హిందూమతం అనగానే స్వమతస్థులు, విమతస్థులు కూడా ముఖ్యంగా విమర్శించే విషయం, అర్థం చేసుకోలేకపోయే విషయం ఇందులో అనేక పంథాలుండటం, చాలామంది దేవతలుండటం గూర్చి. “ఏకం సత్ విప్రా బహుధావిదంతి” (1 – 164 – 46) అని, “ఏకం సన్తం బహుధా కల్పయన్తి” (10 – 114 – 5) అని ఋగ్వేదం చెప్తోంది. అంటే ఒకే సత్ పదార్థాన్ని పండితులు అనేక విధాల చెప్తున్నారని అర్థం. ఆ ఒకే ఒక్క సత్యపదార్థమే ఓంకారం. హిందూ ధర్మం మొత్తానికి అర్థం ఆ ఓంకారంలోనే ఉంది. ఆ మూల తత్వం పూర్తిగా అర్థం చేసుకుంటే తప్ప హిందూత్వంలోని ఏకాత్మత అర్థమయి సకల సందేహాలు తీరవు. హిందూధర్మం మొత్తాన్ని ఒక్క వాక్యంలో చెప్పటం కాదు. ఒక్క పదంలో చెప్పటం కాదు. ఒక్క అక్షరంలో చెప్పవచ్చు. అదే “ఓం”.
మూలాన్ని గమనించకుండా చెట్టుకొమ్మలు, రెమ్మలు వేలాదిగా ఉండటం చూచి “అమ్మో! ఇన్ని భేదాలే!” అని ఆందోళనపడటంలో అర్థం లేదు. అదంతా ఒకే చెట్టు. ఏ కొమ్మ ఎక్కి అయినా కోసుకునేది ఒక ఫలమే. కనీస పరిఙ్ఞానం కలవారికొక్క విషయం అర్థమౌతుంది. చెట్టు మూలం ఒకటే అయి, అన్ని కొమ్మల ఫలాలూ ఒకేరకంగా ఉంటే తప్పకుండా అదంతా ఒకే చెట్టు అని గ్రహిస్తాం. కొమ్మల సమూహాన్ని బట్టి ఎన్నో చెట్లు అనం. హిందూ మతం ఒక చెట్టు అనుకుంటే దాని మూలం ఓంకార రూప పరబ్రహ్మం. ఫలం ఏ కొమ్మ నుండి కోసినా ముక్తి ఫలమే. కాబట్టి అదంతా ఒకే చెట్టు. ఫలస్వరూపంగా అన్నిటినుండీ పొందగలది ముక్తియే. అయినా దానికి వాసనలు గుబాళించే పుష్పాలు, నోరూరించే పచ్చికాయలు, పూతలు వంటివీ ఉంటాయి. అవే ఐహిక ప్రయోజనాలన్నీ. ఏ దేవత నుండి అయినా మనం ఆశించేవి భుక్తి, ముక్తి అనేవే కదా! ఆ వృక్షం అవ్యక్త పరబ్రహ్మమైతే దాని వ్యక్త రూపం ప్రణవం. దీనిని గూర్చి విపులంగా గ్రహిస్తే తప్ప మనలో ఏర్పడే భేద భావాలు తొలగిపోవు.
వృక్షమూలం ఓంకారం. దానినుండే ఇందరు దేవతలనే కొమ్మలు పుట్టి ఆ వృక్ష ఫలమైన భుక్తి ముక్తులనే అన్నీ ప్రసాదించటం జరుగుతోంది. సూర్యుడొక్కడే. అనంత కిరణాలు. అన్ని కిరణాల మూలం ఆ సూర్యుడే. అన్ని కిరణాలు ఫలమూ ఙ్ఞాన జ్యోతి ప్రకాశనమే. అలా ఓంకారం యొక్క కిరణజాలమే సకల దేవతలు. ఏ దేవత అయినా ఓంకారంతో సంబంధించిన వారే. అందుకే ఏ దేవతా మంత్రమైనా, పూజా నామమైనా మూలమైన ఓంకారంతో కలిపే చెప్పాలి. ఓం శివాయ నమః, ఓం నమో నారాయణాయ, ఓం దేవ్వై నమః అంటూ అందరికీ ఓంకారం తోనే చెప్పాలి. ఆ ఏకతను ఎవ్వరూ కాదనలేరు. ఆ ఓంకారం విషయంలో శైవ, వైష్ణవ శాక్తేయాది భేదాలేవీ లేవు.
