Followers

Sunday, 23 March 2014

శ్రీమద్భాగవతం ఆరవ స్కంధం ప్రధమాధ్యాయం



శ్రీపరీక్షిదువాచ
నివృత్తిమార్గః కథిత ఆదౌ భగవతా యథా
క్రమయోగోపలబ్ధేన బ్రహ్మణా యదసంసృతిః

ప్రారంభములో మీరు మొత్తం నివృత్తి మార్గమే చెప్పారు. చేసిన ప్రతీ కర్మనూ పరమాత్మార్పణం చేయమని. బ్రహ్మ జ్ఞ్యానముతోటే సంసారం పోతుంది అని చెప్పారు. దానితోబాటు త్రిగుణాత్మకమైన మూడు గుణములలో ఉండే ప్రవృత్తి మార్గం (కర్మ యోగం). కర్మ యోగమంటే ప్రకృతియొక్క గుణ సర్గం.

ప్రవృత్తిలక్షణశ్చైవ త్రైగుణ్యవిషయో మునే
యోऽసావలీనప్రకృతేర్గుణసర్గః పునః పునః

అధర్మలక్షణా నానా నరకాశ్చానువర్ణితాః
మన్వన్తరశ్చ వ్యాఖ్యాత ఆద్యః స్వాయమ్భువో యతః

ప్రియవ్రతోత్తానపదోర్వంశస్తచ్చరితాని చ
ద్వీపవర్షసముద్రాద్రి నద్యుద్యానవనస్పతీన్

ధరామణ్డలసంస్థానం భాగలక్షణమానతః
జ్యోతిషాం వివరాణాం చ యథేదమసృజద్విభుః

అధునేహ మహాభాగ యథైవ నరకాన్నరః
నానోగ్రయాతనాన్నేయాత్తన్మే వ్యాఖ్యాతుమర్హసి

స్వాయంభువ చరిత్రను. ప్రియవ్రత ఉత్తానపాదుల చరిత్రనూ చెప్పారు. ద్వీప వర్ష సముద్ర నదుల వృక్ష ఉద్యానవనాలనూ భూమండలాన్నీ దాని విభాగాన్నీ అధోలోకాలూ నక్షత్రాలను పరమాత్మ ఎలా సృష్టించారో చెప్పారు . తప్పులు చేసినా నరకానికి వెళ్ళకుండా ఉండే మార్గం చెప్పండి.

శ్రీశుక ఉవాచ
న చేదిహైవాపచితిం యథాంహసః కృతస్య కుర్యాన్మనౌక్తపాణిభిః
ధ్రువం స వై ప్రేత్య నరకానుపైతి యే కీర్తితా మే భవతస్తిగ్మయాతనాః

చేయకుండా ఫలితం రాదు. చేసిన ఫలితం పోదు. ఇక్కడి తప్పుకు ఇక్కడ ప్రాయశ్చిత్తం చేసుకోకుంటే అక్కడ నరకాలు తప్పవు.ప్రాయశ్చిత్తం కూడా కర్మే.

తస్మాత్పురైవాశ్విహ పాపనిష్కృతౌ యతేత మృత్యోరవిపద్యతాత్మనా
దోషస్య దృష్ట్వా గురులాఘవం యథా భిషక్చికిత్సేత రుజాం నిదానవిత్

త్రికరణాలతో (మనసు మాటా చేతితో) ఆచరించిన పాపములకు ప్రాయశ్చిత్తమును చేయకున్నట్లైతే తప్పకుండా నరకాన్ని చేరతాడు. అతి దారుణమైన యాతనలు అనుభవిస్తాడు. కాబట్టి ఇక్కడే త్వరగా పాపం పరిష్కారమవడానికి ప్రయత్నం చేయాలి. ఈ శరీరానికి మరణం రాకముందే చేసుకోవాలి.. ఈ శరీరముండగా ఏమేమి చేసామో దానికి ఈ శరీరముతోనే ప్రాయశ్చిత్తం చేసుకుంటే ఇంకో శరీరముతో వాటి ఫలితం అనుభవించాల్సిన అవసరం రాదు. కాబట్టి తప్పుకు వెంటనే పరిహారం చేసుకోవాలి.
రోగము యొక్క మూలం తెలుసుకున్న వైద్యుడు రోగాన్ని బట్టి తగిన మందు ఇస్తాడు. అలా మనం చేసిన తప్పు చిన్నదైతే చిన్న, పెద్దదైతే పెద్దా ప్రాయశ్చిత్తం

శ్రీరాజోవాచ
దృష్టశ్రుతాభ్యాం యత్పాపం జానన్నప్యాత్మనోऽహితమ్
కరోతి భూయో వివశః ప్రాయశ్చిత్తమథో కథమ్

