Followers

Friday 7 February 2014

శ్రీమద్భాగవతం చతుర్థ స్కంధం నాలగవ అధ్యాయం


మైత్రేయ ఉవాచ
ఏతావదుక్త్వా విరరామ శఙ్కరః పత్న్యఙ్గనాశం హ్యుభయత్ర చిన్తయన్
సుహృద్దిదృక్షుః పరిశఙ్కితా భవాన్నిష్క్రామతీ నిర్విశతీ ద్విధాస సా

ఇంత చెప్పీ శంకరుడు ఆపాడు. ఆమె వెళ్ళకున్నా వెళ్ళినా అమె శరీర త్యాగం తప్పదని తెలుసుకుని ఊరుకున్నాడు. తనవారిని చూడటానికి వెళ్ళాలని ఉండి, శంకరుడు వద్దు అనడముతో డోలాయమానములో పడి, రెండు అడుగులు బయటకి రెండు అడుగులు లోపలికీ వేస్తూ, చివరికి "మావాళ్ళని చూడాలనే" సంకల్పం గెలిచింది

సుహృద్దిదృక్షాప్రతిఘాతదుర్మనాః స్నేహాద్రుదత్యశ్రుకలాతివిహ్వలా
భవం భవాన్యప్రతిపూరుషం రుషా ప్రధక్ష్యతీవైక్షత జాతవేపథుః

శంకరుడు వద్దన్నకు బాధపడింది. ఇద్దరి మీదా ప్రేమ కలదై, కళ్ళ వెంబడి నీరు కారుతూ తుదకు వెళ్ళాలని నిశ్చయించుకుంది. శత్రువులు లేని వాడైన శంకరున్ని భవాని కోపముతో కాల్చివేస్తున్నట్లుగా చూసింది. శరీరమంతా వణికిపోతున్నది. ఒక సారి నిట్టూర్చి "నేను వెళుతున్నాను" అని కలత చెందిన మనసుతో తల్లి తండ్రులవద్దకు వెళ్ళింది

తతో వినిఃశ్వస్య సతీ విహాయ తం శోకేన రోషేణ చ దూయతా హృదా
పిత్రోరగాత్స్త్రైణవిమూఢధీర్గృహాన్ప్రేమ్ణాత్మనో యోऽర్ధమదాత్సతాం ప్రియః

స్త్రీత్వం వలన పొందిన మూఢ బుద్ధి పుట్టినదై తండ్రి వద్దకు వెళ్ళింది. ఇంటిని వదిలిపెట్టి వారింటివద్దకు వెళ్ళింది. ఎలాంటి ఇంటిని వదిలిపెట్టింది? సజ్జనులకు శంకరుడు ప్రీతి పాత్రుడు. ఆమె మీద ప్రేమతో తన శరీరములో సగ భాగము ఇచ్చాడు. అయినా అలా పార్వతీ వెళ్ళగానే శంకరుడు కను సైగ చేసాడు తన పరివారాలకు

తామన్వగచ్ఛన్ద్రుతవిక్రమాం సతీమేకాం త్రినేత్రానుచరాః సహస్రశః
సపార్షదయక్షా మణిమన్మదాదయః పురోవృషేన్ద్రాస్తరసా గతవ్యథాః

అలా వేగముగా అడుగులు వేస్తూ వెళుతున్న సతీ దేవి వెంట వేలకొలదీ శంకరుని అనుచరులు వెళ్ళారు. యక్షులూ పార్శ్వదులూ ముందు నందికేశ్వరున్ని పెట్టుకుని బయలుదేరారు

తాం సారికాకన్దుకదర్పణామ్బుజ శ్వేతాతపత్రవ్యజనస్రగాదిభిః
గీతాయనైర్దున్దుభిశఙ్ఖవేణుభిర్వృషేన్ద్రమారోప్య విటఙ్కితా యయుః

ఆ నందికేశ్వరుని మీద ఆమెను వేంచేయమని తెల్లని గొడుగూ చామరలూ పుష్పమాలల్తో గీతాలతో మంగళ వాద్యాలతో ఆమెను ఊరేగింపుతో వెళ్ళారు. వెంట వెళ్ళే వారు కూడా అలంకరించుకునే వెళ్ళారు.

