Followers

Saturday, 8 June 2013

వీనులవిందుగా సుందరకాండ పారాయణ

ఆపదామపహర్తారం దాతారం సర్వసమ్పదాం,
లోకాభిరామం శ్రీరామం భూయోభూయో నమామ్యహమ్‌’’ 

ఏనాడో త్రేతాయుగాన రావణ సంహరణార్ధం శ్రీరామచంద్రుని దివ్యావతార ఆవిర్భావం, త్రాతాయుగం గడిచింది..ద్వాపరయుగం గడిచింది.., కలియుగారంభంలో ఉన్నాం..కొన్ని లక్షల సంవత్సరాలు గడిచినాయి. అయినప్పటికి, ఇప్పటికీ శ్రీరామకథాగానం, శ్రవణం అనూచానంగా భారతదేశంలో ఊరూరా విన్పిస్తూనే ఉన్నాయి.

సూర్య చంద్రులున్నంత వరకు, కొండలూకోనలూ ఉన్నంతవరకూ, నదులూఏరులూ పారుతున్నంతవరకూ రామాయణం నిత్యం అని ఋషిప్రోక్తం కదా..! సాధారణంగా మన హైందవ సాంప్రదాయంలో సంవత్సరంలో రెండుమారులు రెండు అయనాలలో రెండు నవరాత్రములలో శ్రీమద్రామాయణ పారాయణముచేయు ఆచారమున్నది. శ్రోత్రియులకు సావకాశమున్నవారికి నిత్యపారాయణగ్రంథం..శ్రీరామాయణం. అది అటుంచండి.! ఉత్తరాయణంలో వచ్చే సంవత్సరారంభం నుండి అంటే చైత్రశుద్ధ పాడ్యమి... శ్రీరామ నవమి వరకు, వసంత నవరాత్రమంటాం..ఈనవరాత్రంలో శ్రీమద్రామాయణపారాయణ చేయు సాంప్రదాయంఉన్నది.

భగవానుడు కొలువై ఉన్న ఆలయాదులలోనే కాక ప్రత్యేకంగా ఊరూరా శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరుపుకునే సాంప్రదాయం భారతీయులసొత్తు. ఇక రెండవది దక్షిణాయనంలో శరన్నవరాత్రులలో కూడా శ్రీమద్రామాయణ పారాయణ చేయడం అనూచానంగా వస్తున్నదే. ముఖ్యంగా ఈ రెండు అయనాలలో రెండు నవరాత్రములలో రామాయణ పారాయణచేయడం భారతీయఆచారం.

శ్రీమద్రామాయణం శతకోటి ప్రవిస్తరమని-అందులోని ఒక్కొక్క అక్షరం మహా పాతకాలను నాశనం చేసేదనీని ఋషిప్రోక్తం. 
‘‘చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం
ఏకైక మక్షరం ప్రోక్తం మహాపాతక నాశనమ్‌అని.
ఇదం రామాయణం కృత్స్నం గాయత్రీబీజ సంయుతమ్‌
త్రిసంధ్యం యఃపఠేన్నిత్యం సర్వపాపైఃప్రముచ్యతే,, 


గాయత్రీ మంత్రబీజ సంయుతమైన రామాయణాన్ని ఎవరైతే నిత్యమూ త్రికాలలో పఠిస్తారో వారి సర్వపాపాలూ తొలగిపోతాయి..ఆని..! మొత్తం శ్రీమద్రామాయ ణాన్ని పారాయణ చేయలేనివారు కనీసం అందులోని భాగమైన సుందరకాండ అయినా చేసుకునే సౌలభ్యాన్నికూడా మన పూర్వీకులు ఏర్పరిచినారు. సుందరకాండ కూడా ఏడుకోట్ల మంత్రాలతో నిండిఉన్నట్లు పెద్దలు చెబుతారు. సుందరకాండ పారాయణము కూడా అనేక పద్ధతులు.. కాండమొత్తము ఒక్కరోజు లో పూర్తిచేయడం.. మూడురోజులలో ఒక ఆవృత్తి పూర్తి చేయడం.., అయిదు రోజులలో.., ఎనిమిది రోజులలో.., తొమ్మిదిరోజులలో.., పన్నెండు రోజులలో.., పదహారు రోజులలో.., ఇరువది ఎనిమిది రోజులలో., ఒకొక్క ఆవృత్తి చొప్పున.

