Followers

Wednesday 5 February 2014

శ్రీమద్భాగవతం తృతీయ స్కంధం పదకొండవ అధ్యాయం

మైత్రేయ ఉవాచ
చరమః సద్విశేషాణామనేకోऽసంయుతః సదా
పరమాణుః స విజ్ఞేయో నృణామైక్యభ్రమో యతః

కాలము దేనితోనూ కలిసి ఉండదు. కాలము ఒకటే అయినా కాలము వలన కలిగే పదార్థాలు అనేకం. కాల ప్రభావం పడని వరకు ఏమీ కలసి ఉండవు (అసమ్యుతః).  కాలము తనలో అన్నింటినీ కలుపుకుంటుంది గానీ, తను దేనిలోనూ కలవదు. కాలము అన్నింటిలోనూ మార్పు తెస్తుంది గానీ. ఏ సంఘటనలోనూ కాలము మార్పు చెందదు. దీనికే పరమాణువు అని పేరు. ఇది అనేకము. ఏ రెండూ కలియవు. ఏ రెండు పరమాణువులూ కలవవు, కలిసినట్లు కనపడతాయి. అన్నింటిలోనూ చివరది పరమాణువు. అంతకంటే విభజించలేము. ఈ పరమాణువును గుర్తించనందు వలనే మనము క్షణాంకీ, అరక్షణానికీ తేడా తెలుసుకోలేము. ఈ సూక్ష్మ భేధాన్ని గుర్తించలేని మనం, ఇదంతా ఒకటే అనుకుంటాము.

సత ఏవ పదార్థస్య స్వరూపావస్థితస్య యత్
కైవల్యం పరమమహానవిశేషో నిరన్తరః

ఈ పరమాణువును గుర్తించడం అంటే ఒకటే గుర్తు - ఎలాంటి మార్పు లేక స్వచ్చమైన పదార్థం ఏదైతే ఉందో అదే పరమ మహాన్. అందులో ఏదీ కలవదు, అది అన్నింటిలో కలుస్తుంది. అది కలిసినందువలన అన్నింటిలోనూ మార్పు వస్తుంది.

ఏవం కాలోऽప్యనుమితః సౌక్ష్మ్యే స్థౌల్యే చ సత్తమ
సంస్థానభుక్త్యా భగవానవ్యక్తో వ్యక్తభుగ్విభుః

ఇది కాలము. ఈ కాలం యొక్క సూక్ష్మావస్థ పరమాణువు. స్థూలావస్థ పరమ మహాన్. కాలము యొక్క అవయవానుభవముతో మనం కాలాన్ని గుర్తిస్తున్నాము. మన జీవితములో అవసరాలను అనుభవించడములో కాలముని మనం గుర్తిస్తున్నాము. కాల స్వరూపములో అవయవాలను అనుభవిస్తూ (సంస్థానభుక్త్యా ) మనం దానికి భేధాలను ఆపాదిస్తాము గానీ, కాలము ఎన్నడూ మరదు. ఇతను అవ్యక్తుడు, ఎవరికీ తెలియడు.  అయినా సరే వ్యక్తమైన వాటన్నిటినీ తనలో ఇముడ్చుకుంటాడు.

స కాలః పరమాణుర్వై యో భుఙ్క్తే పరమాణుతామ్
సతోऽవిశేషభుగ్యస్తు స కాలః పరమో మహాన్

దాన్ని కాలమంటారు. ఈ కాలము మొదలు పరమాణుత్వాన్ని పొందుతుంది. ఇదే పరమ మహాన్ అవుతుంది.

అణుర్ద్వౌ పరమాణూ స్యాత్త్రసరేణుస్త్రయః స్మృతః
జాలార్కరశ్మ్యవగతః ఖమేవానుపతన్నగాత్

రెండు అణువులు కలిస్తే పరమాణువు. మూడు పరమాణువులు త్రస రేన్ణువు. త్రస రేణువును కొంచెం గుర్తించగలము. పొద్దున్న గనీ సాయంకాలం గనీ వచ్చే సూర్య కిరణములలో కనపడేవి త్రస రేణువులు

త్రసరేణుత్రికం భుఙ్క్తే యః కాలః స త్రుటిః స్మృతః
శతభాగస్తు వేధః స్యాత్తైస్త్రిభిస్తు లవః స్మృతః

మూడు త్రస రేణువులు ఒక తృటి. మూడు తృటులు వేధ. మూడు వేధములను లవమూ అంటాము.

