Followers

Wednesday, 30 October 2013

ఆంజనేయుడు సముద్రాన్ని దాటాడు సరే,ఐతే మనకు ప్రయోజనం ఏంటి ?


"విజయం సాధించటం ఎలా?", "విజయానికి ఇన్ని మెట్లు" లాంటి పుస్తకాలు కోకొల్లలు. సరే.
కానీ మన ఆదికావ్యమైన రామాయణమును తరచిచూస్తే ఇలాంటి విషయాలు ఇందులో ఉన్నాయా అన్న ఆశ్చర్యం కలుగక మానదు.

సుందరకాండలో హనుమంతుడు సముద్రాన్ని దాటడం లో , ఒక పని సాధించాలనుకొనేవారికి ఆ పనిని ఎలా సాధించాలో, మనకు నేర్పిస్తుండడం మనము గమనిస్తే ఆశ్చర్యం కలుగక మానదు.

సముద్రాన్ని దాటడం సాధించాల్సిన పని. ఆంజనేయుడు తనకు సాధ్యము కాదని ఊరికే ఒకవైపు అమాయకముగా కూర్చొని ఉన్నాడు. అప్పుడు జాంబవంతుడు హనుమంతుని శక్తిని హనుమంతునికి గుర్తుచేసాడు. ఇక్కడ ఒక పని సాధించాలి అనుకొనేవాడు మొదట తన శక్తిని తెలుసుకోవాలి. అలా తెలుసుకోలేని పక్షంలో పని కావడానికి ప్రోత్సహించే మిత్రుడి లేదా శ్రేయోభిలాషి అవసరం ఎంతైనా ఉంది. అంటే మనకు ఎలాంటి మిత్రుల అవసరం అనే విషయములో మనము ఎంత జాగ్రత్తగా ఉండాలి అనేది మనం ఆలోచించాలి.

హనుమ బయలు దేరుతూ రామబాణం లా దూసుకెళ్ళి పనిని సాధిస్తానని ప్రకటించాడు. అంటే నాదేమీ లేదు భగవంతుడి చేతిలో ఒక పనిముట్టుగా ఉంటాను అనే భావము కలిగిఉండాలి. అంటే అహంకారము ఉండరాదు అని నేర్పుతున్నాడు.

ఇక సముద్రాన్ని దాటేప్పుడు మొదట బంగారు శిఖరాలు గల మైనాకపర్వతం ఆతిథ్యం తీసుకొమ్మని కోరింది. కాని హనుమంతుడు అందుకు కృతజ్ఞతలు తెలుపుతూ "మీకు ఎన్నో కృతజ్ఞతలు. కాని అత్యవసరమైన పని మీద వెడుతున్నాను. ఆలశ్యం చేయడం నాకు తగదు.పని ఐన తర్వాత మళ్ళీ కలుస్తాను" అంటూ ఒకసారి ఆ కొండను ముట్టుకొని "నీవు ఆతిథ్యం ఇచ్చినట్లే" అంటూ సెలవు పుచ్చుకొన్నాడు.
అంటే కార్యసాధనలో అలసత్వం పనికిరాదు అని, అదెటువంటి ఆకర్షణ ఐనా లొంగరాదని, అదే సమయములో ఎదుటివారు ప్రేమతో మనకు ఆతిథ్యం ఇస్తామన్నప్పుడు వారిని నొప్పించకుండా ఎలా మాట్లాడాలి, నడుచుకోవాలి అనే విషయం మనకు నేర్పుతున్నాడు.

ఇక తర్వాత సురస అనే నాగమాత నిన్ను ఆహారంగా తింటానని హనుమతో అనగా చాలా చిన్నగా మారిపోయి ఆమె నోట్లోకి దూరి వెంటనే మళ్ళీ బయటకు వచ్చేసాడు.
ఇక్కడ "అనువుగాని చోట అధికులమనరాదు" అని, ఎంత పెద్ద సమస్య ఐనా సూక్ష్మబుద్ధితో ఆలోచించి దానిని ఎలా సామరస్యముగా పరిష్కరించుకోవాలి అని, అది మన పనికి ఆటంకము కాకుండా ఎలా చూసుకోవాలి అని, కండబలమే కాదు బుద్ధిబలము కూడా అత్యవసరము అని మనకు నేర్పుతున్నాడు.

తర్వాత సింహిక అనే రాక్షసి హనుమంతుని తినబోగా ఆమె కడుపులోనికి దూరి ఆమె లోపలి అంగాలను పిండి చేసి ఆమెను చంపేసాడు.
ఇక్కడ మన కార్యసాధనలో మనం భరించలేని,తీవ్రమైన కష్టం ఎదురైనప్పుడు ఆ సమస్య యొక్క మూలాన్ని కనుగొని మూలాన్ని కనుక దెబ్బతీస్తే పునాదులు లేని భవనములా ఆ సమస్య కూడా కూలిపోతుంది అంటే పరిష్కారమవుతుంది అని నేర్పుతున్నాడు. అదే సమయములో సమస్య మూలాన్ని అన్వేషించేటప్పుడు ఆ సమస్య మనలను ముంచేయకుండా ఎంత అప్రమత్తముగా ఉండాలి అని కూడా నేర్పుతున్నాడు.ఇంతకు
మునుపు సమస్యను కేవలం బుద్ధిబలముతో పరిష్కరించాడు. కాని ఇప్పుడు బుద్ధిబలముతో పాటు సాహసాన్ని కూడా కల్గి ఉండాలని నేర్పుతున్నాడు.

తర్వాత ఇక ఏ బాధా లేకుండా సముద్రాన్ని దాటాడు.

ఇదండీ నాకు అర్థమైన హనుమంతుడి సముద్ర లంఘనం.

ఇంకా సీతమ్మను వెతకడం లో కూడా మనం తెలుసుకోవల్సింది ఎంతో ఉంది. కాని ప్రస్తుతానికి ఇలా ముగిస్తున్నాను.

Popular Posts