మీరు చెప్పినది తెలియకుండా తప్పు చేసిన వారికి సరిపోతుంది గానీ, అది పాపమని తెస్లిసి అలాంటి దాని గురించి వినీ అలా చేస్తే ఏమవుతుందో చూచీ బుద్ధి పూర్వకముగా చేసినవారికి ప్రాయశ్చిత్తం ఏ విధముగా ఉపయోగపడుతుంది

క్వచిన్నివర్తతేऽభద్రాత్క్వచిచ్చరతి తత్పునః
ప్రాయశ్చిత్తమథోऽపార్థం మన్యే కుఞ్జరశౌచవత్

ఒక చోట తప్పు చేసి మరో చోట ప్రాయశ్చిత్తం చేసి మరో తప్పు చేస్తున్నాడు. ఏనుగు స్నానం లాగ అలాగే మనం కూడా ధర్మం చేసిన వెంటనే అధర్మం చేస్తూనే ఉంటాము. ఐతే ప్రాయశ్చిత్తం వలన లాభం లేదేమో

శ్రీబాదరాయణిరువాచ
కర్మణా కర్మనిర్హారో న హ్యాత్యన్తిక ఇష్యతే
అవిద్వదధికారిత్వాత్ప్రాయశ్చిత్తం విమర్శనమ్

ఒక కర్మను ఆచరించటం వలన వచ్చిన ఫలితం, ఇంకో కర్మను ఆచరించడం వలన తొలగదు. పరిపూర్ణముగా పరిహారం కాదు. ప్రాయశ్చిత్తమంటే కేవలం తాను చేసిన పనిని పరిశీలించుకోవడం మాత్రమే. ఇక ముందు అలాంటి తప్పు చేయకుండా పనికొస్తుంది గానీ చేసిన తప్పు పరిహారం అవ్వదు. జ్ఞ్యానం లేని వాడు మాత్రమే తప్పులు చేస్తాడు.

నాశ్నతః పథ్యమేవాన్నం వ్యాధయోऽభిభవన్తి హి
ఏవం నియమకృద్రాజన్శనైః క్షేమాయ కల్పతే

తినవలసిన దానిని తిన్నవాడికి వ్యాధులు రావు. ధర్మాన్ని ఆచరించినవాడికి పాపమూ రాదు

తపసా బ్రహ్మచర్యేణ శమేన చ దమేన చ
త్యాగేన సత్యశౌచాభ్యాం యమేన నియమేన వా

నియమం తప్పిన వాడికే నరకబాధలు. వెదురు బొంగును అగ్ని కాల్చినట్లుగా తాము చేసిన ఎంత చిన్న తప్పులైనా మహాత్ములు తొలగించుకుంటారు. శమాది మార్గాలు దానికి ఉన్నాయి

దేహవాగ్బుద్ధిజం ధీరా ధర్మజ్ఞాః శ్రద్ధయాన్వితాః
క్షిపన్త్యఘం మహదపి వేణుగుల్మమివానలః

కేచిత్కేవలయా భక్త్యా వాసుదేవపరాయణాః
అఘం ధున్వన్తి కార్త్స్న్యేన నీహారమివ భాస్కరః

కొందరు భక్తితోటే పరమాత్మను ఆరాధిస్తారు. వారు తప్పునూ ఒప్పునూ తెలియకనే చేస్తారు. పరమాత్మ నామ సంకీర్తన కూడా పరవశముతో చేస్తారు.కోరికలేని వాడు కోరకుండా చేసిన పనికి పాపం అంటదు. కేవల భక్తులై పూర్తిగా పాపాన్ని పోగొట్టుకుంటారు. సూర్యభగవానుడు మంచును తొలగించినట్లుగా వారి పాపాలు తొలగించబడతాయి. దాని వలన పాపం పోతాయి గానీ, ప్రాయశ్చిత్తం వలన కాదు.

న తథా హ్యఘవాన్రాజన్పూయేత తపాదిభిః
యథా కృష్ణార్పితప్రాణస్తత్పురుషనిషేవయా

భగవంతుని  యందు భక్తి కలవారు తప్పులు పోయినట్లు తపస్సు దానమూ యజ్ఞ్యములతో ప్రాయశ్చిత్తము చేస్తే పోవ్. భగవత్ భాగవతారాధనతో పవిత్రులైనట్లుగా ప్రాయశ్చిత్తముతో పవిత్రులము కాలేము.

సధ్రీచీనో హ్యయం లోకే పన్థాః క్షేమోऽకుతోభయః
సుశీలాః సాధవో యత్ర నారాయణపరాయణాః

ప్రపంచములో ఏ పక్కనుండీ ఎలాంటి భయమూ లేకుండా ఉండే మార్గముగా ఇది చెప్పబడింది. పరమాత్మ భక్తులకు ప్రాయశ్చిత్తాలతో పని లేదు. భగవత్ భాగవత ఆచార్య భక్తి కలవారు ప్రాయశ్చిత్తం చేయవలసిన పని లేదు. అది లేని వారు ప్రాయశ్చిత్తం చేసినా ఫలితం లేదు.