అల్లాగే అరువది ఎనిమిదిరోజులలో రోజుకొక ఆవృత్తి చొప్పున అరువది ఎనిమిది ఆవృత్తులు పూర్తి చేయడం.. మహాసప్తసర్గిపారాయణము...ప్రతిరోజూ ఏడు సర్గల చొప్పున చదువుతూ అరువది ఎనిమిది రోజులు అయ్యేసరికి ఒక ఆవృత్తి పూర్తవుతుంది.. అలా ఏడుసార్లు అంటే 68 (ఇంటు) 7=476 రోజులు ప్రతి దినము ఏడుసర్గల చొప్పున పూర్తి చేసిన మహాసప్తసర్గిపారాయణమగును. ఇది సకలాభీష్టఫలప్రదం.
సింహాచలంలో శ్రీవేంకటేశ్వరస్వామిసన్నిథిలో 108మంది ఋత్విక్కులతో సామూహిక సుందరకాండ పారాయణం చేయించాలని కొంతమంది ఉత్సాహవం తులైన యువకులు సంకల్పించడం జరిగింది. 

విజయనామ సంవత్సర శుక్లపంచమి (వసంతపంచమి) వరకు జరిపించాలని సంకల్పించారు. 
విజయనామసంవత్సరము ఏప్రిల్‌ 12 నుండి మే 20 వ తేదీ వరకూ భారతదేశానికి ఏదైనా ఉపద్రవం సంభవించవచ్చును.. ఈరోజులు చాలా గడ్డుదినములుగా కనబడుతున్నట్లు ప్రముఖ జ్యోతిశ్శాస్త్ర విద్వాంసులు మధనపడుతూ. అష్టోత్తరశత శ్రీమత్సుందరకాండ సామూహిక పారాయణ కార్యక్రమాన్ని గురించి విని ‘‘చాలా మంచి కార్యక్రమాన్ని తలపెట్టేరు.. దేశానికి అరిష్టంకలిగే గడ్డుదినాలలో ఇలాంటి ఒక మంచి ఆథ్యాత్మిక కార్యక్రమం నిర్వహించడం చాలా ముదావహం అనడం’’.. కార్యకర్తలకు కొండంత బలం చేకూరింది. 

కార్యక్రమానికి రూపకల్పన చేసేరు.. ఏప్రిల్‌ 12 సాయంత్రంనుండి 15వ తేదీ వరకూ చాలా అద్భుతంగా ‘‘అష్టోత్తరశత శ్రీమత్సుందరకాండ సామూహికపారాయణము’’.. సింహాచలం కొండ దిగువ ఆర్టీసీ బస్టాండుదరి, శ్రీవేంకటేశ్వరస్వామి సన్నిథిలో మూడు రోజుల పాటు జరిగినాయి.
ఏప్రిల్‌ 12 సాయంత్రం 6 గంలకు శ్రీసింహాచల దేవస్థాన అనువంశికధర్మకర్తలు శ్రీమాన్‌ పూసపాటి ఆనందగజపతిరాజుగారు సతీసమేతంగా, తొలిపాపంచా నుండి ప్రారంభంకాబోయే శోభాయాత్రకు మొదటికొబ్బరికాయ కొట్టి శోభాయాత్రను ప్రారంభించేరు...సింహాచల దేవస్థాన కార్యనిర్వహణాధికారి శ్రీమాన్‌.అచ్యుతరామచంద్రమోహన్‌గారు కూడా శోభాయాత్రలో పాల్గొన్నారు.

శోభాయాత్ర ప్రారంభానికి ముందు 
తిరుపతికి అన్నమయ్యవలె.., భద్రాద్రికి గోపన్నవలె.., సింహాచలాన కృష్ణమయ్య సుప్రసిద్ధుడు. ఈయన 13వశతాబ్దికి చెందినవాడుగా చరిత్ర చెబుతోంది. కృష్ణమాచార్యులను, అన్నమాచార్యులు మార్గదర్శకునిగా కూడా చెప్పుకున్నారు. 