ఆబ్రహ్మఘోషోర్జితయజ్ఞవైశసం విప్రర్షిజుష్టం విబుధైశ్చ సర్వశః
మృద్దార్వయఃకాఞ్చనదర్భచర్మభిర్నిసృష్టభాణ్డం యజనం సమావిశత్

అలా బయలుదేరిన సతీ దేవి యజ్ఞ్య శాలకు చేరింది. వేద ఘోష అంతటా ప్రతిధ్వనిస్తోంది. యజ్ఞ్యములో ఉన్న పూజా విధానముతో బ్రాహ్మణులూ దేవతలతో కూడి. మృద్దార్వయఃకాఞ్చన దర్భచర్మ-
యజ్ఞ్యములో మట్టివి చక్కవీ ఉక్కువీ బంగారమువీ దర్భలతో చేసినవీ చర్మములతో చేసినవీ అయిన పాత్రల దగ్గరకు వీరు ప్రవేశించారు

తామాగతాం తత్ర న కశ్చనాద్రియద్విమానితాం యజ్ఞకృతో భయాజ్జనః
ఋతే స్వసౄర్వై జననీం చ సాదరాః ప్రేమాశ్రుకణ్ఠ్యః పరిషస్వజుర్ముదా

అలా వచ్చిన సతీ దేవిని అక్కడివారెవ్వరూ కన్నెత్తి కూడా చూడలేదు. ఆదరించలేదు. యజమాని (దక్షుడు) వలన భయముతో సతీ దేవిని పలకరించలేదు. చెళ్ళెల్లూ తల్లీ, ప్రేమతో కన్నీటితో ఎదుర్కొని ఆమెను ఆలింగనం చేసుకున్నారు

సౌదర్యసమ్ప్రశ్నసమర్థవార్తయా మాత్రా చ మాతృష్వసృభిశ్చ సాదరమ్
దత్తాం సపర్యాం వరమాసనం చ సా నాదత్త పిత్రాప్రతినన్దితా సతీ

వారు చేసిన ఆదరాన్ని గానీ, వారు ఇచ్చిన ఆసనాన్ని గానీ ఆమె స్వీకరించలేదు. తండ్రి అభినందించలేదని మిగతా వారు ఇచ్చిన ఆసనాన్ని స్వీకరించలేదు.

అరుద్రభాగం తమవేక్ష్య చాధ్వరం పిత్రా చ దేవే కృతహేలనం విభౌ
అనాదృతా యజ్ఞసదస్యధీశ్వరీ చుకోప లోకానివ ధక్ష్యతీ రుషా

తన భర్తకు భాగము లేకుండా జరుగుతున్న యజ్ఞ్యాన్ని చూచింది. తన తండ్రి దైవాన్ని అవమానించాడన్ని చూచి, జగన్మాత అయిన తల్లి లోకాలన్నీ దహించేట్లు కోపించింది,

జగర్హ సామర్షవిపన్నయా గిరా శివద్విషం ధూమపథశ్రమస్మయమ్
స్వతేజసా భూతగణాన్సముత్థితాన్నిగృహ్య దేవీ జగతోऽభిశృణ్వతః

కాస్త అసహ్యముతో కాస్త కోపముతో కూడి తండ్రిని నిందించడం మొదలుపెట్టింది. శివున్ని ద్వేషిస్తున్నందుకు నిందించింది. అసలు కారణం: ధూమపథశ్రమస్మయమ్. ధూమ మార్గములో వెళ్ళడానికి (నరకానికి వెళ్ళే పనులు) కావలసిన పనులు చేస్తూ శ్రమపడుతూ గర్వించిన వాడు. అజ్ఞ్యానముతో ధూమమార్గములో వెళ్ళే పనులు అంటే - నల్ల దారి- నరకానికి వెళ్ళే దారి. "నేను చేస్తున్నాను" అనే భావన ఉన్న వాడు. దీన్నే ధూఒమ మార్గం (నల్ల దారి లేదా పొగ దారి). మాటి మాటికీ పుట్టాడానికి కావలసిన కర్మలు చేస్తూ గర్వించే తండ్రిని చూచి ఇలా అంది.

యజ్ఞ్యములో కూడా హోమ ధూమం వస్తుంది. అలా ప్రపంచమంతా వ్యాపించే హోమ ధూమం చూచి "నేను చేసిన పనులు అనంతములు " అని గర్విస్తున్నా ఆ హోమములు తనకి పొగ మార్గాన్నే ఇస్తాయి.