ప్రాయశ్చిత్తాని చీర్ణాని నారాయణపరాఙ్ముఖమ్
న నిష్పునన్తి రాజేన్ద్ర సురాకుమ్భమివాపగాః

పరమాత్మ యందు వైముఖ్యం కలిగిన మనసుతో చేసిన ప్రాయశ్చిత్తం పాపాన్ని పోగొట్టలేదు. మద్యపాత్రను గంగలో ఉంచితే దాని అపవిత్రత పోదు కదా. నదులు సురా కుంభాన్ని పవిత్రం చేయలేనట్లుగా పరమాత్మ విముఖముగా చేసిన ప్రాయశ్చిత్తాలు పవిత్రం చేయలేవు.

సకృన్మనః కృష్ణపదారవిన్దయోర్నివేశితం తద్గుణరాగి యైరిహ
న తే యమం పాశభృతశ్చ తద్భటాన్స్వప్నేऽపి పశ్యన్తి హి చీర్ణనిష్కృతాః

ఒక్క సారి మన మనసును పరమాత్మ పాద పద్మాల యందూ ఆయన గుణాల యందూ ఉంచితే యమున్ని గానీ, పాశధారులైన యమభటులని గానీ కలలో కూడా చూడరు. ఇంక వారికే ప్రాయశ్చిత్తములూ అవసరం లేదు. పరమాత్మ ఏ భావముతో భావించినా పాపం అంటదు. అగ్నిలో ఏది పడ్డా భస్మమైనట్లు.

అత్ర చోదాహరన్తీమమితిహాసం పురాతనమ్
దూతానాం విష్ణుయమయోః సంవాదస్తం నిబోధ మే

దీనికొక ఉదాహరణ ఇస్తాను. విష్ణు యమ దూతలకు జరిగిన సంవాదము చెబుతాను. కన్యా కుబ్జ నగరములో అజామీళుడనే వాడు ఒక శూద్ర స్త్రీకి భార్యగా పెరిగి దాసీ సంబోగముతో ఆచార భ్రష్టుడై

కాన్యకుబ్జే ద్విజః కశ్చిద్దాసీపతిరజామిలః
నామ్నా నష్టసదాచారో దాస్యాః సంసర్గదూషితః

బన్ద్యక్షైః కైతవైశ్చౌర్యైర్గర్హితాం వృత్తిమాస్థితః
బిభ్రత్కుటుమ్బమశుచిర్యాతయామాస దేహినః

దాసీ సగమం వచ్చాక ఆ ఒక్క పాపం వలన అందరూ నిందించే వృత్తిని అవలంబించి అపవిత్రుడై దాసీ కుటుంబాన్ని అపరిశుద్ధమైన మార్గములో పోషించుకుంటూ గడిపాడు

ఏవం నివసతస్తస్య లాలయానస్య తత్సుతాన్
కాలోऽత్యగాన్మహాన్రాజన్నష్టాశీత్యాయుషః సమాః

ఆ దాసీ పుత్రులను లాలిస్తూ, ఎనభై ఎనిమిది సంవత్సరాలు గడిపాడు.

తస్య ప్రవయసః పుత్రా దశ తేషాం తు యోऽవమః
బాలో నారాయణో నామ్నా పిత్రోశ్చ దయితో భృశమ్

ఆ దాసీ యందు పది మంది కుమారులు కలిగారు. అందరికంటే చిన్నవాడికి "నారాయణ" అన్న పేరు పెట్టుకున్నాడు.

స బద్ధహృదయస్తస్మిన్నర్భకే కలభాషిణి
నిరీక్షమాణస్తల్లీలాం ముముదే జరఠో భృశమ్

ముద్దు మాటలాడుతున్న నారాయణుని మాటలను వింటూ కాలం గడుపుతున్నాడు. ఆ పిల్లవాడి మాటలనీ ఆటలనీ సంతోషముగా చూస్తూ వింటూ ఉన్నాడు

భుఞ్జానః ప్రపిబన్ఖాదన్బాలకం స్నేహయన్త్రితః
భోజయన్పాయయన్మూఢో న వేదాగతమన్తకమ్

యముడు అనే వాడొకడున్నాడని కూడా తెలుసుకోలేదు

స ఏవం వర్తమానోऽజ్ఞో మృత్యుకాల ఉపస్థితే
మతిం చకార తనయే బాలే నారాయణాహ్వయే
స పాశహస్తాంస్త్రీన్దృష్ట్వా పురుషానతిదారుణాన్
వక్రతుణ్డానూర్ధ్వరోమ్ణ ఆత్మానం నేతుమాగతాన్
దూరే క్రీడనకాసక్తం పుత్రం నారాయణాహ్వయమ్
ప్లావితేన స్వరేణోచ్చైరాజుహావాకులేన్ద్రియః

