బ్రహ్మయే స్వయంగా హనుమంతుని సర్వదేవాంశ సంభూతునిగా సర్వదేవమయునిగా చెప్పి అతనిని పూజించుటచే దేవతలందరూ పూజించినట్లేయనుచు,రాక్షస నివారణకై గ్రామగ్రామములందు హనుమదాలయములు ఏర్పడునని పలికెను.
నామ మహిమ:- బుద్ధి, బలము, కీర్తి, ధైర్యము, నిర్భయత్వము, అరోగత, జాఢ్యములు తొలగుట, వాక్పటుత్వము, మున్నగునవన్నియు హనుమన్నామస్మరణము వలన కలుగును.
శుభాశుభములన్నింటియందున పవిత్రమగు హనుమన్నామమును భక్తి తత్పరులై పండ్రెండు మారులు తలచిన కార్య సిద్ధియగునని పరాశర మహర్షి చెప్పారు.
హనుమ వాగ్దానము.
శ్లో// ఐహికేషు చ కార్యేషు -మహాపత్సు చ సర్వదా
నైవ యోజ్యో రామ మంత్ర: కేవల్కం మోక్షసాధక:
ఐహిక సమనుప్రాప్తే మాం స్మరే ద్రామ సేవకం//
అని హనుమంతుడు తానుగా రామ రహస్యోపనిషత్ లో చెప్పి యున్నాడు. వరమెట్లున్నను ఐహికజీవితము ముందు చూచుకొనవలెను కదా యని కలియుగమున కష్టకాలమున ప్రతివారూ కార్యసాధన కోరుకుందురు అట్టివి తననాశ్రయించినచో తానే నెరవేరుస్తానని హనుమంతుడే చెప్పుకున్నాడు. ఆయన అనుగ్రహమునకు పాత్రులగుటకు ప్రయత్నముచేయుటయే మనవంతు. ఐహిక ఆముష్మిక విషయాలలో శుభప్రాప్తికి హనుమంతుని ఆశ్రయించటం చాలా తెలివైన పని. ఆయన ధ్యానం సకల ప్రమాదాలనుండి నిస్సంశయంగా మనలను కాపాడుతుంది.