Followers

Wednesday 5 February 2014

శ్రీమద్భాగవతం తృతీయ స్కంధం నాలుగవ అధ్యాయం

ఉద్ధవ ఉవాచ
అథ తే తదనుజ్ఞాతా భుక్త్వా పీత్వా చ వారుణీమ్
తయా విభ్రంశితజ్ఞానా దురుక్తైర్మర్మ పస్పృశుః

వారిచే అనుజ్ఞ్య పొంది తిని, మద్యపానం బాగా చేసి, తద్వారా వారి జ్ఞ్యానం పోయి, వారు వీరు అన్న భేధం పోయి ఒకరినొకరు నిందించుకున్నారు

తేషాం మైరేయదోషేణ విషమీకృతచేతసామ్
నిమ్లోచతి రవావాసీద్వేణూనామివ మర్దనమ్

మద్యపానంతో వారి మనసంతా విషమయి పోయింది. సూర్యుడు అస్తమించిన తరువాత వెదురుబొంగుల పొదకు ఒరిపిడిలాగ జరిగింది

భగవాన్స్వాత్మమాయాయా గతిం తామవలోక్య సః
సరస్వతీముపస్పృశ్య వృక్షమూలముపావిశత్

పరమాత్మ ఆయన మాయను ఆయనే వీక్షించాడు. సరస్వతీ నదిలో స్నానం చేసి కూర్చున్నాడు

అహం చోక్తో భగవతా ప్రపన్నార్తిహరేణ హ
బదరీం త్వం ప్రయాహీతి స్వకులం సఞ్జిహీర్షుణా

అప్పుడు నాతో "నీవు బదరికాశ్రమం పో"మ్మని చెప్పాడు.

తథాపి తదభిప్రేతం జానన్నహమరిన్దమ
పృష్ఠతోऽన్వగమం భర్తుః పాదవిశ్లేషణాక్షమః
అలా చెప్పిన స్వామి మనసులో ఉన్న అభిప్రాయాన్ని అర్థం చేసుకున్న నేను ఆయన పాదాల ఎడబాటుని సహించలేక ఆయన వెంటనే వెళ్ళాను.
అద్రాక్షమేకమాసీనం విచిన్వన్దయితం పతిమ్
శ్రీనికేతం సరస్వత్యాం కృతకేతమకేతనమ్
ఒంటిగా కూర్చున్నాడు స్వామి. అలాంటి స్వామిని చూచాను. ఏ నివాసం లేనివాడు ఒక చెట్టు మూలని నివాసంగా ఉంచుకున్నాడు.
శ్యామావదాతం విరజం ప్రశాన్తారుణలోచనమ్
దోర్భిశ్చతుర్భిర్విదితం పీతకౌశామ్బరేణ చ

ఎలాంటి దోషం లేనివాడు, అరుణ వర్ణమైన కనుల అంచు గలవాడు, నాలుగు భుజాలతో చతుర్భుజునిగా పీతాంబరంతో ఉన్నాడు.

వామ ఊరావధిశ్రిత్య దక్షిణాఙ్ఘ్రిసరోరుహమ్
అపాశ్రితార్భకాశ్వత్థమకృశం త్యక్తపిప్పలమ్

కుడి పాదాన్ని ఎడమ తొడ మీద ఉంచుకున్నాడు. ఎప్పుడు అశ్వద్ధ వృక్షాన్ని ఆశ్రయించకుండా ఉండని వాడు, దాన్ని ఆశ్రయించకుండా దూరంగా ఉన్నాడు. ఆ అశ్వద్ధ వృక్షం (రావి చెట్టు) చిన్న మొక్కలాగ ఉన్నది.  దాని మూలంలో దక్షిణ పాదాన్ని వామ ఊరువు మీద అధిస్టింపచేసి, దాని ఆకులమీదకు మాత్రం పోనివ్వలేదు. (  ద్వా సుపర్ణా సయుజా సఖాయా సమానం వృక్షమ్ పరి షస్వజాతే |
  తయోర్ అన్యః పిప్పలం స్వాద్వ్ అత్త్య్ అనశ్నన్న్ అన్యో అభి చాకశీతి || 1-164-20 ఋగ్వేదము - మండలము 1 - సూక్తము 164: ఒకే రావి చెట్టు మీద రెండు పక్షులు ఉన్నాయి. రెండూ మిత్రులే, ఒకలాగే ఉంటాయి. ఒక పక్షి చెట్టు ఆకులను తింటూ ఉన్నది. రెండవది ఏమీ తినకుండా మొదటి దానికన్నా ఆనందముగా ఉంటుంది. ఆ రావి ఆకులు కర్మ ఫలములు. పరమాత్మ అన్ని ఫలములూ విడిచిపెట్టినవాడు)

