలా ప్రజల చేత ఆరాధించబడే పరమాత్మ ఆ రాజు యందు ప్రసన్నుడవుతాడు. ఆ పరమాత్మ అందరికీ ఆత్మ. పరమాత్మ సంతోషిస్తే రాజూ ప్రజలూ పొందలేనిదంటూ ఏదీ ఉండదు

తస్మింస్తుష్టే కిమప్రాప్యంజగతామీశ్వరేశ్వరే
లోకాః సపాలా హ్యేతస్మై హరన్తి బలిమాదృతాః

ఈ ధర్మ సూక్ష్మాన్ని తెలుసుకొని లోకపాలకులూ లోకులూ దిక్కులూ దిగ్పాలకులూ ఇలాంటి పరమాత్మకు పరమ ఆదరముతో పూజ చేస్తారు

తం సర్వలోకామరయజ్ఞసఙ్గ్రహం త్రయీమయం ద్రవ్యమయం తపోమయమ్
యజ్ఞైర్విచిత్రైర్యజతో భవాయ తే రాజన్స్వదేశాననురోద్ధుమర్హసి

ఈ పరమాత్మ సర్వ లోకములలో ఉండే దేవతల చేత ఆచరించబడే సకల యజ్ఞ్యములకూ ఆయన సంగ్రహ స్వరూపుడు. పరమాత్మ వేద స్వరూపుడు (త్రయీమయం) లోక స్వరూపుడు (ద్రవ్యమయం) తపో స్వరూపుడు. కాబట్టి ఇలాంటి శాస్త్ర విహితమైన వర్ణాచార ధర్మములు ప్రజలు నీ ఉనికి కోసం ఆచరిస్తారు. అలాంటి యజ్ఞ్యాన్ని నీవు నిరోధించకూడదు. 

యజ్ఞేన యుష్మద్విషయే ద్విజాతిభిర్వితాయమానేన సురాః కలా హరేః
స్విష్టాః సుతుష్టాః ప్రదిశన్తి వాఞ్ఛితం తద్ధేలనం నార్హసి వీర చేష్టితుమ్

నీ రాజ్యములో బ్రాహ్మణులు ఆచరించే యజ్ఞ్యముతో పరమాత్మ అంశలైన దేవతలు హవిస్సు ఆరగించి సంతోషించి మనము కోరినది ప్రసాదిస్తారు. అలాంటి దేవతలను అవమానించకూడదు. బ్రాహ్మణులు యజ్ఞ్యాన్ని చేసి నీకే ఇస్తున్నారు 

వేన ఉవాచ
బాలిశా బత యూయం వా అధర్మే ధర్మమానినః
యే వృత్తిదం పతిం హిత్వా జారం పతిముపాసతే

శిశువుల వంటి మీకు (అజ్ఞ్యానులు) శాస్త్రం తెలీదు. అధర్మాన్ని ధర్మం అనుకుంటున్నారు. మీకు అన్నం పెట్టేదీ పాలించేదీ నేనైతే ఇంకొకరిని పూజించమంటారా. భర్తను వదిలి పెట్టి జారుని వద్దకు పోయే ధర్మాన్ని ఆచరిస్తున్నారు

అవజానన్త్యమీ మూఢా నృపరూపిణమీశ్వరమ్
నానువిన్దన్తి తే భద్రమిహ లోకే పరత్ర చ

పరమ మూర్ఖులై రాజుగా ఉన్న ఈశ్వరున్ని అయిన నన్ను అవమానిస్తున్నారు. రాజును అవమానించే వారు ఇహ పరాలలో సుఖాన్ని పొందలేరు.

కో యజ్ఞపురుషో నామ యత్ర వో భక్తిరీదృశీ
భర్తృస్నేహవిదూరాణాం యథా జారే కుయోషితామ్

యజ్ఞ్య పురుషుడంటున్నారు వాడెవడు. మీ ధర్మాన్ని మీరు తప్పారు

విష్ణుర్విరిఞ్చో గిరిశ ఇన్ద్రో వాయుర్యమో రవిః
పర్జన్యో ధనదః సోమః క్షితిరగ్నిరపామ్పతిః

ఏతే చాన్యే చ విబుధాః ప్రభవో వరశాపయోః
దేహే భవన్తి నృపతేః సర్వదేవమయో నృపః

రాజు దేహములో ఈ దేవతలందరూ ఉంటారు. రాజు అంటే సర్వ దేవ మయుడు. 