మృత్యుకాలం వచ్చేసరికి ఎవరు చిన్నవారో వారి మీద ప్రేమ ఉంటుంది. అందుకు ఇతనికి నారాయణుడు జ్ఞ్యాపకం వచ్చాడు. ముగ్గురు యమభటులు పాశము ధరించి వంకర మూతితో భయంకరముగా వెంట్రుకలు నిక్కబొడుచుకుని ఉండి తనను తీసుకు పోవడానికి రాగానే వారిని చూచి భయము పొంది, "నారాయణ" "నారాయణా" "నారాయణా" అంటూ గట్టిగా పిలిచాడు

నిశమ్య మ్రియమాణస్య ముఖతో హరికీర్తనమ్
భర్తుర్నామ మహారాజ పార్షదాః సహసాపతన్
వికర్షతోऽన్తర్హృదయాద్దాసీపతిమజామిలమ్
యమప్రేష్యాన్విష్ణుదూతా వారయామాసురోజసా
ఊచుర్నిషేధితాస్తాంస్తే వైవస్వతపురఃసరాః
కే యూయం ప్రతిషేద్ధారో ధర్మరాజస్య శాసనమ్
కస్య వా కుత ఆయాతాః కస్మాదస్య నిషేధథ
కిం దేవా ఉపదేవా యా యూయం కిం సిద్ధసత్తమాః

తమ ప్రభువైన నారాయణుని పేరు పిలవగానే విష్ణు పార్శ్వదులు వచ్చారు. అప్పటికే యమదూతలు పాశముతో ఇతన్ని లాగుతూ ఉండగా విష్ణు పార్శ్వదులు వారిని నెట్టి వేసారు.

"మేము ధర్మరాజు దూతలం. ఆయన ఆజ్ఞ్యని కాదనడానికి మీరెవరు. దేవతలా ఉపదేవతలా (రాక్షసులా)"

సర్వే పద్మపలాశాక్షాః పీతకౌశేయవాససః
కిరీటినః కుణ్డలినో లసత్పుష్కరమాలినః

సర్వే చ నూత్నవయసః సర్వే చారుచతుర్భుజాః
ధనుర్నిషఙ్గాసిగదా శఙ్ఖచక్రామ్బుజశ్రియః

దిశో వితిమిరాలోకాః కుర్వన్తః స్వేన తేజసా
కిమర్థం ధర్మపాలస్య కిఙ్కరాన్నో నిషేధథ

పుండరీకాషులూ కిరీటములతో ఇపుడే యవ్వనములోకి వచ్చినట్లు ఉన్నారు. శంఖ చక్రాదులతో మీ తేజస్సుతో అన్ని దిక్కుల చీకట్లనూ పొగొడుతున్నారు. మేము ధర్మరాజు కింకరులము. మమ్ము మీరెందుకు నిషేధిస్తున్నారు".

శ్రీశుక ఉవాచ
ఇత్యుక్తే యమదూతైస్తే వాసుదేవోక్తకారిణః
తాన్ప్రత్యూచుః ప్రహస్యేదం మేఘనిర్హ్రాదయా గిరా

పరమాత్మ అనుచరులు నవ్వుతూ మేఘగంభీర స్వనముతో ఇలా అన్నారు

శ్రీవిష్ణుదూతా ఊచుః
యూయం వై ధర్మరాజస్య యది నిర్దేశకారిణః
బ్రూత ధర్మస్య నస్తత్త్వం యచ్చాధర్మస్య లక్షణమ్

మీరు యమధర్మరాజూ అనుచరులని మాకర్ధ్మైంది. ధర్మమంటే ఏమిటొ చెప్పగలరా మీరు. దండన తత్వం గురించి కూడా వివరించండి.

కథం స్విద్ధ్రియతే దణ్డః కిం వాస్య స్థానమీప్సితమ్
దణ్డ్యాః కిం కారిణః సర్వే ఆహో స్విత్కతిచిన్నృణామ్

తప్పు చేసిన వారందరినీ దండిస్తారా. కొందరినే దండిస్తారా. అని అడుగగా.

యమదూతా ఊచుః
వేదప్రణిహితో ధర్మో హ్యధర్మస్తద్విపర్యయః
వేదో నారాయణః సాక్షాత్స్వయమ్భూరితి శుశ్రుమ

వేదముచే విధించబడినది ధర్మం. వేదం చేత నిషేధించబడినది అధర్మం. వేదమంటే సాక్షాత్ నారాయణుడే. నారాయణుని వలన వచ్చినది వేదం. అయినప్పటికీ వేదం అపౌరుషేయం. నారాయణుని రూపమే వేదం. పరమాత్మ నిశ్వాసమే వేదం.

