శ్రీనారద ఉవాచ
అథ దైత్యసుతాః సర్వే శ్రుత్వా తదనువర్ణితమ్
జగృహుర్నిరవద్యత్వాన్నైవ గుర్వనుశిక్షితమ్
మనస్సులో ఎలాంటి కల్మషం లేని రాక్షస బాలురకు ప్రహ్లాదుడు సులభముగా స్పష్టముగా చేసిన ఉపదేశాన్ని స్వీకరించారు. గురువుగారు బోధించిన దాన్ని స్వీకరించలేదు.
అథాచార్యసుతస్తేషాం బుద్ధిమేకాన్తసంస్థితామ్
ఆలక్ష్య భీతస్త్వరితో రాజ్ఞ ఆవేదయద్యథా
పిల్ల మనస్తత్వం మారినట్లు గ్రహించిన గురుపుత్రులు, అది ప్రహ్లాదుని పనే అని గ్రహించి హిరణ్యకశిపునికే అది నివేదించారు.
శ్రుత్వా తదప్రియం దైత్యో దుఃసహం తనయానయమ్
కోపావేశచలద్గాత్రః పుత్రం హన్తుం మనో దధే
గురుపుత్రులు చెప్పిన తన పుత్రుడు చేసిన అవినీతి (అనయం) విని ఒళ్ళంతా మండిపోతుంటే ప్రహ్లాదున్ని చంపడానికి నిశ్చయించుకున్నాడు.
క్షిప్త్వా పరుషయా వాచా ప్రహ్రాదమతదర్హణమ్
ఆహేక్షమాణః పాపేన తిరశ్చీనేన చక్షుషా
ప్రశ్రయావనతం దాన్తం బద్ధాఞ్జలిమవస్థితమ్
సర్పః పదాహత ఇవ శ్వసన్ప్రకృతిదారుణః
అటువంటి ప్రవృత్తికి అర్హుడు కాని ప్రహ్లాదున్ని కిందకి తోసి పరుషమైన మాటలతో పాపౌ వంకర చూపుతో తండ్రి వద్ద వినయముగా చేతులు జోడించి ఒదిగి ఉన్నా, ఇంద్రియ నిగ్రహం గల ప్రహ్లాదునితో పరమదారుణమైన రాక్షుడు తోక తొక్కిన తాచులా బుసలు కొడుతూ ఇలా అన్నాడు.
శ్రీహిరణ్యకశిపురువాచ
హే దుర్వినీత మన్దాత్మన్కులభేదకరాధమ
స్తబ్ధం మచ్ఛాసనోద్వృత్తం నేష్యే త్వాద్య యమక్షయమ్
వినయము లేని వాడా, మంద బుద్ధీ, రాక్షస కులములో భేధం కలిగించేవాడా, నీవు నా ఆజ్ఞ్యను అతిక్రమించావు, తోసి వేసావు. నిన్ను యమ సదనానికి పంపుతాను.
క్రుద్ధస్య యస్య కమ్పన్తే త్రయో లోకాః సహేశ్వరాః
తస్య మేऽభీతవన్మూఢ శాసనం కిం బలోऽత్యగాః
నేను కోపిస్తే మూడు లోకాలూ లోక నాయకులతో కూడి వణికిపోతారు. అలాంటి నా ఆజ్ఞ్యను ఎవరి బలము చూసుకుని ధిక్కరిస్తున్నావు.
శ్రీప్రహ్రాద ఉవాచ
న కేవలం మే భవతశ్చ రాజన్స వై బలం బలినాం చాపరేషామ్
పరేऽవరేऽమీ స్థిరజఙ్గమా యే బ్రహ్మాదయో యేన వశం ప్రణీతాః
మహారాజా నాకేకాదు, నీకు కూడా ఆయనే బలం. చిన్నవారూ పెద్దవారూ స్థావరములూ జంగమములూ బ్రహ్మాది దేవతలూ ఎవరి వశములో ఉన్నారో అందరికీ ఆయనే బలం.
