Followers

Saturday, 8 August 2015

శ్రద్ధాత్రయవిభాగయోగః 2 (అథ సప్తదశోధ్యాయః, భగవద్గీత)-శ్రీ భగవద్గీత

యాతయామం గతరసం‌
పూతి పర్యుషితం చ యత్‌,
ఉచ్ఛిష్టమపి చామేధ్యం
భోజనం తామసప్రియమ్‌.



వండిన పిమ్మట ఒక జాము దాటినదియు (లేక బాగుగ ఉడకనిదియు), సారము నశించినదియు, దుర్గంధము గలదియు, పాచిపోయినదియు (వండిన పిదప ఒకరాత్రి గడచినదియు), ఒకరు తినగా మిగిలినది (ఎంగిలి చేసినది) యు, అశుద్ధముగానున్నదియు (భగవంతునకు నివేదింపబడనిదియు) అగు ఆహారము తమోగుణము గలవారి కిష్టమైనది యగును.

******************************************************************************************* 10

అఫలాకాంక్షి భిర్యజ్ఞో‌
విధిదృష్టో య ఇజ్యతే‌,
యష్టవ్యమేవేతి మన
స్సమాధాయ స సాత్త్వికః‌.



'ఇది చేయదగినదియే' యని మనస్సును సమాధాన పఱచి శాస్త్రసమ్మతమగు ఏ యజ్ఞము ఫలాపేక్షలేని వారిచేత చేయబడుచున్నదో అది సాత్త్వికయజ్ఞమనబడును .

******************************************************************************************* 11

అభిసంధాయ తు ఫలం
దంభార్థమపి చైవ యత్‌,
ఇజ్యతే భరతశ్రేష్ఠ
తం యజ్ఞం విద్ధి రాజసమ్‌.



భరతవంశ శ్రేష్ఠుడవగు ఓ అర్జునా! ఫలమును గోరియు డంబము కొఱకును గావింపబడు యజ్ఞమును రాజసమైనదానినిగా నీవు తెలిసికొనుము.

******************************************************************************************* 12

విధిహీన మసృష్టాన్నం
మంత్రహీన మదక్షిణమ్‌,
శ్రద్ధావిరహితం యజ్ఞం
తామసం పరిచక్షతే.



విధ్యుక్తము కానిదియు, అన్నదానము లేనిదియు, మంత్రరహితమైనదియు, దక్షిణలేనిదియు, శ్రద్ధ బొత్తిగా లేనిదియునగు యజ్ఞము తామస యజ్ఞమని చెప్పబడును.

******************************************************************************************* 13

దేవద్విజగురుప్రాజ్ఞ
పూజనం శౌచమార్జవమ్‌,
బ్రహ్మచర్యమహింసా చ
శారీరం తప ఉచ్యతే



దేవతలను, బ్రహ్మనిష్ఠులను, గురువులను, జ్ఞానులను (మహాత్ములను, బ్రహ్మజ్ఞానముగల పెద్దలను) పూజించుట, బాహ్యాభ్యంతర శుద్ధిగలిగియుండుట, ఋజుత్వముతో గూడియుండుట, (కుటిలత్వము లేకుండుట, మనోవాక్కాయములతో ఏకరీతిగా వర్తించుట),బ్రహ్మచర్యవ్రతమును పాలించుట, ఏ ప్రాణిని హింసింపకుండుట శారీరక (శరీరసంబంధమైన) తపస్సని చెప్పబడుచున్నది.

******************************************************************************************* 14

అనుద్వేగకరం వాక్యం
సత్యం ప్రియహితం చ యత్‌,
స్వాధ్యాయాభ్యసనం చైవ
వాజ్మయం తప ఉచ్యతే.



ఇతరుల మనస్సునకు బాధగలిగింపనిదియు, సత్యమైనదియు, ప్రియమైనదియు, మేలు గలిగించునదియునగు వాక్యమును, వేదాదులయొక్క అధ్యయనమును అభ్యసించుట (వేదము, ఉపనిషత్తులు, భగవద్గీత, భారత భాగవత రామాయణాదులు మున్నగువానిని అధ్యయనము చేయుట ప్రణవాది మంత్రములను జపించుట) వాచిక తపస్సని చెప్పబడుచున్నది.

******************************************************************************************* 15

మనః ప్రసాదస్సౌమ్యత్వం
మౌనమాత్మవినిగ్రహః,
భావసంశుద్ధిరిత్యేత
త్తపో మానస ముచ్యతే.



మనస్సును నిర్మలముగా నుంచుట (కలతనొందనీయక స్వచ్చముగా నుండుట), ముఖప్రసన్నత్వము (క్రూరభావము లేకుండుట), పరమాత్మనుగూర్చిన మననము (దైవధ్యానము) గలిగియుండుట {లేక దృశ్య సంకల్పము లెవ్వియులేక ఆత్మయందే స్థితి గలిగియుండుట అను (వాజ్మౌన సహిత) మనో మౌనము} మనస్సును బాగుగ నిగ్రహించుట, పరిశుద్ధమగు భావము గలిగియుండుట (మోసము మున్నగునవి లేకుండుట) అను నివి మానసిక తపస్సని చెప్పబడుచున్నది.

******************************************************************************************* 16

శ్రద్ధయా పరయా తప్తం
తపస్త త్త్రివిధం నరైః,
అఫలాకాంక్షి భిర్యుక్తై
స్సాత్త్వికం పరిచక్షతే.



ఫలాపేక్షలేనివారును, నిశ్చలచిత్తులును, లేక దైవభావనాయుక్తులును అగు మనుజులచే అధికమగు శ్రద్ధతో ఆచరింపబడినట్టి ఆ (పైన దెల్పిన శారీరక, వాచిక, మానసికములగు) మూడు విధములైన తపస్సును సాత్త్వికమని (సాత్త్విక తపస్సని) (పెద్దలు) చెప్పుచున్నారు.

******************************************************************************************* 17

సత్కారమాన పూజార్థం
తపో దంభేన చైవ యత్‌,
క్రియతే తదిహ ప్రోక్తం
రాజసం చలమధ్రువమ్‌.



ఇతరులచే తాము సత్కరింపబడవలెనని, గౌరవింపబడవలెనని, పూజింపబడవలెనని డంబముతో మాత్రమే చేయబడుతపస్సు అస్థిరమై, అనిశ్చితమైనట్టి ఫలముగలదై (లేక చపలమైనట్టి రూపముగలదై) ఈ ప్రపంచమున రాజస తపస్సు అని చెప్పబడినది.

******************************************************************************************* 18



Popular Posts