ఎప్పుడైతే యజ్ఞ్య భాగములో శివునికి భాగము లేదో అది చూసి కోపించింది. అమ్మవారి కోపాన్ని ప్రమధగణం చూసారు. ఆయుధాలు తీసుకుని ఉరకలు వేసారు. అప్పుడు తల్లి తన తేజస్సుతో వారిని ఆపింది, నిగ్రహించింది. అక్కడ ఉన్న వారందరూ వింటూ ఉండగా తన తండ్రిని నిందిస్తూ ఇలా మాట్లాడింది

దేవ్యువాచ
న యస్య లోకేऽస్త్యతిశాయనః ప్రియస్తథాప్రియో దేహభృతాం ప్రియాత్మనః
తస్మిన్సమస్తాత్మని ముక్తవైరకే ఋతే భవన్తం కతమః ప్రతీపయేత్

శనర్కున్ని సతీ దేవి "ప్రియాత్మనా" అంది. అందరికీ ఆత్మ శ్రీమన్నారాయణుడు. ఆయనకు అత్యంత ప్రీతి పాత్రుడైన స్వామి శనక్రుడు. అలాంటి మహానుభావుడిని మించిన వారు ఈ లోకములో లేరు. అతనికి ప్రీతి పాత్రులూ లేరు, శత్రువులూ లేరు. అందరినీ సమానముగా చూసేవాడు. సకల లోకములో సకల జీవులకూ ఆత్మ అయిన వాడు. సకల జీవులనీ తన ఆత్మగా భావించేవాడు. తనలోనే అందరూ ఉన్నారు. తాను అందరిలో ఉన్నాడు. వైరాన్ని పూర్తిగా విడిచిపెట్టిన ఆయన విషయములో ఒక్క నువ్వు తప్ప ఎవరు ద్వేషించేది? ఎవరూ ద్వేషించరు.

దోషాన్పరేషాం హి గుణేషు సాధవో గృహ్ణన్తి కేచిన్న భవాదృశో ద్విజ
గుణాంశ్చ ఫల్గూన్బహులీకరిష్ణవో మహత్తమాస్తేష్వవిదద్భవానఘమ్

లోకములో రెండు రకాల స్వభావాలు గల మనుషులు ఉంటారు. మంచి వారి గుణాలలో దోషాలు చూసేవారు. వీరు నీలాంటి వారు. చేదువారి దోషాలలో గుణాలు చూసేవారు కొందరు. వారు మహానుభావులు. నీలాంటి వారు తప్ప శంకరుని విషయములో దోషాన్ని ఎవరూ చూడరు. చిన్న దాన్ని పెద్దదిగ చూస్తారు. ఒకరు తప్పును చూస్తారు. ఇంకొకరు (మంచిని) మంచిని చూస్తారు. నీలాంటి వారు మంచివారిలో మంచిని కూడా చెడుగా చూస్తారు.

కొద్దిగా మంచి గుణము ఉన్నా అది పెద్దగా చెప్తారు ఉత్తములు. అలాంటి వారి విషయములో అపచారం చేస్తున్నావు.

నాశ్చర్యమేతద్యదసత్సు సర్వదా మహద్వినిన్దా కుణపాత్మవాదిషు
సేర్ష్యం మహాపూరుషపాదపాంసుభిర్నిరస్తతేజఃసు తదేవ శోభనమ్

ఇది వింతేమీ కాదు. శంకరుని వంటి మహానుభావుల విషయములో అపచారం చేయడం ఆశ్చర్యం కలిగించదు. శరీరాన్ని (కుణ - పురుగు, కుణపం - క్రిముల చేత పానం చేయబడేది, శరీరం) ఆత్మ అనుకునే వారు మహానుభావులను నిందించడం ఆశ్చర్యం కాదు, సహజమే. దేహాత్మాభిమానం పోకుండా ఎంత పెద్ద యజ్ఞ్య్నం చేస్తే ఏమి లాభం.
ఒక విధముగా మీవంటి వారు అలాంటి వారిని నిందించడమే మంచిది. అదే మీకు క్షేమం. ఎందుకంటే పెద్దలని ఆదరిస్తూ ఉంటే మీలాంటి వారికి బలమూ తేజస్సు శక్తీ పెరుగుతుంది. అవి పెరగడం వలన మీరు లోకాన్ని పీడిస్తూ ఉంటారు. మీరు నిందించడం వలన అలాంటి మహాత్ముల పాదపరాగం మీ తేజస్సుని హరిస్తుంది. కొత్త శక్తి కలిగి పదిమందిని పీడించడం కన్నా, ఉన్న శక్తి పోవడమే మంచిది. మీరు మరిన్ని దుష్ట కార్యములు చేయకుండా చేస్తుంది. అది మీకు మేలే. లోకాన్ని పీడింపచేసే శక్తి పెంచేదానికంటే , శక్తిని తగ్గించే ఇలాంటి పని చేయడమే మంచిది.