బలయుతులకు దుర్బలులకు
బలమెవ్వడు నీకు నాకు బ్రహ్మాదులకున్
బలమెవ్వడ ప్రాణులకును
బలమెవ్వం డట్టి విభుడు బల మసురేంద్రా
స ఈశ్వరః కాల ఉరుక్రమోऽసావోజః సహః సత్త్వబలేన్ద్రియాత్మా
స ఏవ విశ్వం పరమః స్వశక్తిభిః సృజత్యవత్యత్తి గుణత్రయేశః
ఆయనే శాసకుడు, ఆయనే కాలము, ఆయనే చాలా వేగము కల పాదము గలవాడు, అతనే ఓజస్సూ (ప్రవృత్తి, అనుకున్న దానిలో ప్రవర్తించగల నేర్పు. సంకల్పించినదాన్ని చేయగలగడం) సహస్సూ(వేగం, చేసే పనిని వేగముగా చేయడం, వేగమును తట్టుకోవడం) బలం (ధారణ, ధరించే సామర్ధ్యం), ఇంద్రియమ్ములూ, అన్నీ ఆయనే. నా చేత నమస్కరింపచేస్తున్నాదీ, నీచేత తిరస్కరింపచేస్తున్నదీ ఆయనే. నీ ప్రవృత్తీ నా ప్రవృత్తీ, నీ ఆలోచనా నా ఆలోచనా, నీ వేగం నా వేగం, నీ బలం నా బలం అన్నీ ఆయనే. ఆయన తన దివ్యమైన శక్తులతో మూడు గుణములు (సత్వం రజః తమః) అధిపతి కాబట్టి ఆయనే మూడు గుణాలతో మూడు పనులనూ చేస్తాడు (సృష్టి స్థితి లయములు).
జహ్యాసురం భావమిమం త్వమాత్మనః సమం మనో ధత్స్వ న సన్తి విద్విషః
ఋతేऽజితాదాత్మన ఉత్పథే స్థితాత్తద్ధి హ్యనన్తస్య మహత్సమర్హణమ్
ఈ అసుర బుద్ధినీ, తలంపునూ విడిచిపెట్టు. మనస్సును రాగ ద్వేషములు లేకుండా సమముగా ఉంచుకో. అలా చేస్తే శత్రువులే ఉండరు. వేరొక శత్రువు నీకు ఉండరు. అడ్డదారి పట్టిన వశములో లేని, గెలువని మనసుకంటే వేరొక శత్రువు లేరు. మనసుని గెలుచుటే మంచి ఆరాధన.
దస్యూన్పురా షణ్న విజిత్య లుమ్పతో మన్యన్త ఏకే స్వజితా దిశో దశ
జితాత్మనో జ్ఞస్య సమస్య దేహినాం సాధోః స్వమోహప్రభవాః కుతః పరే
మనలోనే ఆరుగురు దొంగలున్నారు. వారిని గెలవకుండా "మేము పది దిక్కులూ గెలిచాము" అని భావిస్తూ ఉంటారు. అసలు ఎవరికెవరు శత్రువులు? మోహం వలన పుట్టినవారే శత్రువులు. మనసుని గెలిచి జ్ఞ్యానం కలిగి సమదృష్టి కలవారికి శత్రువులు ఎవరు?
లోకములన్నియున్ గడియలోన జయించినవాడ వింద్రియా
నీకము జిత్తముం గెలువ నేరవు నిన్ను నిబద్ధు జేయు నీ
భీకర శత్రు లార్వుర బ్రఖిన్నుల జేసిన బ్రాణికోటిలో
నీకు విరోధి లే డొకడు నేర్పున చూడుము దానవేశ్వరా!
శ్రీహిరణ్యకశిపురువాచ
వ్యక్తం త్వం మర్తుకామోऽసి యోऽతిమాత్రం వికత్థసే
ముమూర్షూణాం హి మన్దాత్మన్నను స్యుర్విక్లవా గిరః
నిజముగా నీకు చావు మీదే కోరిక ఉన్నట్లు ఉంది. ఇంతగా గర్విస్తున్నావు. చనిపోబోయే వారికి మాటలు ఇలాగే తడబడతాయి, అందుకే నీవిలా మాట్లాడుతున్నావు.