తస్మిన్మహాభాగవతో ద్వైపాయనసుహృత్సఖా
లోకాననుచరన్సిద్ధ ఆససాద యదృచ్ఛయా

ఇలా కృష్ణ పరమాత్మ తన అవతారాన్ని చాలించుకోబోతున్న తరుణంలో అన్ని దేశములనూ ప్రాంతములనూ సంచరిస్తూ వ్యాసభగవానుని సహాధ్యాయి, మిత్రుడు అయిన మైత్రేయుడు అక్కడికి వచ్చాడు

తస్యానురక్తస్య మునేర్ముకున్దః ప్రమోదభావానతకన్ధరస్య
ఆశృణ్వతో మామనురాగహాస సమీక్షయా విశ్రమయన్నువాచ

సాహటాంగపడి నమస్కరించి స్వామి పక్కన కూర్చున్నాడు. పక్కన కూర్చున్న మైత్రేయ్డు వినేట్లుగా నాతో మాట్లాడాడు.

శ్రీభగవానువాచ
వేదాహమన్తర్మనసీప్సితం తే దదామి యత్తద్దురవాపమన్యైః
సత్రే పురా విశ్వసృజాం వసూనాం మత్సిద్ధికామేన వసో త్వయేష్టః
స ఏష సాధో చరమో భవానామాసాదితస్తే మదనుగ్రహో యత్
యన్మాం నృలోకాన్రహ ఉత్సృజన్తం దిష్ట్యా దదృశ్వాన్విశదానువృత్త్యా

అష్టా వసువులలో ఉద్ధవుడు ఒకడు. కృష్ణుడు ఇలా అన్నాడు "నీ మనసులో ఏమున్నదో నాకు తెలుసు. దాన్ని సామాన్యంగా ఇతరులు పొందలేరు. దాన్ని నేను నీకు ఇస్తాను. పూర్వము వసువులూ ప్రజాపతులందరూ కలిసి ఒక యజ్ఞ్యం చేసారు. దానిలో నీవు ఒక్కడివి మాత్రం నన్ను పొందాలని చేసావు. నా దయ వలన నీ జన్మలలో ఇదే చివరిది అవుతుంది. భూలోకాన్ని వదిలిపెట్టి వెడుతున్న నన్ను చూచే భాగ్యం నీకు కలిగింది. అది నా అనుగ్రహం "

పురా మయా ప్రోక్తమజాయ నాభ్యే పద్మే నిషణ్ణాయ మమాదిసర్గే
జ్ఞానం పరం మన్మహిమావభాసం యత్సూరయో భాగవతం వదన్తి

నా మొదటి సృష్టిలో నా నాభి నుంచి పుట్టిన బ్రహ్మకు నా మహిమను తెలియజేసే జ్ఞ్యానముని చెప్పాను, దానినే అందరూ భాగవతమంటారు.

ఇత్యాదృతోక్తః పరమస్య పుంసః ప్రతిక్షణానుగ్రహభాజనోऽహమ్
స్నేహోత్థరోమా స్ఖలితాక్షరస్తం ముఞ్చఞ్ఛుచః ప్రాఞ్జలిరాబభాషే

ఇలా స్వామి చెబుతుంటే ప్రతీ క్షణం పరమాత్మ మీద ప్రేమతో పులకింతలు వచ్చి అక్షరాలు తడబడుతూ, కళ్ళనీరు రాగా, ఇలా నేను మాట్లాడాను

కో న్వీశ తే పాదసరోజభాజాం సుదుర్లభోऽర్థేషు చతుర్ష్వపీహ
తథాపి నాహం ప్రవృణోమి భూమన్భవత్పదామ్భోజనిషేవణోత్సుకః

నీ అనుగ్రహాన్ని పొందిన వాడికి ఏ పురుషార్థం పొందరానిది? నిజమైన నీ భక్తులు నిన్ను తప్ప ఇంకే పురుషార్థాన్ని కోరరు. నేను నీ పాద సేవ తప్ప ఏమీ కోరట్లేదు.

