సఞ్జయ ఉవాచ :-
తం తథా కృపయో విష్ట
మశ్రుపూర్ణాకు లేక్షణమ్,
విషీదంతమిదం వాక్య
మువాచ మధుసూదనః
సంజయుడు చెప్పెను - (ఓ ధృతరాష్ట్ర మహారాజా!) ఆ ప్రకారముగ కనికరముతో గూడుకొని కంటనీరు పెట్టుకొనినవాడై వ్యాకులత్వము చెంది దుఃఖించుచున్న అర్జునుని జూచి శ్రీకృష్ణు డిట్లుపలికెను.
******************************************************************************************* 1
శ్రీ భగవానువాచ :-
కుతస్త్వా కశ్మలమిదం
విష మే సముపస్థితమ్,
అనార్యజుష్ట మస్వర్గ్య
మకీర్తి కరమర్జున!
శ్రీ భగవానుడు చెప్పెను. ఓ అర్జునా! పామరు లవలంబించునదియు, స్వర్గప్రతిబంధకమును, అపయశస్సును గలుగజేయునదియునగు ఈ మోహము, ఈ యొడుదుడుకు సమయమున నీ కెక్కడినుండి దాపురించినది?'
******************************************************************************************* 2
క్లైబ్యం మాస్మగమః పార్థ!
నైతత్త్వయ్యుపపద్యతే,
క్షుద్రం హృదయదౌర్బల్యం
త్యక్త్వోత్తిష్ఠ పరంతప!.
ఓ అర్జునా! అధైర్యమును పొందకుము. ఇది నీకు తగదు. నీచమగు ఈ మనోదుర్బలత్వమును వీడి యుద్ధము చేయుటకు లెమ్ము.
******************************************************************************************* 3
అర్జున ఉవాచ :-
కథం భీష్మమహం సంఖ్యే
ద్రోణం చ మధుసూదన!
ఇషుభిః ప్రతియోత్స్యామి
పూజార్హావరిసూదన!
అర్జునుడు పలికెను - ఓ కృష్ణా! భీష్మద్రోణు లిరువురును పూజింపదగినవారు. అట్టివారిపై బాణములను వదలి నేనెట్లు యుద్ధము చేయగలను?
******************************************************************************************* 4
గురూన హత్వాహిమహానుభావాన్
శ్రేయోభోక్తుం భైక్ష్యమపీహలోకే,
హత్వార్థకామాంస్తు గురూనిహైవ
భుఞ్జీయభోగాన్ రుధిరప్రదిగ్ధాన్.
మహానుభావులైన గురువులను చంపక ఈలోకము నందు భిక్షాన్నమైనను భుజించుట మంచిది. వారిని చంపినచో అత్తఱి వారి రక్తముతో తడిసిన ధనసంపదలనే (కామ్యభోగములనే) అనుభవింపవలసియుండును.
******************************************************************************************* 5
న చైతద్విద్మః కతరన్నో గరీయో
యద్వా జయేమ యది వా నో జయేయుః,
యానేవహత్వా న జిజీవిషామ
సై వస్థితాః ప్రముఖేధార్త రాష్ట్రాః.
పైగా ఈ యుద్ధమున మనము గెల్చుదుమో లేక వారే గెల్చుదురో చెప్పలేము. ఈ రెండింటిలో మనకేది శ్రేష్థమోకూడ తెలియదు. ఎవరిని చంపి మనము జీవించగోరమో అట్టి భీష్మాదులు యుద్ధమున మనయెదుట నిలిచియున్నారు.
******************************************************************************************* 6
కార్పణ్యదోషోపహతస్వభావః
పృచ్ఛామిత్వాంధర్మ సమ్మూఢచేతాః
యఛ్ఛ్రేయస్స్యాన్నిశ్చితం బ్రూహితన్మే
శిష్యసైహం శాధి మాం త్వాం ప్రపన్నమ్.
ఓ కృష్ణా! కృపణత్వము (ఆత్మజ్ఞానశూన్యత) అను దోషముచే కొట్టబడినవాడనగుటచే ధర్మవిషయమున సందేహము గలిగి మిమ్మడుగుచున్నాను. ఏది నిశ్చయముగ శ్రేయస్కరమో దానిని చెప్పుడు - నేను మీకు శిష్యుడను; శరణుబొందిన నన్ను 'ఈ ప్రకారముగ నడచుకొనుము' - అని శాసింపుడు.
******************************************************************************************* 7
న హి ప్రపశ్యామి మమాపనుద్వా
ద్యచ్ఛోకముచ్ఛోషణ మింద్రియాణామ్,
అవాప్య భూమా వసపత్నమృద్ధం
రాజ్యంసురాణామపిచాధిపత్యమ్.
ఈ భూమండలమున శత్రువులు లేని సమృద్ధమైన రాజ్యమును, (స్వర్గమున) దేవతల యొక్క ఆధిపత్యమును పొందియుగూడ. ఇంద్రియములను శోషింప జేయుచున్న ఈ నా దుఃఖము నేది పోగొట్టగలదో దానిని కనుగొనజాలకున్నాను.
******************************************************************************************* 8
సఞ్జయ ఉవాచ :-
ఏవముక్త్వా హృషీకేశం
గుడాకేశః పరంతపః
న యోత్స్య ఇది గోవింద
ముక్త్వా తూష్ణీం బభూవ హ.
సంజయుడు చెప్పెను - ఓ రాజా! ఇవ్విధముగ అర్జునుడు శ్రీకృష్ణునితో చెప్పి 'నేను యుద్ధము చేయనని' పలికి ఊరకుండెను.
******************************************************************************************* 9