మన మతంలో అనేకత్వాన్ని భావించడానికి ప్రధాన కారణం భ్రాంతి, అజ్ఞానాంధత. ఒక గురువుగారు గ్రుడ్డి శిష్యులకు ఏనుగును గూర్చిన అనుభవ జ్ఞానం కలిగిద్దామని దాని దగ్గరకు తీసుకొని పోయి వారు దాన్ని చేతులతో తడిమి గ్రహించాక “ఏనుగు ఎలా ఉంటుంది?” అని అడిగితే ఒకడు అరటిస్తంభంలా ఉంటుందని, వేరొకడు చీపురు కట్టలా ఉంటుందని, ఇంకొకడు పెద్ద పాములా ఉంటుందని, ఇలా ఎవరికి దొరికిన అవయవం పట్టుకొని అదే ఏనుగులా భావించి చెప్పారట. సమగ్ర జ్ఞానం ఎవరికీ లేదు. అలా సమగ్రమైన అవగాహన లేక ఎవరి పంథాను వారు అదే హిందూ ధర్మ సర్వస్వంగా భావించటంతో ఇన్ని అభిప్రాయ భేదాలకు, వివాదాలకు కారణం ఏర్పడుతోంది. నిజానికి మన ధర్మం యొక్క ఏకైక సమగ్ర రూపం ప్రణవం. అంటే ఓంకారం. వేదాలే సమస్తమునకు ఆధారమయితే ఆ వేదాలకు పుట్టుక స్థానం ఓంకారమే. ఎవరు ఏ దేవతను సర్వాధిక దేవతగా అనుకొన్నా ఆ దేవతలందరకూ ఓంకారమే మూలం. “ఓంకారస్సర్వవేదానాం మూలం” అని “ఓంకార ప్రభవా దేవాః” అని సకల వేదాలు, సకల దేవతలు ప్రణవం నుండే పుట్టినట్లు ఉపనిషత్తులు చెప్తున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే మనుష్య జన్మ నెత్తినందుకు సాధింపవలసిన ఆధి భౌతిక, ఆధి దైవిక, ఆధ్యాత్మిక ప్రయోజనాలన్నీ ఈ ఓంకారం వలననే సాధింపబడతాయి. అదే ఈ గ్రంథంలో ముఖ్యంగా నిరూపితమౌతుంది.
