Followers

Friday 2 August 2013

మనం ఉపాసించే దైవం పూర్ణుడై ఉండాలి(శాంతి మంత్రం) [ఉపనిషత్తులు]


మన శరీరానికి దాహం వేస్తే నీటి ద్వారా దాహం తీర్చుకుంటాం. అట్లా శరీర అవసరాలకి కాక, నేను అనే లోపల ఉన్న ఆత్మకి దాహం వేస్తే ఏం చేస్తాం ? అత్మకి జ్ఞానం అవసరమైతుంది. అప్పుడు అన్వేషణ ప్రారంభం అవుతుంది. ఏమిటి కారణ తత్త్వం అని అన్వేషణ ప్రారంభిస్తాడు జీవుడు. తను చేయాల్సిన పనిలో లోపం లేకున్నా జరగాల్సినది జరగటంలేదు ఎందుకని ఆలోచన ప్రారంభం అవుతుంది. ఏమిటి కారణ తత్త్వం అని అన్వేషణ ప్రారంభం చేయడమే ఆత్మకు కల్గిన దాహం. జ్ఞానాన్ని పెంచుకోవడం అనేది కాదు కానీ కర్మలచేత జీవుడికి జ్ఞానం అడ్డుపడింది, దాన్ని భగవంతుని అనుగ్రహ విశేషం చేత పైన ఉన్న ఆటంకం తొలగించుకోవాలి అని జిజ్ఞాస కలిగితే ఆనాడు మన జీవనం తెల్లవారుతోంది అని అర్థం. అజ్ఞానమనే చీకటినుండి బయటపడుతున్నాం అని అర్థం. 

భగవత్ తత్త్వాన్ని చూసేది ఎలా ? మొదట దైవం అంటే ఎమిటో తెలియాలి. దైవం  అనేది మన కోరికలు తీర్చగలిగేది కావాలి. కోరికలు అంటే ఇక్కడ ఉన్నంతవరకు మన అవసరాలు ఉంటాయి, ఇక్కడి నుండి మనం వెళ్ళడం ఖాయం కనుక మనం ఎక్కడికి వెళ్ళినా అక్కడ మంచి ఆనందం, అనుభవం కావాలి. ఇంతకంటే క్రిందకు దిగజారేలా ఉండకూడదు. శారీరక అనుభూతులు వదిలివేయనవసరం లేదు అవి మన గమ్యాన్ని పాడుచేయనంత వరకు. కనుక శరీర అవసరాలకు తగ్గ కోరికలు కోరవచ్చు. మనకు ఎప్పుడైనా కోరిక కలిగినప్పుడు లేదా భాద కలిగినప్పుడు మనం చెప్పుకుంటే దైవం అనేవాడు విన యోగ్యుడు కావాలి. 

మన మొరలను ఆర్తిని ఎవడైతే ఆలకిస్తాడో అలాంటి వాడిని దేవుడు అని అంటారు. అంతే కాదు మన కష్టాన్ని చెప్పినప్పుడు విని గుర్తించగలిగే జ్ఞానం కలిగి ఉండాలి. మనం కూడా కొంతమందికి మంచి చేయగలుగుతున్నాం, అట్లా కాదు ప్రపంచంలోని ప్రతిప్రాణికి అట్లా చేయగలిగే జ్ఞానం కలిగి ఉండాలి. అంటే సర్వజ్ఞుడై ఉండాలి. 

కలిగిన కష్టాన్ని తొలగించి ఇష్టాన్ని ఇవ్వగలిగే శక్తి వంతుడై ఉండాలి. ఇలా ఎందుకు చేసావు అని ఎవ్వరూ అతణ్ణి ఆడ్డని సర్వశక్తిత్వం కలిగి ఉండాలి. అన్నింటిని నియమించే సామర్థ్యం కలిగి ఉంటాలి. 

కేవలం కొందరిని మాత్రమే కాక అందరినీ తన వాళ్ళు అని భావించేవాడై ఉండాలి. అందరూ నా సొత్తు అని అభిమానించి వారికున్న మురికిని శుద్దిచేసుకొని స్వీకరించే వాడై ఉండాలి. దీన్నే స్వామిత్వం అంటారు. 

ప్రతి ప్రాణితో కూడా అరమరికలు లేకుండా తేడాలు చూపకుండా ఉండగలగాలి. శీలం అంటారు. పాలలో నీళ్ళను పోస్తే అయ్యో నేను తెల్లగా ఉన్నాను నీవు నాతో ఎందుకు చేరుతున్నావు అని అనదు. తనలో కలుపుకొని తన రూపును పేరును వాటికి ఇస్తుంది. అట్లాంటి గుణాన్ని శీలం అంటారు. అట్లా కలుపుకొని ఏదో గొప్ప విషయం చేస్తున్నాను అనే భావన లేకుండా, అదే వాడి గుణం అయ్యి ఉంటే దాన్ని సు-శీలం అంటారు. దీన్నే సౌశీల్యం అంటారు. 

ఎప్పుడొ ఒకప్పుడే కాదు ఎప్పుడు చేయి చాచినా అందేట్టు ఉండాలి, దీన్నే సౌలభ్యం అంటారు. 

మనలో ఎన్నో పాపాలు ఉండొచ్చు, ఎప్పుడూ వాటిని ఎత్తిచూపే వాడు అయి ఉండకూడదు. జాలితో మన పాపాల్ని తొలగించగలిగే ప్రేమ, దయ కలిగి ఉండాలి. ఆవు దూడ ఒంటిమీద ఉన్న మురికిని నాకి శుద్ధిచేస్తుంది. దీన్నే వాత్సల్యం అంటారు. 

ఇవన్నింటిని మనం కళ్యాణ గుణములు అని అంటాం. అంటే ఎవడిలొ సర్వజ్ఞత్వం, సర్వశక్తిత్వం, సర్వస్వామిత్వం, సౌశీల్యం, సర్వసౌలభ్యం, దయ, వాత్సల్యం ఉన్నాయో వాణ్ణి మనం ఉపాసన చేస్తాం. ఇవన్నీ మనం ఎప్పుడు అడిగినా ఇవ్వగలిగే నిండుతనం ఆయనలో ఉండాలి. అంటే ఈ కళ్యాణ గుణములతో నిండి ఉండాలి. దీన్నే పూర్ణత్వం అంటారు. ఎవడైతే పూర్ణుడో వాడు ఉపాస్యమైన వాడు కానీ శూణ్యుడు కాదు. పూర్ణాన్నే మన వాళ్ళు గుండ్రంగా గీసారు. కానీ ఈ నాడు కొందరు దాన్ని శూణ్యం అని అంటున్నారు. అది తప్పు. సున్నాలోంచే అన్ని అంకెలు వచ్చాయి అని సంఖ్యా శాస్త్రం చెబుతుంది. కాబట్టి సున్నాను పూర్ణం అనే చెప్పాలి. భగవంతుడు పూర్ణుడు. 

ఈశావాస్య ఉపనిషద్ భగవంతుడు పూర్ణుడని, పరిపూర్ణమైన కళ్యాణ గుణములు కల గుణాకరమైన తత్త్వం నీదాహం తీర్చడానికి దిగివచ్చి ఎట్లా అందుతుందో చెప్పింది. అది పరమాత్మ తత్త్వం అని గుర్తించాలి అదే పూర్ణం అంటే.

ఓం పూర్ణమిదం పూర్ణమదః మూర్ణాత్ పూర్ణముదచ్యతే |
పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే ||

Popular Posts