యస్త్వయా మన్దభాగ్యోక్తో మదన్యో జగదీశ్వరః
క్వాసౌ యది స సర్వత్ర కస్మాత్స్తమ్భే న దృశ్యతే
మంద భాగ్యుడా నీవు చెప్పినట్లుగా నాకంటే వేరే ఒక జగన్నాధుడు ఉంటే, ఎక్కడున్నాడు. నీవనంట్లు అంతటా ఉంటే అందులో కనపడుట లేదే?
సోऽహం వికత్థమానస్య శిరః కాయాద్ధరామి తే
గోపాయేత హరిస్త్వాద్య యస్తే శరణమీప్సితమ్
నిజముగా అంతటా ఉంటే, ఈ స్తంభములో కూడా ఉంటే ఆయన చూస్తుండగానే నీ శిరస్సును ఖండిస్తాను. అంతటా ఉంటే, నిన్ను ఆ హరే కాపాడాలి. నీవు ఆయనని శరణు వేడావు కదా?
ఏవం దురుక్తైర్ముహురర్దయన్రుషా సుతం మహాభాగవతం మహాసురః
ఖడ్గం ప్రగృహ్యోత్పతితో వరాసనాత్స్తమ్భం తతాడాతిబలః స్వముష్టినా
కోపముతో దుర్భాషలతో పరమభాగవతోత్తముడైన తన కన్నకొడుకుని ఈ మహారాక్షసుడు బాధిస్తూ, ఖడ్గమును తీసుకుని సింహాసనం నుండి కిందకు ఎగిరాడు. మహాబలాడ్యుడైన ఆ హిరణ్యకశిపుడు తన పిడికిలితో స్తంభాన్ని కొట్టాడు.
తదైవ తస్మిన్నినదోऽతిభీషణో బభూవ యేనాణ్డకటాహమస్ఫుటత్
యం వై స్వధిష్ణ్యోపగతం త్వజాదయః శ్రుత్వా స్వధామాత్యయమఙ్గ మేనిరే
అతను ముష్టితో కొట్టగానే ఆ స్తంభము నుండి ఒక భయంకరమైన ధ్వని వినిపించింది. బ్రహ్మాండ కటాహం వణికిపోయేంత పరమభయంకరమైన ధ్వని వినిపించింది. వారి వారి లోకాలలో ఉన్న బ్రహ్మ రుద్రేంద్రాదులు ఈ ధ్వని విని తమ లోకాలకు ముప్పు ముంచుకొచ్చిందీ, ప్రళయం వచ్చింది అని భయపడ్డారు.
స విక్రమన్పుత్రవధేప్సురోజసా నిశమ్య నిర్హ్రాదమపూర్వమద్భుతమ్
అన్తఃసభాయాం న దదర్శ తత్పదం వితత్రసుర్యేన సురారియూథపాః
హిరణ్యకశిపుడు వేగముగా కొడుకును చంపడానికి వేగముగా వెళ్ళాడు. తాను ముందుకు వెళ్ళేసరికి పధ్నాలుగు లోకాలూ వణికే ధ్వని వచ్చింది. అది విని ఆశ్చర్యముతో వెనక్కు తిరిగాడు. అపూర్వమైనది ( ఇది వరకు ఎక్కడా జరిగి ఉండని), అద్భుతమైనదీ అయైన ధ్వనిని విని, సభలో ఆ ధ్వని ఎక్కడినుంచి వచ్చిందో చుట్టూ చూసాడు గానీ ఏమీ కనపడలేదు. రాక్షస సైన్యమంతా భయపడి వణికిపోయింది ఆ ధ్వని వలన.
