బలమే జీవనం, దౌర్బల్యమే దు:ఖం
నా మతసారం బలం (శారీరిక మానసిక ఆధ్యత్మిక బలం). గీత ఉపనిషద్భాగవత ధర్మాలలోఏదైనా కానివ్వండి మనో స్థైర్యం, ఆత్మోత్తేజం జనింపచేయని ధర్మాన్ని నేను ధర్మంగా పరిగణించను. ధర్మం అంటే బలం, శక్తి. బలాన్ని మించినది ఏదీ లేదు.
బలమే జీవనం, దౌర్బల్యమే మరణం. బలమే సౌఖ్యం, శాశ్వత జీవనం; దౌర్బల్యం నిరంతర ప్రయాస, దు:ఖం. దౌర్బల్యమే మరణం. బాల్యం నుండీ, కాదు శైశవం నుండే బలకరం, ఆస్తికం, సాహాయ్యకరమూ ఐన భావాలను మీ బుద్ధులలో ప్రవేశింపనివ్వండి.
దౌర్యల్యమే బాధకు కారణం. దుర్బలులం కావడం చేతనే దు:ఖితులమౌతూంటాం. దౌర్బల్యం చేతనే అసత్యం పలుకుతాం, దొంగిలిస్తాం, హత్య చేస్తాం, ఇతర నేరాలు అనేకం చేస్తాం. దౌర్బల్యం చేతనే బాధపడుతూంటాం. దౌర్బల్యం చేతనే మరణిస్తూంటాం. ఎక్కడ మనలను దుర్బలులం చేసేది ఏదీ ఉండదో, అక్కడ మరణం గాని, బాధగాని ఉండనే ఉండదు.
బలమే ఆవశ్యకమైనది. బలమే భవరోగానికి ఔషధం. దరిద్రులు ధనికుల వలన హింసకు గురియైనప్పుడు వారికి కావలసిన దివ్యౌషధం బలమే. పామరులు పండితులచే అణగద్రొక్కబడేటప్పుడు వారికి కావలసిన ఔషధం బలమే. పాపులు ఇతర పాపులచే పీడింపబడేటప్పుడు అదే వారికి అవశ్యకమైన ఔషధం.
స్వశక్తి మీద నిలబడి, ధీరుడవై మసలుకో. బలాఢ్యుడవై ఉండు. సమస్త బాధ్యతను నీ భుజస్కంధాలపై వహించు. నీ విధికి నువ్వే కర్తవని గ్రహించు. నీకు కావలసిన బలసంరక్షణలు నీలోనే ఉన్నాయి. కనుక నీ భవిష్యత్తును నువ్వు రూపొందించుకో.