ఇలాంటి మహానుభావుల పాదపరాగముతో తొలగించబడిన తేజస్సు కలిగిన మీకు ఇదే శోభనం కలిగిస్తుంది

యద్ద్వ్యక్షరం నామ గిరేరితం నృణాం సకృత్ప్రసఙ్గాదఘమాశు హన్తి తత్
పవిత్రకీర్తిం తమలఙ్ఘ్యశాసనం భవానహో ద్వేష్టి శివం శివేతరః

నీవు చేసే పని గురించి ఎపుడైనా ఆలోచించావా? అనాలోచితముగా ఏ రెండు అక్షరాలు పలికితే సకల ప్రాణుల పాపం పోతుందో, అటువంటి పవిత్ర కీర్తి గలవాడు, ధిక్కరింపరాని ఆజ్ఞ్య కలవాడు, శివ అనే రెండక్షరాల మంగళ కరమైన నామం కలవాడిని నీవంటి అమంగళ కరుడు తప్ప ఎవరు ద్వేషించేది. 

యత్పాదపద్మం మహతాం మనోऽలిభిర్నిషేవితం బ్రహ్మరసాసవార్థిభిః
లోకస్య యద్వర్షతి చాశిషోऽర్థినస్తస్మై భవాన్ద్రుహ్యతి విశ్వబన్ధవే

బ్రహ్మరసాసవార్థిభిః - బ్రహ్మానందం అనే అమృతాన్ని కోరేవారు, ఏ మాహనుభావుని పాదపద్మాలను మనసనే తుమ్మెదలచేత సేవిస్తారో, కోరే ప్రతీ వారి కోరికను తీర్చే మహానుభావుడు, జగత్తుకు బంధువైన వాడు. అయానకు నీవు యజ్ఞ్యములో భాగం ఇవ్వలేదు. ఆయన శ్మశానములో ఉంటాడూ, అమంగళుడూ అన్నావు. మరి ఈ విషయం లోకములో ఎవ్వరికీ తెలియదే? బ్రహ్మాదులకు కూడా ఈ విషయం తెలియనట్లుంది

కిం వా శివాఖ్యమశివం న విదుస్త్వదన్యే బ్రహ్మాదయస్తమవకీర్య జటాః శ్మశానే
తన్మాల్యభస్మనృకపాల్యవసత్పిశాచైర్యే మూర్ధభిర్దధతి తచ్చరణావసృష్టమ్

శంకరుడు నృత్యం చేస్తూ జటలను దులిపితే రాలిన భస్మాన్ని బ్రహ్మాదులూ, ఋషులు వారి శిరస్సున ధరిస్తారు. ఆయన పాదముల నుండి రాలిన భస్మ రేణువులను ఇంద్రాదులు తమ శిరస్సున ధరిస్తారు.

కర్ణౌ పిధాయ నిరయాద్యదకల్ప ఈశే ధర్మావితర్యసృణిభిర్నృభిరస్యమానే
ఛిన్ద్యాత్ప్రసహ్య రుశతీమసతీం ప్రభుశ్చేజ్జిహ్వామసూనపి తతో విసృజేత్స ధర్మః

ధర్మాన్ని కానీ, ధర్మాధికారిని గానీ (పరమాత్మని) నిందిస్తే, వారిని వారించలేకపోతే చేత గాకుంటే చెవులు మూసుకుని అక్కడినుంచి వెళ్ళిపోవాలి. ధర్మం కాపాడే వారి మహానుభావుల విషయములో దోషాన్ని ఆపాదిస్తుంటే సమర్ధుడు కాని వాడు చెవులు మూసుకుని వెళ్ళిపోవాలి. సమర్ధుడైతే అలా పలుకుతున్న నాలుకను కోసిపారేయాలి. ఈ రెండూ చేయకుంటే ప్రాణత్యాగం చేయాలి. భగవన్నిందని సహించకూడదు. అధర్మాత్ములూ పాపులూ భగవన్నింద చేస్తుంటే వారించాలి, లేకపోతే అక్కడినుండి వెళ్ళిపోవాలి, లేకుంటే వారి నాలుకను కోసేయ్యాలి, లేకుంటే ప్రాణమే వదిలిపెట్టాలి