సత్యం విధాతుం నిజభృత్యభాషితం వ్యాప్తిం చ భూతేష్వఖిలేషు చాత్మనః
అదృశ్యతాత్యద్భుతరూపముద్వహన్స్తమ్భే సభాయాం న మృగం న మానుషమ్
నరసింహస్వామి అవతారానికి మూల కారణం ఇది.
1. సత్యం విధాతుం నిజభృత్యభాషితం. తన భక్తుడు అన్న మాటను నిజం చేయడానికి. ఇక్కడ ప్రహ్లాదుడు సర్వ వ్యాపి అన్నది ప్రహ్లాదుడు. అలా ప్రహ్లాదునికి చెప్పినది నారదుడు. ఆ నారదునికి చెప్పినది బ్రహ్మ. ఈ ముగ్గురూ స్వామి భక్తులే. స్తంభములోంచి స్వామి ఆవిర్భవించి వారి మాటను నిజం చేసారు.
2. వ్యాప్తిం చ భూతేష్వఖిలేషు చాత్మనః - ఇది రెండవ కారణం. సకల ప్రాణుల యందు స్వామి వ్యాపించి ఉన్నాడు. ఈ విషయం అందరికీ చాటడానికి కనపడ్డాడు.
స్వామి రూపం వేదాలకు కూడా అందించడానికి మాటలు అందవు. అందుకే ఆయన రూపం అత్యద్భుతం. అత్యత్భుత రూపాన్ని వహించి కనపడ్డాడు. ఏ స్తంభాన్ని హిరణ్యకశిపుడు కొట్టాడో అందులో కనపడ్డాడు. మనిషీ కాదు మృగమూ కాదు. నరమూ కాదు సింహమూ కాదు. నరసింహం.
నరమూర్తిగాదు కేవల
హరిమూర్తియు గాడు మానవాకారము కే
సరి యకారము నున్నది
హరి మాయారచితమగు యధార్దము చూడన్!
నరరూపం మృగరూపం కాని నృసింహాకృతి
పగలు రాత్రి కాని సంధ్యాసమయం
లోపల వెలుపల కాని సభాద్వారం
ప్రాణులున్నవీ లేనివీ అయిన వాడిగోళ్ళు
స సత్త్వమేనం పరితో విపశ్యన్స్తమ్భస్య మధ్యాదనునిర్జిహానమ్
నాయం మృగో నాపి నరో విచిత్రమహో కిమేతన్నృమృగేన్ద్రరూపమ్
అప్పుడు హిరణ్యకశిపుడు చుట్టూ తిరిగి చూచాడు. స్తంభం మధ్యనుంచి తనను సంహరించడానికి వస్తున్న స్వామిని చూచి, నరమూ కాదు, మృగమూ కాదు, ఇదేమి రూపం అని ఆశ్చర్యపోయాడు.
మీమాంసమానస్య సముత్థితోऽగ్రతో నృసింహరూపస్తదలం భయానకమ్
ప్రతప్తచామీకరచణ్డలోచనం స్ఫురత్సటాకేశరజృమ్భితాననమ్
ఆ రూపాన్ని చూచి, ఇదే రూపం అయి ఉంటుంది అని ఆలోచిస్తూ ఉండగానే భయపడడానికి అదే చివరి మెట్టుగా అంతకంటే భయపడడానికి ఏదీ లేని రూపం, బాగుగా కాల్చిన బంగారపు రంగు (పచ్చ) భయంకరమైన కళ్ళు కలిగి, బాగా ప్రకాశించే మెడ చుట్టూ ఉండే సటలతో (జుట్టు),
కరాలదంష్ట్రం కరవాలచఞ్చల క్షురాన్తజిహ్వం భ్రుకుటీముఖోల్బణమ్
స్తబ్ధోర్ధ్వకర్ణం గిరికన్దరాద్భుత వ్యాత్తాస్యనాసం హనుభేదభీషణమ్
పర్వత గుహలాంటి దమ్ష్ట్రలూ, కోరలు, మహా ఖడ్గములా అటూ ఇటూ కదులుతున్న నాలుకా, కనుబొమ్మల ముడితో భయంకరముగా ఉన్న, నిక్కబొడుచుకుని ఉన్న చెవులూ, పర్వత గుహ వంటి నాసికా రంధ్రము కలా, భయంకరమైన దవడలూ కలిగి
