యదక్షరం వేదవిదో వదంతి
విశంతి యద్యతయో వీతరాగాః,
యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి
తత్తేపదం సంగ్రహేణ ప్రవక్ష్యే.
వేదవేత్తలు, దేనిని నాశరహితమైన దానినిగ జెప్పుచున్నారో, రాగరహితులగు (కోరికలు నశించిన) యత్నశీలురు (జితేంద్రియులు) ఎద్దానియందు ప్రవేశించుచున్నారో, దేనిని అభిలషించుచు జనులు బ్రహ్మచర్యము ననుష్ఠించుచున్నారో, అట్టి(పరమాత్మ) పదమును గూర్చి నీకు సంక్షేపముగ జెప్పెదను.
******************************************************************************************* 11
సర్వద్వారాణి సంయమ్య
మనో హృది నిరుధ్య చ,
మూర్ధ్న్యాధాయాత్మనః ప్రాణ
మాస్థితో యోగధారణామ్.
ఓమిత్యేకాక్షరం బ్రహ్మ
వ్యాహరన్మామనుస్మరన్
యః ప్రయాతి త్యజందేహం
స యాతి పరమాం గతిమ్.
ఎవడు ఇంద్రియద్వారములన్నిటిని బాగుగ అరికట్టి మనస్సును హృదయమందు (ఆత్మయందు) లెస్సగా స్థాపించి, శిరస్సునందు (బ్రహ్మరంధ్రమందు) ప్రాణవాయువును ఉంచి; ఆత్మనుగూర్చిన ఏకాగ్రచింతనము (యోగధారణ) గలవాడై పరబ్రహ్మమునకు వాచకమైన 'ఓం' అను ఒక అక్షరమును ఉచ్చరించుచు నన్ను ఎడతెగక చింతించుచు శరీరమును వదలునో అతడు సర్వోత్తమ స్థానమును (మోక్షమును) బొందుచున్నాడు.
******************************************************************************************* 12,13
అనన్యచేతాస్సతతం
యో మాం స్మరతి నిత్యశః,
తస్యాహం సులభః పార్థ
నిత్యయుక్తస్య యోగినః.
ఓ అర్జునా! ఎవడు అనన్యచిత్తుడై నన్నుగూర్చి ప్రతిదినము నిరంతరము స్మరించుచుండునో, అట్టి నిరంతర ధ్యానపరులకు నేను సులభముగ పొందబడువాడనై యున్నాను.
******************************************************************************************* 14
మాముపేత్య పునర్జన్మ
దుఃఖాలయమశాశ్వతమ్,
నాప్నువంతి మహాత్మాన
స్సంసిద్ధిం పరమాం గతాః.
సర్వోత్తమమైన మోక్షమును పొందిన మహాత్ములు నన్ను పొందినవారై మరల దుఃఖనిలయమై, అనిత్య మైనట్టి - జన్మను ఎన్నటికిని పొందనేరరు.
******************************************************************************************* 15
ఆబ్రహ్మభువనాల్లోకాః
పునరావర్తి నోర్జున,
మాము పేత్య తు కౌంతేయ
పునర్జన్మ న విద్యతే.
ఓ అర్జునా! బ్రహ్మలోకము వరకుగల లోకములన్నియు తిరిగి వచ్చెడి స్వభావముకలవి (అనగా వానిని పొందినవారు మరల జన్మమెత్తవలసియేవచ్చుదురు.) నన్ను పొందినవారికో మరల జన్మయే లేదు.
******************************************************************************************* 16
సహస్రయుగపర్యంత
మహర్యద్బ్రహ్మణోవిదుః,
రాత్రిం యుగసహస్రాంతాం
తే హోరాత్ర విదో జనాః.
ఏ జనులు బ్రహ్మదేవునియొక్క పగటిని వేయి యుగముల పరిమితిగల దానిగను, అట్లే రాత్రిని వేయి యుగముల పరిమితిగల దానిగను ఎరుగుదురో అట్టివారు రాత్రింబగళ్ళ యొక్క తత్త్వమును బాగుగ నెరిగినవారగుదురు.
******************************************************************************************* 17
అవ్యక్తాద్వ్యక్తయః సర్వాః
ప్రభవంత్యహరాగమే,
రాత్ర్యాగమే ప్రలీయంతే
తత్రైవావ్యక్త సంజ్ఞ కే.
బ్రహ్మదేవుని పగలు ప్రారంభమగునపుడు అవ్యక్తము (ప్రకృతి) నుండి సమస్త చరాచరవస్తువులు పుట్టుచున్నవి. మరల రాత్రి ప్రారంభమగునపుడు ఆ అవ్యక్తమునందే లీనమగుచున్నవి.
******************************************************************************************* 18