Followers

Friday, 20 September 2013

దేవుణ్ణి పూజించేది కోరికల కోసమేనా?









ప్రపంచంలో ఎక్కువమంది దేవుణ్ణి పూజించేది కోరికల 

కోసమే. మన కోరికలు మనకు అత్యంత ప్రియతమం. 

అవి తీఱడమే మన దృష్టిలో ఆనందమయ 

సుఖజీవనానికి గల ఏకైక నిర్వచనం. భగవంతుడి 

అస్తిత్వానికి గల ప్రత్యక్ష నిదర్శనం. ఎక్కువమంది 

నానావిద్యలు గఱచేదీ, నానావృత్తులు అవలంబించేదీ 

కేవలం జఱుగుబాటు కోసమని కాదు, కోరికలు 

తీర్చుకోవడం కోసమే, ఏదో ఒక రోజున వాటిని 

తీర్చుకోగలుగుతామనే ఆశ కోసం. భవిష్యత్తు కోసం ఏ 

కోరికలూ, ఆశలూ లేని మనిషి మన దృష్టిలో ఒక 

నిస్సారమైన జీవితాన్ని గడుపుతున్నట్లే లెక్క. 

మనకు అతని గుఱించి ఆసక్తి కలిగించేదేదీ అతనిలో 

లేనట్లే జమ. “దీని మీద ఇంకో రెండు అంతస్తులు కట్టి 

అద్దెలకివ్వబోతున్నాం. శాంత్రో తీసేసి స్కార్పియో 

కొంటున్నా. ఈ సంవత్సరం ఉన్న వెయ్యికోట్ల 

టర్నోవర్ 

ని వచ్చేసంవత్సరానికి 1300 కోట్లకు పెంచడానికి 

ప్రయత్నం చేస్తున్నాం” లాంటి మాటలు ఎవఱైనా 

మాట్లాడితే మనకు భలే ఊపొస్తుంది. యమా 

ఉత్సాహంగా ఉంటుంది. మాయామయమైన ఈ 

ప్రపంచం మనకు ఈ రకమైన కోరికల్ని శైశవం నుంచే 

మప్పుతుంది. మొదట్లో తిండి మీదా, ఆటవస్తువుల 

మీదా ఉన్న చిఱు చిఱు కోర్కెలు కాస్తా వయసు 

పెఱిగేకొద్దీ వాటి కంటే ఎక్కువ శ్రమసాధ్యమైన, 

చిరకాల 

స్థాయి కలిగిన, సమాజ ప్రశంసలకు నోచుకునే కోర్కెల 

వైపు మళ్లుతాయి. ఈ మళ్ళడంలో తల్లిదండ్రులతో 

సహా 

మన చుట్టూ ఉన్న ప్రతివొక్కరూ తలో చేయీ వేస్తారు. 

తలో పాత్రా వహిస్తారు.
కోరికలు చిన్నవైనా పెద్దవైనా, సమాజానికి 

ప్రశంసనీయమైనా కాకపోయినా అవన్నీ కోరికలే. 