అతస్తవోత్పన్నమిదం కలేవరం న ధారయిష్యే శితికణ్ఠగర్హిణః
జగ్ధస్య మోహాద్ధి విశుద్ధిమన్ధసో జుగుప్సితస్యోద్ధరణం ప్రచక్షతే

శంకరున్ని నిందిస్తున్న నీనుండి పుట్టిన ఈ శరీరాన్ని నేను నిలుపుకోను. తెలియక కలుషితమైన ఆహారం తీసుకుంటే దాన్ని వాంతి చేయడం మినహా వేరే దారి లేనట్లుగా పనికిరాని నీ నుండి కలిగిన ఈ శరీరాన్ని నేను విడిచిపెడుతున్నాను. మంచి ఆహారం తీసుకోనప్పుడు దాన్ని బయటక్ పంపించివేయడమే దానికి శుద్ధి.

న వేదవాదాననువర్తతే మతిః స్వ ఏవ లోకే రమతో మహామునేః
యథా గతిర్దేవమనుష్యయోః పృథక్స్వ ఏవ ధర్మే న పరం క్షిపేత్స్థితః

వేదవాదాలన్నీ శరీరాత్మాభిమానన్ని పెంచేవి. పరమాత్మ వేదవాదాలని అనుసరించడు, మనని కూడా అనుసరించవద్దని చెబుతాడు. ఫాలాకంక్ష కోరని వారు వేదవాదాలని అనుసరించరు. అలాంటి వారికి ఫలాన్నిచ్చేది శంకరుడు. ఆయన మహాముని, తనలోకములో తాను ఉంటాడు. నిరంతరం ఆత్మారాముడై, శ్రీమన్నారాయణున్ని ధ్యానిస్తూ ఉంటాడు. పరమాత్మ యందు మనసు లంగం చేసిన వారు లౌకికమైనవాటిని గానీ వైదికమైనవాటిని గానీ అనుసరించరు.
దేవలోకం వారికి వారిలోకమే గొప్ప, భూవాదులకి  భూలోకమే గొప్ప. దేవలోకం మనుష్యలోకం ఎలా వేరో. పరమాత్మ లోకం కూడా వేరు. ఎవరి ధర్మాన్ని వారు ఆచరిస్తూ ఉన్నప్పుడు, ఉత్తముడైన వాడు ఎదుటివాడిని నిందించకూడదు.

కర్మ ప్రవృత్తం చ నివృత్తమప్యృతం వేదే వివిచ్యోభయలిఙ్గమాశ్రితమ్
విరోధి తద్యౌగపదైకకర్తరి ద్వయం తథా బ్రహ్మణి కర్మ నర్చ్ఛతి

లోకములో కర్మను రెండు భాగాలుగా చెప్పారు. ప్రవృత్తీ అని (ఫలమును కోరే కర్మ) నివృత్తీ అని (ఫలమును కోరని కర్మ). వేదములో ఈ రెండూ వివరించారు. కానీ, పరమాత్మ యందు ఈ రెండు కర్మలు పని చేయవు. ఎందుకంటే ఆయన రెంటినీ చూడదు.

మా వః పదవ్యః పితరస్మదాస్థితా యా యజ్ఞశాలాసు న ధూమవర్త్మభిః
తదన్నతృప్తైరసుభృద్భిరీడితా అవ్యక్తలిఙ్గా అవధూతసేవితాః

మాకు మీరు చేస్తున్న పనుల వలన పొందే పదవులూ లోకాలూ వద్దు. వాటితో మాకు పని లేదు. మీరాచరించే యజ్ఞ్య దాన తపః కర్మలతో కలిగే అష్ట సిద్ధులూ వద్దు. పొరబాటున వాటి మీద మనసు లగ్నమైతే మనసు ఇంక బయటకు రాదు. ఈ యజ్ఞ్యాలన్నీ నల్లదారికి పంపించేవే. ,యజ్ఞ్యములన్నీ కోరికలను పెంచేవే ఐతే మరి అందరూ యజ్ఞ్యాన్ని ఎందుకు స్తోత్రం చేస్తున్నారు. ఆ యజ్ఞ్యానికి వచ్చేవారు, ఆ యజ్ఞ్య యజమానులు పెట్టే అన్నముతో తృప్తి పడి ప్రాణాలను పోషించుకునే వారు. అలాంటి యజ్ఞ్యాలు ఇచ్చే పొగదారి (ధూమ మార్గం) మాకు వద్దు. కామ్య కర్మలు ఇలాంటి ఫలితాన్నే ఇస్తాయి. ఆ యజ్ఞ్యములో యజమాని పెట్టే అన్నముతో పోషింపబడుతూ ఆ యజ్ఞ్యాలను పొగుడుతారు.
శంకరున్ని చూసి గుర్తుపట్టడానికి ఒక లింగం అంటూ ఉండదు. అందరిచేతా సేవించబడే అవధూతలచే సేవించబడే వారు శంకరుడు. అలాంటి శంకరునికీ, ఆయన భార్య అయిన నాకు ఈ యజ్ఞ్యాలు వద్దు

