Followers

Wednesday, 25 September 2013

సనాతన ధర్మ సంస్కారాల్లో 'వివాహం' అతి ప్రధానమైనది. సూర్య కిరణాలు తాకగానే పద్మం వికసించినట్లు, మానవజీవితంలో వివాహం తొలి వెలుగులను విరజిమ్ముతుంది


సనాతన ధర్మ సంస్కారాల్లో 'వివాహం' అతి ప్రధానమైనది. సూర్య కిరణాలు తాకగానే పద్మం వికసించినట్లు, మానవజీవితంలో వివాహం తొలి వెలుగులను విరజిమ్ముతుంది ధర్మార్ధ కామ మోక్షములను సాధించే రాచబాటే మన వివాహ వ్యవస్థ. అందుకే విదేశీయులను కూడా విశేషంగా ఆకర్షిస్తోంది. ఇంక పెళ్ళి ప్రక్రియలు అనేకం. వాటిలో "శుభముహూర్తం " లేదా "సమీక్షణం" అతి ముఖ్యమైనది. వధూవరులిద్దరూ పెళ్ళి మంటపం మీద తూర్పు, పశ్చిమ ముఖాలుగా కూర్చుంటారు. వారి కుడి చేతికి జీలకర్ర, బెల్లం కలిపిన ముద్దలు ఇస్తారు. వారి వివాహానికి సరిగ్గా, నిర్ణయించిన సుముహూర్తం సమయంలో, వేద ఘోష, మంగళ వాయిద్యాలు మధ్య ఆ మిశ్రమాన్ని వధూవరులు ఒకరి తలపై మరొకరు ఉంచి, అణచి పట్టుకొని, శిరస్సులను తాకుతారు. ఒక ప్రక్క "గట్టి మేళం" మ్రోగుతూనే ఉంటుంది. అంతవరకు వారిద్దరి మధ్యా అడ్డుగా ఉన్న తెర/తెరశెల్లాను తొలగిస్తారు. అప్పటి వరకు వేచియున్న వధూవరులు ఒకరినొకరు పవిత్రంగా చూసుకొంటారు. దీనినే "సుమూహుర్తం" అంటారు. ఇదే సమయంలో వేదపండితులు ఋగ్వేదంలోని ఈ మంత్రాన్ని ఉచ్ఛరిస్తారు.

"ధృవంతే రాజావరుణో ధృవం దేవో బృహస్
ధృవంతే ఇంద్రశ్చాగంచ్ఛ రాష్ట్రం థార్యతాం ధృవం."

అంటే " ఓ రాజా! రాజైన వరుణుడు, దేవతలైన బృహస్పతి, ఇంద్రాగ్నులు నీ రాజ్యాన్ని స్థిరమొనర్చుగాక." అలాగే, ఈ గృహస్తు జీవితం నిలకడగా ఆనందంగా జీవించాలని, చివరిదాక ఇద్దరూ ఎడబాటు లేకుండా ఉండాలని, అన్యోన్యమైన దాంపత్యాన్ని కలిగిఉండాలనే ఆకాంక్షే దీని పరమార్ధం. వరుడి శ్రేయం కోరడమే ఇందులోని ముఖ్యాంశం.

ఇహ జీలకర్ర, బెల్లం మిశ్రమాన్ని వినియోగించడంలో కల ప్రయోజనం: జీలకర్ర వృద్ధ్యాప్యం రాకుండా దోహదపడుతుంది. అందువలన శుభకార్యాల్లో దీని వినియోగం మంగళప్రదం. అందుకే జీలకర్రని వంటలలో కూడా విరివిగా వాడతారు. బెల్లం భోగ్య పదార్ధం. ఇది మధురంగాను, తన మధురాన్ని ఇతర వస్తువుల్లోకి సంక్రమింప చేసేదిగాను, పవిత్రమయినదని, కృష్ణ యజుర్వేద సంహిత చెబుతోంది. ఈ రెంటిని కలిపి నూరినా, నమిలినా "ధనసంజ్ఞకమైన విద్యుత్తు"(POSSITIVE ELECTRONIC CHARGE) కలుగుతుందని పదార్ధ విజ్ఞాన శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అందువలనే ఈ మిశ్రమ సంయోగం వలన ఒక క్రొత్త శక్తి పుడుతుందనీ, దీనిని తలపై పెట్టినపుడు వధూవరుల శరీరాల్లో ఒక విశిష్ట ప్రేరణ కలిగి , పరస్పర జీవ శక్తుల ఆకర్షణకు సహాయపడుతుందని చెబుతారు. అందుకే ఈ మిశ్రమం పావనం, మంగళకరం అని మహర్షుల మాట. అలాగే మన వివాహ వ్యవస్థ లో మాంగల్య ధారణ, సప్తపది, తలంబ్రాలు మొదలయిన ప్రక్రియల్లో కూడా ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయన్నది పెద్దల మాట.

Popular Posts