కర్మాణ్యనీహస్య భవోऽభవస్య తే దుర్గాశ్రయోऽథారిభయాత్పలాయనమ్
కాలాత్మనో యత్ప్రమదాయుతాశ్రమః స్వాత్మన్రతేః ఖిద్యతి ధీర్విదామిహ

దీన్నే విరోదాభాసం అంటారు. నీవన్ని పనులూ చేస్తున్నావు. మానవులు ఒక దాన్ని కోరి పనులు చేస్తారు. కానీ నీవు ఏ కోరిక లేకుండా పనులు చేస్తున్నావు. పుట్టుకలేని నీవు పుడుతున్నావు. శత్రుభయంతో దుర్గంలో దాక్కున్నావు. నీవే కాలుడవు. నీవు ఆత్మా రాముడవు. అయినా పదహారువేల మంది స్త్రీలతొ విహరించావు. పరమజ్ఞ్యానులకు కూడా ఇది తలచుకుంటే మనసు కలత చెందుతుంది

మన్త్రేషు మాం వా ఉపహూయ యత్త్వమకుణ్ఠితాఖణ్డసదాత్మబోధః
పృచ్ఛేః ప్రభో ముగ్ధ ఇవాప్రమత్తస్తన్నో మనో మోహయతీవ దేవ

రాజ్య కార్యములలో క్లిష్ట సమస్యలకు పరిష్కారానికి మంత్రాంగానికి నన్ను పిలిచి నీవడుగుతూ ఉంటే, నిరంతరమూ ఆత్మ తత్వజ్ఞ్యానాన్ని అందించే వాడివి నీవు, నీ అత్మస్వభావాన్ని నీవు మరచిపోవు, అలాంటి నీవు అడుగుతూ ఉంటే , అది చూసి నా మనసు మోహపడుతోంది

జ్ఞానం పరం స్వాత్మరహఃప్రకాశం ప్రోవాచ కస్మై భగవాన్సమగ్రమ్
అపి క్షమం నో గ్రహణాయ భర్తర్వదాఞ్జసా యద్వృజినం తరేమ

నీవు ఆత్మను ప్రకాశించే తత్వాన్ని, బ్రహ్మగారికి చెప్పినదాన్ని వినడానికి నాకు యోగ్యత ఉంటే, అది నేను అర్థం చేసుకోగలవాడినని అనుకుంటే, మీరు అనుగ్రహంతో చెబితే మేము పాపాన్ని తొలగించుకుంటాము.

ఇత్యావేదితహార్దాయ మహ్యం స భగవాన్పరః
ఆదిదేశారవిన్దాక్ష ఆత్మనః పరమాం స్థితిమ్

ఇలా ప్రార్థిస్తే నా ప్రార్థనను మన్నించి పరమాత్మ తన స్వస్వరూపాన్ని నాకు బోధించాడు

స ఏవమారాధితపాదతీర్థాదధీతతత్త్వాత్మవిబోధమార్గః
ప్రణమ్య పాదౌ పరివృత్య దేవమిహాగతోऽహం విరహాతురాత్మా

సోऽహం తద్దర్శనాహ్లాద వియోగార్తియుతః ప్రభో
గమిష్యే దయితం తస్య బదర్యాశ్రమమణ్డలమ్
యత్ర నారాయణో దేవో నరశ్చ భగవానృషిః
మృదు తీవ్రం తపో దీర్ఘం తేపాతే లోకభావనౌ

ఇలా పరమాత్మను చూడటం వలన కలిగే ఆనందాన్ని మరికొంతకాలం పొందే భాగ్యము లేక బాధపడుతున్న నేను నారాయణునికి బాగా ఇష్టమైన బదరికాశ్రమానికి వెళ్తాను. అక్కడ నర నారయణులనే ఋషులు (కలౌ నర నారయాణౌ) ఉంటారు. ఆయనకు చూడకుండా ఉండలేను కాబట్టి.