యేన స్వధామ్న్యమీ భావా రజఃసత్త్వతమోమయాః
గుణనామక్రియారూపైర్విభావ్యన్తే యథాతథమ్

ధరించేదీ ధరించబడేదీ ధర్మం. వృద్ధుడు కట్టెను పట్టుకుంటేనే నడిపిస్తుంది. అలాగే ధర్మం కూడా దానిని ఆచరిస్తేనే అది మనను కాపాడుతుంది. రజస్సు సత్వం తమో అనే భావములు గుణ నామ క్రియ పరమాత్మ చేతనే సృష్టించబడతాయి

సూర్యోऽగ్నిః ఖం మరుద్దేవః సోమః సన్ధ్యాహనీ దిశః
కం కుః స్వయం ధర్మ ఇతి హ్యేతే దైహ్యస్య సాక్షిణః

ఎవరికీ తెలియకుండా అతి రహస్యముగా మేము పని చేయగలం అనుకుటారు గానీ. సూర్యుడూ అగ్ని ఆకాశం వాయువు గోవులు చంద్రుడు సంధ్య పగలు దిక్కులూ బ్రహ్మ భూమి కాలమూ ధర్మమూ, ఈ పన్నెండూ దేహం కలవాడిచేత చేయబడే పనులకి సాక్షులు.

ఏతైరధర్మో విజ్ఞాతః స్థానం దణ్డస్య యుజ్యతే
సర్వే కర్మానురోధేన దణ్డమర్హన్తి కారిణః

ఇవి దేహం కలవారు చేసే అధర్మాన్ని తెలుసుకొని చేసిన అధర్మానికి శిక్ష కూడా విధిస్తాయి. ఏ ప్రాణి మరణానికైన ఈ పన్నెంటిలో ఏదో ఒకటి కారణమవుతుంది. వారు వారు చేసిన కర్మకనుగుణముగా శిక్షననుభవిస్తారు.

సమ్భవన్తి హి భద్రాణి విపరీతాని చానఘాః
కారిణాం గుణసఙ్గోऽస్తి దేహవాన్న హ్యకర్మకృత్

ధర్మాన్ని అనుసరించిన వారికి మగళము జరుగుతుంది. కాని వారికి శిక్షపడుతుంది. ధర్మమో అధర్మమో ఏదో ఒకటి చేసే తీరాలి. ఎందుకంటే ప్రకృతిలో ఉంటే సత్వమూ రజస్సూ తమస్సులలో ఏదో ఒకటి చేయాలి

యేన యావాన్యథాధర్మో ధర్మో వేహ సమీహితః
స ఏవ తత్ఫలం భుఙ్క్తే తథా తావదముత్ర వై

శరీరము కలవాడు కర్మ చేయకుండా ఉండలేడు. ఎవరు వారి గుణ సంగమును బట్టి ధర్మమో అధర్మమో చేసి తీరతాడు. అలా అనుకోవడానికి వాడి గుణము కారణం. ఇలా వారాచరించిన ధర్మాధర్మములకు అనుగుణముగానే ఫలితాన్ని పొందుతాడు. అన్నీ ఇక్కడే పొందడు. కొన్ని పరలోకములలో కూడా పొందుతాడు.

యథేహ దేవప్రవరాస్త్రైవిధ్యముపలభ్యతే
భూతేషు గుణవైచిత్ర్యాత్తథాన్యత్రానుమీయతే

దేవతలలో తేడాలు లాగ, సాత్విక రాజస తామస ప్రాణులు ఉంటాయి. వారాచరించే కర్మను బట్టి వారు సాత్వికులో రాజసికులో తామసికులో చెప్పవచ్చు.

వర్తమానోऽప్యయం కాలో గుణాభిజ్ఞాపకో యథా
ఏవం జన్మాన్యయోరేతద్ధర్మాధర్మనిదర్శనమ్

ఆయా జాతులలో ఉన్న శరీరుల శరీరం ఒకే తీరుగా ఉంటుంది. మరి వారు రాజసులా సాత్వికులా అని ఎలా చెప్పగలం. ఒక్కటే అయిన కాలాన్ని భూత భవిష్యత్ వర్త్మానమనీ. అలాగే రోజులో తెల్లవార్జు ఝామును సాత్వికమనీ, సాయం కాలం వరకూ రాజసమనీ, రాత్రి తామసికమని ఎలా చెప్పగలుగుతున్నాము. ప్రాణులు ఆచరించే పనులను బట్టి. ఆ పనులు ఏ గుణానివో ఆ గుణం కాలానికి ఆపాదిస్తున్నాము. సంబంధం లేని కాలానికే ఆ గుణం ఉన్నప్పుడు కర్తృత్వం ఉన్న ప్రాణికి ఆ గుణం ఉండదా?  ఎలాంటి వారికి పుత్రులుగా పుట్టారు, ఎలాంటి కాలములో పుట్టారు, ఎలాంటి పనులు చేస్తున్నారు.