నైతేన దేహేన హరే కృతాగసో దేహోద్భవేనాలమలం కుజన్మనా
వ్రీడా మమాభూత్కుజనప్రసఙ్గతస్తజ్జన్మ ధిగ్యో మహతామవద్యకృత్

శనక్రునికి అపకారం చేసిన నీ వలన వచ్చిన ఈ శరీరం నాకు వద్దు. ఇలాంటి పాపపు దేహం, పాపపు జన్మా నాకు వద్దు. మంచివారందరూ కూర్చుని మాట్లాడుకుంటున్నపుడు వారి మాటల మధ్యలో ఒక దుర్మార్గుని పేరు వస్తే వారు ఎంత బాధపడతారు. ఎలాంటి వారి పేరు ఉచ్చరించడానికి మహాత్ములు శంకిస్తారో అలాంటి వారి వలన వచ్చిన పుట్టుక మాకొద్దు. పెద్దలకపచారం చేసేవారి వలన వచ్చిన పుట్టుక మాకు సిగ్గును కలిగిస్తుంది.

గోత్రం త్వదీయం భగవాన్వృషధ్వజో దాక్షాయణీత్యాహ యదా సుదుర్మనాః
వ్యపేతనర్మస్మితమాశు తదాహం వ్యుత్స్రక్ష్య ఏతత్కుణపం త్వదఙ్గజమ్

శంకరుడు నా మీద ప్రేమతో అప్పుడప్పుడు దాక్షాయనీ అని పిలిచేవాడు. అప్పుడు నేను కూడా సంతోషించాను. కానీ ఇప్పుడు ఆయన పరిహాసముతో నన్ను దాక్షాయనీ అంటే నా గతి ఏమిటి? ఇలా మాటి మాటికీ శూలలతో పొడిచే నీ పేరుతో నన్ను పిలిస్తే ఆ మాట విన్న నేను దుఃఖముతో వణికిపోతాను. ఇంతవరకూ ఆ పేరుతో పిలిస్తే హాస్యం ఉండేది. ఇప్పుడు ఆ పరిహాసం గానీ, నర్మం కానీ తొలగిపోతుంది. పురుగులు పీల్చి పిప్పిచేసే నీ వలన పుట్టిన శరీరాన్ని ఇక్కడే విడిచిపెడతాను. (రక రకాల పురుగులు మన శరీరములో రక్త మాంసాలను పానము చేస్తాయి. )

మైత్రేయ ఉవాచ
ఇత్యధ్వరే దక్షమనూద్య శత్రుహన్క్షితావుదీచీం నిషసాద శాన్తవాక్
స్పృష్ట్వా జలం పీతదుకూలసంవృతా నిమీల్య దృగ్యోగపథం సమావిశత్

ఇలా యజ్ఞ్యములో దక్షుని తప్పులు తెలియజేసి, ఉత్తర దిక్కుగా భూమి మీద శాంతముగా కూర్చుంది. యోగానికి మూలం మౌనం. యోగానికి శ్వాసను గెలుచుట ముఖ్యం. నాసికలో సూర్య మార్గం చంద్ర మార్గం అని రెండు ఉంటాయి. శ్వాస కూడా 24 సార్లు సూర్య మార్గము ద్వారా, 24 సార్లు చంద్ర మార్గము ద్వారా వెళుతూ వస్తూ ఉంటుంది.  దాన్ని అదుపులో ఉంచాలి. అంటే అనుకున్నప్పుడు అనుకున్న మార్గము నుండి శ్వాసను రప్పించగలగాలి. అది జిత శ్వాస. శ్వాసను నియంత్రించుకోవాలి. ఆ శ్వాస నియంత్రణమే ప్రాణాయామం. అది చేయడానికి మొదలు వాక్కు నియంత్రణ ఉండాలి. అందుకు సతీ దేవి వాక్కును నియమించుకుని, ఆచమనం చేసి, పీతాంబరధారిణి అయిన అమ్మవారు కనులు మూసుకుని యోగమార్గములో ప్రవేశించింది

