సంధ్యావందనం అనే ఆచారాన్ని ఒక సంప్రదాయంగా, మొక్కుబడిగా చేయడం కంటే, దానివల్ల ప్రయోజనం ఏమిటో తెలుసుకోవడం వల్ల మరింత శ్రద్ధాసక్తులతో చేసే అవకాశం ఉంది. సూర్యభగవానుడు ఒక్కడే. కానీ, ఆయనలో అద్వితీయమైన మూడు శక్తులు, ఏడు రంగుల కిరణాలు ఉన్నాయి.
"ధ్యేయస్సదా సవిత్రు మండల మధ్యవర్తీ నారాయణః సరసిజానన సన్నివిష్టః" అనేది మంత్రం. అంటే సూర్యుడు స్పష్టంగా కనిపించే ప్రత్యక్ష దైవం అన్నమాట. ఇందుకు వేదాల్లో అనేక ప్రమాణాలు ఉన్నాయి.
సూర్యునిలో కనిపించే సప్త వర్ణాలే సప్త అశ్వాలు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను వెలిగించే పరబ్రహ్మ తత్వం సూర్యుడు. త్రిమూర్తుల శక్తులను విడివిడిగా చూపించే దివ్య నారాయణ మూర్తి సూర్యుడు. సూర్యభగవానుడిలో సావిత్రి, గాయత్రి, సరస్వతి అనే మూడు మహా శక్తులు కేంద్రీకృతం అయ్యుంటాయి. అందుకే సూర్యునికి ఉదయం, మధ్యాహ్నం, సాయంత్ర వేళల్లో మూడుసార్లు సంధ్యావందనం చేయాలి.
త్రి సంధ్యల్లో సంధ్యావందనం చేయడం వల్ల సూర్యునిలో దాగివున్న సావిత్రి, గాయత్రి, సరస్వతి శక్తులు మన సొంతం అవుతాయి.
ఆయా శక్తులను
"గాయత్రీం ఆవాహయామి
సావిత్రీం ఆవాహయామి
సరస్వతీం ఆవాహయామి"
అనే మంత్ర సాయంతో ఆకర్షించి గ్రహించే సాధన సంధ్యావందనం. ఈ మంత్రాన్ని మూడుసార్లు భక్తిగా స్మరించి, నమస్కరించుకోవాలి. త్రి సంధ్యల్లోనూ క్రమం తప్పకుండా సంధ్యావందనం ఆచరించాలి. ఈ మూడు శక్తులూ ఘనీభవించిన మూర్తియే గాయత్రి. కనుకనే గాయత్రిని భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తారు.
సంధ్యావందనంలో ఆచమనం, ప్రాణాయామం, అఘమర్షణం,అర్ఘ్యప్రదానం, గాయత్రి మంత్రజపం, ఉపస్థానం అనేవి అంగాలు.
మూడు సంధ్యలూ ఒకే మాదిరిగా ఉండవు. సూర్య తాపము, ప్రభావము వేరువేరుగా ఉంటాయి. ఉదయ సూర్యుడిని బాలార్క అని, సాయంత్ర సూర్యుని వృద్దార్క అని అంటారు. ఉదయానే ఏమంత ప్రభావం చూపడు. సాయంత్ర వేళలో సూర్యుడు గొప్ప ప్రభావాన్ని చూపుతాడు. ఇక మధ్యాహ్న సమయంలో సూర్యుని వేడిమి సహించలేనిదిగా ఉంటుంది. అయితే మూడు దశల్లోనూ సూర్యుని కిరణాలను చూడటం చాలా అవసరం. కనుకనే సంధ్యావందనం పేరుతో ఒక ఆచారాన్ని ప్రతిపాదించారు. దాన్ని కొనసాగించడంవల్ల మనసుకు శాంతి అనుభూతమౌతుంది. శరీర ఆరోగ్యమూ బాగుంటుంది.