ఓంకారం మనలను అన్ని విధాలా రక్షించేది. అసలు ఆ అక్షరానికున్న అర్థమే అది. “అవతి రక్షతీతి ఓమ్” అని రక్షించునది అనియే ఓంకారానికి అర్థం. కాబట్టి మనకు ఓంకారం సర్వదా సర్వధా రక్ష. ప్రణవ మనేది “ణు స్తుతౌ” అనే ధాతువు నుండి పుట్టింది. “ప్రకృష్టో నవః ప్రణవ:” అని పుష్కలమైన స్తోత్రముగా ప్రణవమునకు అర్థం చెప్పబడింది. “యద్వా ప్రణౌతి ప్రస్తూయతే అనయా బ్రహ్మేతి ప్రణవః”. ఈ స్తోత్రము సకల దేవతలకు చెందునది, లేదా సకల దేవాత్మకమగు బ్రహ్మమునకు చెందునది. “ప్రాణాన్ సర్వాన్ పరమాత్మని ప్రణానయతీ త్యేతస్మాత్ ప్రణవః” – సర్వ ప్రాణములను పరమాత్మయందు లగ్నము చేయునది అని కూడా ప్రణవమున కర్థం. “ప్రణౌతీతి ప్రణవః తస్మాత్ ఓమితి ప్రణౌతి ఇతిస్తుతేః” అని విష్ణు సహస్రనామ శంకర భాష్యంలో కూడా స్తుతి పరమైనదిగా ఓంకారం తెలుపబడింది. “ప్రణవష్టేః” అని పాణినిచే వ్యాకరణ సూత్రం వ్రాయబడింది. దానికి భాష్యం వ్రాస్తూ పతంజలి యజ్ఞకర్మల యందు ఋక్కుల యొక్క చివరలో పలుకబడు ఓంకారమే ప్రణవం అని చెప్పారు. యజ్ఞము, వేదాధ్యయనము, వేదమంత్రోచ్చారణములందన్నిటి ఆద్యంతములందు ఓంకారం ఉచ్ఛరించాలనేది వేద సంప్రదాయం. అందుకే తైత్తిరీయా రణ్యకంలో “యో వేదా దౌ స్వరః ప్రోక్తో వేదాంతే చ ప్రతిష్ఠితః” అని సూచింప బడింది.
“సర్వేభ్యో దుఃఖ భయేభ్యః సంతారయతీతి తారణా త్తారః” అని సర్వవిధములయిన దుఃఖముల నుండి, భయముల నుండి కూడ రక్షింపగల్గినది కాబట్టి దీనిని తారం అని కూడా అంటారు. ఓంకారోచ్చారణ యొక్క అభ్యాసం వలన క్రమంగా చిత్త స్థైర్యం ఏర్పడి దుఃఖ భయాదుల నుండి మనస్సు దూరంగా ఉండగల్గటం వలన రక్తపు పోటు వంటి ప్రమాదాల నుండి కూడా బయట పడవచ్చు. వైద్య శాస్త్రజ్ఞుల అంచనా మేరకు ఇది ఉద్వేగ యుగం. వత్తిడి, వేగం ప్రతిమనిషి పై ఎక్కువగా ఉండే కాలం. చిన్నతనం నుండే బ్లడ్ ప్రెషర్ ప్రభావాలు చాలా మందిలో చూస్తున్నాం. ఆ ఉద్వేగం, ఉద్రేకం ఓంకార సాధన వల్ల నిరోధింపబడతాయి. ఓం యొక్క పరిపూర్ణ జ్ఞానం అందరకూ అందటం ప్రపంచ శాంతికే అత్యంత ప్రధానం.
అమెరికా శాస్త్రవేత్తలు వైద్యపరంగా పై విషయం గుర్తించారు. జార్జియా మెడికల్ కాలేజీకి చెందిన “డా. వెర్మాన్ చార్నెస్” అనే ఆయన సహచరులతో కలసి పరిశోధన చేసి ఈ ధ్యానం వల్ల రక్తపు పోటును తగ్గించటం ఎలా సాధ్యమో గ్రహింప గల్గినట్లు “సైకోమాటిక్ మెడిసిన్” పత్రికలో ప్రచురించారు. జర్మనీలో బ్రస్సెల్స్ నగరంలో ఒక యోగ కేంద్రం నెలకొల్పబడింది. అక్కడ “ఓం” అనేదే కేంద్రంలో స్థాపింప బడినదని, అతి ప్రమాణంగా దాన్ని వారు స్వీకరిస్తారని తమ పర్యటానుభవాల్లో శ్రీ ఎక్కి రాల కృష్ణమాచార్యులుగారన్నారు. ఏసు క్రీస్తు భక్తులయిన వారు తమ సాధనలో భాగంగా ముందు మూడుసార్లు ఓంకారాన్ని ముక్త కంఠంతో ఉచ్ఛరించి “ఓంకార బిందు సంయుక్తం” ఇత్యాదిగా నమశ్శివాయ అనే పంచాక్షర శ్లోకాలు పఠించేవారుట. జెనీవా పట్టణంలో ఆల్బర్ట్ శశీ అనే ఆధ్యాత్మికవేత్త తన మరణ సమయంలో ముఖ్య శిష్యురాలు కెరోల్ అనే భక్తురాలికి ఒక ఉంగరం ప్రసాదించారు. దానిపై సంస్కృత లిపిలో లిఖించి ఉన్న ఓంకారం ఉండటం చూచి ప్రణవ విశిష్టత వారిచే ఉపదేశింప బడ్డట్లు గ్రహించారట. ఇలా ప్రణవాన్ని విలువ గ్రహించిన పాశ్చాత్యులు కూడా ఆరాధించటం గ్రహింపగలం.