దివిస్పృశత్కాయమదీర్ఘపీవర గ్రీవోరువక్షఃస్థలమల్పమధ్యమమ్
చన్ద్రాంశుగౌరైశ్ఛురితం తనూరుహైర్విష్వగ్భుజానీకశతం నఖాయుధమ్
స్వర్గానికి తాకుతున్నంత ప్రమాణం గల శరీరం కలవాడై, బాగా పొడువూ కాకుండా పొట్టీ కాకుండా బలిసి ఉన్న మెడ, విశాల వక్షస్థలం, సన్నని నడుము, చంద్రుని కిరణముల వలె తెల్లగా ఉన్న, చుర కత్తుల వంటి రోమములూ, అంతటా వ్యాపించి ఉన్న వేయి భుజాలూ, (భుజ అనీక సైన్యం - అంతటా వ్యాపించి ఉన్న భుజములనే సైన్యం కలవాడు), గోళ్ళే ఆయుధములుగా కలిగి,
దురాసదం సర్వనిజేతరాయుధ ప్రవేకవిద్రావితదైత్యదానవమ్
ప్రాయేణ మేऽయం హరిణోరుమాయినా వధః స్మృతోऽనేన సముద్యతేన కిమ్
ఎవ్వరి చేతా దగ్గరకి పోవడానికి వీలు లేనంత భయంకరముగా ఉన్నాడు, తనకంటే ఇతరుల చేతిలో ఉన్న ఆయుధములను తరిమికొడుతున్న వాడు, ఇప్పటి దాకా అన్ని భీరములూ పలికిన హిరణ్యకశిపుడు కూడా ఆ దివ్య భయంకరమైన రూపాన్ని చూచి "నా వధ ఈ రూపములో జరగాలని నిర్ణయించుకున్నాడా" అని అనుకున్నాడు.
ఏవం బ్రువంస్త్వభ్యపతద్గదాయుధో నదన్నృసింహం ప్రతి దైత్యకుఞ్జరః
అలక్షితోऽగ్నౌ పతితః పతఙ్గమో యథా నృసింహౌజసి సోऽసురస్తదా
అలా అనుకొని గదను తీసుకుని స్వామి మీదకు వెళ్ళాడు. నారసింహుని మీదకు రాక్షసుడనే ఏనుగు వెళ్ళింది. అగ్ని తేజస్సు గుర్తించక మిడతలు ఎలా అందులో పడతాయో అలా హిరణ్యకశిపుడు వెళ్ళాడు. ఇంత గొప్పవాడైన హిరణ్యకశిపుడు కూడా అంధ కారములో మునిగిపోయాడు. ఇంత పెద్ద బ్రహ్మాండమనే అంధకారాన్ని మింగిన స్వామ్మికి హిరణ్యకశిపున్ని తనలో చేరుకోవడం ఒక లెక్కలోకి రాదు.
న తద్విచిత్రం ఖలు సత్త్వధామని స్వతేజసా యో ను పురాపిబత్తమః
తతోऽభిపద్యాభ్యహనన్మహాసురో రుషా నృసింహం గదయోరువేగయా
తన చేతిలో ఉన్న గదతో స్వామిని కొట్టాడు. పామును గరుడుడు ఒడిసిపట్టినట్లుగా గదతో ఉన్న హిరణ్యకశిపున్ని స్వామి పట్టుకున్నాడు.
తం విక్రమన్తం సగదం గదాధరో మహోరగం తార్క్ష్యసుతో యథాగ్రహీత్
స తస్య హస్తోత్కలితస్తదాసురో విక్రీడతో యద్వదహిర్గరుత్మతః
ఆయన పట్టుకుంటే హిరణ్యకశిపుడు ఆ పట్టుని విడిపించుకున్నాడు. అది మంచి శకునముగా దేవతలు భావించలేదు. అందరూ మబ్బుల చాటులో దాక్కుని జరిగేదంతా చూస్తున్నారు. గరుత్మంతుడు పాముతో ఆడుకున్నట్లు హిరణ్యకశిపునితో ఆడుకున్నాడు స్వామి.
