యథా దీపో నివాతస్థో
నేజ్గతే సోపమాస్మృతా,
యోగినోయతచిత్తస్య
యుఞ్జతో యోగమాత్మనః.
గాలిలేనిచోటనున్న దీప మే ప్రకారము కదలక నిశ్చలముగనుండునో, ఆ ప్రకారమే ఆత్మధ్యానమును శీలించుచున్న యోగియొక్క స్వాధీనపడినచిత్తమున్ను నిశ్చలముగనుండును. కనుకనే యోగియొక్క నిశ్చలమనస్సునకు అట్టి గాలిలేనిచోటగల దీపము దృష్టాంతముగ చెప్పబడినది.
******************************************************************************************* 19
యత్రోపరమతే చిత్తం
నిరుద్ధం యోగసేవయా,
యత్రచైవాత్మనాత్మానం.
పశ్యన్నాత్మని తుష్యతి.
సుఖమాత్యంతికం యత్త
ద్బుద్ధిగ్రాహ్యమతీంద్రియమ్,
వేత్తి యత్ర న చైవాయం
స్థితశ్చలతి తత్త్వతః.
యంలబ్ధ్వా చాపరం లాభం
మన్యతే నాధికం తతః,
యస్మిన్ స్థితో న దుఃఖేన
గురుణాపి విచాల్యతే.
తం విద్యాద్దుఃఖసంయోగ
వియోగం యోగసంజ్ఞితమ్.
స నిశ్చయేన యోక్తవ్యో
యోగో నిర్విణ్ణచేతసా.
యోగాభ్యాసముచేత నిగ్రహింపబడిన మనస్సు ఎచట పరమశాంతిని బొందుచుండునో, ఎచట (పరిశుద్ధమైన) మనస్సుచే ఆత్మను సందర్శించుచు (అనుభవించుచు) యోగి తనయందే ఆనందమును బడయుచుండునో, ఎచటనున్నవాడై యోగి (ఇంద్రియములకు) గోచరము కానిదియు, (నిర్మల) బుద్ధిచే గ్రహింప బడదగినదియు అంతయు లేనిదియునగు సుఖమును అనుభవించుచుండునో, యఱియు స్వానుభవమునుండి ఏమాత్రము చలింపకుండునో, దేనిని పొందిన పిదప ఇతరమగు ఏ లాభమును అంతకంటె గొప్పదానినిగ తలంపకుండునో, దేనియందున్నవాడై మహత్తర దుఃఖముచేతగూడ చలింపకుండునో, దుఃఖసంబంధము లేశమైననులేని అట్టిస్థితినే యోగము (ఆత్మైక్యము, ఆత్మసాక్షాత్కారము) అని యెఱుగవలయును. అట్టి ఆత్మసాక్షాత్కారరూప యోగము దుఃఖముచే కలతనొందని ధీర మనస్సుచే పట్టుదలతో సాధింపదగియున్నది .
******************************************************************************************* 20,21,22,23
సంకల్ప ప్రభవాన్ కామాం
స్య్తక్త్వా సర్వానశేషతః,
మనసై వేంద్రియగ్రామం
వినియమ్య సమంతతః.
శనైః శనైరుపరమే
ద్బుద్ధ్యా ధృతిగృహీతయా,
ఆత్మసంస్థం మనః కృత్వా
న కించిదపి చింతయేతే.
సంకల్పము వలన గలిగెడు కోరికలన్నిటిని సంపూర్తిగా విడిచిపెట్టి, మనస్సుచే ఇంద్రియములను నలుప్రక్కల నుండి బాగుగ నిగ్రహించి ధైర్యముతో గూడిన బుద్ధిచే మెల్లమెల్లగ బాహ్య ప్రపంచము నుండి ఆ మనస్సును మరలించి అంతరంగమున విశ్రాంతి నొందవలెను. (ఉపరతిని బడయవలెను) మఱియు మనస్సును ఆత్మయందు స్థాపించి ఆత్మేతరమగు దేనిని గూడ చింతింపక యుండవలయును.
******************************************************************************************* 24,25
యతో యతో నిశ్చరతి
మనశ్చఞ్చల మస్థిరమ్,
తతస్తతో నియమ్యైత
దాత్మన్యేవ వశం నయేత్.
చపలస్వభావము గలదియు, నిలుకడలేనిదియునగు మనస్సు ఎచటెచట (ఏయే విషయముల యందు) సంచరించునో అచటచటనుండి దానిని మరలించి ఆత్మయందే స్థాపితము చేయవలెను. ఆత్మకధీనముగ నొనర్పవలెను.
******************************************************************************************* 26
ప్రశాంతమనసం హ్యేనం
యోగినం సుఖ ముత్తమమ్,
ఉపైతి శాంతరజసం
బ్రహ్మభూత మకల్మషమ్.
ప్రశాంతచిత్తుడును, (కామక్రోధాది) రజోగుణ వికారములు లేనివాడును, బ్రహ్మరూపమును బొందినవాడును, దోషరహితుడునగు ఈ ధ్యానయోగిని సర్వోత్తమమగు సుఖము (ఆత్మానందము) పొందుచున్నది కదా! (అట్లు పొందుట శాస్త్ర ప్రసిద్ధమని భావము)
******************************************************************************************* 27