హతో వా ప్రాప్స్యసే స్వర్గం
జిత్వా వా భోక్ష్యసే మహీమ్,
తస్మాదుత్తిష్ఠ కౌంతేయ!
యుద్ధాయ కృతనిశ్చయః.
అర్జునా! ఒకవేళ నీవీ ధర్మయుద్ధమందు శత్రువులచే చంపబడినచో స్వర్గమును బొందెదవు. అట్లుగాక నీవే జయించినచో భూలోక రాజ్యము ననుభవించెదవు. ఈ ప్రకారముగ రెండు విధముల మేలే. కావున లెమ్ము, యుద్ధమునకు సంసిద్ధుడవు కమ్ము.
******************************************************************************************* 37
సుఖదుఃఖే సమేకృత్వా
లాభాలాభౌ జయాజయౌ,
తతో యుద్ధాయ యుజ్యస్వ
నైవం పాప మవాప్స్యసి.
సుఖదుఃఖములయందును, లాభనష్టములందును, జయాపజయములందును సమబుద్ధిగలిగి యుద్ధమునకు సంసిద్ధుడవగుము. ఇట్లు చేసితివేని నీవు పాపమును పొందకుందువు.
******************************************************************************************* 38
ఏషా తేభిహితా సాంఖ్యే
బుద్ధిర్యోగే త్విమాం శృణు,
బుద్ధ్యా యుక్తో యయా పార్థ!
కర్మబంధం ప్రహాస్యసి.
ఓ అర్జునా! ఇంతవరకు సాంఖ్యశాస్త్రమున జెప్పబడిన ఆత్మతత్త్వ నిశ్చయమును దెలిపియుంటిని. ఇక యోగశాస్త్రమందలి కర్మయోగ సంబంధమైన వివేకమును నీకు దెపులబోవుచున్నాను. అద్దాని నెరింగినచో నీవు కర్మబంధము నుండి లెస్సగ విముక్తుడవు కాగలవు. కాబట్టి శ్రద్ధతో నాలకింపుము.
******************************************************************************************* 39
నేహాభిక్రమనాశోస్తి
ప్రత్యవాయో న విద్యతే,
స్వల్పమప్యస్య ధర్మస్య
త్రాయతే మహతోభయాత్.
ఈ కర్మయోగము ప్రారంభింపబడినది నిష్పలమెన్నటికిని కానేరదు. పూర్తియగుటకు ముందుగా ఏ కారణముచేనైన మధ్యలో నిలిచిపోయినను దోషము లేదు. ఈ కర్మయోగానుష్ఠానమను ధర్మము ఒకింతైనను గొప్పదైన (జనన, మరణ ప్రవాహ రూపమైన) సంసార భయము నుండి రక్షించుచున్నది.
******************************************************************************************* 40
వ్యవసాయాత్మికాబుద్ధి
రేకేహ కురునందన!
బహుశాఖా వ్యానంతాశ్చ
బుద్ధయోవ్యవసాయినామ్.
అర్జునా! ఈ కర్మాయోగానుష్ఠానమున నిశ్చయముతో గూడిన బుద్ధి ఒక్కటియే. నిశ్చయములేని వారలయొక్క బుద్ధులు పలువిధములుగను, అనంతములుగను నున్నవి.
******************************************************************************************* 41
యామిమాం పుష్పితాం వాచం
ప్రవదంత్యవిపశ్చితః,
వేదవాదరతాః పార్థ !
నాన్యదస్తీతి వాదినః.
కామాత్మానః స్వర్గపరా
జన్మకర్మ ఫల ప్రదామ్,
క్రియావిశేష బహులాం
భోగైశ్వర్యగతిం ప్రతి.
భోగైశ్వర్య ప్రసక్తానాం
తయాపహృతచేతసామ్,
వ్యవసాయాత్మికా బుద్ధి
స్సమాధౌ న విధీయతే.
ఓ అర్జునా! వేదమునందు ఫలమును దెలుపు భాగములం దిష్టము కలవారును, అందు చెప్పబడిన స్వర్గాదిఫలితములకంటె అధికమైనది వేరొకటి యెద్దియు లేదని వాదించువారును, విషయవాంఛలతో నిండిన చిత్తముకలవారును, స్వర్గాభిలాషులునగు అల్పజ్ఞులు, జన్మము, కర్మము, తత్ఫలము నొసంగునదియు, భోగైశ్వర్య సంపాదనకై వివిధ కార్యకలాపములతో గూడినదియు, ఫలశూన్యమైనదియునగు ఏ వాక్యమును చెప్పుచున్నారో, అద్దానిచే నపహరింపబడిన చిత్తముకలవారును (ఆ వాక్యమును నమ్మి దృశ్యవ్యామోహమందు పడువారును), భోగైశ్వర్యప్రియులునగు జనులకు దైవధ్యానమందు (సమాధినిష్ఠయందు)నిశ్చయమైన, (ఏకాగ్రమైన) బుద్ధి కలుగనే కలుగదు.
******************************************************************************************* 42,43,44
త్రైగుణ్యవిషయా వేదా
నిస్త్రై గుణ్యో భవార్జున
నిర్ద్వంద్వో నిత్యసత్త్వస్థో
నిర్యోగక్షేమ ఆత్మవాన్.
ఓ అర్జునా! వేదములు (అందలి పూర్వభాగమగు కర్మకాండము) త్రిగుణాత్మకములగు (సంసార) విషయములను తెలుపునవిగా నున్నవి. నీవు త్రిగుణములను వదలినవాడవును, ద్వంద్వములు లేనివాడవును, నిరంతరము శుద్ధసత్వము నాశ్రయించినవాడవును, యోగక్షేమములదృష్టి లేనివాడవును, ఆత్మజ్ఞానివియు కమ్ము!.
******************************************************************************************* 45