నిమేషస్త్రిలవో జ్ఞేయ ఆమ్నాతస్తే త్రయః క్షణః
క్షణాన్పఞ్చ విదుః కాష్ఠాం లఘు తా దశ పఞ్చ చ

మూడు లవములను నిమేషం అంటాము. మూడు నిమేషణములను క్షణమంటాము. ఐదు క్షణములు కాష్ఠం. పదిహేను కాష్ఠములు లఘు.

లఘూని వై సమామ్నాతా దశ పఞ్చ చ నాడికా
తే ద్వే ముహూర్తః ప్రహరః షడ్యామః సప్త వా నృణామ్

పదిహేను లఘువులు నాడిక అని, రెండు నాడికలను ఒక ముహూర్తమని, ఆరు ముహూర్తములను ఒక ఝాము. ఏడు ఝాములు ఒక యామము.

ద్వాదశార్ధపలోన్మానం చతుర్భిశ్చతురఙ్గులైః
స్వర్ణమాషైః కృతచ్ఛిద్రం యావత్ప్రస్థజలప్లుతమ్
యామాశ్చత్వారశ్చత్వారో మర్త్యానామహనీ ఉభే
పక్షః పఞ్చదశాహాని శుక్లః కృష్ణశ్చ మానద

ఇలాంటి కాలమును గుర్తుపట్టడానికి పన్నెండున్నర పలములు ఉన్న పాత్రను తీసుకుని నాలుగు అంగుళములున్న సమానమైన నాలుగు భాగం ఏర్పాటు చేసి , మాసమెత్తు బంగారం శీకులోని కొసభాగముతో రంధ్రం చేసి, అందులో నీరు గానీ ఇసుక గానీ వేస్తే, అది పైన కడితే, అందులోంచి ఇసుక జారి పడుతుంటే, ఆ మొత్తం ఐపోయే దానికి యామము అంటారు. ఝామును కొలవడానికి ఇది పద్దతి. ఝాము అంటే ఏడున్నర ఘడియలు. (లేదా మూడున్నర ఘంటలు)
నాలుగు ఝాములు ఒక పూట. అవి రెండు అయితే ఒక రోజు. పదిహేను రోజులను పక్షమంటారు. ఇవి రెండు పక్షములు

తయోః సముచ్చయో మాసః పితౄణాం తదహర్నిశమ్
ద్వౌ తావృతుః షడయనం దక్షిణం చోత్తరం దివి
అయనే చాహనీ ప్రాహుర్వత్సరో ద్వాదశ స్మృతః
సంవత్సరశతం న్ణాం పరమాయుర్నిరూపితమ్

రెండు పక్షములు ఒక మాసము. మాసములు రెండు కలిస్తే ఒక ఋతువు , మూడు ఋతువులు ఒక అయనం, రెండు అయనములు ఒక సంవత్సరం. ఒక నెల పితృదేవతలకు ఒక రోజు. మానవులకు నూరు సంవత్సరములు పరమాయువు.

గ్రహర్క్షతారాచక్రస్థః పరమాణ్వాదినా జగత్
సంవత్సరావసానేన పర్యేత్యనిమిషో విభుః

ఈ కాలమే అనిమిషుడైన పరమాత్మ. సంవత్సరం కాగానే ఈ కాలం మళ్ళీ మొదటి నుంచీ తిరుగుతూనే ఉంటుంది.

సంవత్సరః పరివత్సర ఇడావత్సర ఏవ చ
అనువత్సరో వత్సరశ్చ విదురైవం ప్రభాష్యతే

సంవత్సరాన్ని ఐదు రకాలుగా చెబుతారు.సంవత్సరః పరివత్సర ఇడావత్సర అనువత్సరం వత్సరం

యః సృజ్యశక్తిమురుధోచ్ఛ్వసయన్స్వశక్త్యా
పుంసోऽభ్రమాయ దివి ధావతి భూతభేదః
కాలాఖ్యయా గుణమయం క్రతుభిర్వితన్వంస్
తస్మై బలిం హరత వత్సరపఞ్చకాయ

సకల చరాచర జగత్తునీ సృష్టించే అమోఘమైన శక్తి ఉన్న ఈయన ఒక సారి నిట్టుర్పు లాగ తీసుకున్నప్పుడు, ఆయా ప్రాణ, భూత, భేధములతో కాలమనే రూపముతో తిరుగుతున్నాడు. ఈ కాలం ఆయా పదార్థాలకు ఆయా గుణాలు వచ్చేట్లు చేస్తుంది. ఇలా ఆయా గుణములతో ఆయా పనులు చేస్తూ మన నిత్య జీవితములో కాలమునే పూజిస్తున్నాము.