మనసైవ పురే దేవః పూర్వరూపం విపశ్యతి
అనుమీమాంసతేऽపూర్వం మనసా భగవానజః

యథాజ్ఞస్తమసా యుక్త ఉపాస్తే వ్యక్తమేవ హి
న వేద పూర్వమపరం నష్టజన్మస్మృతిస్తథా

సామాన్యులు వారి మనస్సును బట్టి ఊహిస్తారు. మనస్సే వారి పూర్వ రూపాన్ని చెబుతుంది. (జాతకములో ద్వాదశాంశ అని ఒకటుంటుంది. అది తెలిస్తే పూర్వ జన్మ గురించి చెప్పవచ్చు). మనసు బట్టే వాడు పూర్వ జన్మలో ఎలాంటి వాడో చెప్పవచ్చు. పరమాత్మ కూడా ఒకడి కర్మ  బట్టే రాబోయే శరీరాన్ని నిర్ణ్యైస్తాడు. జ్ఞ్యానము లేని వాడు, తమో గుణములో ఉన్నవాడు, చీకటిలో ఉన్నవాడు దేనినీ సేవించలేడు. జ్ఞ్యానం పొంది వెలుతురులో ఉన్నవాడు స్పష్టముగా ఉన్న దానినే సేవిస్తాడు. చీకటిలో ఉన్నవాడు దేనినీ తెలియనట్లుగా పూర్వ జన్మ జ్ఞ్యానమున్నవాడు తరువాత దన్ని గానీ ముందు దాన్ని గానీ తెలుసుకోలేడు.

పఞ్చభిః కురుతే స్వార్థాన్పఞ్చ వేదాథ పఞ్చభిః
ఏకస్తు షోడశేన త్రీన్స్వయం సప్తదశోऽశ్నుతే

ప్రతీ వ్యక్తి తనకు కావలసిన దానిని ఐదింటితో చేస్తాడు. ఐదింటితో చేసి ఐదింటితో తెలుసుకుంటాడు.ఐదింటినీ కూడా ఐదింటితో తెలుసుకుంటాడు. ఒకడు పదహారుతో పదిహేడవది భావించి మూటినీ అనుభవిస్తాడు. ఐదు కర్మేంద్రియములతో ఐదు విషయములను ఆచరిస్తాడు. శబ్ద స్పర్శ రూప రస గంధములను పంచ జ్ఞ్యానేంద్రియములతో తెలుసుకుంటాడు. ఐదు కర్మేంద్రియములతో ఐదు పనులనూ చేస్తాడు. పదహారవది మనస్సు, పదిహేడవది బుద్ధి. మనసుతో చేసె దాన్ని అనుభవించేది బుద్ధి.  ఈ పదహారవ పదిహేడవ దానితోటే కర్తృత్వ కార్యత్వ కరణత్వ భావాలు కలుగుతాయి. 

తదేతత్షోడశకలం లిఙ్గం శక్తిత్రయం మహత్
ధత్తేऽనుసంసృతిం పుంసి హర్షశోకభయార్తిదామ్

జ్ఞ్యానెంద్రియ కర్మేంద్రియ పంచ భూతములూ మనసుతో కలిసి ఉన్నది త్రిగుణాత్మకం. ద్రవ్య జ్ఞ్యాన క్రియా శక్తిగా ఉంటుంది. ఈ శక్తి త్రయమే (బుద్ధి) జీవునిలో సంసారాన్ని ప్రవేశింపచేస్తుంది. సంతోషం దుఃఖం భయం ఆర్తి, వీటిని సంసారం కలిగిస్తుంది. ఈ సంసారాన్ని బుద్ధి కలిగిస్తుంది. అదే చేయిస్తుంది, అదే అనుభవిస్తుంది. ఆ అనుభవాన్ని ఆత్మకు ఆపాదిస్తుంది. 