కృత్వా సమానావనిలౌ జితాసనా సోదానముత్థాప్య చ నాభిచక్రతః
శనైర్హృది స్థాప్య ధియోరసి స్థితం కణ్ఠాద్భ్రువోర్మధ్యమనిన్దితానయత్

ప్రాణమునూ అపానమునూ, రెంటినీ సమానం చేసి (ఒకే చోటిలో చేర్చి), ప్రాణ అపానములతో ఉదాన వాయువును కలిపింది, నాభి నుండి ఆ వాయువును హృదయములోకి తెచ్చి, అక్కడి నుండీ వక్షస్థలం వరకూ తీసుకు వచ్చి, అక్కడి నుంచీ కంఠం వరకూ తీసుకు వచ్చి, అక్కడి నుంచీ కనుబొమ్మల వద్దకు తీసుకు వచ్చి బ్రహ్మకపాలం (సహస్రారం) వద్దకు తీసుకు వచ్చి

ఏవం స్వదేహం మహతాం మహీయసా ముహుః సమారోపితమఙ్కమాదరాత్
జిహాసతీ దక్షరుషా మనస్వినీ దధార గాత్రేష్వనిలాగ్నిధారణామ్

శరీరాన్ని విడిచిపెట్టబోయే ముందు ఆ శరీరం సుకృతం ఆచరించామా, దుష్కృతం ఆచరించామా 
సాక్షాత్ లోకశంకరుడైన శంకరుడు ఈ శరీరాన్నే ఎన్నో సార్లు ఒడిలో కూర్చోపెట్టుకున్నాడు. ఆ శరీరాన్ని, అభిమానం గలది అయి, దక్షుని మీద కోపముతో, మహాత్ముల నింద జరిగితే ఊరుకోలేక, ధర్మము యందు ఆగ్రహం కలిగి (మనస్వినీ - సత్యాగ్రహం లాగ ధర్మాగ్రహం), నాభీ హృదయం వక్షస్థలం కంఠం భ్రూ మధ్యం బ్రహ్మకపాలానికి ప్రసరింపచేసిన వాయువుకు (జఠరాగ్నిలో ఉన్న) అగ్నిని తోడు చేసింది. దీన్నే వాయ్వగ్ని ధారణ. వాయువుతో కలిపి అగ్నిని కూడా నిలపగలగడం అత్యుత్తమ యోగమని పతంజలి చెబుతాడు. ఈ వాయ్వగ్ని ధారణం శరీరములో ఉన్న, మనసులో ఉన్నా, సకల కల్మషాలనూ పోగొట్టడానికి పనికొస్తుంది. శరీరమే వద్దనుకుంటే శరీరాన్నే దహింపచేస్తుంది. 

తతః స్వభర్తుశ్చరణామ్బుజాసవం జగద్గురోశ్చిన్తయతీ న చాపరమ్
దదర్శ దేహో హతకల్మషః సతీ సద్యః ప్రజజ్వాల సమాధిజాగ్నినా

"నేను కాలిపోతున్నానా" అనే భావన లేక తన భర్త యొక్క పాదపద్మ మకరందాన్నే ధ్యానము చేసింది. దేన్నీ మనసులోకి రానియ్యలేదు. భర్త చరణాలను ధ్యానం చేయుటచే శరీరములో ఉన్న అన్ని పాపాలు పోవడం చూడగలిగింది. యోగమార్గములో బ్రహ్మకపాలము ద్వారా ఆత్మను పంపించే వారు రెండు తీరులుగా సంకల్పించుకోవచ్చు. మోక్షానికీ వెళ్ళొచ్చు, ఇంకా ఏదైనా శరీరములోకి వెళ్ళాలనుకున్నా వెళ్ళొచ్చు. ఈ రెండవ కోవకు చెందినవాటిలోనే పరకాయ ప్రవేశము కూడా. 
వెంటనే సమాధిలో పుట్టిన అగ్నిలో కాలిపోయింది

తత్పశ్యతాం ఖే భువి చాద్భుతం మహధా హేతి వాదః సుమహానజాయత
హన్త ప్రియా దైవతమస్య దేవీ జహావసూన్కేన సతీ ప్రకోపితా

అన్ని లోకాలవారు ఆ దృశ్యాన్ని చూచి హాహాకారాలు చేసారు. సాక్షాత్ పరదైవమైన శంకరుని ప్రియురాలిగా ఉండి దక్ష్ప్రజాపతి వలన కోపించబడి ప్రాణము వదిలిపెట్టింది