జర్మనీలో ఒక కంపెనీ డైరెక్టర్లు ప్రతినెలా సమావేశం ఏర్పాటు చేసుకొని విపరీతంగా తగాదాలాడుకొని పోతూ ఉండేవారు. వారిలో ముఖ్యునికి ఓంకార విశిష్టతను తెల్పే "ఇండియన్ మిస్టిజమ్" అనే గ్రంథం దొరికింది. అది చదివాక మీటింగు మెదట 20 సార్లు ఓంకారం చేసి ఆరంభిద్దామని సూచించటంతో అలాగే చేయసాగారు. అంతకు ముందున్న పంతాలు, పట్టింపులు, తగాదాలు తొలగిపోయి ప్రతివారూ ఇతరుల మాట కూడా విందాం, ఆలోచిద్దాం అనుకొనే మనస్తత్వానికి రావటంతో వివాదాలు సమసిపోయాయి. బల్గేరియాలో విద్యార్థులచే ప్రణవం చేయిస్తారట. అలాంటి మంచి నియమం మనదేశంలో లేకపోవటం మన దురదృష్టం. మనమయినా మన పరిధి అంతటా అలా ప్రణవం చేయించే యత్నం చేస్తే అదే మనకు, మన పరిసరాలకు చాలా మేలు కల్గిస్తుంది. సాధన ద్వారా ప్రణవ శక్తి దేహంలో వ్యాపిస్తే దాని ప్రభావం వారి సంతానంలో కూడా ప్రస్ఫుట మౌతుంది. క్రమ పద్ధతిలో ఓంకారం జపిస్తూ ఉండేవారు మేధావులయిన సంతతిని పొందగల్గుతారు. కాబట్టి యువకుల దశలోనే ప్రణవం అభ్యసిస్తే మన అనంతర తరాల వారంతా మేధావులై జాతి మేధావి జాతి కాగల్గుతుంది. “ఓంకార ప్రభవా దేవాః – ఓంకార ప్రభవా స్స్వరాః ఓంకార ప్రభవం సర్వం” అని మన దేవతలంతా ఓంకారం నుండి పుట్టిన వారే. అందుకే “ఓంకార మాదిం కృత్వా” అని దేవతా సంబంధమైన సర్వకార్యాలూ ఓంకారోచ్చారణ చేసే ఆరంభింప బడతాయి.
