ధృతరాష్ట్ర ఉవాచ : -
ధర్మక్షేత్రే కురుక్షేత్రే
సమవేతా యుయుత్సవః,
మామకాః పాణ్డవాశ్చైవ
కిమకుర్వత సంజయ!
ధృతరాష్ట్రుడిట్లు పలికెను: ఓ సంజయా! నా వారలగు దుర్యోధనాదులను, పాండుపుత్రులగు ధర్మరాజాదులను యుద్ధము చేయ కుతూహలముతో పుణ్యభూమి యగు కురుక్షేత్రమున జేరి యేమిచేసిరి?
******************************************************************************************* 1
సంజయ ఉవాచ :-
దృష్ట్వా తు పాణ్డవానీకం
వ్యూఢం దుర్యోధన స్తదా,
ఆచార్యముపసజ్గమ్య
రాజా వచనమబ్రవీత్.
ధృతరాష్ట్రునితో సంజయడిట్లు వచించెను :- అపుడు రాజైన దుర్యోధనుడు ప్యూహాకారము గాంచింపబడియున్న పాండవసేనను చూచి, తదుపరి గురువగు ద్రోణాచార్యుని సమీపించి యిట్లు పలికెను.
******************************************************************************************* 2
పశ్యైతాం పాణ్డుపుత్రాణా
మాచార్య మహతీం చమూమ్,
వ్యూఢాం ద్రుపదపుత్రేణ
తవ శిష్యేణ ధీమతా.
ఓ గురువర్యా! బుద్ధిశాలియు, మీ శిష్యుడునగు ధృష్టద్యుమ్నునిచేత ప్యూహాకారముగ రచింపబడియునట్టి పాండవుల ఈ గొప్ప సైన్యమునుజూడుడు!
******************************************************************************************* 3
అత్రశూరా మహేష్వాసా
భీమార్జున సమా యుధి,
యుయుధానో విరాటశ్చ
ద్రుపదశ్చ మహారథః.
ధృష్ట కేతు శ్చేకితానః
కాశీరాజశ్చ వీర్యవాన్,
పురుజిత్కుంతి భోజశ్చ
శైబ్యశ్చ నరపుజ్గవః
యుధామన్యుశ్చ విక్రాంత
ఉత్తమౌజాశ్చ వీర్యవాన్,
సౌభద్రో ద్రౌపదేయాశ్చ
సర్వ ఏవ మహారథాః
ఈ పాండవసేనయందు గొప్ప విలుకాండ్రును, యుద్ధమునందు భీమార్జునులతో సమానులునగు శూర వీరులును పెక్కురు కలరు. వారెవరనిన - యుయుధానుడు, విరాటుడు, మహారథుడైన ద్రుపదుడు, ధృష్టకేతువు, చేకితానుడు, పరాక్రమవంతుడగు కాశీరాజు, పురుజిత్తు, కుంతిభోజుడు, నరోత్తముడగు శైబ్యుడు, శౌర్యవంతుడగు యుధామన్యుడు, పరాక్రమశాలియగు ఉత్తమౌజుడు, అభిమన్యుడు, ఉపపాండవులు. వీరందరును మహారథులే అయియున్నారు.
******************************************************************************************* 4,5,6
అస్మాకం తు విశిష్టా యే
తాన్నిబోధ ద్విజోత్తమ,
నాయకా మమ సైన్యస్య
సంజ్ఞార్థం తాన్ బ్రవీమి తే.
ఓ బ్రాహ్మణోత్తమా! ఇక మనసైన్యములో ప్రముఖులు, సేనానాయకులు ఎవరు కలరో వారలను జ్ఞాపకము కొరకు మీకు చెప్పుచున్నాను.(వినుడు)
******************************************************************************************* 7
భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ
కృపశ్చ సమితింజయః,
అశ్వర్థామా వికర్ణశ్చ
సౌమదత్తి స్తథైవ చ.
అన్యే చ బహవశ్శూరా
మదర్థే త్యక్తజీవితాః,
నానాశస్త్ర ప్రహరణా
స్సర్వే యుద్ధవిశారదాః.
మీరు, భీష్ముడు, కర్ణుడు, యుద్ధమందు జయశీలుడైన కృపాచార్యుడు, అశ్వర్థమ, వికర్ణుడు, భూరిశ్రవుడు, ఇంకను నాకొరకు తమ తమ జీవితములను ధారబోయునట్టి అనేక ఇతర శూరులు, అందరును యుద్ధసమర్థులై వివిధ శస్త్రాస్త్ర సంపన్నులై ఇచట నున్నారు.
******************************************************************************************* 8,9