విదుర ఉవాచ
పితృదేవమనుష్యాణామాయుః పరమిదం స్మృతమ్
పరేషాం గతిమాచక్ష్వ యే స్యుః కల్పాద్బహిర్విదః
భగవాన్వేద కాలస్య గతిం భగవతో నను
విశ్వం విచక్షతే ధీరా యోగరాద్ధేన చక్షుషా

ఈ ప్రపంచం యొక్క స్థితిని యోగ శక్తి ఉన్న వారు, ఆ యోగ శక్తితో ప్రపంచం యొక్క అన్ని స్వరూపాలు చూడగలరు. ఈ కల్పములో ఉండేవారికి ఆయుష్షు చెప్పారు. మిగతా కలపములో ఉండే వారి ఆయుష్షు ఎలా ఉంటుంది.

మైత్రేయ ఉవాచ
కృతం త్రేతా ద్వాపరం చ కలిశ్చేతి చతుర్యుగమ్
దివ్యైర్ద్వాదశభిర్వర్షైః సావధానం నిరూపితమ్
చత్వారి త్రీణి ద్వే చైకం కృతాదిషు యథాక్రమమ్
సఙ్ఖ్యాతాని సహస్రాణి ద్విగుణాని శతాని చ

కృత త్రేతా ద్వాపర కలి యుగాలు. ఈ నాలుగు యుగాలూ పన్నెండు వేల దివ్య సంవత్సరములు. నాలుగు వేలు, మూడు వేలు రెండు వేలు ఒక వేయ్యి దివ్య సంవత్సరాలకి రెట్టింపు
శతాలు అంటే - నాలుగు వేల ఎనిమిది వందల దివ్య సంవత్సరాలు కృత యుగం, మూడు వేల ఆరు వందల దివ్య సంవత్సరాలు త్రేతా యుగం, రెండు వేల నాలుగు వందల దివ్య సంవత్సరాలు ద్వాపర యుగం, ఒక వేయి రెండు వందల దివ్య సంవత్సరాలు కలి యుగం. ఇలా  పన్నెండు వేల దివ్య సంవత్సరములు.

సన్ధ్యాసన్ధ్యాంశయోరన్తర్యః కాలః శతసఙ్ఖ్యయోః
తమేవాహుర్యుగం తజ్జ్ఞా యత్ర ధర్మో విధీయతే

అసలు కంటే కొసరే ముఖ్యం. అంటే నాలుగు వేల ఎనిమిది వందల సంవత్సరాలలో నాలుగు వేల తరువాత ఉండే ఎనిమిది వందలని సంధి అంటారు. అసలు ఈ సంధికే యుగమని పేరు. అంటే కృత యుగం ఐపోబోతున్నది, త్రేతాయుగం రాబోతోంది అనడానికే సంధి అని యుగం అని అంటాము. ఆ యుగములోనే ధర్మము కూడా విధించబడుతుంది.

ధర్మశ్చతుష్పాన్మనుజాన్కృతే సమనువర్తతే
స ఏవాన్యేష్వధర్మేణ వ్యేతి పాదేన వర్ధతా

నాలుగు పాదాలతో కృతయుగములో ఉంటుంది. ఇతర యుగాలలో అధర్మం పెరుగుతూ ఉన్న కొద్దీ ఒక్కో పాదం తగ్గుతూ ఉంటుంది.

త్రిలోక్యా యుగసాహస్రం బహిరాబ్రహ్మణో దినమ్
తావత్యేవ నిశా తాత యన్నిమీలతి విశ్వసృక్
నిశావసాన ఆరబ్ధో లోకకల్పోऽనువర్తతే
యావద్దినం భగవతో మనూన్భుఞ్జంశ్చతుర్దశ

నాలుగు యుగములు వేయి సార్లు తిరిగితే బ్రహ్మకి ఒక పూట. అంటే కృత త్రేతా ద్వాపర కలి యుగాలు వేయి సార్లు తిరిగితే బ్రహ్మకి ఒక పూట. మళ్ళీ నాలుగు వేల యుగాలు ఆయంకు రాత్రి. తెల్లవారితే మళ్ళీ సృష్టి ప్రారంభం అవుతుని. బ్రహ్మ యొక్క పగటి పూట పధ్నాలుగు మంది మనువులు పాలిస్తారు. (4000/14 = 285.7 యుగములు లేక 285.7/4 = 71.4 మహాయుగాలు).  ఒక్కో మనువు 71 మహా యుగాలు ఉంటారు. దీనే మన్వంతరం అంటారు (హిరణ్యకశిపుడు ఒక మన్వంతరం పరిపాలించాడు. 71 * 4 = 284 యుగాలు పరిపాలించాడు ) . డెబ్బై యొక్క మహా యుగాల కొసరుతో ఒక్కొక్క మనువు తమ కాలములో తాము తీసుకుని పాలిస్తారు.