తస్మాన్మాం కర్మభిర్విప్రా యజధ్వం గతమత్సరాః
బలిం చ మహ్యం హరత మత్తోऽన్యః కోऽగ్రభుక్పుమాన్

మీరు యజ్ఞ్యం ఎవరికి చేస్తున్నారో అది నేనే. యజ్ఞ్యములలో ఎవరినో ఆరాధించే బదులు హవిస్సు నాకే ఇవ్వండి. మీ మత్సరమంతా తొలగించుకుని నాకే ఇవ్వండి, నాకే పూజలు చేయండి, యజ్ఞ్యములో నాకంటే ముందు వచ్చి యజ్ఞ్య ఫలం తినేవాడెవడున్నాడు 

మైత్రేయ ఉవాచ
ఇత్థం విపర్యయమతిః పాపీయానుత్పథం గతః
అనునీయమానస్తద్యాచ్ఞాం న చక్రే భ్రష్టమఙ్గలః

పాపి అయి అడ్డదారి పట్టిన వాడికి ఇంకొంత నచ్చజెప్ప ప్రయత్నించారు. అయినా అన్ని శుభములూ పోగొట్టుకున్న వేనుడు ఋషి వాక్యాలు వినలేదు.

ఇతి తేऽసత్కృతాస్తేన ద్విజాః పణ్డితమానినా
భగ్నాయాం భవ్యయాచ్ఞాయాం తస్మై విదుర చుక్రుధుః

నేనే పండితుడన్న భావనతో వారిని తిరస్కరిస్తే ఋషులలో దాగి ఉన్న కోపం బయటకు వచ్చింది

హన్యతాం హన్యతామేష పాపః ప్రకృతిదారుణః
జీవన్జగదసావాశు కురుతే భస్మసాద్ధ్రువమ్

ఈ రాజు ప్రజలకు భయంకరుడు, భయంకర స్వభావుడూ, ఇతన్ని సంహరించండి. ఎందుకు చంపాలంటే లోకన్ని చంపుతాడు. లోకం నశించక ముందే వీడిని నశింపచేయండి. 

నాయమర్హత్యసద్వృత్తో నరదేవవరాసనమ్
యోऽధియజ్ఞపతిం విష్ణుం వినిన్దత్యనపత్రపః

ఈ దుష్ట చరిత్రుడు రాజ సిమ్హాసనములో కూర్చునే  అర్హత లేని వాడు. సిగ్గు విడిచి యజ్ఞ్యపతి అయిన విష్ణువును నిందిస్తున్నాడు. ఆ నింద విన్న వారు మౌనముగా వింటే ఆ భాగం విన్న వారికీ వస్తుంది. ఇటువంటి వాడు ఉండటానికి అర్హుడు కాడు

కో వైనం పరిచక్షీత వేనమేకమృతేऽశుభమ్
ప్రాప్త ఈదృశమైశ్వర్యం యదనుగ్రహభాజనః

ఒక్క వీడు తప్ప పరమాత్మను ఎవరు నిందిస్తారు? ఎవరి దయ వలన రాజయ్యాడో ఈ వేనుడు ఒక్క క్షణము కూడా ఆలోచించట్లేదు. పరమాత్మ అనుగ్రహ పాత్రుడై రాజ్యాన్ని పొందిన వేనుడు ఆ పరమాత్మనే నిందిస్తున్నాడు

ఇత్థం వ్యవసితా హన్తుమృషయో రూఢమన్యవః
నిజఘ్నుర్హుఙ్కృతైర్వేనం హతమచ్యుతనిన్దయా

రాజును చంపాలని నిశ్చయించుకుని కోపముతో (రూఢమన్యవః) (అంతకు ముందు వీరు గూఢ మన్యవః) అందరూ కలిసి హుంకారం చేసారు. భగవంతుని వలన బ్రతుకుతూ భగవంతుని నిందించినవాడు అప్పటికే చచ్చినవాడు. అలాంటి వాడిని హుంకారముతో చంపారు. 

ఋషిభిః స్వాశ్రమపదం గతే పుత్రకలేవరమ్
సునీథా పాలయామాస విద్యాయోగేన శోచతీ

సునీధ తన తపో బలముతో (విద్యా యోగముతో - జ్ఞ్యాన బలముతో) ఆ దేహాన్ని చెడిపోకుండా కాపాడింది. 

ఏకదా మునయస్తే తు సరస్వత్సలిలాప్లుతాః
హుత్వాగ్నీన్సత్కథాశ్చక్రురుపవిష్టాః సరిత్తటే

కొంతకాలానికి ఋషులు స్నానము చేసి పరమాత్మ కథలను చెప్పుకుంటున్నప్పుడు వారికి ఉత్పాతాలు కనబడ్డాయి

వీక్ష్యోత్థితాంస్తదోత్పాతానాహుర్లోకభయఙ్కరాన్
అప్యభద్రమనాథాయా దస్యుభ్యో న భవేద్భువః

రాజు లేని ఊరికి దొంగల వలన ఆపద కలగబోతున్నదా అనుకొని 

ఏవం మృశన్త ఋషయో ధావతాం సర్వతోదిశమ్
పాంసుః సముత్థితో భూరిశ్చోరాణామభిలుమ్పతామ్

ఆలోచ్చించి ఏమి జరుగుతోందో చూసారు. దోచుకునే దోపిడీ దొంగల వలన వచ్చిన దుమ్ము చూచీ, రాజు లేకపోవడం వలన ఎవరికి వారు దొంగలవడం చూచి, 