అవన్నీ మానవుడి పసితనానికి నిదర్శనమే. మన 

ప్రస్తుతస్థితి మనకు ఆమోదయోగ్యంగా లేదనీ, 

మనల్ని 

మనం ఉన్నదున్నట్లుగా స్వీకరించలేకపోతున్నామనే 

ఆంతరిక వాస్తవానికి దర్పణమే. అంటే కోరికలు తప్పని 

గానీ, వాటిని తీర్చుకోవడం తప్పని గానీ ఇక్కడ 

చెప్పడంలేదు. ప్రాథమికంగా అవి తప్పు కాదు గనుకనే 

ఏం చేస్తే అవి తీఱతాయో మతగ్రంథాలు 

వివరిస్తున్నాయి. దేవుడు కూడా వాటిని 

తీఱుస్తున్నాడు.  అలా తీర్చడంలో ఆయన ఉద్దేశం 

వేఱు. వాటిని తీర్చి తానున్నాననే నమ్మకాన్ని 

మానవుడిలో పాదుగొల్పడం, తనయందు భక్తిశ్రద్ధల్ని 

కలిగించడం, తదుపరి అతనికి తత్త్వజ్ఞానాన్ని కలిగించి 

మోక్షం వైపు నడిపించడం – ఇదీ ఆయన లక్ష్యం. ఈ 

ప్రక్రియలో భాగంగా ఆయన కోట్లాదిమందికి కోరికలు 

తీఱిస్తే వారిలో కొన్నిలక్షలమంది మాత్రమే ఆయనకు 

అంకితమవుతారు. వారిలో కొన్ని వేలమంది మాత్రమే 

తత్త్వజ్ఞానానికి అర్హత సంపాదిస్తారు. వారిలో 

కొన్నివందలమంది మాత్రమే నిజంగా తత్త్వాన్ని 

అవగతం చేసుకుంటారు. మళ్లీ వారిలో 

కొన్నివందలమంది మాత్రమే గురూపదేశం పొంది 

తపస్సుకు కూర్చుంటారు. అయినా అంతిమంగా 

మోక్షానికి వెళ్ళేది ముగ్గుఱో నలుగుఱో !

శ్లో|| మనుష్యాణాం సహస్రేషు కశ్చిద్యతతి సిద్ధయే |
యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్త్వతః || 

(భగవద్గీత)
తాత్పర్యము : అర్జునా ! వేలాదిమంది మనుష్యులలో 

ఎవడో ఒకడు మోక్షసిద్ధి కొఱకు ప్రయత్నించును. 

అట్లు 

ప్రయత్నించు వేలాదిమందిలో ఎవడో ఒకడు మాత్రమే 

నన్ను నిజముగా తెలిసికొనగలుగును.
వాస్తవ ప్రయోజనం ఇంత పరిమితంగా ఉన్నప్పటికీ 

“వీళ్ళల్లో కనీసం కొద్దిమందైనా మోక్షం వైపు 

రాకపోతారా ?” అనే ఆశతో ఆ పరాత్పరుడు ఓపిగ్గా, 

ప్రేమగా వరసపెట్టి అందఱి కోరికలూ తీఱుస్తూనే 

ఉన్నాడు. కానీ మనం అనంతంగా కోరికలు 

తీర్చుకుంటూనే ఉన్నాం తప్ప మోక్షం ఊసే ఎత్తడం 

లేదు. కనుకనే కోట్లాది సంవత్సరాలుగా మళ్లీ మళ్లీ 

పుడుతూ ఇప్పుడు ఇక్కడి దాకా వచ్చాం.

కొన్నిరకాల కోరికలు కోరడానికి అర్హత ఉండాలని 

కొందఱు అనగా వింటాం. ఇది వాస్తవం కాదు. 

ఇతరులకి అపకారం తలపెట్టనంత వఱకూ ఏ కోరికైనా 


భగవంతుడికి ఆమోదయోగ్యమేననీ, ఏదో ఒకరోజున 

ఆయన దాన్ని తప్పకుండా తీఱుస్తాడనీ 

తెలుసుకున్నప్పుడు ఇహ అర్హతల ప్రసక్తి 

ఏముంటుంది 

? నిజానికి అనేక సందర్భాల్లో ఒకానొక కోరిక 

కోరగలగడమే దాన్ని పొందడానికి గల అర్హత. 