శ్రీకృష్ణమాచార్యుల వారు సింహగిరినరహరిని తన సంకీర్తనవాక్పూజలంతో అర్చించేడు. నాలుగు లక్షల వచనాలను చెప్పినట్లు ఆయన వచనాల బట్టి తెలుస్తోంది.. వారివచనాలను కొన్నింటిని సుందరకాండ పారాయణ నిర్వహణ సంఘంలో ఒకరైన శ్రీకాంత్‌ స్వయంగా పాడి సమర్పణగావించిన ‘‘సింహగిరి నరహరీ! నమోనమో దయానిథీ!!’’ ఆడియో సీ.డీ.ని శ్రీమాన్‌ ఆనందగజపతిరాజు దంపతులు, శ్రీమాన్‌ కార్యనిర్వహణాధికారిగారు ఆవిష్కరించేరు.

శోభాయాత్ర చాలాకన్నులపండువయిన మనోహరదృశ్యం. ఆనాడు వనవాస పరిసమాపనం తరువాత శ్రీరామచంద్రుడు సీతాదేవితో కలిసి, వానరసేన వెంట రాగా.., అయోధ్యంతా తోడ్కొని రావటానికి ఎదురేగ.., రామచంద్రుడు అయోధ్య కు వేంచేస్తున్నంత కమనీయరమణీయంగా సాగింది. పల్లకిలో శ్రీరామపట్టాభిషేక చిత్రమునుంచి.., శ్రీమత్సుందరకాండ శ్రీకోశాలను పల్లకిలో వేంచేపుచేసి.., శ్రీవైష్టవస్వాములే స్వయంగా పల్లకిమోయ.., దివట్లతో.., ఆతపత్రాలతో ఇరువం కలనిలువ.., చామరవీవనలతో.., జేగంటలతో.., మంగళవాయిద్యాల నడుమ.., నామపారాయణ.., శ్రీవిష్ణుసహస్రనామ పారయణలను గానంచేస్తూ.. సుమా రు120 మంది ఋత్విక్కులు.., మహిళాకార్యకర్తలు.., యువకార్యకర్తలు.., భక్తు లు ఊరిజనం వెంటరాగా.. సింహాద్రినాథుడు తిరువీధికి వేంచేయు మాడ వీధుల గుండాసాగుతూ.. శ్రీవేంకటేశ్వరస్వామి సన్నిథికి చేరుకుంది శోభాయాత్ర..!
ఇందులో పాల్గొన్నవారు అనేకమంది వయోవృద్ధులు.., ఆడవారు.., పిల్లలు..అంతా ఎంతో ఉత్సాహంతో పాల్గొనడం కార్యనిర్వాహకవర్గంవారికి మరింత ఉత్సాహాన్ని కలిగించింది.

శ్రీ వేంకటేశ్వరస్వామి సన్నిథికి చేరిన అనంతరం విష్వక్సేన ఆరాధన, పుణ్యాహవచనం, ఋత్విగ్వరణం, మృత్సంగ్రహణం, అంకురారోపణం, ఇత్యాది కార్యక్రఇమాలు... పారాయణ పూర్వరంగాన్ని సుసంపన్నం చేసేయి. 13వతేదీ ఉదయం 6 గంటలకు మరల నగర సంకీర్తనలతో కార్యక్రమం ప్రారంభమైంది. 8 గంటలకు శ్రీమత్సుందరకాండ సామూహిక పారాయణ ప్రారంభమైంద. పారాయణ చేసే ఋత్విక్కులు ఎవరిఇష్టం ఆవచ్చిన రీతినవారు కూచోవడం కాకుండా...నిర్వహణ సంఘంవారు క మండలాన్ని ఏర్పాటు చేసి... ఆ మండలంలో 108మందిని ఆసీనులను చేయడం చూసేవారికి.... పారాయణం చేసేవారికి కూడా కనులవిందైంది.

