కుమార, కార్తికేయ, సుబ్రహ్మణ్య, షణ్ముఖ మొదలైన నామములతో పిలవబడే స్కందుడు పరమశివుని రెండవ పుత్రుడు. కోడి పుంజు (కుక్కుటం) ఇతని ధ్వజము, నెమలి ఇతని వాహనము. ఈయన శక్తులు (పత్నులు) వల్లి మరియు దేవసేన. తన తపస్సు చేయుచుండగా భంగము చేయ వచ్చిన మన్మథుని శివుడు తన మూడో నేత్రముతో దగ్ధము చేస్తాడు. ఆ అగ్నిని అగ్నిదేవుడు, వాయుదేవుడు ఆకాశ మార్గమున గంగానదిలో పడవేస్తారు. దాని తేజోశక్తిని భరించలేక గంగాదేవి దానిని ఒడ్డున ఉన్న రెల్లుగడ్డిలోకి నెడుతుంది. ఆ విధముగా పంచ భూతముల శక్తితో శివుని దివ్య తేజము ఏకమై ఆరు ముఖములు గల స్కందునిగా జన్మిస్తాడు. జ్ఞాన రూపమైన శివుని మూడో నేత్రమునుండి జన్మించిన వాడు కాబట్టి కార్తికేయుడు జ్ఞానావతారునిగా పేరు పొందాడు. ఇతని ఆయుధము శూలము. కేవలము స్కందుడు మాత్రమే అసురులైన శూరపద్ముడు, సింహముఖుడు, తారకుడు సంహరించగలడని బ్రహ్మ తనను వేడుకో వచ్చిన దేవతలకు తెలుపుతాడు. అప్పుడు స్కందుడు దేవతల సేనకు అధిపతి అవుతాడు. అప్పటినుంచి అతను సేనాపతిగా కూడా పిలవబడ్డాడు. స్కందుడు అసురులను జయించే వృత్తాంతాన్ని స్కాందపురాణంలో వివరించ బడింది. ఈ అసురులను జయించే రోజునే స్కంద షష్టిగా పూజించబడుతున్నది.
పఈ సుబ్రహ్మణ్య లక్షణాలు అన్నీ సంపుటంగా ఈ ధ్యాన శ్లోకంలో వివరించ బడ్డాయి.శ్రీ గాంగేయం వహ్నిగర్భం శరవణ జనితం జ్ఞానశక్తిం కుమారం ,
బ్రహ్మణ్యం స్కందదేవం గుహమమల గుణం రుద్ర తేజస్వరూపం
సేనాన్యం తారకఘ్నం గురుమచలమతిం కార్తికేయం షడాన్యం
సుబ్రహ్మణ్యం మయూరధ్వజ రథ సహితం దేవదేవం నమామి
గంగాదేవి శివుని శక్తిని కొంత సేపు మోసి, శక్తిని భరించ లేక రెల్లు గడ్డిలోకి త్రోయటంవలన గాంగేయుడు అని, అగ్ని శివుని శక్తిని తన వద్ద ఉంచుకొని గంగలో విడుచుట వలన అగ్నిగర్భుడని, జ్ఞాన శక్తి పరబ్రహ్మమని, గుహుడని, అమలమైన గుణము కలవాడని, రుద్రుని తేజస్స్వరూపమని, దేవతల సేనాపతియని, తారకాసురిని చంపిన వాడని, జ్ఞానానికి నిధియై గురు స్వరూపమని, అచలమైన బుద్ధి కలవాడని, రెల్లు గడ్డి నందు పుట్టినందు వలన శరవణ భవుడని, ఆరుముఖములు ఉండుట వలన షడాననుడు అని, నెమలిని అధిరోహించినందు వలన మయూర ధ్వజుడని, రథముని అధిరోహించిన వాడు అని ఈ ధ్యాన శ్లోకము ద్వారా ప్రార్ధించ బడినాడు.