Followers

Wednesday, 5 August 2015

జ్ఞానయోగః 4 (అథ చతుర్థోధ్యాయః, శ్రీ భగవద్గీత)-శ్రీ భగవద్గీత


ద్రవ్యయజ్ఞా స్తపోయజ్ఞా
యోగయజ్ఞాస్తథాపరే,
స్వాధ్యాయ జ్ఞానయజ్ఞాశ్చ
యతయః సంశితవ్రతాః.


కొందరు ద్రవ్యమును దానధర్మాది సద్విషయములందు వినియోగించుటచే యజ్ఞముగ గలవారును, కొందరు తపస్సే యజ్ఞముగ గలవారును, కొందరు (ప్రాణాయామాద్యష్టాంగ) యోగమే యజ్ఞముగ గలవారు నయియున్నారు. వారందరున్ను ప్రయత్నశీలురును దృఢవ్రతములు కలవారునయి యొప్పుచున్నారు.

*******************************************************************************************  28

అపానే జుహ్వతి ప్రాణం
ప్రాణేపానం తథాపరే,
ప్రాణాపానగతీ రుద్ధ్వా
ప్రాణాయామపరాయణాః.


ప్రాణాయామతత్పరులగు కొందరు ప్రాణాపానములయొక్క గతులను (మార్గములను) నిరోధించి అపానవాయువునందు ప్రాణవాయువును, ప్రాణ వాయువునందు అపానవాయువును హొమము చేయుచున్నారు. (పూరక, కంభక, రేచకముల నొనర్చుచున్నారని భావము.) .

*******************************************************************************************  29

అపరే నియతాహారాః
ప్రాణాన్‌ ప్రాణేషు జుహ్వతి,
సర్వే ప్యేతే యజ్ఞవిదో
యజ్ఞక్షపితకల్మషాః.


మరికొందరు ఆహారవిషయమున కట్టుబాటుగల వారై ప్రాణాది వాయువులను ప్రాణాదివాయువులందే హోమముచేయుచున్నారు. (లేక ఇంద్రియ వ్యాపారములను వశీకృతేంద్రియములందు వ్రేల్చుచున్నారు.) వీరందరున్ను యజ్ఞము నెరిగినవారును యజ్ఞముచే పాపము నశించినవారును అయియున్నారు.

*******************************************************************************************  30

యజ్ఞ శిష్టామృతభుజో
యాంతి బ్రహ్మ సనాతనమ్‌,
నాయం లోకోస్త్యయజ్ఞస్య
కుతోన్యః కురుసత్తమ.


కురువంశ శ్రేష్ఠుడవగు ఓ అర్జునా! (పైనదెల్పిన) యజ్ఞము లాచరింపగా శేషించిన అమృతరూపమైన అన్నమును భుజించువారు శాశ్వత పరబ్రహ్మమును పొందుదురు. అట్టి యజ్ఞ మొకదానినైనను చేయని వానికి ఇహలోక సుఖము లేదు. అట్టిచో నిక పరలోక సుఖమెక్కడిది? .

*******************************************************************************************  31

ఏవం బహువిధా యజ్ఞా
వితతా బ్రహ్మణో ముఖే,
కర్మజాన్‌ విద్ధి తాన్‌ సర్వా
నేవం జ్ఞాత్వా విమోక్ష్యసే.


ఈ ప్రకారముగ అనేకవిధములైన యజ్ఞములు వేదమునందు సవిస్తరముగ తెలుపబడియున్నవి. అవి యన్నియు కర్మమువలన పుట్టినవానినిగ (కర్మమునకు సంబంధించినవేయని) నీ వెఱుగుము. ఇట్లేఱిగిన నీవు విముక్తుడవు కాగలవు .

*******************************************************************************************  32

శ్రేయాన్‌ ద్రవ్యమయాద్యజ్ఞా
జ్జ్ఞా నయజ్ఞః పరంతప,
సర్వం కర్మాఖిలం పార్థ
జ్ఞానే పరిసమాప్యతే.


ఓ అర్జునా! ద్రవ్యమువలన సాధింపబడు యజ్ఞముకంటె జ్ఞానయజ్ఞము శ్రేష్ఠమైనది. ఏలయనిన సమస్త కర్మమున్ను నాశము కానిదగుచు (ఫలసహితముగ) జ్ఞానమునందే పర్యవసించుచున్నది (అంతర్భూత మగుచున్నది.)

*******************************************************************************************  33

తద్విద్ధి ప్రణిపాతేన
పరిప్రశ్నేన సేవయా,
ఉపదేక్ష్యంతి తే జ్ఞానం
జ్ఞానిన స్తత్త్వదర్శినః.


ఓ అర్జునా! అట్టి జ్ఞానమును నీవు తత్త్వవేత్తలగు జ్ఞానులకు సాష్టాంగనమస్కారము చేసియు, సమయముచూచి వినయముగ ప్రశ్నించియు, సేవచేసియు, వారివలన నెఱుగుము. వారు తప్పక నీకుపదేశింపగలరు.

*******************************************************************************************  34

యజ్జ్ఞా త్వా న పునర్మోహ
మేవం యాస్యసి పాణ్డవ,
యేన భూతాన్యశేషేణ
ద్రక్ష్య స్యాత్మన్యథోమయి.


ఓ అర్జునా! దేనిని తెలిసికొనినచో మరలనిట్టి మోహమును నీవు పొందకుందువో మఱియు దేనిచే సమస్త ప్రాణులను నీయందును, నాయందును గూడ చూడగలవో అట్టి జ్ఞానమును తత్త్వవేత్తల వలన తెలిసికొనుము.

*******************************************************************************************  35

అపి చేదసి పాపేభ్యః
సర్వేభ్యః పాపకృత్తమః
సర్వం జ్ఞానప్లవేనైవ
వృజినం సంతరిష్యసి.


ఒకవేళ పాపాత్ములందరికంటెను నీవు మిగుల పాపము చేసినవాడవైతివేని ఆ సమస్త పాపసముద్రమును జ్ఞానమను తెప్పచేతనే లెస్సగ దాటివేయగలవు.

*******************************************************************************************  36

Popular Posts