కవరుసకు తొమ్మిదిమంది చొప్పున 12 వరుసలుగా కూచోబెట్టేరు. మళ్లా ఈ 108 మందిఇ 9 ఉప మండలాలుగా చేయడం జరిగింది. ఒక్కొక్క ఉప మండలానికి 12మంది చొప్పున 9 ఉప మండలాలు చిత్రించడం జరిగింది. స్వామికి అష్టోత్తర కలశ స్నపనం జరిపే పద్ధతిలో పాంచరాత్రాగమ శాస్త్రాన్ని అనుసరించి, ఈ మండల రచన చేయశారు. ఇది చూసినవారికి చాలా వైభవంగా కానవచ్చింది.
ఒకరు మైకువద్ద కూచుని పారాయణాన్ని ప్రారంభిస్తే...108మంది స్వాములు ఆ స్వరాన్ని అనుసరిస్తూ...పుస్తకం చూసి పారాయణాన్ని సాగించారు. ఇది ఒక అద్భుత అవకాశం. అత్యద్భుత దృశ్యం. 

ఉదయం సుమారు 11 గంటల వరకు పారాయణ కార్యక్రమం...11.30 గంటలకు మంగళాశాసనం, తీర్థప్రసాద గోష్టితో ఉదయం కార్యక్రమం పరిసమాప్తి అయింది. ఇక సాయంత్రం 6 గంటలకు శ్రీ విష్ణు సహస్రనామ పారాయణంతో సభ ప్రారంభం. 6 .30 గంటల 30 నిముషాలనుండి శ్రీమతి కందాల జానకి (విజయనగరం)గారు సుందరకాండ వైభవాన్ని వీనులవిందుగా వివరించారు. మరునాడు 14వతేదీ ఉదయం 6 గంటలకు నగర సంకీర్తనంతో కార్యక్రమం ప్రారంభమైంది. సుందరకాండ రెండవరోజు పారాయణం చేసే సర్గలు పూర్తి అయిన తరువాత మంగళాసాసన, తీర్థప్రసాదగోష్టితో ఉదయం కార్యక్రమం పూర్తయింది.

సాయంత్రం 6 గంటలకు శ్రీవిష్ణుసహస్రనామపారాయణం జరిగిన తరువాత..., ఆరోజు సాయంత్రం డా.టిపి శ్రీనివాసరామానుజమ్‌ గారి సుందరకాండ ప్రవచనం జరిగింది. సుందరకాండ మహాత్యాన్ని రామాయణ వైభవాన్ని చెబుతూ మధ్య మధ్య కృష్ణ లీలలను ఉటంకిస్తూ చాలా రసవత్తరంగా... రసరమ్యంగా సాగింది ప్రవచనం.. తాము కనులు చమర్చినారు..., ప్రసంగాన్ని ఆలకించేవారి కనులు కూడా చెమర్చేట్టు చేసినారు వారి ప్రసంగం ద్వారా...

15వ తేదీ చివరి రోజు.. పారాయణ పరిసమాపనం అయ్యేరోజు... పారాయణం పూర్తికావచ్చింది. శ్రీవేంకటేశ్వర సన్నిధిని కొలువైన పది అడుగుల శ్రీ ఆంజనేయస్వామి బృహన్మూర్తిముందు శ్రీరామచంద్రా పట్టాభిషేకానికై సమకూర్చిన- ఐదునది తీర్థాలు.., సాగర జలం..., కిరీటం మొదలైన వాటికి ఆవాహనాది షోడశోపచారముల నర్చనచేసి..., కన్నెపల్లెలు మంగళద్రవ్యాలు చేతనిడుకొని.., ముందు మంగళవాయిద్య ములతో.., శ్రీవైష్ణవఋత్విక్‌ స్వాములు నదిజలాలను.., సాగరజలాన్ని తమ సిరిసులపై ఉంచుకొని.., శ్రీసింహాచల దేవస్థాన సహాయకార్యనిర్వాహణాధికారిగా పదవీవిరమణ చేసిన శ్రీమాన్‌ అయిలసోమయాజుల అప్పల సత్యనారాయణమూర్తి కిరీటాన్ని చేత ధరించి.., నిర్వహణా సంఘం వారు వీరినితోడ్కొని వెంటరాగా.., వేదికమీవేంచేసి ఉన్న శ్రీరామచంద్ర ప్రభువుని పట్టాభిషిక్తునిగావింప తరలిరాగా..,

