మనం అందరమూ చదువుకొన్నవాళ్ళము. లోకజ్ఞానము ఇంతో అంతో కలిగినవాళ్ళము. కాని మనము కూడా అనాగరికులలాగా మతము పేరుతో గొడవలు పడడము ఎంతవరకు సమంజసం?
ఎవరి మతము వారికి ప్రియము. ఆ ప్రియత్వము అనేది ఇతరమతాలను ద్వేషించకుండా ఉన్నంతవరకే బాగుంటుంది. ప్రత్యేకముగా ఏదో ఒక మతాన్ని లక్ష్యము చేసుకొని ఎప్పుడూ దానిపైనే బురద చల్లడానికి ప్రయత్నించడం సమంజసము కాదని నా వ్యక్తిగత అభిప్రాయము.
ఎవరి మతాలను వారు పొగడుకుంటూ, వారి మతాల గొప్పతనం గురించి కావాలనుకొంటే వారు వ్రాసుకోవచ్చు. అప్పుడు ఎవరికీ ఏ అభ్యంతరాలు ఉండవు. అలా కాకుండా ఇతర మతాల లోటుపాట్ల గురించి వాదించుకోనవసరం లేదని నా అభిప్రాయం. ఎందుకంటే మనం వాదించుకున్నంతమాత్రాన లేక వాటి గురించి గొడవ పడినంత మాత్రాన ఆయా మతధర్మాలు కాని, ఆచారసాంప్రదాయాలు కాని ఇసుమంతైనా మారవు కదా. ఊరికే మన మధ్య భేధాభిప్రాయాలు రావడం, వ్యక్తిగత కక్ష్యలు ఏర్పడడం( అసలు కనీసం ముఖపరిచయాలు కూడా లేకుండానే ) తప్ప వేరే ప్రయోజనం ఏమీ ఉండదు.
కొందరి తిండి లేదని, బట్టలు లేవని, ఇల్లు లేదని బాధ. ఈ మూడూ ఉన్న మనకు అభిప్రాయప్రకటన, వాక్స్వాతంత్రము పేరుతో వాదోపవాదాల బాధ. మొత్తానికి మనకు సౌలభ్యాలు ఎన్ని ఉన్నా ఏదో ఒక బాధను మెడకు గుదిబండలా తగిలించుకొంటే తప్ప మనకు జిల తీరదనుకొంటా.
నేనొక హిందువును. నా మతధర్మాలు నేను పాటిస్తాను. నాకు ముస్లిములు, క్రైస్తవులలో కూడా మంచి స్నేహితులున్నారు. మేము ఎవరి మతధర్మాలు వారు పాటిస్తాము. మా మత ధర్మాల గురించి, ఆచారసాంప్రదాయాల గురించి ఒకరికొకరు చెప్పుకొంటాము. కొత్త విషయాలు తెలుసుకొని ఆనందిస్తాము.
నాకు సమీర్ అనే ముస్లిం స్నేహితుడున్నాడు. భగవద్గీత గురించి అతను, ఖురాన్ గురించి నేను అతడిని తెల్సుకొంటుంటాము. ఉన్నట్టుండి అతను జ్ఞానయోగం అంటే ఏంటని అడుగుతాడు. నాకు తెలిసింది చెప్తాను. అలానే నాకూ అతని మతధర్మాలు గురించి నాకు చెప్తుంటాడు. అలానే ఫణి అనే క్రైస్తవ స్నేహితునితో కూడా ఇటువంటి సంబంధాలే ఉన్నాయి. మాకు ఎప్పుడూ మామా మతాల విషయంలో గొడవలు కానీ, వాదోపవాదాలు కానీ రాలేదు.
ఒకరి పండుగలకు మరొకరు శుభాకాంక్షలు చెప్పుకొంటాము. అంతవరకే. ఏ విషయములోనైనా మా మధ్య భేధాభిప్రాయాలు ఉండవచ్చు. కాని మా మతాల విషయాలలో, కుటుంబ విషయాలలో ఎంతో జాగ్రత్తగా ఉంటాము. ఎందుకంటే మత విషయాలు, కుటుంబవిషయాలు అత్యంత సున్నితమైనవని మాకు తెలుసు. వాటి విషయములో ఒక సారి అభిప్రాయభేధాలు గనుక వస్తే జీవితమంతా బాధపడవలసి వస్తుందని మాకు తెలుసు. అలా మా స్నేహాన్ని నిలుపుకొంటున్నాము.
అందరికీ తెలుసు వాదోపవాదాలు మనసుకు ఎంత అశాంతికి గురిచేస్తాయో. కాని వాదాలను వదలలేకుండా పోతున్నారు.
ఫలానా రాముడో లేక మహమ్మదో లేక ఏసుక్రీస్తో, వీరి గురించి మనం ఎందుకు పోట్లాడుకోవాలి? ఆయా మతాలవారు వీరిని పూజిస్తారు. వీరి వ్యక్తిత్వాలతో పోలిస్తే మన వ్యక్తిత్వాలు ఏ మూలకు? వారున్నరో లేదో మనకు ఎందుకు? ఉంటే ఉంటారు, లేకపోతే లేదు. కాని వారున్నారని, వారు తమ వ్యక్తిత్వాలతో, జ్ఞానంతో, ప్రవర్తనతో సమాజాలను ప్రభావితం చేసారని పెద్దలు చెబుతారు. అలాంటప్పుడు వారు భోధించిన, ఆచరించి చూపిన విషయాలను మనకు నచ్చితే అనుసరిద్దాము. నచ్చకపోతే వద్దు. అంతేకాని వారిని దూషిస్తూ, మనలో మనం వారి పేరుపై పోట్లాడుకొంటూ మనం ఎందుకు మనశ్శాంతిని పోగొట్టుకోవాలి? అవసరమా?
ఈ బ్లాగులు, కంప్యూటర్లు, ఆంగ్లము ఏమీ తెలియని గ్రామాల ప్రజలే పరమతసహనముతో ఒకరి మతాన్ని ఒకరు గౌరవించుకొంటూ ఆనందముగా ఉంటున్నారు. ఏ మతపండుగ వచ్చినా అందరూ కలిసి జరుపుకొంటూ సంతోషముగా ఉంటున్నారు. కాని ఇవన్నీ తెలిసిన మనం ఒకరికొకరు దుమ్మెత్తిపోసుకొంటున్నాము. నిజమే కదా?
చివరిగా ఒక మాట. తప్పు మతం పేరుతో చేసే తప్పులు చేసే మనుషులదే కాని, మతానిది ఎన్నటికీ కానేరదు.
ఇకనైనా మనము మతాల పేరుతో కువిమర్శలకు, వ్యక్తిగత విమర్శలకు దిగకుండా ఉండాలని నా అభిలాష.