అందుకనే సర్వసాధారణంగా మనం లోకంలో అర్హత 

లేనివాళ్ళు చాలామంది అందలాలెక్కడాన్ని 

గమనిస్తాం. అర్హత లేకపోయినా వారు తమ 

పూర్వజన్మల్లో వాటిని పొందాలని కోరుకున్నారనీ, ఆ 

కోరిక ఫలితంగానే ఇప్పుడిలా తటస్థించిందనీ అర్థం 

చేసుకోవాలి.
కామం చెడ్డదనీ, మోక్షానికి తీవ్ర ఆటంకమనీ చెబుతూ 

శాస్త్రకర్తలు ఆ మాట ఉపయోగించిన ప్రతిసారీ దానర్థం 


‘కోరికల సామాన్యం’ అనే తప్ప లోకులు 

తలపోస్తున్నట్లుగా ఖచ్చితంగా శృంగారాభిలాష అని 

కాదు. ఏ కోరికనైనా కామమనే వ్యవహరించారు 

పూర్వ 

తత్త్వవేత్తలు. కానీ తరువాతి కాలంలో దాన్ని 

శృంగారానికి మాత్రమే అన్వయించుకొన్న జనం 

లైంగికవాంఛని ఒక  పెద్ద దెయ్యాన్నీ, భూతాన్నీ 

చేసేశారు. కోరికలు ఎందుకు చెడ్డవి ? అంటే, అవి 


ఇహలోక సంబంధులు కనుకా, తత్కారణం చేత అవి 

జన్మల పరంపర నుంచి విడివడని విధంగా 

మానవాత్మని ఈ లోకానికి బంధిస్తాయి గనుకా. 

కోరికల కుమ్ములో మానవ మనస్సుకు ఊపిరాడదు. 

శాంతీ ఉండదు. అది లేనప్పుడు మనస్సు ఏకాగ్రంగా 

సాధనలో నిమగ్నం కాజాలదు. అందుచేత చేసిన 

సాధనకు పెద్దగా ఫలితం ఉండదు. దీన్నుంచి 


బయటపడాలంటే రెండే మార్గాలు. ఒకటి – అన్ని 

కోరికల్నీ మళ్ళీ తలెత్తని విధంగా అణిచేసుకోవడం. 

లేదా వాటిని తృప్తిగా తీర్చుకోవడం. మొదటి 

ప్రయత్నం చేయగలవారెవఱూ లేరు. రెండో ప్రయత్నం 

మటుకు విఱివిగా కనిపిస్తోంది.
భగవంతుడు కోరికల్ని తీఱుస్తాడన్నప్పుడు “వెంటనే 

తీఱుస్తాడా ?” అనే ప్రశ్న ఉదయిస్తుంది. ఈ 


విషయమై 

శ్రీ సచ్చిదానంద పరమహంస (గడికోట, కడపజిల్లా) 

వ్రాస్తూ ఈ జన్మలో కోరే కోరికలు ఈ జన్మలోనే తీఱడం 

అసంభవమని తెలియజేశారు. ఇందుక్కారణమేంటంటే 

– ప్రస్తుతం జఱగాల్సిన సంఘటనల పరంపర ముందే 

నిర్ణయమైపోయింది. ఇహ ఇప్పటికిప్పుడు దీన్ని 

మార్చడం కుదఱదు. ఈ పరిస్థితిని పొగబండి 

ప్రత్యేకింపుల (Railway reservations) తో 

పోల్చవచ్చు. అలాగని ఇప్పుడు కోరినవాటిని ఇప్పుడే 

నెఱవేర్చడం లేకపోలేదు గానీ అరుదు. అలాంటి 

అరుదైన పరిస్థితి తమది అని భక్తులు తమ ప్రార్థనల 

ద్వారా భగవంతుడికి వివరించి ఒప్పించాల్సి వస్తుంది. 

అలా ఆయన ఒప్పుకోవడం  సాధారణంగా నాలుగు 

సందర్భాల్లో జఱుగుతుంది. ఒకటి – ఆ ప్రార్థన 
భక్తుడికి 

గానీ, అతని సంబంధీకుల గుఱించీ గానీ కానప్పుడు. 