శ్రీశుక ఉవాచ
ఇత్యుద్ధవాదుపాకర్ణ్య సుహృదాం దుఃసహం వధమ్
జ్ఞానేనాశమయత్క్షత్తా శోకముత్పతితం బుధః

యాదవులంతా తమలో తాము కలహించుకున్నారు, కలహించుకొని వధింపబడ్డారు. వారి వధను వినడం వలన కలిగే దుఖాన్ని శమింపచేసుకున్నాడు.

స తం మహాభాగవతం వ్రజన్తం కౌరవర్షభః
విశ్రమ్భాదభ్యధత్తేదం ముఖ్యం కృష్ణపరిగ్రహే

ఉద్ధవుని మీద ప్రేమతో తెలుసుకోవలసిన విషయాన్ని త్వరగా తెలుసుకోవాలన్న ఆర్తితో కృష్ణుని పొందడానికి ఏది ప్రథాన సాధనమో దాన్ని వివరించమని విదురుడు ఉద్ధవుని కోరాడు.

విదుర ఉవాచ
జ్ఞానం పరం స్వాత్మరహఃప్రకాశం యదాహ యోగేశ్వర ఈశ్వరస్తే
వక్తుం భవాన్నోऽర్హతి యద్ధి విష్ణోర్భృత్యాః స్వభృత్యార్థకృతశ్చరన్తి

యోగేశ్వరుడూ ఈశ్వరుడూ అయిన కృష్ణ పరమాత్మ, జీవత్మ పరమాత్మల రహస్యాని తెలిపే ఏ జ్ఞ్యానాని బోధించాడో, దేన్ని భాగవతం అన్నాడో, అలాంటీ తత్వాన్ని నాకు చెప్పండి
విష్ణు భక్తులు, పరమాత్మ భక్తుల కార్యం చేయడంలోనే తృప్తి పొందుతారు కదా.

ఉద్ధవ ఉవాచ
నను తే తత్త్వసంరాధ్య ఋషిః కౌషారవోऽన్తికే
సాక్షాద్భగవతాదిష్టో మర్త్యలోకం జిహాసతా

పరమాత్మ భూలోకాన్ని విడిచిపెట్టేముందు నిన్నే గుర్తుచేసుకున్నాడు. పరమాత్మే మైత్రేయునికి "ఈ భాగవతం నీవు విదురునికి చెప్పవలసింది" అని ఆజ్ఞ్యాపించాడు.

శ్రీశుక ఉవాచ
ఇతి సహ విదురేణ విశ్వమూర్తేర్గుణకథయా సుధయా ప్లావితోరుతాపః
క్షణమివ పులినే యమస్వసుస్తాం సముషిత ఔపగవిర్నిశాం తతోऽగాత్

ఈ ప్రకారంగా విదురునితో కలిసి పరమాత్మ గుణాలను గానం చేయడం వలన ఆ కథామృతంతో తొలగించబడిన పెద్ద తాపమును తొలగించబడింది.
యముని చెల్లెలి తీరములో (యమునా తీరములో) విదురుడు ఆ రాత్రిని క్షణ కాలంలా గడిపాడు, భగవత్ కథా సుధలో మునిగి.

రాజోవాచ
నిధనముపగతేషు వృష్ణిభోజేష్వధిరథయూథపయూథపేషు ముఖ్యః
స తు కథమవశిష్ట ఉద్ధవో యద్ధరిరపి తత్యజ ఆకృతిం త్ర్యధీశః

ఉద్ధవుడొక్కడే యదువంశంలో ఎలా మిగిలాడు. స్వామి కూడా తన శరీరాన్ని వదిలి పెట్టాడు కదా.