దేహ్యజ్ఞోऽజితషడ్వర్గో నేచ్ఛన్కర్మాణి కార్యతే
కోశకార ఇవాత్మానం కర్మణాచ్ఛాద్య ముహ్యతి

అసలు జీవునికి వీటితో సంబంధం లేదు. అసలు ఆత్మ జ్ఞ్యాధికరణం. అది మరచిపోయి అరిషడ్వర్గాలని గెలవలేక, తనకు ఇష్టము లేకున్నా పనులు చేస్తూనే ఉంటాడు. సాలీడు తను వేసుకున్న వల తననే బంధిస్తుందని తెలియక అల్లుకున్నట్లు మనం కూడా మనని బంధించుకుంటాము. ఏ ఒక్కడూ ఏ ఒక్క క్షణం పని చేయకుండా ఉండజాలడు. తన వశములో తాను లేక ఇలాంటి పనులను తాను చేస్తూ ఉంటాడు. తాను కాదు ఆ పని చేసేది. గుణములు చేయిస్తుంటాయి. ఆ గుణములు తన స్వభావము వలన వచ్చినది. మామిడి విత్తనం వేస్తే వేప వస్తుందా? (పక్వానికి వచ్చిన మామిడి చెట్టును గొడ్డలితో కొట్టి అదే స్థానములో వేప చెట్టును నాటి దానిని పాలతో పోషించినా ఆ పండు చేదుగానే ఉంటుంది గానీ తీపిగా ఉండదు - భరతుని వాక్యం రామాయణములో) క్షేత్రం (యోనీ) విత్తనం కాలం - ప్రతీ దానికీ ఈ మూడే కారణం. వీటి బట్టే కర్మ వస్తువూ అనుభవం నిర్ణయించబడి ఉంటాయి. 

న హి కశ్చిత్క్షణమపి జాతు తిష్ఠత్యకర్మకృత్
కార్యతే హ్యవశః కర్మ గుణైః స్వాభావికైర్బలాత్
లబ్ధ్వా నిమిత్తమవ్యక్తం వ్యక్తావ్యక్తం భవత్యుత
యథాయోని యథాబీజం స్వభావేన బలీయసా
ఏష ప్రకృతిసఙ్గేన పురుషస్య విపర్యయః
ఆసీత్స ఏవ న చిరాదీశసఙ్గాద్విలీయతే

కారణం వ్యక్తం కావచ్చు అవ్యక్తం కావచ్చు వ్యక్తావ్యక్తమూ కవొచ్చు గానీ ఆయా క్షేత్రం బీజం ప్రకృతి స్వభావం బట్టే విపరీతముగా ప్రవర్తిస్తాడు. 

అయం హి శ్రుతసమ్పన్నః శీలవృత్తగుణాలయః
ధృతవ్రతో మృదుర్దాన్తః సత్యవాఙ్మన్త్రవిచ్ఛుచిః

ఎవరిని ఊర్ధ్వ లోకాలకు పంపాలనుకుంటాడో అలాంటి వాడిచేత అలాంటి పని పరమాత్మే చేయిస్తాడు. 

గుర్వగ్న్యతిథివృద్ధానాం శుశ్రూషురనహఙ్కృతః
సర్వభూతసుహృత్సాధుర్మితవాగనసూయకః

ఇతను శచ్చీలం కలవాడు శాస్త్రం చదువుకున్నవాడు మృదుస్వభావి. ఇంద్రియ నిగ్రహం కలవాడు, శుచి శౌచం కలవాడు. గురువులనూ అగ్నినీ భూతములనూ అథితినీ సేవించేవాడు, అహంకారం లేని వాడు, సకల ప్రాణులయందూ మైత్రీభావం కలవాడూ, సజ్జనుడూ, మితబాషి, ఇతరుల గుణాలలో దోషం ఎంచని వాడు.

ఏకదాసౌ వనం యాతః పితృసన్దేశకృద్ద్విజః
ఆదాయ తత ఆవృత్తః ఫలపుష్పసమిత్కుశాన్

దదర్శ కామినం కఞ్చిచ్ఛూద్రం సహ భుజిష్యయా
పీత్వా చ మధు మైరేయం మదాఘూర్ణితనేత్రయా

ఒక సారి పితృ ఆదేశం మీద దర్భలు తీసుకు రావడానికి వనానికి వెళ్ళాడు. పళ్ళనూ పూలనూ సమిధలనూ తీసుకుని వెనకకు బయలుదేరగా, విశ్రమిద్దామని చెట్టుకింద కూర్చుని ఉండగా కాముకుడైన ఒక శూద్రుడు తాననుభవించడానికి ఏర్పాటు చేసుకున్న వేశ్యను చూచాడు. 

మత్తయా విశ్లథన్నీవ్యా వ్యపేతం నిరపత్రపమ్
క్రీడన్తమనుగాయన్తం హసన్తమనయాన్తికే

దృష్ట్వా తాం కామలిప్తేన బాహునా పరిరమ్భితామ్
జగామ హృచ్ఛయవశం సహసైవ విమోహితః

స్తమ్భయన్నాత్మనాత్మానం యావత్సత్త్వం యథాశ్రుతమ్
న శశాక సమాధాతుం మనో మదనవేపితమ్

ఆ వేశ్య మద్యపానం చేసి ఎర్రబారిన చూపుతో ఉన్నది. మద్యపానము చేయడముతో బాగా మదించి ఉన్నది. వస్త్రం జారిపోతూ ఉండగా సిగ్గును విడిచి ఉన్న స్త్రీనీ ఆ పురుషున్ని చూచాడు. వారిద్దరూ ఆడుతూ పాడుతూ మాట్లాడుతూ ఉండగా పరిపూర్ణ్మైన కామోద్రేకముతో ఆలింగనం చేసుకున్న ఆ జంటను చూడగానే పాండిత్యం శ్రద్దా జ్ఞ్యానం పోయి మధన బాధితుడై 

