Followers

Saturday, 22 June 2013

తల్లిదండ్రులకు, పెద్దలకు సాష్టాంగ నమస్కారము ఎందుకు చేయాలి?



భారతీయులు తమ తల్లిదండ్రులకు, పెద్దలకు, గురువులకు, మహాత్ములకు సాష్టాంగ నమస్కారము చేస్తారు.  మనచే నమస్కరింపబడిన పెద్దలు తిరిగి వారి చేయిని మన తలమీద లేక పైన ఉంచి దీవిస్తారు.  ప్రతి రోజు పెద్దలను కలిసినప్పుడు మరియు ఏదైనా క్రొత్తగా ప్రారంభించేటప్పుడు, జన్మదినములు పండుగలు మొదలగు శుభ సందర్భాలలో కూడా పెద్దలకు నమస్కరించడము జరుగుతుంది.  కొన్ని సంప్రదాయ సమూహాలలో తమ కుటుంబము, సామాజిక హోదా మరియు తమ పరిచయము తెలియచేసే విధముగా (ప్రవర తో కూడి) సాష్టాంగ నమస్కారము చేయబడుతుంది. 
సాష్టాంగ నమస్కారము ఎందుకు చేయాలి?

మానవుడు తన పాదాల ఆధారముగా నిలబడతాడు.  సాష్టాంగ నమస్కారములో పెద్దల పాదాలకు నమస్కరించడమనేది వారి వ్యక్తిత్వానికి ఆధారమైన పెద్దరికానికి, పూర్ణత్వానికి, ఉదారతకు, దివ్యత్వానికి మనము ఇచ్చేటటువంటి గౌరవానికి చిహ్నము.  ఇది వారికి మనపై గల స్వార్ధరహిత ప్రేమ మరియు మన సంక్షేమానికి వారు చేసిన త్యాగాల పట్ల మన కృతజ్ఞతని తెలియజేస్తుంది.  ఇది ఇతరుల గొప్పతనాన్ని అణకువతో అంగీకరించే ఒక మార్గము.  భారతదేశము యొక్క గొప్ప శక్తులలో ఒకటైన పటిష్టమైన కుటుంబ బాంధవ్య వ్యవస్థను ప్రతిబింబింప జేసే ఆచారములలో ఇది ఒకటి. 

భారత దేశములో పెద్దల శుభ సంకల్పాలకు మరియు అశీర్వాదములకు ఉన్నతమైన విలువ ఇవ్వబడుతుంది.  వాటిని పొందడానికి మనము నమస్కరిస్తాము.  మంచి ఆలోచనలు మంచి తరంగాలను సృష్టిస్తాయి.  పరిపూర్ణమైన ప్రేమ, దివ్యత్వము మరియు ఉదారత్వముతో నిండిన హ్రుదయాలనుండి  ఉద్భవించే శుభకామనలు అద్భుతమైన శక్తిని కల్గి ఉంటాయి. ఎప్పుడైతే మనము వినయముతో గౌరవముతో పెద్దలకు నమస్కరిస్తామో అప్పుడు వారి శుభకామనలు, దీవెనలు మంచి శక్తి వంతమైన తరంగ రూపంలో మనపై ప్రసరిస్తాయి.  ఇందు వలననే మనము నిలబడి కానీ, సాగిలబడి కానీ నమస్కారము చేసినప్పుడు శరీరమంతా ఈ శక్తిని స్వీకరించ గలుగుతుంది. 

గౌరవాన్ని తెలియపరచే వివిధ రీతులు:



ప్రతుత్థానము   :  లేచి నిలబడి స్వాగతమిచ్చుట 
నమస్కారము : నమస్తే అని విధేయతను వ్యక్త పరచడము
ఉపసంగ్రహణ   : పెద్దల, గురువుల పాదాలను తాకడము 
సాష్టాంగము   : కాళ్ళు, మోకాళ్ళు, ఉదరము, చాతి, నుదురు చేతులు అన్నీ నేలను తాకేలాగా పెద్దల ముందు సాగిలబడి నమస్కరించుట 
ప్రత్యభివందనము: ప్రతి నమస్కారము చేయుట. 


సంపద, వంశము, వయస్సు, నైతిక బలము మరియు ఆధ్యాత్మిక జ్ఞానము ఒకదాని కంటే ఒకటి ఎక్కువ గా వ్యక్తులకు గౌరవాన్ని పొందే అర్హతను కల్గిస్తాయి.  ఇందువలననే భూమిని పరిపాలించే రాజు ఐనప్పటికీ ఆధ్యాత్మిక గురువు యొక్క పాదాలకు నమస్కరిస్తాడు.  ఈ భావాన్ని ప్రత్యేకంగా స్పష్టము చేసే కధలెన్నో మనకు రామాయణం, మహా భారతము వంటి ఇతిహాసాలలో గలవు. 

ఈ సంప్రదాయము వలన కుటుంబము మరియు సంఘము లోని వ్యక్తుల మధ్య పరస్పర ప్రేమ, గౌరవము, ఐకమత్యం, శాంతియుత వాతావరణము పెంపొందించ బడుతున్నాయి. 

Popular Posts