స్వం స్వం కాలం మనుర్భుఙ్క్తే సాధికాం హ్యేకసప్తతిమ్
మన్వన్తరేషు మనవస్తద్వంశ్యా ఋషయః సురాః
భవన్తి చైవ యుగపత్సురేశాశ్చాను యే చ తాన్

మన్వంతరములో మనువులూ ఉంటారు, మను పుత్రులూ ఉంటారు, ఋషులూ ఉంటారు, దేవతలూ ఉంటారు, పరమాత్మ యొక్క అవతారాలు ఉంటాయి. ఇది ప్రతీ సాయంకాలం కాగానే ప్రళయం వస్తుంది. ఇది నైమిత్తిక సృష్టి, బ్రహ్మగారికి ఇది రోజూ వారి కార్యక్రమం లాంటిది

ఏష దైనన్దినః సర్గో బ్రాహ్మస్త్రైలోక్యవర్తనః
తిర్యఙ్నృపితృదేవానాం సమ్భవో యత్ర కర్మభిః

ఇది దైనందిన కార్యక్రమం బ్రహ్మగారికి. ఈ మన్వంతరాలలో పశువులు పక్షులు నరులు పితృదేవతలూ రాక్షసులూ దేవతలూ వారి కర్మానుసారముగా పుడతారు

మన్వన్తరేషు భగవాన్బిభ్రత్సత్త్వం స్వమూర్తిభిః
మన్వాదిభిరిదం విశ్వమవత్యుదితపౌరుషః

పరమాత్మే తన దివ్య తేజస్సును మనువులలో ఉంచి వారితో పరిపాలింపచేస్తాడు

తమోమాత్రాముపాదాయ ప్రతిసంరుద్ధవిక్రమః
కాలేనానుగతాశేష ఆస్తే తూష్ణీం దినాత్యయే

ఈయనే తమో గుణాన్ని తీసుకుని ప్రళయం ఏర్పరుస్తాడు. కాలమును అనుసరించి సాయంకాలం కాగానే ఏమీ చేయకుండా ఉంటాడు

తమేవాన్వపి ధీయన్తే లోకా భూరాదయస్త్రయః
నిశాయామనువృత్తాయాం నిర్ముక్తశశిభాస్కరమ్

ప్రతీ పూటకూ పధ్నాలుగు లోకాలు పోవు. భూః భువః స్వః లోకాలు మాత్రమే ప్రళయానికి గురవుతారు.

త్రిలోక్యాం దహ్యమానాయాం శక్త్యా సఙ్కర్షణాగ్నినా
యాన్త్యూష్మణా మహర్లోకాజ్జనం భృగ్వాదయోऽర్దితాః

సాయంకాలం అయ్యిందంటే సూర్యుడు చంద్రుడూ నక్షత్రాలు లేకుండా అవుతాయి. సంకర్షణుడు (ఆదిశేషుడు) తన వేయిపడగలతో విష్జ్వాలలు చిమ్ముతాడు, ద్వాదశాదిత్యులతో, శంకరుడు మూడవ కన్నుతో వేడి సృష్టిస్తారు. ఈ వేడికి భయపడి వేరు వేరు లోకాల వారు జనో లోకానికి వెళ్తారు.

తావత్త్రిభువనం సద్యః కల్పాన్తైధితసిన్ధవః
ప్లావయన్త్యుత్కటాటోప చణ్డవాతేరితోర్మయః

అన్ని సముద్రాలూ ఒక్క సారి ఉప్పొంగుతాయి,

అన్తః స తస్మిన్సలిల ఆస్తేऽనన్తాసనో హరిః
యోగనిద్రానిమీలాక్షః స్తూయమానో జనాలయైః

అప్పుడు అనంతాసనుడై పరమాత్మ నిదురపోతాడు. జన లోకములో వారు స్వామిని స్తోత్రం చేస్తారు.