మధ్యాన్నం పన్నెండు నించీ నాలుగు వరకూ అడవికీ అర్థరాత్రి శ్మశానములోకీ అపరరాత్రి నదీ జలమునకూ వెళ్ళకూడదు. ఆయా సమయాలలో అక్కడ అటువంటి పనులు జరుగుతాయి. మధ్యాహ్నం ఎవరూ ఉండరని అడవిలో కొందరు కాముకులు అరణ్యాన్ని శయ్యాగృహముగా వాడుకొంటారు. అర్థరాత్రి భూత ప్రేతములు శ్మశానాన్ని అలా వాడుకొంటాయి, అలాగే అపర రాత్రి సరస్సులూ. అప్పటికీ చదువుకున్నవాడు కాబట్టి నిగ్రహించుకుందామని ప్రయత్నించాడు గానీ సమాధానపరచుకోలేకపోయాడు.

తన్నిమిత్తస్మరవ్యాజ గ్రహగ్రస్తో విచేతనః
తామేవ మనసా ధ్యాయన్స్వధర్మాద్విరరామ హ


తామేవ తోషయామాస పిత్ర్యేణార్థేన యావతా
గ్రామ్యైర్మనోరమైః కామైః ప్రసీదేత యథా తథా


మన్మధుడనే గ్రహం పట్టింది ఇతనికి. ఆ వేశ్యనే కోరుకున్నాడు. ఎలాగూ వేశ్య కాబట్టి తండ్రి సంపాదించిన డబ్బుని (తండ్రి నుంచి నేర్చుకున్న జ్ఞ్యానం శీలం తపస్సూ ధారపోసాడు) ధార్పోసాడు. ఆమెను సంతోషపరచి తాను సంతోషం పొందాడు. అంతవరకూ తనకన్ని రకములుగా సేవచేసిన ధర్మపత్నినీ, అప్రౌఢ (వేశ్య లాగ తనని రజింపచేయలేక పోయినదైన భార్య) 

విప్రాం స్వభార్యామప్రౌఢాం కులే మహతి లమ్భితామ్
విససర్జాచిరాత్పాపః స్వైరిణ్యాపాఙ్గవిద్ధధీః

తన భార్య తనకు అలాంటి సంతోషాన్ని ఇవ్వలేకపోయింది అని విడిచిపెట్టాడు. భర్తను తన వశములో ఉంచుకోవడానికి అవసరమైన చేష్టలు చేయలేనిది - అప్రౌఢ. 

యతస్తతశ్చోపనిన్యే న్యాయతోऽన్యాయతో ధనమ్
బభారాస్యాః కుటుమ్బిన్యాః కుటుమ్బం మన్దధీరయమ్

ఉత్తమ కులములో పుట్టినది. మాయోపాయములతో భర్తను వశం చేసుకోవాలన్న భావన అటువంటి స్త్రీలకు కలదు. ఆ వేశ్యను పోషించడానికి ఈ బ్రాహ్మణోత్తముడు అన్ని వైపులనుంచీ ధనాన్ని తీసొచ్చాడు, ధర్మముగా అధరమముగా కూడా సంపాధించాడు. బుద్ధి తక్కువ వాడై ఆమె సంతానాన్ని పోషించాడు. 

యదసౌ శాస్త్రముల్లఙ్ఘ్య స్వైరచార్యతిగర్హితః
అవర్తత చిరం కాలమఘాయురశుచిర్మలాత్

తత ఏనం దణ్డపాణేః సకాశం కృతకిల్బిషమ్
నేష్యామోऽకృతనిర్వేశం యత్ర దణ్డేన శుద్ధ్యతి

ఇలా ధర్మాన్నీ శాస్త్రాన్ని ఉల్లంఘించి చాలా కాలం వ్యవహరించాడు. యధేచ్చగా ప్రవర్తిస్తూ చాలా కాలం గడిపి జీవితమంతా పాపముతో గడిపాడు. ఇతను చేసిన పాపానికి తగిన శిక్ష అనుభవించడానికి ఇతను తీసుకుపోవడానికి యమధర్మరాజు దగ్గర నుంచి వచ్చాము. చేసిన అపరాధం శిక్షతో పరిశుద్ధమవుతుంది కాబట్టి యమ ధర్మ రాజు పంపాడు

Popular Posts