అహో అనాత్మ్యం మహదస్య పశ్యత ప్రజాపతేర్యస్య చరాచరం ప్రజాః
జహావసూన్యద్విమతాత్మజా సతీ మనస్వినీ మానమభీక్ష్ణమర్హతి

ఈ దుర్మార్గుడు(దక్షునికి) శరీరమునకూ ఆత్మకూ కూడా అందని ఈ పని చూడండి. ప్రపంచములో ఉన్న ప్రతీ ప్రాణీ ఈయన సంతానమే. ఎందుకంటే ఈయన ప్రజాపతి. ప్రపంచములో ఏ ప్రాణి బాధపడ్డా తొలగించవలసిన కర్తవ్యం ఈయనది. సకల లోకాల ప్రజలను కాపాడే ధర్మం ఈయనది. తండ్రిగా కాకపోయినా, కనీసం ప్రజాపతిగా కర్తవ్యం నిర్వర్తించలేదు. తండ్రి ధర్మాన్నీ, ప్రజాపతి ధర్మాన్నీ, రెంటినీ మరచిపోయాడు. ఏ సంబంధంలేని వారిని కూడా కాపాడవలసిన వాడు, అభిమానవంతురాలు (మనస్వినీ) అయిన కూతురిని మన్నన చేయకుండా కాపాడలేకపోయాడు.

సోऽయం దుర్మర్షహృదయో బ్రహ్మధ్రుక్చ లోకేऽపకీర్తిం మహతీమవాప్స్యతి
యదఙ్గజాం స్వాం పురుషద్విడుద్యతాం న ప్రత్యషేధన్మృతయేऽపరాధతః

ఇదే అనాత్మ్యం (పరమ కౄరమైనది). ఆమె గానీ ఆమె భర్తగానీ ఏ తప్పు చేయకున్నా అమర్షముతో అసహనముతో దేహాత్మాభిమానం గలవాడై అసహనాన్ని మనసులో పెట్టుకుని బ్రహ్మ ధృక్ అయిన శివునికి ద్రోహం చేసాడు. ఇతను తప్పకుండా గొప్ప అపకీర్తిని పొందుతాడు. ఎందుకంటే తన శరీరమునుంచి పుట్టిన తన పుత్రికనూ, పురుషుడినీ (పరమపురుషుడినీ) ద్వేషించి, తాను చేసిన తప్పును చూచి శరీరం విడిచిపెట్టాలనుకున్న కూతురును భర్తమీది కోపముతో వారించలేదు. ఇతను గొప్ప అపకీర్తిపాలవుతాడు

వదత్యేవం జనే సత్యా దృష్ట్వాసుత్యాగమద్భుతమ్
దక్షం తత్పార్షదా హన్తుముదతిష్ఠన్నుదాయుధాః

సతీ దేవి ఇలా చేయడాన్ని చూచి, అప్పటిదాకా ఊరుకుని ఉన్న ఆమె సైన్యం దక్షుని చంపడానికి ముందుకు వచ్చారు. యజ్ఞ్యములకు అడ్డువచ్చేవారిని తొలగించడానికి మంత్రాలు కొన్ని ఉంటాయి. అవి చదవడముతో అవి అన్నీ తొలగిపోతాయి. అలాంటి మంత్రాలు చదివి బృగువు రక్షపెట్టాడు. 

తేషామాపతతాం వేగం నిశామ్య భగవాన్భృగుః
యజ్ఞఘ్నఘ్నేన యజుషా దక్షిణాగ్నౌ జుహావ హ

దక్షిణాగ్నులతో హోమము చేసాడు అద్వర్యువైన బృగువు.ఆ యగ్న కుండాలలోంచి 

అధ్వర్యుణా హూయమానే దేవా ఉత్పేతురోజసా
ఋభవో నామ తపసా సోమం ప్రాప్తాః సహస్రశః

ఋభవులనే దేవతలు వేలకొద్దీ లేచారు. దివిటీలు ఆయుధముగా పట్టుకుని లేచారు. 

తైరలాతాయుధైః సర్వే ప్రమథాః సహగుహ్యకాః
హన్యమానా దిశో భేజురుశద్భిర్బ్రహ్మతేజసా

వారు ఆయుధాలతో కొడుతూ ఉంటే తట్టుకోలేక పారిపోయారు. తాత్కాలికముగా యజ్ఞ్యాన్ని బృగువు రక్షించాడు

Popular Posts