ఏవంవిధైరహోరాత్రైః కాలగత్యోపలక్షితైః
అపక్షితమివాస్యాపి పరమాయుర్వయఃశతమ్

ఇలా పగలు రాత్రి అనే భేధముతో ఉన్న కాలమును , బ్రహ్మకు కూడా పరమాయువు నూరు సంవత్సరములు

యదర్ధమాయుషస్తస్య పరార్ధమభిధీయతే
పూర్వః పరార్ధోऽపక్రాన్తో హ్యపరోऽద్య ప్రవర్తతే

బ్రహ్మకు యాభై ఏళ్ళను పరార్థము అంటారు. బ్రహ్మ ఆయువు ద్విపరార్థము. పూర్వ పరార్థములో బ్రాహ్మ కల్పం ఏర్పడింది

పూర్వస్యాదౌ పరార్ధస్య బ్రాహ్మో నామ మహానభూత్
కల్పో యత్రాభవద్బ్రహ్మా శబ్దబ్రహ్మేతి యం విదుః

ఆ బ్రహ్మకే శబ్ద బ్రహ్మ అని పేరు.

తస్యైవ చాన్తే కల్పోऽభూద్యం పాద్మమభిచక్షతే
యద్ధరేర్నాభిసరస ఆసీల్లోకసరోరుహమ్

దాని తరువాత పాద్మ కల్పం వచ్చింది. పరమాత్మ నాభి నుండి పద్మం ఆవిర్భవించింది

అయం తు కథితః కల్పో ద్వితీయస్యాపి భారత
వారాహ ఇతి విఖ్యాతో యత్రాసీచ్ఛూకరో హరిః

తరువాత కల్పములో పరమాత్మ వరాహ రూపములో వస్తాడు.

కాలోऽయం ద్విపరార్ధాఖ్యో నిమేష ఉపచర్యతే
అవ్యాకృతస్యానన్తస్య హ్యనాదేర్జగదాత్మనః

ఇలా ద్విపరార్థ కాలం అయిపోతే స్వామికి ఒక రెప్పపాటు లాంటిది. ఇదే పరమాణువు నుండి ద్విపరార్థం వరకూ ఉండే కాలము.

కాలోऽయం పరమాణ్వాదిర్ద్విపరార్ధాన్త ఈశ్వరః
నైవేశితుం ప్రభుర్భూమ్న ఈశ్వరో ధామమానినామ్

అలాంటి పరమాత్మను ఎవరూ తెలియలేరు, శాసించలేరు

వికారైః సహితో యుక్తైర్విశేషాదిభిరావృతః
ఆణ్డకోశో బహిరయం పఞ్చాశత్కోటివిస్తృతః

అన్ని వికారాలు విశేషాలూ ఆయనతో కలిసి ఉంటాయి గానీ ఆయనకు ఏవీ అంటదు. ఆయనకు ఏమి ఉన్నాయో మనకి తెలియదు. మనకు కనపడే భూమండలం, బ్రహ్మాండం యొక్క ఈవల భాగం, బహిః అండకోశం, దీని విస్తీర్ణం యాభైకోట్ల యోజనములు (ఒక యోజనం - పన్నేండు కిలోమీటర్లు)

దశోత్తరాధికైర్యత్ర ప్రవిష్టః పరమాణువత్
లక్ష్యతేऽన్తర్గతాశ్చాన్యే కోటిశో హ్యణ్డరాశయః

ఈ భూమి యొక్క కొలత బట్టి, భూమి కన్నా పదిరెట్లు పెద్దది భువర్లోకం, దానికన్నా పది రెట్లు పెద్దది సువర్లోకం, దానికంటే పది మహా, జన తప సత్యం. కింద ఉన్న లోకాలు ఇరవై రెట్లు ఎక్కువ. అతలం కన్న ఇరవై రెట్లు వితలం. ఇలా ఉన్నది మనకు ఒక బ్రహ్మాండం. ఈ సృష్టిలో మనకు అనతకోటి బ్రహ్మాండములు ఉన్నాయి. బ్రహ్మాండముల గుంపులు కోట్లు ఉంటాయి

తదాహురక్షరం బ్రహ్మ సర్వకారణకారణమ్
విష్ణోర్ధామ పరం సాక్షాత్పురుషస్య మహాత్మనః

ఇలాంటివి తనలో దాచుకున్న పరమాత్మ అక్షరం, బ్రహ్మ. అన్ని కారణాలకూ కారణం. ఈయనకే పరమపురుషుడు శ్రీమన్నారాయణుడు అంటాము. ఈయనే పరంధాముడు.

Popular Posts