లోకమాత రూపాల్లో విలక్షణమైన రూపం దుర్గ.
దుర్గమమగు ఏ కార్యానై్ననా సుగమం చేయగల చల్లని
తల్లి కనుకనే ఆమెని దుర్గా అని అంటారు. దుర్గా దుర్గతి
నాశిని అని అమ్మను స్తుతించటంలో కూడా ఒక
అంతరార్ధం ఉంది . దుర్గం అంటే దేహం.ఈదేహంలో ఉండే
శక్తే దుర్గ. అదే ప్రాణశక్తి. ప్రాణం ఉంటేనే దేహం ఉన్నట్లుగా
దుర్గాదేవి అనుగ్రహం ఉంటేనే ఈలోకం నిలచి ఉంటుంది.
దుర్గా రూపంలో ఒకొక్క అంశానికీ ఒకొక్క సంకేతం ఉంది.
సర్వజ్ఞులైన పండితోత్తములకు మాత్రమే విశిధమయ్యే ఈ
రూపలావణ్య విశేషాలు వారి ద్వారానే లోకానికి
వెల్లడయ్యాయి.
దుర్గాదేవి దశభుజాలు: పంచప్రాణ, పంచోపప్రాణాలు దశప్రాణాల కు, పంచజ్ఞానేంద్రియాలకు, పంచ కర్మేంద్రియాలకు సంకేతాలు.
సింహవాహిని : ఇక దుర్గాదేవి సింహాన్ని అధిష్టించి ఉంటుంది. సింహం కామానికి సంకేతం. దాన్ని లొంగదీసుకోవాలి తప్ప అంతం చేయకూ డదు. కామం నశిస్తే సృష్టికార్యమే భంగపడుతుంది. అలాగే అమ్మ చేతి లో సంహరించబడిన దున్నపోతు రూపంలో ఉండే మహిషుడు క్రోధానికి ప్రతీక. క్రోధాన్ని చంపుకోవటమే మానవుని విజయానికి మూలం. ఇలా దుర్గాతత్వం ప్రాణతత్వం కనుక అమ్మకుచేసే పూజ ప్రాణాహుతులను సమర్పించడమే. మనలో అట్టి దుర్గాతత్వాన్ని పెంపొందించు కోవటమే ప్రాణాయామం ప్రాణశక్తిని పెంపొందించుకునే యోగ రహస్యం.
కుడి, ఎడమల శక్తి స్వరూపాలు: ఇక దుర్గ పక్కన ఉండేది లక్ష్మీదేవి. ఈమె ధనశక్తి. స్థితికారిణి. ఆశక్తిఉండాలి. దానిసూచిస్తూ లక్ష్మీదేవి గుడ్ల గూబను అణచివేసి అధిరోహించటం సూచిస్తుంది. మరోపక్క సరస్వతి జ్ఞానానికి ప్రతీక. అది అత్యవసరం. అజ్ఞానం వీడి సత్‌జ్ఞానంతో ఉండాల ని చెప్పటమే దాని అర్ధం. ఆవిడ వాహనం హంస. హంస, పాలనీ నీటినీ వేరుచేసి కేవలం పాలని మాత్రమే స్వీకరిస్తుంది.
కుమార స్వామి: ఇంకోపక్క నుండే కుమారస్వామి దేవసేనాని, ఆయన వీరత్వానికి ప్రతీక. వీరత్వంతో ఆత్మరాజ్యస్థాపన చేయాలి. నెమలి లైంగిక సంబంధంలేని బ్రహ్మచర్యానికి గుర్తు. అటువంటి బ్రహ్మచర్యం పాటించడం వలన, నెమలి కన్నువంటి జ్ఞాననేత్రం విచ్చుకుంటుంది.
గణపతి: ఇటువంటి సాధనలో సిద్ది గణపతి స్థానం ఏమిటంటే, అకార ణంగా అన్నింటినీ నాశనం చేసే లక్షణం ఎలుకది. సిధ్ధికి భంగం కలుగ కుండా ఉండాలంటే ఆఎలుకను అదుపులో ఉంచుకోవాలి. అందుకు సర్వసమర్ధుడు మూలాధార చక్రానికి అధిపతి అయిన ఆ విఘ్నేశ్వరుడు. అందుకే సాధనలో ముందుగా చైతన్యాన్ని పొందేది మూలాధార చక్రమే.
పరమేశ్వరుడు: ఆన్నింటికీ అధిష్టాతగాఉన్న శివుడు త్యాగమునకు, అద్వైతస్థితికి ప్రతీక కాగా ఆయన చేతిలో డమరుకం ప్రణవనాదం. త్రిశూలం సత్వరజస్తమోగుణాలకు గుర్తు, వృషభము అంటే ధర్మం. అదే ఆయనవాహనమైన నంది. అది నాలుగుకాళ్లపై ఉంటుంది. ఇలాపరివార సహితంగా దుర్గాతత్వం మానవునకు మార్గదర్శకమై జీవితగమ్యాన్ని సూచిస్తుంది.