ఎన్ని ప్రదక్షిణలు చెయ్యాలి?
ఈ విషయం మీద ఖచ్చితమయిన నిశ్చయం అయితే లేదు కానీ మనకు తోచినదానిని బట్టి బేసి సంఖ్యలలో అనగా 3, 5, 9,11 ఇలా చేయాలి అంటారు. మరి కొంతమంది మొక్కుకుని 108 చేస్తారు అవి మాత్రం సరి సంఖ్యలో ఉన్నాయేమిటి అనే సందేహం కలుగవచ్చు. అప్పుడు మన ఉపనిషత్తుల సారాన్ని బయటకి తీసి పరిశీలించిన మీదట చెప్పిన విషయమేమిటంటే వైష్ణవాలయాలకి అథమపక్షం నాలుగు ప్రదక్షిణలు, శైవాలయాలకి అథమపక్షం మూడు చేయాలని చెప్పారు. ఇక్కడ మనం ఎన్ని చేశాము అనేదానికన్నా ఎంత భక్తితో చేశాము అనేది ముఖ్యం.
ఇక్కడ ఇంకొక విషయాన్ని మీకు స్పష్టం చేయాలి. ఏమిటంటే బ్రహ్మలేని గుడి గుడే కాదు అన్నారు. మనకి తెలిసి బ్రహ్మకి ఒక్క గుడి ఉంది కానీ అయన లేని గుడి అంటే ఏదీ గుడి కింద పరిగణలోనికి రాదు కదా!. ధ్వజస్తంభం బ్రహ్మ గారికి ప్రతీక. కావున ధ్వజస్తంభం ఉన్నవన్నీఆలయాలవుతాయి లేనివి కేవలం మందిరాలవుతాయి. ప్రదక్షిణ చేసే సమయములో దేవునితో పాటు ఈ ధ్వజస్తంభం కూడా మన వృత్తంలోనే ఉండాలి. వైష్ణవాలయాలలో ప్రదక్షిణం చేసేటప్పుడు ఆలయ ముందు భాగానికి దూరముగా వెనుక భాగానికి దగ్గరగా చేయాలి. ఎందుకంటే వైష్ణవాలయాలలో ఆలయ ముందు భాగమున రాక్షసులు, వెనుక భాగమున దేవతలు ఉంటారుట. అలాగే శైవాలయాలలో ముందు భాగం వైపు దగ్గరగా, వెనుక భాగం వైపు దూరముగా ప్రదక్షిణలు చేయాలి ఇక్కడ వెనుకవైపు రాక్షసులు, ముందు వైపు దేవతలు ఉంటారుట. అందుకేనేమో మన ఆలయాలని ఆ విధముగానే నిర్మించారు.
ఈ ప్రదక్షిణలు మనం కేవలం గుడికీ, ఆత్మకే చేస్తామా? లేదు అగ్నికి చేస్తాం (వివాహసమయములో, హోమాల సమయములో), తల్లి తండ్రులకి చేస్తాం (వాళ్ళనే ఆది దంపతులుగా భావించి), రావిచెట్టు-వేప చెట్టు కలిసి ఉన్న చోట చేస్తాం, గోవుకి చేస్తాం (గోపూజ చేసిన తరువాత) ఇలా చెప్పుకుంటూ పోతే మంచి అన్న దానికి దేనికయినా మనం ప్రదక్షిణలు చేస్తాం తద్వారా మనలోని మంచిని పెంచుకుని ఆనందంగా, నిష్కల్మషంగా బ్రతకవచ్చు. అయితే ఈ ప్రదక్షిణలు చేసేటప్పుడు భక్తి తత్వముతో చేయాలి. మనలో ప్రదక్షిణలని ఎంత సమయములో చేశాము అని ఆలోచించేవాళ్ళు ఉన్నారు కానీ శ్రద్ధతో చేసే వాళ్ళు మనలో ఎంతమంది ఉన్నారు? భక్తి లేనప్పుడు లేదా ఆత్మ శుద్ధి లేనప్పుడు ఏది చేసినా, ఎన్ని ప్రదక్షిణలు చేసినా వ్యర్ధమే.అలౌకిక విషయాలను పక్కన పెడితే ప్రదక్షిణ శరీరానికి, మనస్సుకు కూడా ఉపయోగకరంగానే ఉంటుంది.