Followers

Wednesday 5 August 2015

అర్జున విషాదయోగః 2 (అథ ప్రథమోధ్యాయః, శ్రీ భగవద్గీత)


అపర్యాప్తం తదస్మాకం
బలం భీష్మాభిరక్షితమ్‌,
పర్యాప్తం త్విదమేతేషాం
బలం భీమాభిరక్షితమ్‌

అట్టిశూరులు కల మన సైన్యము భీష్మునిచే గాపాడబడుచు అపరిమితముగనున్నది. (అజేయమైయొప్పచున్నది) పాండవుల యొక్క ఈ సేనయో భీమునిచే రక్షింపబడుచు పరిమితమగనున్నది. (జయింపశక్యమైయున్నది)

******************************************************************************************* 10

అయనేషు చ సర్వేషు
యథా భాగమవస్థితాః,
భీష్మ మేవాభిరక్షంతు
భవంతస్సర్వ ఏవ హి.

మీరందరున్ను ప్యూహమార్గములందు మీ మీ నియమిత స్థానములందుండి భీష్మునే సర్వవిధముల కాపాడుచుండవలయును.

******************************************************************************************* 11

తస్య సఞ్జనయన్‌ హర్షం
కురువృద్ధః పితామహః,
సింహనాదం వినద్యోచ్చై
శ్శజ్ఖం దధ్మౌ ప్రతాపవాన్‌.

పరాక్రమశాలియు, కురువృద్ధుడునగు భీష్మ పితామహుడంతట దుర్యోధనున కుత్సాహము గలుగునటుల పెద్దగ సింహధ్వని జేసి శంఖమును వూరించెను.

******************************************************************************************* 12

తత శ్శజ్ఖాశ్చ భేర్యశ్చ
పణవానక గోముఖాః,
సహసై వాభ్యహన్యంత
స శబ్దస్తుములో భవత్‌.

భీష్ముడు శంఖారావము చేసిన పిమ్మట కౌరవ సైన్యమందలి తక్కినవారున్ను శంఖములను, భేరులను, తప్పెటలు మున్నగువానిని వెంటనే మ్రోగించిరి. ఆ శబ్దముచే దిక్కులు పిక్కటిల్లెను.

******************************************************************************************* 13

తత శ్శ్వేతైర్హయైర్యుక్తే
మహతి స్యందనే స్థితౌ,
మాధవః పాణ్డవశ్చైవ
దివ్యౌ శజ్ఖౌ ప్రదధ్మతుః.

పిమ్మట తెల్లని గుర్రములబూంచిన గొప్ప రథము అందు గూర్చొనియున్న కృష్ణార్జును లిరువురును తమ తమ దివ్యములగు శంఖములను గట్టిగ ఊదిరి.

******************************************************************************************* 14

పాఞ జన్యం హృషీకేశో
దేవదత్తం ధనఞ్జయః,
పౌణ్డ్రం దధ్మౌ మహాశజ్ఖం
భీమకర్మా వృకోదరః

అనంతవిజయం రాజా
కుంతీపుత్రో యుధిష్ఠిరః,
నకుల స్సహదేవశ్చ
సుఘోష మణిపుష్పకౌ.

కాశ్యశ్చ పరమేష్వాస
శ్శిఖణ్డీ చ మహారథః,
ధృష్టద్యుమ్నో విరాటశ్చ
సాత్యకిశ్చా పరాజితః

ద్రుపదో ద్రౌపదేయాశ్చ
సర్వశః పృథివీపతే,
సౌభద్రశ్చ మహాబాహు
శ్శజ్ఖాన్‌ దధ్ముఃపృథక్పృథక్‌

శ్రీ కృష్ణుడు పాంచజన్యమను శంఖమును ఊదెను. అర్జునుడు దేవదత్తమును ఊదెను. భయంకర కార్యములనొనర్చు భీముడు పౌండ్రమను గొప్ప శంఖమును ఊదెను. కుంతీసుతుడగు ధర్మరాజు అనంతవిజయమును, నకులుడు సుఘోషమును, సహదేవుడు మణిపుష్పకమును ఊదిరి. అట్లే గొప్ప ధనుస్సుగల కాశీరాజున్ను, మహారథుడగు శిఖండియు, ధృష్టద్యుమ్నుడును, విరటుడును, అపజయమునొందని వాడగు సాత్యకియు, ద్రుపదుడును, ద్రౌపదీ తనయులగు ఉపపాండవులును, గొప్ప భుజబలముగల అభిమన్యుడును సేవయందంతట వేరు వేరుగా తమ తమ శంఖములను ఊదురి.

******************************************************************************************* 15,16,17,18

Popular Posts