Followers

Wednesday, 5 August 2015

అర్జున విషాదయోగః 5 (అథ ప్రథమోధ్యాయః, శ్రీ భగవద్గీత)


తస్మాన్నార్హావయం హంతుం
ధార్తరాష్ట్రాంస్వబాంధవాన్‌,
స్వజనం హి కథం హత్వా
సుఖిన స్స్యామ మాధవ!

ఓ కృష్ణా! కావున మన బంధువులగు దుర్యోధనాదులను చంపుటకు మనము తగము. మనవారిని చంపి మన మెట్లు సుఖపడగలము?

******************************************************************************************* 37

యద్యప్యేతే న పశ్యంతి
లోభోపహతచేతసః,
కులక్షయకృతం దోషం
మిత్రద్రోహేచ పాతకమ్‌.

కథం న జ్ఞేయమస్మాభిః
పాపాదస్మా న్నివర్తితుమ్‌,
కులక్షయకృతం దోషం
ప్రపశ్యద్భిర్జనార్దన!

ఓ కృష్ణా! రాజ్యలోభముచే భ్రష్టచిత్తులైన దుర్యోధనాదులు వంశనాశనము వలన గలుగు దోషమును, మిత్రద్రోహము వలన గలుగు పాపమును, ఒకవేళ యెఱుగకున్నను, ఆ రెండింటిని బాగుగ తెలిసినట్టి మనమేల యీ పాపకృత్యమునుండి విరమింపగూడదో అర్థము కాకున్నది.

******************************************************************************************* 38,39

కులక్షయే ప్రణశ్యంతి
కులధర్మాస్సనాతనాః,
ధర్మేనష్టే కులం కృత్స్న
మధర్మోభిభవత్యుత.

అధర్మాభిభవాత్కృష్ణ!
ప్రదుష్యంతి కులస్త్రియః,
స్త్రీషు దుష్టాసు వార్ష్ణేయ!
జాయతే వర్ణ సంకరః.

సంకరో నరకాయైవ
కులఘ్నానాం కులస్య చ,
పతంతి పితరో హ్యేషాం
లుప్తపిణ్డోదకక్రియం.

ఓ కృష్ణా! కులము నశించుటచే అనాదిగ వచ్చు కులధర్మములు అంతరించిపోవును. ధర్మము నశించుటచే కులమంతటను అధర్మము వ్యాపించును. అధర్మము వృద్ధినొందుటచే, కులస్త్రీలు చాల చెడిపోవుదురు. స్త్రీలు చెదిపోవుటచే వర్ణసంకర మేర్పడును. అట్టి వర్ణసంకరము వలన సంకరము చేసినవారికి, సంకరమునొందిన కులమునకు గూడ నరకము సంప్రాప్తించును. వారి పితృదేవతలు శ్రాద్ధములు, తర్పణములు లేనివారై యథోగతిని బొందుదురు.

******************************************************************************************* 40,41,42

దోషై రేతైః కులఘ్నానాం
వర్ణసజ్కరకారకైః
ఉత్సాద్యంతే జాతిధర్మాః
కులధర్మశ్చ శాశ్వతాః.

ఉత్సన్న కులధర్మాణాం
మనుష్యాణాం జనార్దన!
నరకే నియతం వాసో
భవతీత్యనుశుశ్రుమ.

ఓ కృష్ణా! కులనాశకులయొక్క జాతిసాంకర్యహేతువులైన ఈ దోషముల చేత శాశ్వతములగు జాతి ధర్మములు, కులధర్మములు నశించుపోవుచున్నవి. కుల ధర్మములు నశించిన మానవులకు శాశ్వత నరక నివాసము కలుగునని మనము వినియున్నాము.

******************************************************************************************* 43,44

అహో! బత! మహత్పాపం
కర్తుం వ్యవసితావయమ్‌,
యద్రాజ్యసుఖలోభేన
హంతుం స్వజన ముద్యతాః.

కటకటా! రాజ్యసుఖమందలి యాశచే మనము బంధువులను చంపుట కుద్యమించి మహాపాపమును చేయుటకు సమకట్టితిమి కదా!.

******************************************************************************************* 45

యది మామప్రతీకార
మశస్త్రం శస్త్రపాణయః
ధార్తరాష్ట్రా రణే హన్యు
స్తన్మే క్షేమతరం భవేత్‌.

ఆయుధములు ధరింపకయు, ఎదిరించకయునున్న నన్ను ఆయుధములు చేబూనిన దుర్యోధనాదు లీయుద్ధమున జంపుదు రేని అది నాకు మరింత క్షేమమైనదియే యగును.

******************************************************************************************* 46

సఞ్జయ ఉవాచ:-

ఏవముక్త్వార్జునస్సజ్ఞ్యే
రథోపస్థ ఉపావిశత్‌,
విసృజ్య సశరం చాపం
శోక సంవిగ్న మానసః

సంజయుడు చెప్పెను - (ఓ ధృతరాష్ట్ర మహారాజా!) యుద్ధభూమియం దర్జును డీప్రకారముగ జెప్పి, శోకముచే కలతనొందిన చిత్తముగలవాడై, బాణముతో గూడిన వింటిని పారవైచి రథముపై చతికిలబడెను.

******************************************************************************************* 47

ఇతి శ్రీమద్భావద్గీతానూపనిషత్సు, బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే, శ్రీకృష్ణారునసంవాదే, అర్జున విషాదయోగోనామ ప్రమమోధ్యాయః

Popular Posts