శ్రీ భగవానువాచ :-
ప్రజహాతి యదా కామాన్
సర్వాన్ పార్థ మనోగతాన్,
ఆత్మన్యేవాత్మనా తుష్టః
స్థితప్రజ్ఞ స్తదోచ్యతే.
శ్రీకృష్ణుడు చెప్పెను: ఓ అర్జునా! ఎపుడు మనుజుడు తన మనస్సునందున్నట్టి కోరికలన్నిటిని సంపూర్ణముగ వదలివేయునో, మరియు ఆత్మయందే ఆత్మచే (నిర్మలచిత్తముతో) నిరంతరము సంతుష్టిని బొందుచుండునో, అప్పుడాతడు స్థితప్రజ్ఞుడని చెప్పబడును.
******************************************************************************************* 55
దుఃఖేష్వనుద్విగ్నమనాః
సుఖేషు విగతస్పృహః,
వీతరాగ భయక్రోధః
స్థితధీర్మునిరుచ్యతే.
దుఃఖములందు కలతనొందని మనస్సుగలవాడును, సుఖములందు ఆసక్తిలేనివాడును, అనురాగము, భయము, కోపము తొలగినవాడునగు (ఆత్మ) మననశీలుడు స్థితప్రజ్ఞుడని చెప్పబడును.
******************************************************************************************* 56
యస్సర్వత్రానభిస్నేహ
స్తత్తత్ర్పాప్య శుభాశుభమ్,
నాభినందతి న ద్వేష్టి
తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా.
ఎవడు సమస్త విషయములందును (దేహ, బంధు, భోగాదులందు) అభిమానము లేకయుండునో, ఆయా ప్రియాప్రియములు సంభవించినను సంతోషమునుగాని, ద్వేషమునుగాని బొందకుండునో, అట్టివాని జ్ఞానము మిగుల స్థిరమైనది యగును. (అట్టివాడే స్థితప్రజ్ఞుడు)
******************************************************************************************* 57
యదా సంహరతే చాయం
కూర్మోజ్గానీవ సర్వశః,
ఇంద్రియాణీంద్రియార్థేభ్య
స్తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా.
తాబేలు తన అవయవములను లోనికి ముడుచుకొనునట్లు, యోగి యెపుడు తన ఇంద్రియములను ఇంద్రియార్థములగు విషయములనుండి సర్వత్ర వెనుకకు మరల్చుచున్నాడో, అపుడాతని జ్ఞానము మిగుల స్థిరమైనది యగును.(అతడు స్థితప్రజ్ఞుడగును)
******************************************************************************************* 58
విషయా వినివర్తంతే
నిరాహారస్య దేహినః
రసవర్జం రసోప్యస్య
పరం దృష్ట్వా నివర్తతే
శబ్దాది విషయములను స్వీకరింపనట్టి జీవునకు, ఆ విషయములు తొలగుచున్నవేకాని వానిగూర్చిన వాసన పోవుటలేదు. పరమాత్మను దర్శించినచో ఆ వాసనయు విషయములతోపాటు తొలగిపోవుచున్నది.
******************************************************************************************* 59
యతతో వ్యాపి కౌంతేయ!
పురుషస్య విపశ్చితః
ఇంద్రియాణి ప్రమాథీని
హరంతి ప్రసభం మనః.
ఓ అర్జునా! ఇంద్రియములు మహాశక్తివంతములైనవి. ఏలయనిన ఆత్మావలోకనము కొరకు యత్నించుచున్నట్టి విద్వాంసుడగు మనుజుని యొక్క మనస్సును గూడ నయ్యవి బలాత్కారముగ (విషయములపైకి) లాగుకొని పోవుచున్నవి.
******************************************************************************************* 60
తాని సర్వాణి సంయమ్య
యుక్త ఆసీత మత్పరః,
వశే హి య స్యేంద్రియాణి
తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా.
(బలవత్తరములగు) అట్టి యింద్రియములన్నిటిని చక్కగా వశపరుచుకొని సాధకుడు మనఃస్థిరత్వము (సమాధి) గలవాడై నాయందే (ఆత్మయందే) ఆసక్తమైన మనస్సు గల్గియుండవలెను. ఏలయనగా, ఎవని యింద్రియములు స్వాధీనమునందుండునో, ఆతని జ్ఞానమే సుస్థిరమై వెలయగలదు.
******************************************************************************************* 41
ధ్యాయతో విషయాన్ పుంసః
సజ్గ స్తేషూపజాయతే,
సజ్గాత్సంజాయతే కామః
కామాత్ర్కోధోభిజాయతే.
క్రోధాద్భవతి సమ్మోహః
సమ్మోహాత్స్మృతివిభ్రమః,
స్మృతిభ్రంశాద్బుద్ధినాశో
బుద్ధినాశాత్పృణశ్యతి.
మనుజుడు శబ్దాది విషయములను చింతించుచుండుట వలన ఆ విషయములం దాసక్తి జనించుచున్నది. అట్టి యాసక్తిచే దానియం దాతనికి కోరిక ఉదయించుచున్నది. ఆ కోరిక వలన కోపము పుట్టుచున్నది. కోపమువలన అవివేకము, అవివేకము వలన మరుపు, మరుపు వలన బుద్ధినాశము క్రమముగ సంభవించుచున్నవి. బుద్ధినాశముచే తుదకు పూర్తిగ చెడిన వాడగుచున్నాడు.
******************************************************************************************* 62, 63