అసాధ్వమన్యన్త హృతౌకసోऽమరా ఘనచ్ఛదా భారత సర్వధిష్ణ్యపాః
తం మన్యమానో నిజవీర్యశఙ్కితం యద్ధస్తముక్తో నృహరిం మహాసురః
పునస్తమాసజ్జత ఖడ్గచర్మణీ ప్రగృహ్య వేగేన గతశ్రమో మృధే
సకలలోకపాలకులూ హిరణ్యకశిపుడు స్వామి చేతిలోంచి పట్టును తప్పించుకోవడం మంచిది కాదు కదా అనుకున్నారు. తన బలం మీద తనకే అనుమానం వచ్చింది హిరణ్యకశిపునికి. ఒక కత్తినీ డాలునీ తీసుకుని మీదకి వెళ్ళాడు. యుద్ధమంటే ఆనందం కలిగేవాడైన హిరణ్యకశిపుడు స్వామి మీదకు వెళ్ళాడు.
తం శ్యేనవేగం శతచన్ద్రవర్త్మభిశ్చరన్తమచ్ఛిద్రముపర్యధో హరిః
కృత్వాట్టహాసం ఖరముత్స్వనోల్బణం నిమీలితాక్షం జగృహే మహాజవః
డేగ లాంటి వేగం గల హిరణ్యకశిపుడు నూరు చంద్రులు (అంచులు) గల కత్తిని సందులేకుండా వేగముగా పట్టుకుని తిప్పుతూ ఉన్న వాడిని చూచి స్వామి ఒక అట్టహాసం చేసాడు. ఆ ధ్వనితో అన్ని లోకాలూ వణికిపోయాయి. ఆ అట్టహాసానికి హిరణ్యకశిపుడు కళ్ళు మూసుకున్నాడు.
విష్వక్స్ఫురన్తం గ్రహణాతురం హరిర్వ్యాలో యథాఖుం కులిశాక్షతత్వచమ్
ద్వార్యూరుమాపత్య దదార లీలయా నఖైర్యథాహిం గరుడో మహావిషమ్
సర్పము ఎలా ఎలుకను ఎంత వేగముగా వెళుతున్నా పట్టుకుంటుందో, అలా పట్టుకుని సభా ద్వారములో కూర్చుండి తన ఊరువు మీద పెట్టుకుని పాముని గరుడుడు గోళ్ళతో చీల్చి వేసినట్లు చీల్చి వేసాడు.
సంరమ్భదుష్ప్రేక్ష్యకరాలలోచనో వ్యాత్తాననాన్తం విలిహన్స్వజిహ్వయా
అసృగ్లవాక్తారుణకేశరాననో యథాన్త్రమాలీ ద్విపహత్యయా హరిః
ఏంగును చంపిన సింహం గోళ్ళకు అంటినట్లుగా స్వామి గోళ్ళకూ, మెడచుట్టూ ఉన్న కేసరమూలూ, ముఖానికీ రక్తం అంటుకొని ఉండగా, ప్రేగులు మెడలో పడిన సింహములాగ, ఆయన కోపాన్ని చూస్తే ఎవ్వరూ ఆయనౌ చూడడానికి సాహసం చేయరానిదిగా ఉండెను.
నఖాఙ్కురోత్పాటితహృత్సరోరుహం విసృజ్య తస్యానుచరానుదాయుధాన్
అహన్సమస్తాన్నఖశస్త్రపాణిభిర్దోర్దణ్డయూథోऽనుపథాన్సహస్రశః
గోళ్ళ కొనలతో హిరణ్యకశిపుని గుండే పెకిలి వేయబడినది. అతన్ని ఇలా వధిస్తే మా రాజుని చంపుతావా అని సైన్యమంతా వచ్చారు. తన నఖములతో ఇంకా కొన్ని ఇతర ఆయుధాలతో వచ్చిన వారిని వచ్చినట్లు వధించాడు. భుజములే స్వామి సైన్యము. దారిపట్టి వచ్చిన వారందరినీ సంహరించాడు.
