Followers

Monday, 24 June 2013

త్రేతాయుగ యాగ భూమి ఒంటిమిట్ట

కడప జిల్లాలో ఒంటి మిట్ట గ్రామం ఉంది. దీనినే ఏకశిలా నగరం అంటారు. ఇది మహర్షులకు తపోధనులకు యజ్ఞ, యాగాలకు త్రేతాయుగంలో ప్రసిద్ధి చెందింది. ఋషుల తపస్సుకు తరచుగా రాక్షసులు భంగం కలిగించి, విఘ్నం చేసే వారు. శ్రీ రాముడు సీతా దేవి, లక్ష్మణ సమే తుడై ఒంటిమిట్టకు వచ్చాడు. ఆయన కోదండం ధరించి, పిడి బాకుతో రాక్షస వధ చేసి ఋషుల తపస్సును నిరాటంకంగా జరగటానికి దోహదం చేశాడు.

onti1ఋషులు యాగ సమాప్తి అయిన తర్వాత సీతా రామ లక్ష్మణులను అర్చించారు. వారి మూర్తులను ఏక శిలపై మలిచి అప్పటి నుండి పూజాదికాలు నిర్వహించారు. అందుకే ఏక శిలా నగరం అయింది.. అప్పటికి అంజనేయస్వామితో రాముడికి పరిచయం కలగలేదు. అందువల్ల హనుమ మూర్తి ఉండదు. ద్వాపరయుగంలో జాంబవంతుడు ఈ ఏక శిలా మూర్తులను ఆగమ విధానంలో ప్రతిష్టించాడు. అందుకని దీన్ని జాంబవంత ప్రతిష్ట, కపిల వానర ప్రతిష్ట అని కూడా అంటారు.స్థల పురాణం : ఆ నాడు బాగా పేరు పొందిన ఒంటడు, మిట్టడు అనే ఇద్దరు బందిపోటు దొంగలు ప్రయాణీకులను దోచుకొని బంగారం మొదలైన వాటిని దగ్గరలో ఉన్న కొండ గుహలో దాచుకొనేవారు. ఆ గుహలో ఉన్న సీతారాములు వారికి దర్శన మిచ్చి దొంగతనం మానేసి గౌరవ ప్రదమైన జీవితం గడపమని ఆదేశించారు. అంతే, వారిలో మార్పు వచ్చి దొంగతనాలు మానేసి దివ్య జీవనం సాగించారు. శ్రీరామునికి అత్యంత భక్తులై, ఆ మూర్తులకు గర్భాలయాన్ని నిర్మించారు. అప్పటి నుండి ఈ బంది పోటు దొంగల పేరు మీద ఈ గ్రామానికి ఒంటి మిట్ట అనే పేరు వచ్చింది అని ఇక్కడివారు చెప్తారు.

చారిత్రిక గాధ : ఆలయ శిలా శాసనాలను పరిశీలిస్తే ఎన్నో విషయాలు తెలుస్తాయి ఈ దేవాలయాన్ని మూడు దశల్లో నిర్మించారని తెలుస్తోంది. ముందు గర్భాలయ నిర్మాణం, తర్వాత ముఖ మండపం, మూడవ దశలో గాలిగోపురం నిర్మించి పూర్తి చేసారు. రెండవ శిలా శాసనం ప్రకారం 1558లో ఒంటి మిట్ట తదితర గ్రామాలను నాటి ఏలిక ఆలయానికి దానం చేసినట్టు స్పష్టంగా తెలుస్తోంది. ఆయా గ్రామాల మీద వచ్చే ఆదాయాన్ని రధం నిర్మించటానికి, బ్రహ్మోత్సవ నిర్వహణకు ,ప్రహరీగోడల నిర్మాణానికి దానిని వినియోగించాలని తెలిపాడు. విజయ నగర చక్రవర్తి సదాశివ రాయల ముఖ్య మంత్రి గుత్తియేరా తిరుమల రాజు కుమారుడు నాగరాజదేవ నాగరాజు విరాళం అందజేసినట్టు కూడా చారిత్రక ఆధారాల మూలంగా తెలుస్తోంది. ఏదిఏమైనా, ఈ ఆలయం చారిత్రక, పౌరాణిక ప్రాశస్త్యాన్ని సంతరించుకున్న చక్కని దేవాలయం.

Popular Posts