శ్రీ భగవానువాచ :-
మయ్యాసక్తమనాః పార్థ
యోగం యుఞ్జన్మదాశ్రయః,
అసంశయం సమగ్రం మాం
యథా జ్ఞాస్యసి తచ్ఛృణు.
శ్రీభగవానుడు చెప్పెను - ఓ అర్జునా! నా యందాసక్తిగల మనస్సుగలిగి, నన్నే ఆశ్రయించి యోగము నాచరించుచు నిస్సందేహముగ సంపూర్ణముగ నన్నెట్లు తెలిసికొనగలవో దానిని (ఆ పద్ధతిని) చెప్పెదను వినుము.
******************************************************************************************* 1
జ్ఞానం తేహం సవిజ్ఞాన
మిదం వక్ష్యామ్య శేషతః,
యజ్జ్ఞాత్వా నేహ భూయోన్య
జ్జ్ఞాతవ్య మవశిష్యతే.
దేనిని తెలిసికొనినచో మరల యీ ప్రపంచమున తెలిసికొన దగినది మరియొకటి మిగిలియుండదో అట్టి అనుభవ సహితమగు జ్ఞానమును సంపూర్ణముగ నీకు చెప్పెదను.
******************************************************************************************* 2
మనుష్యాణాం సహస్రేషు
కశ్చిద్యతతి సిద్ధయే,
యతతామపి సిద్ధానాం
కశ్చిన్మాం వేత్తి తత్త్వతః.
అనేక వేలమంది మునుజులలో ఏ ఒకానొకడో మోక్షసిద్ధికై యత్నించుచున్నాడు. అట్లు యత్నించు వారైన అనేకమందిలో ఏ ఒకానొకడు మాత్రమే నన్ను వాస్తవముగ తెలిసికొనగల్గుచున్నాడు.
******************************************************************************************* 3
భూమిరాపోనలో వాయుః
ఖం మనోబుద్ధి రేవ చ,
అహంకార ఇతీయం మే
భిన్నా ప్రకృతిరష్టధా.
భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి, అహంకారము - అని యీ ప్రకారముగ ఎనిమిది విధములుగ నా యీ ప్రకృతి (మాయ) విభజింపబడినది.
******************************************************************************************* 4
అపరేయమితస్త్వన్యాం
ప్రకృతిం విద్ధి మే పరామ్,
జీవభూతాం మహాబాహో
యయేదం ధార్యతే జగత్.
గొప్ప బాహువులు గల ఓ అర్జునా! ఈ (అపరా) ప్రకృతి చాల అల్పమైనది. దీనికంటె వేరైనదియు, ఈ జగత్తునంతను ధరించునదియు జీవరూపమైనదియు నగు మరియొక ప్రకృతిని (పరాప్రకృతిని) శ్రేష్ఠమైన దానినిగా నెరుగుము.
******************************************************************************************* 5
ఏతద్యోనీని భూతాని
సర్వాణీత్యుపధారయ,
అహం కృత్స్నస్య జగతః
ప్రభవః ప్రలయస్తథా.
(జడ, చేతనములగు) సమస్త భూతములున్ను ఈ రెండు విధములగు (పరాపర) ప్రకృతుల వలననే కలుగునవియని తెలిసికొనుము. ఈ రెండు (ప్రకృతుల ద్వారా) నేనే ఈ సమస్త ప్రపంచముయొక్క ఉత్పత్తికి, వినాశమునకు కారణభూతుడనై యున్నాను.
******************************************************************************************* 6
మత్తః పరతరం నాన్య
త్కించిదస్తి ధనంజయ,
మయి సర్వమిదం ప్రోతం
సూత్రే మణిగణా ఇవ.
ఓ అర్జునా! నాకంటె వేరుగ మరియొకటి ఏదియు లేనేలేదు. దారమందుమణులవలె నాయందే సమస్త ప్రపంచము కూర్చబడినది.
******************************************************************************************* 7
రసోహమప్సు కౌంతేయ
ప్రభాస్మి శశిసూర్యయోః,
ప్రణవః సర్వ వేదేషు
శబ్దః ఖే పౌరుషం నృషు.
అర్జునా! నేను జలమందు రుచియు, చంద్ర సూర్యులందు కాంతియు, సమస్త వేదములందు ఓంకారమును ఆకాశమందు శబ్దమును మనుజులందు పరాక్రమమును అయియున్నాను.
******************************************************************************************* 8
పుణ్యో గంధః పృథివ్యాం చ
తేజశ్చాస్మి విభావసౌ,
జీవనం సర్వభూతేషు
తపశ్చాస్మి తపస్విషు.
(మఱియు నేను) భూమియందు సుగంధమును, అగ్నియందు ప్రకాశమును, సమస్త ప్రాణులయందు ప్రాణమును (లేక ఆయువును). తాపసులయందు తపస్సును అయియున్నాను.
******************************************************************************************* 9
బీజం మాం సర్వభూతానాం
విద్ధి పార్థ సనాతనమ్,
బుద్ధిర్బుద్ధిమతామస్మి
తేజస్తేజస్వినా మహమ్.
ఓ అర్జునా! నన్ను సమస్త ప్రాణులయొక్క శాశ్వతమైన బీజముగ నెఱుగుము. మఱియు బుద్ధిమంతుల యొక్క బుద్ధియు, ధీరులయొక్క ధైర్యమును నేనే అయియున్నాను.
******************************************************************************************* 10