రెండోది – ఆ ప్రార్థనాసారాంశం (భక్తుడి Micro plan) 

తన బృహత్ ప్రణాళిక (Macro plan) లో 

ఇముడుతుంది అని ఆయనకి అనిపించినప్పుడు. 

మూడోది – కొన్ని వేలమంది ఒకేసారి ఒకే విషయం 

గుఱించి ప్రార్థన చేసినప్పుడు. నాలుగోది – ఆ 

ప్రార్థనాసారాంశం ఆ భక్తుడి  కర్మఫలానికి 

అనుగుణంగా ఉందని ఆయన భావించినప్పుడు. 

ఇలాంటి సందర్భాల్లో ఫలితం వెంటనే కనిపిస్తుంది.

కోరికలు కోరేవారంతా సాధారణంగా ఈ జన్మలోని 

అవసరాల గుఱించే కోరతారు. కొందఱికి అవి ఈ 

జన్మలోనే తీఱతాయి. కొందఱికి తీఱవు. తీఱడానికి 

కారణం – వాళ్ళు దేన్నయితే కోరుతున్నారో అది 

లభించే యోగం వాళ్ళకి జాతకంలో ఉంటుంది. కానీ 


బలహీనంగా ఉంటుంది. అది భగవత్కృప చేత 

బలోపేతమైనప్పుడు ఈ జన్మలోనే తీఱుతుంది. 

జాతకంలో లేనిది భగవంతుడు ప్రసాదించడు. కానీ ఆ 

ప్రార్థన ఆయనకి గుర్తుంటుంది. అందుకని దాన్ని 

తరువాతి జన్మలో ప్రసాదిస్తాడు. ముందస్తుగా 

అందఱూ ఇది అర్థం చేసుకోవాలి. ఎవఱు ఏ కోరిక 

కోరినా, అది ఎంత అసాధ్యమైనా, ఎంత 

అభ్యంతరకరమైనా సరే, ఏదో ఒక పరిస్థితిని కల్పించి 

ఒకరోజున భగవంతుడు దాన్ని తీఱుస్తాడు. కానీ 

సమస్యేంటంటే – అది పూర్తిగా మనం అనుకున్న 

రూపంలో అనుకున్నట్లుగా తీఱదు. మనం కోరినదాన్తో 

పాటు కోరనివి కూడా ఒక పదో, వందో పరిస్థితులొచ్చి 

మనల్ని చుట్టుముట్టేస్తాయి. దీన్ని కోరికల యొక్క 

అవాంతర ఫలితం (side effect) గా భావించవచ్చు. 

ఉదాహరణకి – ఏ కష్టమూ పడకుండా 

కోటీశ్వరుణ్ణయిపోవాలని ఒకడు కోరుకుంటే 

మఱుజన్మలో అతను ఇల్లఱికం పోవాల్సిరావచ్చు. 