తదుపద్రవమాజ్ఞాయ లోకస్య వసు లుమ్పతామ్
భర్తర్యుపరతే తస్మిన్నన్యోన్యం చ జిఘాంసతామ్

చోరప్రాయం జనపదం హీనసత్త్వమరాజకమ్
లోకాన్నావారయఞ్ఛక్తా అపి తద్దోషదర్శినః

రాజ్యమంతా దొంగల పరమైఅనదీ అని తెలుసుకున్నారు. మరి రాజుని చంపిన వారు దొంగలను చంపలేరా? దొంగలను చంపగలిగిన వారైనా వారించలేదు. తాము దొంగలను వారించడం మొదలుపెడితే వారే రాజులవుతారు. అంటే బ్రాహ్మణుడు బ్రాహ్మణ ధర్మాన్ని వదిలినట్లవుతుంది. ఒక్క సారి పరిపాలనా రాజ్యమూ వస్తే ఇంక బ్రాహ్మణ ధర్మాన్ని ఆచరించలేరు. రాజుగా ఉంటే కలిగే దోషం తెలుసు కాబట్టి (రాజ్యాంతే నరకం ధ్రువం) వారిని వారించలేదు. 

బ్రాహ్మణః సమదృక్శాన్తో దీనానాం సముపేక్షకః
స్రవతే బ్రహ్మ తస్యాపి భిన్నభాణ్డాత్పయో యథా

శిక్షించడమూ తప్పే, ప్రజలకు హాని కలిగినప్పుడు చూస్తూ ఊరుకున్నా తప్పే. అందరిలో పరమాత్మను చూచేవాడూ, ఇంద్రియముల యందు నిగ్రహం కలిగినవాడూ, అయిన బ్రాహ్మణుడు ఇలాంటి వారిని ఉపేక్షిస్తే  చిల్లు కుండలో ఉన్న నీరు కారిపోతున్నట్లు వాడు సంపాదించిన వారి తపస్సంతా కర్చయి పోతుంది

నాఙ్గస్య వంశో రాజర్షేరేష సంస్థాతుమర్హతి
అమోఘవీర్యా హి నృపా వంశేऽస్మిన్కేశవాశ్రయాః

మనం రాజును చంపేసాము కానీ దాని వలన అంగ వంశం నిర్వంశం కాకూడదు. అంగ వంశ రాజులు బల పరాక్రమం కలవారు. విష్ణు భక్తులూ. 

వినిశ్చిత్యైవమృషయో విపన్నస్య మహీపతేః
మమన్థురూరుం తరసా తత్రాసీద్బాహుకో నరః
కాకకృష్ణోऽతిహ్రస్వాఙ్గో హ్రస్వబాహుర్మహాహనుః
హ్రస్వపాన్నిమ్ననాసాగ్రో రక్తాక్షస్తామ్రమూర్ధజః

అలా ఆలోచించుకుని ఆ వేనుని దేహం వద్దకు వచ్చి అతని తొడని మదించారు. అప్పుడు ఒక పొట్టివాడు, నల్లటి వాడూ పొట్టి చేతులూ కలవాడు, పెద్ద నోరు కలవాడు పొట్టి కాళ్ళు కలవాడు, ముక్కు లావుగా ఉన్నవాడు ఎర్రటి కళ్ళూ కేశములూ కలవాడు. సంతానం రావాలంటే బాహువును మదించాలి గానీ తొడనెందుకు మదించారు? తెలియకనా? తొడనుండి పుట్టిన వారి వలన వేనుడు పరిశుద్ధుడయ్యాడు. అతని నుండి మంచి సంతానం కావాలంటే మొదలు అతను పాప విముక్తుడు కావాలి. 

తం తు తేऽవనతం దీనం కిం కరోమీతి వాదినమ్
నిషీదేత్యబ్రువంస్తాత స నిషాదస్తతోऽభవత్

దీనముగా ఉన్న వాడు ఏమి చేయాలి అని అడగగా "నీవు కూర్చో" మన్నారు. వీరే నిషాధులయ్యారు. 

తస్య వంశ్యాస్తు నైషాదా గిరికాననగోచరాః
యేనాహరజ్జాయమానో వేనకల్మషముల్బణమ్

వీరుండేది పర్వత అరణ్య ప్రాంతాలలో ఉంటారు. వీడు పుట్టి మహాభయంకరమైన వేనుని పాపాన్ని పోగొట్టాడు. (అందుకే ఆటవికులకు తల్లి తండ్రులంటే ప్రేమ ఎక్కువ. దానికి ఇదే కారణం. ఈ నిషాధుడు పుట్టి అంతవరకూ వేనుడు పాపం పోగొట్టాడు )

Popular Posts