సటావధూతా జలదాః పరాపతన్గ్రహాశ్చ తద్దృష్టివిముష్టరోచిషః
అమ్భోధయః శ్వాసహతా విచుక్షుభుర్నిర్హ్రాదభీతా దిగిభా విచుక్రుశుః
అలా చంపుతూ తన తలని ఒక్క సారి విదిలించాడు, అలా విధించగా అక్కడున్న మేఘాలన్నీ విడిపోయాయి, ఒక్క సారి పైకి చూడగానే గ్రహాలన్నీ రాలిపోయాయి, ఒక్క సారి ఆయన కోపముతో నిశ్వాస తీయగానే ఏడు సముద్రాలూ ఒక్కసారి ఉప్పొంగాయి, గట్టిగా గర్ఝించగానే దిగ్గజాలు పారిపోయాయి, ఆయన జూలులో ఆకాశములో వెళ్ళే విమానాలు చిక్కుకున్నాయి.
ద్యౌస్తత్సటోత్క్షిప్తవిమానసఙ్కులా ప్రోత్సర్పత క్ష్మా చ పదాభిపీడితా
శైలాః సముత్పేతురముష్య రంహసా తత్తేజసా ఖం కకుభో న రేజిరే
ఒక్క అడుగు వేయగానే భూమి మొత్తం కదిలి పక్కకు వెళ్ళిపోయింది, ఆయన వేగముతో పర్వతాలు పడిపోయాయి, ఆయన తేజస్సుతో ఆకాశమూ దిక్కులూ ఉన్నట్లు కనపడలేదు.
తతః సభాయాముపవిష్టముత్తమే నృపాసనే సమ్భృతతేజసం విభుమ్
అలక్షితద్వైరథమత్యమర్షణం ప్రచణ్డవక్త్రం న బభాజ కశ్చన
ఇలా అన్నీ పూర్తి చేసి, సభా మధ్యములో ఉన్న సింహాసనం మీద తన దివ్యమైన తేజస్సుతో కూర్చున్నాడు. ఆయనకు ఎదురు నిలిచేవాడే లేడు. దరిదాపులకు కూడా ఎవరూ వచ్చే సాహసం చేయలేదు. ఆయన కోపం ఎంతకీ తగ్గలేదు. మహా ఉగ్రముగా ఉన్నాడు. అలాంటి స్వామిని చూచి ఎవ్వరి ముఖమూ శోభించలేదు.
నిశామ్య లోకత్రయమస్తకజ్వరం తమాదిదైత్యం హరిణా హతం మృధే
ప్రహర్షవేగోత్కలితాననా ముహుః ప్రసూనవర్షైర్వవృషుః సురస్త్రియః
మూడు లోకములకూ తల నొప్పి వంటి వాడైన (లోకత్రయమస్తకజ్వరం ) హిరణ్యకశిపుడు సంహరించబడ్డాడని విని ఆనందించి అప్సరసలు వికసించిన ముఖం కలవారై పుష్పవర్షాన్ని కురిపించారు.
తదా విమానావలిభిర్నభస్తలం దిదృక్షతాం సఙ్కులమాస నాకినామ్
సురానకా దున్దుభయోऽథ జఘ్నిరే గన్ధర్వముఖ్యా ననృతుర్జగుః స్త్రియః
అందరూ తమ విమానాలలో చూడడానికి రాగానే ఆకాశమంతా విమానాలతో నిండిపోయింది సందులేకుండా. ఇలా దేవతలూ దేవతాధిపతులూ దుంధుభులు మోగించారు, గంధర్వులు గానం అప్సరసలు నాట్యం చేసారు.