అక్కడ అతను అనేక అవమానాలూ, ఇబ్బందులూ, 

రాజకీయాలూ ఎదుర్కోవచ్చు. అంతిమంగా అతను 

మామగారి ఆస్తికి వారసుడైనప్పటికీ చివఱికి ఆ తృప్తి 

మాత్రం కఱువవుతుంది. ఈ కోరబడని అవాంతర 

ఫలితాలకు మనం ప్రతిస్పందించే విధానం ఎల్లవేళలా 

ప్రశంసనీయంగా ఉండకపోవచ్చు. కానీ ఆ 

ప్రతిస్పందనే 

మన తర్వాతి జన్మల్ని నిర్ణయిస్తుంది.
చాలామందికి తెలీని విషయం ఒకటుంది. కోరికలు 

కోరడమంటే – భగవంతుణ్ణి పేరుపెట్టి స్మరించి 

ప్రత్యేకంగా ఆయన్ని వేడుకుంటేనే కోరిక కోరినట్లు 

.కాదు. ఎవఱితోనూ పెదవి విప్పి చెప్పుకోకపోయినా, 

ప్రతిరోజూ, ప్రతిక్షణమూ ఏ ఊహైతే మన మనస్సులో 

జాగృతంగానో, నిద్రాణంగానూ కదలాడుతూ ఉంటుందో, 

లేదా ఏ విషయమైతే ఒక్కసారి చూసినందుకే మనకి 

పిచ్చిపిచ్చిగా నచ్చేసి మనస్సులో చిరస్థాయిగా 

ముద్రించుకు పోతుందో అదే మన కోరిక. దాన్ని 

సర్వజీవుల హృదయాంతర్యామి అయిన భగవంతుడు 

తనంతట తానుగా గ్రహిస్తాడు. అయితే ఏ కోరికనీ 

ఆయన అసహ్యించుకోడు. ఆయన దృష్టికి వచ్చిందంటే 

ఆఱు నూఱైనా అది ఫలించాల్సిందే.  ఎడాపెడా కోరికలు 
కోరడంలోని బెడదల (risks) మీద ఎవఱికీ అవగాహన 
లేదు. మనం ఎవఱినో పైపైన చూసి ‘ఫలానా విధంగా ఉంటే ఎంత బావుంటుందో !’ అని ఊహ చేసేసుకొని ఆ కోరిక కోరేస్తాం. కానీ దాని వెనక ఉన్న ఇబ్బందులూ, సాధక బాధకాలూ, దాన్తో పాటు వచ్చిపడే అదనబ్బరువులూ భగవంతుడికి మాత్రమే తెలుసు. ఆయన తీర్చడానికి అంగీకరించినంత మాత్రాన మన కోరిక ధర్మబద్ధమనే భ్రమప్రమాదంలో ఎప్పుడూ ఇఱుక్కోకూడదు. ఎందుకంటే, భక్తుడి పుణ్యఫలాన్ని బట్టి అతనికున్న అధర్మవాంఛల్ని కూడా తీర్చడం జఱుగుతుంది. ఆ ఫలం అలా వృథా అవుతుంది పాపసంచయనం కోసం ! కొన్ని కోరికలు పాపస్వభావం గలవైనప్పుడు, అవి అలాంటివని తెలిసీ, మనం వాటిని కోరడం మానకపోతే, ఆయన విధిలేక ఆ కోరిక తీఱుస్తాడు. కానీ, దాన్ని తీర్చుకోవడం వల్ల కలిగే పాపఫలితాన్ని అనుభవించే బాధ్యతని మన నెత్తినే వేస్తాడు. మనం ఒక కోరిక కోరితే, ఆయన ఆ ఒక్కటే తీర్చి, దాని పర్యవసానంగా మన తలకొచ్చి చుట్టుకునే వంద అనవసరపు విషయాలతో వేగే బాధ్యతని మాత్రం మనకే వదిలిపెడతాడు.
దీనర్థం ఏంటంటే, మనకి ఖచ్చితంగా ఏం కావాలో మనకి తెలీదు అని ! మనం కోరాల్సివస్తే నిజంగా కోరాల్సింది ఆయురారోగ్య ఐశ్వర్యాలనో, పదవులనో, సౌందర్యాన్నో, సుఖాలనో, కీర్తినో కాదు, సదసద్వివేకాన్ని, మనశ్శాంతిని, దైవభక్తిని ! అప్పుడు కొందఱొక ప్రశ్నవేయొచ్చు, “వీటిని అడిగితే అవి తీఱినట్లు కాదు గదా ?”అని !  ఇక్కడ గమనించాల్సింది ఏమంటే సదసద్వివేకం (అంటే – ఇది మంచి, ఇది చెడు అనే విచక్షణ) లాంటివి లోపిస్తే ధనం, ఆయుర్దాయం లాంటి వరాలు కూడా శాపాలుగా మారతాయి. ఎందుకంటే అవి పాపకర్మలు చేయడం 