పంచారాత్ర ప్రయోనిధులు శ్రీమాన్‌. మోర్త. సీతారామభట్టాచార్యస్వామి పట్టాభిషేకా ఘట్టాన్ని విన్నవిస్తూ స్వామికి ఉపచారాదులు సమర్పించి.., నదీజలాలతో సాగరజలం తో అభిషేకించి.., కిరీటాధారణ చేయడం..నిజంగా శ్రీరామచంద్రుని మనమే పట్టాభిషిక్తునిగావిస్తున్నామా..! ఒక వశిష్టులమా..? విశ్వాసపాత్రులమా..? అన్నంత సంబరంగా అంబరాన్నంటేంత సందడిగా జరిగింది..! మేనుపులకరించింది.. ఆహా ఏమిభాగ్యమనిపించింది...!! పట్టాభిషేకమైయినాక, పారాయణాంగంగా జరిగిన శ్రీసుందరకాండ హవన పరిసమాపన పూర్ణాహుతి జరిపించిన తరువాత శాంతికల్యాణం జరిపించడానికి సన్నద్ధులయ్యేవారు.. పురోహితస్వాములు.., అర్చకస్వాములు. 

అష్టోత్తరశత శ్రీమత్సుందరకాండ సామూహికపారాయణ పరిసమాపనం.. శ్రీరామచంద్రునికి లోకకల్యాణార్థం సంకల్పిత శాంతికల్యాణం.. పాంచరాత్రపయోనిధుల ఆధ్వర్యంలో శ్రీమాన్‌ కరి సీతారామచార్యస్వామి..., తి.పె.లక్ష్మీకుమారస్వామి...కో.కం.రంగనాథ్‌స్వామి..దేవాల అర్చకులు శ్రీమాన్‌ వరదరాజశ్రవణ్‌స్వామి అత్యద్భుతంగా నిర్వహించేవారు.. నిర్వహణ సంఘంవారు స్వామికి పట్టుపీతాంబరాలను..., ముత్యాల తలంబ్రాలను సమర్పించేవారు..

శ్రీసీతారామ కమ్రకల్యాణ వైభవాన్ని ప్రత్యక్షంగా తిలకించినవారు ధన్యులు..
తిలకించినవారిద్వారా ఆనోటా ఈనోటా విన్నవారు కార్యక్రమాన భాగస్వాములే..!!
ఈ కార్యక్రమంలో కార్యకర్తలయిన అనేకమంది మహిళలు.., యువకార్యకర్తలు.. ఋత్విజుల.., భక్తుల.., నిర్వహణ సంఘం వారి అభిమానాన్ని చూరగొనడం విశేషం. ఈ బృహత్తర కార్యక్రమానికి ఎందరో వదాన్యులు తమవంతుగా సహాయసహకారాలను అందించేరు.. ఎవరిగోత్రనామాదులు చెప్పనివ్వలేదు.. లోకకల్యాణార్ధం అన్నారు కదా..! అలాగే కానివ్వండి అన్నారు..!

అందరికీ అనేకానేక ధన్యవాదాలు తెలియజేసేరు నిర్వహణ సంఘంవారు. అనేక ప్రాంతాల నుండి వచ్చిన ఋత్విక్కులకు భోజన వసతి సదుపాయాదులు చక్కగా ఏర్పాటు చేసేరు. సంఘంవారు.. ఋత్విక్కుల సన్మాన కార్యక్రమంతో అష్టోత్తరశత శ్రీమత్సుందరకాండ సామూహిక పారాయణం పరిసమాప్తినొందింది. 
లోకమంతా సుభిక్షంగా ఉండాలని అంతా ఆశీర్వదించేరు..
నిర్వహణ సంఘం ధన్యతనొందింది.. లోకాస్సమస్తాస్సుఖినోభవంతు..!!

Popular Posts