ఈ ఆధునిక యుగంలో మానవుడు తన ఆరోగ్యం కోసం పడని పాట్లంటూ లేవు. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు మన పెద్దలు. నిజమేకదా ! ఆరోగ్యంగావుంటే ఆయుషు కూడా పెరుగుతుంది. ముఖ్యంగా ఆహారంలో శాఖాహారం ఉత్తమం అంటున్నారు వైద్యులు. శాఖాహారం తీసుకుంటే అధిక రక్తపోటునుండి కూడా మనిషి తనుతాను కాపాడుకోవచ్చని పరిశోధకులు తెలిపారు.
పౌష్టికాహారమే శరీరాన్ని మనస్సును ఆరోగ్యంగా వుంచుతుంది. ఈ భోజనంలో శరీరానిక
ి కావలసిన ఖనిజ పదార్థాలు, ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు, విటమిన్లతోబాటు పోషకపదార్థాలుండాలి. ఇవన్నీ కలిసున్న భోజనమే అమృతంతో సమానం. మనం తీసుకునే భోజనం ప్రకృతి సిద్ధమైనదైవుండాలి.
సమపాళ్ళలో తీసుకునే శాఖాహారం శరీరానికి అన్ని రకాల పోషకాలను అందిస్తుంది. దీంతో గుండెజబ్బులు, క్యాన్సర్, అధిక రక్తపోటు, మధుమేహం, కీళ్లనొప్పులు ఇతర జబ్బులనుండి కూడా బయట పడగలుగుతామని పరిశోధకులు తెలిపారు.
మాంసాహారం అధికంగా తీసుకునేవారిలో అధిక రక్తపోటును గమనించామని అదే శాఖాహారం తీసుకున్నవారిలో అమినో ఆమ్లము అధికంగా వుందని లండన్లో జరిపిన పరిశోధనలో తేలినట్లు పరిశోధకులు తెలిపారు. ఈ అమినో ఆమ్లం రక్తపోటును నివారిస్తుంది.
కాయగూరల్లో అమినో ఆమ్లంతోబాటు మెగ్నీషియం కూడా వుంటుందని ఇది రక్త పోటును క్రమబద్దీకరిస్తుందని పరిశోధకులు తెలిపారు. ఇంతేకాకుండా మాంసాహారుల్లో ఫైబర్ శాతం కూడా తక్కువగా వుంటుందని తేలింది.
ఫైబర్ మనకు ధాన్యాలలో అధికంగా లభిస్తుంది. పప్పులు, పండ్ల రసాలు, ఫ్రూట్ సలాడ్లలో అధికంగా లభిస్తుంది. ఇవి శరీర బరువునుకూడా క్రమబద్దీకరిస్తాయి. మాంసాహారం ఎక్కువగా తీసుకుంటే ఊబకాయం పెరిగిపోతుంది, కొవ్వుకూడా అధికంగా పేరుకు పోతుంది. ముఖ్యంగా శరీరానికి కార్బోహైడ్రేట్లు కూడా ఎంతో అవసరం.