దక్షిణాదిన, ముఖ్యంగా, శివారాధన ప్రాబల్యంగా ఉన్న తమిళ నాట సుబ్రహ్మణ్య స్వామి ఒక ప్రధాన ఆరాధ్య దైవం. ఆరు పడి అని ఆరు పుణ్య క్షేత్రాలైన పళని, స్వామి మలై, తిరుచ్చెందూర్, త్రిపురకుంద్రం, పళముదిర్ చోలై, తిరుత్తణి క్షేత్రాలు మహా సుబ్రహ్మణ్య క్షేత్రాలుగా ప్రసిద్ధి చెందాయి. పిల్లలు పుట్టని వారికి, నాగ దోషమున్న వారికి, కుజ దోషమున్న వారికి ఈ క్షేత్రాలు గొప్ప ఫలితాలు ఇస్తాయని గట్టి నమ్మకం. అలాగే, కర్ణాటకలోని కుక్కే లో సుబ్రహ్మణ్యస్వామి క్షేత్ర కూడా అత్యంత మహిమాన్వితమైనదిగా చెప్పబడింది. ఈ క్షేత్రాలలో ఈ స్వామి సౌందర్యము, భోగము చెప్పనలవి కాదు. గుళ్ళ సంగతి పక్కకు పెట్టి, సుబ్రహ్మణ్య తత్త్వము గురించి కొంచెం చెప్పుకుందాం.
అవిద్య మరియు జ్ఞానము, దేవతలు మరియు అసురుల మధ్య జరిగే నిరంతర యుద్ధము, వాటి పరిణామమైన దైవిక శక్తుల విజయం - ఇదే సుబ్రహ్మణ్యుని లీలల సారము. స్కందుని జననం గురించి శ్రీమద్రామాయణం లో వాల్మీకి మహర్షి వివరంగా చెప్పారు. శివుని తేజస్సు (వీర్య రూపంలో) ఆయన ఆజ్ఞా చక్రమునుండి పెల్లుబుకి స్కందుని రూపము పొందినదట. అందుకనే స్కందుడు జ్ఞాన జ్యోతిగా ప్రతీక. శరవణమను సరస్సులో రెల్లు గడ్డి పెరిగే చోటనున్న ఆరు కమలముల నుండి పార్వతీ దేవి ఈ స్కందుని తీసుకున్నదట. సర్వోన్నత ఆధ్యాత్మిక అనుభూతి (అపరోక్షానుభూతి) అనేది యోగములో షడ్చక్రముల భేదన ద్వారా కలుగుతుంది. ఈ ఆరు చక్రముల భేదన ద్వారా జీవ శక్తి సహస్రార చక్రమున పూర్ణ యొక స్థితిని అనుభూతి పొందుతుంది. దీనికి సంకేతమైన ఆరు కమలములనుండి ఆవిర్భవించిన స్కందుడు సర్వోన్నత జ్ఞానమునకు, బుద్ధికి ప్రతీకగా నిలిచాడు. అందుకనే స్కందుడు అజ్ఞానమనే అంధకారాన్ని తొలగించే( ఈ ప్రపంచములో అజ్ఞాన రూపమైన అసురులను సంహరించే దైవిక శక్తి) పరిపూర్ణ జ్ఞాన స్వరూపముగా కొలవబడుతున్నాడు.