శ్రీశుక ఉవాచ
బ్రహ్మశాపాపదేశేన కాలేనామోఘవాఞ్ఛితః
సంహృత్య స్వకులం స్ఫీతం త్యక్ష్యన్దేహమచిన్తయత్

పరమాత్మ బ్రాహ్మణ శాపమనే మిషతో మొత్తం యాదవ కులం నశింపచేసి తాను కూడా శరీరం విడిచిపెట్టదలచి ఇలా అనుకున్నాడు

అస్మాల్లోకాదుపరతే మయి జ్ఞానం మదాశ్రయమ్
అర్హత్యుద్ధవ ఏవాద్ధా సమ్ప్రత్యాత్మవతాం వరః

"అందరూ వెళ్ళిపోతే నాకు సంబంధించిన జ్ఞ్యానం ఎవరిని ఆశ్రయించి ఉండాలి" అని ఇప్పుడు ఉన్న జ్ఞ్యానంలో ఆత్మజ్ఞ్యానం కలిగిన ఉద్ధవుడే అందుకు అర్హుడు అని తలచాడు

నోద్ధవోऽణ్వపి మన్న్యూనో యద్గుణైర్నార్దితః ప్రభుః
అతో మద్వయునం లోకం గ్రాహయన్నిహ తిష్ఠతు

"నాకంటే కొద్దిగా కూడా తక్కువ గాని వాడు ఉద్ధవుడు ". ఎవరైతే ప్రకృతికి సంబంధించిన సత్వ రజ తమ గుణాలతో పీడించబడడో వాడు (ప్రకృతికి లొంగని వాడు.) భగవానునికి దగ్గర వాడు అవుతాడు. (బాధరాగానే డీలాపడనివాడు, ఆనందం రాగానే పొంగిపోనివాడు). అటువంటి వాడు ఉద్ధవుడు. అందుకే నాకు సంబంధించిన వైకుంఠలోక ప్రభావాన్ని ప్రాప్తి కామనను అడిగినవారికి బోధిస్తూ ఉద్ధవుడు ఇక్కడే ఉండు గాక అని సంకల్పించాడు

ఏవం త్రిలోకగురుణా సన్దిష్టః శబ్దయోనినా
బదర్యాశ్రమమాసాద్య హరిమీజే సమాధినా

అలా సంకల్పించుకుని ఉద్ధవున్ని అక్కడే ఉంచి నర నారయణున్ని సేవించమనని చెప్పాడు

విదురోऽప్యుద్ధవాచ్ఛ్రుత్వా కృష్ణస్య పరమాత్మనః
క్రీడయోపాత్తదేహస్య కర్మాణి శ్లాఘితాని చ

అలాగే సమాధిలో ఉండి పరమాత్మను ఆరాధించడం మొదలు పెట్టాడు

దేహన్యాసం చ తస్యైవం ధీరాణాం ధైర్యవర్ధనమ్
అన్యేషాం దుష్కరతరం పశూనాం విక్లవాత్మనామ్

విదురుడు కూడా ఉద్ధవుని వలన పరమాత్మ లీలలను విని, పరమాత్మ శరీరం వదిలిపెట్టినందుకు ఇంకా ధైర్యం పెంచుకున్నాడు. అజ్ఞ్యానులు, దీనమైన మనసు గలవారు (చిన్న కష్టానికే భయపడేవారు) పరమాత్మ శరీరం వదిలిపెట్టినందుకు భయపడతారు. అటువంటి వారికి శరీరం విడిచిపెట్టడం అనేది మనసుకు కూడా అందదు.

ఆత్మానం చ కురుశ్రేష్ఠ కృష్ణేన మనసేక్షితమ్
ధ్యాయన్గతే భాగవతే రురోద ప్రేమవిహ్వలః

"స్వామి నన్ను తలచుకున్నాడా, ఎంత అదృష్టం!" అని తలచుకుంటూ, ఉద్ధవుడు వెళ్ళిపోగానే, ప్రేమతో పిచ్చివాడిలా ఏడ్చాడు.

కాలిన్ద్యాః కతిభిః సిద్ధ అహోభిర్భరతర్షభ
ప్రాపద్యత స్వఃసరితం యత్ర మిత్రాసుతో మునిః

ఇలా కొంతసేపు రోదించి, ధైర్యాన్ని కూడగట్టుకుని, కొద్ది రోజులలో త్వరగా గంగా తీరానికి చేరుకున్నాడు, అక్కడ మిత్రా సుతుడైన మైత్రేయుడు ఉన్నాడు

Popular Posts