వేద పఠనం, మంత్ర పఠనం, మంత్ర జపం, పూజ సద్గ్రంథ పారాయణ, యజ్ఞ యాగాదికం, ఇలా సమస్త హిందూ కార్యాలూ ప్రణవోచ్చారణ లేకుండా మెదలు కావంటే హిందూ ధర్మానికి ఓంకారమెంత కీలకమో అర్థమౌతుంది. ఈ ధర్మంలో ప్రణవానికున్న స్థానం మరి దేనికి లేదనేది తిరుగులేని సత్యం. కాబట్టి హిందువుకు అత్యంత ప్రధానమైనది ఓంకారం. అర్థం చేసుకొంటే ప్రపంచ మంతటికీ అత్యంత ప్రధానమైనది ఓంకారం. బ్రహ్మము – ఆత్మ – ఓం అనేవి మూడూ సమానమైనవే. కాని వీనిలో కన్పించేది, విన్పించేది ఓంకారం మాత్రమే. ఆత్మకలవారందరికీ అవి అనుసరణీయమే. పరబ్రహ్మ స్వరూపమైన ఈ ఓంకారం దేవతలకు కూడా నిరంతరం స్మరింపదగినది. “ఓంకార పంజరశుకీం” అని అమ్మవారిని ఓంకారమనే పంజరంలో చిలుకగా చెప్పిన ఆంతర్యమదే. సకల దేవతలూ అలా ఓంకార పంజరంలో వారే. హరి: ఓం అంటూ ఆరంభించి ఓం తత్ సత్ అని ముగించే మన సంప్రదాయం యావత్తూ ఓంకారం మధ్యనే ఇమిడి ఉంది. ఏ దేవతకయినా ఓంకారంతో కల్పి చెప్తేనే పరిపూర్ణత, వారికి తృప్తి కూడ. అందుకే అష్టోత్తర శతనామాలు, సహస్రనామాలు, కేశవాది చతుర్వింశతి నామాలు సైతం ఓంకారంతోనే చెప్పాలి. కాబట్టి దేవతలందరూ ఓంకార వాచ్యులైతేనే పరిపూర్ణత. అలా హిందూమతంలో దేవతలందరూ ఓంకారంతోనే ఆరాధింపబడటమనే విషయంలో తేడాలేదు. కాబట్టి ఓంకారంతో ఉచ్చరించే, ముక్తిని ప్రధాన ఫలంగా ఇచ్చే దేవతలంతా సమానమే. యహోవా, అల్లా వంటివి ఓంకారంతో ఉచ్చరింపబడేవీ కావు,.ముక్తిని ప్రసాదించేవిగా చెప్పబడవు. కాబట్టి అవి ఈ దేవతల కంటే పూర్తిగా భిన్నాలు. రాజకీయాలతో, లౌకికపు హెచ్చులతో, విశాల దృక్పథమనే పేరుతో అన్నీ కలగా పులగం చేయబోయినా కావు. మన దేవతలలో ఎవరినాశ్రయించినా పరమ ప్రయోజనంగా ముక్తిని పొందగలం. కాన ఈ కొమ్మలలోనే ఒకటి మారి మరొకటి, మరొకటి ఎక్కినా ఫర్వాలేదు. కాని మతమే మారటం ద్వారా ఈ చెట్టే దిగేస్తే ఇక ఈ పరమ ప్రయోజనం పొందలేరు. మనమంతా ఒకే చెట్టు మీదున్నామనుకొనే వీలు లేదు. లౌకిక ప్రయోజనాలు చూచి అదే భుక్తి ఫలంగా భావించి వానిని ఆశ్రయిస్తున్నారు. వారిదెంతటి దురదృష్టము! భుక్తి ముక్తి ఫలమిచ్చే ఈ మహత్తరావకాశం చేతులారా వదలుకొంటే మళ్ళీ ఎన్నిజన్మల కీభాగ్యం పొందగలరో ఎవరు చెప్పగలరు? ఈ చెట్టు దిగకుండా ఉంటే ఎలాగయినా సత్ఫలం పొందగలరు. హిందూమతం వీడిపోతే ఈ సత్ఫలం కోల్పోయినట్లే. కాబట్టి అలా పోతున్నవారి యెడ ద్వేషం చూపక సానుభూతి చూపి యధార్థ తత్వం చెప్పాలి. అలా చెప్పని దోషం మనది కారాదు. వారితో వాదించటం కాక అనుకూల సమయంలో వివరించాలి. లేకుంటే ఆ వ్యక్తి మెదలకుండా చెట్టుదిగి పోవటమే కాక ఈ చెట్టును నరికే యత్నం చేస్తాడు. కళ్ళముందు అలాంటి అనుభవాలు చూస్తూ కూడా మెదలకుండా ఊరుకుంటే మనకు మనమే అన్యాయం చేసుకొన్న వారమౌతాము.