కోసం తప్పనిసరిగా దుర్వినియోగమవుతాయి. అందుచేత వేటిని కోరితే వాటితో పాటు మిగతావన్నీ సిద్ధిస్తాయో వాటినే కోరాలి. తప్పుడు కోరికలు కోరడం వల్ల ఏం జఱుగుతుందంటే – ప్రపంచంలో జఱగక తప్పని ఘటనల్లో మనం కూడా భాగమై, కాలప్రవాహంలో పడి కొట్టుకుపోయే ఱాళ్ళూ ఱప్పల్లాంటివాళ్ళమూ, ఆ చారిత్రిక లీలకు ఉపకరించే సాధనాలమూ అవుతామే తప్ప వాటి మూలాన మనకు వ్యక్తిగతంగా హృదయవికాసం గానీ, మేధావికాసం గానీ, ఆత్మోద్ధరణ గానీ ఏమీ ఉండవు.
చేసినదానికి మఱుజన్మలో అనుభవించక తప్పదని హిందువులంతా విశ్వసిస్తారు. అయితే వారు కూడా విస్మరించే విషయమేంటంటే, కర్మ ఎలా చేసినా కర్మేననీ, మనస్సుతో చేసిన కర్మక్కూడా ఫలితాన్ని అనుభవించాల్సి ఉంటుందనేది. ఉదాహరణకి, ఒకఱంటే మనకు తీవ్రమైన ద్వేషం అనుకోండి. ఆ సమస్యని పరిష్కరించుకోకుండానే మనం చనిపోయామనుకోండి. మఱుజన్మలో మనం ఆ వ్యక్తిచేతిలో హింసలు పడాల్సివస్తుంది, ఆ జన్మలో అతనంటే మనకు ఏ ద్వేషమూ లేకపోయినా ! గాఢమైన కోరికలు కూడా ఇలాంటి మనః కర్మలే కనుక వీటికీ ఫలితం ఉంటుంది. కనుక ఈ రోజున మనం ఒక శుభమైన, లేదా శుభాశుభ మిశ్రమైన స్థితిలో ఉన్నామంటే అందుకుక్కారణం – ఒకప్పుడు దీని కోసం తహతహలాడుతూ తపించడమే. కానీ ఇప్పుడిది మనకి 
నచ్చకపోతే అది దీని తప్పూ కాదు. దేవుడి తప్పూ 

కాదు. ఇందాక చెప్పుకున్నట్లుగా ఆ కోరికతో పాటు 

దాని అవాంతర ఫలితాలు మనల్ని చుట్టుముట్టడం 

వల్లనే. లేదా ఆ పూర్వజన్మలో కోరిన ఆ కోరికకి 

మనం 

ఇప్పుడు పుట్టి పెఱిగిన దేశకాలాలు తగినవి 

కాకపోవడం వల్లనే.
తీఱిన కోరికలు సైతం అంతిమంగా ఏమని 

తెలుపుతాయి ? ఇహలోక జీవనం ఒక భ్రాంతి అని 

అవి 

తెలియజేస్తాయి. ఎందుకంటే మనసులో ఏది 

అవ్వాలనుకుంటే అది అయిపోతాం మనం, అది వచ్చే 

జన్మల్లోనే కావచ్చు గాక ! అంటే ఈకోరికలూ, అవి 

తీఱడాలూ, వాటిని మనం అనుభవించడాలూ ఇదంతా 

మనస్సు ఆడుతున్న 

తోలుబొమ్మలాటలే.కావాలనుకున్న దృశ్యం 

కనిపిస్తుంది ఈ తెఱమీద, ముందో వెనకో ! దాన్నే 

మనం మన కోరిక తీఱడంగా భావిస్తాం. తరువాత ఆ 

దృశ్యం మఱపుకొస్తుంది. మఱో దృశ్యం మొదలు…. 

జ్ఞానం కలిగే దాకా ఇదొక అనంత సుషుప్తి.

Popular Posts