తత్రోపవ్రజ్య విబుధా బ్రహ్మేన్ద్రగిరిశాదయః
ఋషయః పితరః సిద్ధా విద్యాధరమహోరగాః
ఋషులూ పితృదేవతలూ సిద్ధులూ విష్ణుపార్శదులూ మొదలైన వారందరూ
మనవః ప్రజానాం పతయో గన్ధర్వాప్సరచారణాః
యక్షాః కిమ్పురుషాస్తాత వేతాలాః సహకిన్నరాః
శిరస్సు వంచి నమస్కరిస్తూ ఆసీనుడైన స్వామికి దగ్గరగా మాత్రం రాలేదు.
తే విష్ణుపార్షదాః సర్వే సునన్దకుముదాదయః
మూర్ధ్ని బద్ధాఞ్జలిపుటా ఆసీనం తీవ్రతేజసమ్
ఈడిరే నరశార్దులం నాతిదూరచరాః పృథక్
అలా స్వామి చుట్టూ తిరుగుతూ స్వామిని స్తోత్రం చేసారు.
శ్రీబ్రహ్మోవాచ
నతోऽస్మ్యనన్తాయ దురన్తశక్తయే విచిత్రవీర్యాయ పవిత్రకర్మణే
విశ్వస్య సర్గస్థితిసంయమాన్గుణైః స్వలీలయా సన్దధతేऽవ్యయాత్మనే
గుణములకూ నామములకూ స్వరూపములకూ స్థితికీ అంతము లేని స్వామికి నమస్కార్మ్. "ఇంతా" అని వివరించలేనంత శక్తి గలవాడు.సకల జగత్తునూ తన వశములో ఉంచుకోగల విచిత్రమైన (బలమూ శక్తీ ఉపయోగించకుండానే సకల లోకములనూ తన వశములో ఉంచుకోగలవాడు.) వీర్యము గలవాడు. నీవు చేసే ఏ పని అయినా సకల లోకములనూ పావనం చేస్తావు. సృష్టి స్థితి లయాలను తన లీలతో చేసేవాడు. తరుగు లేని వాడు
శ్రీరుద్ర ఉవాచ
కోపకాలో యుగాన్తస్తే హతోऽయమసురోऽల్పకః
తత్సుతం పాహ్యుపసృతం భక్తం తే భక్తవత్సల
ఇది ప్రళయకాలం కాదు కదా. అంత కోపం ఎందుకు.ఈ అల్పున్ని చంపడానికా ఇంత కోపం. నీ భతుడైన ప్రహ్లాదుడు నీ వద్దకు వచ్చాడు. అతన్ని కాపాడు, శాంతించు
శ్రీన్ద్ర ఉవాచ
ప్రత్యానీతాః పరమ భవతా త్రాయతా నః స్వభాగా
దైత్యాక్రాన్తం హృదయకమలం తద్గృహం ప్రత్యబోధి
కాలగ్రస్తం కియదిదమహో నాథ శుశ్రూషతాం తే
ముక్తిస్తేషాం న హి బహుమతా నారసింహాపరైః కిమ్
ఇతను దేవతలకు ఇచ్చే హవిస్సును తనే స్వీకరించేవాడు. అలాంటిది నీవు మమ్ము కాపాడదలచి అతన్ని సంహరించి మా భాగాలు మాకు ఇచ్చావు. మిమ్ము తలచుకునే అవకాశమే మాకు లేదు. నిరంతరం ఇతని వలన వచ్చే ఉపద్రవం తలచుకుంటూ నీ ఇల్లు అయిన మా హృదయములో నిన్ను తలచుకోకుండా ఉన్న మేము ం అళ్ళీ నిన్ను తలచుకోగలుగుతున్నాము. మా హృదయములో నీ స్వరూపాన్ని ప్రతిష్టింపచేసావు. ఇదంతా కాల గ్రస్థం. కొంత సమయములో సంతోషం, కొంత సమయములో విచారం. ఇదంతా కాలానుగుణముగా జరిగే ప్రక్రియ. నిన్ను సేవించే వారు మోక్షం కూడా కోరరు. మాకు మీ సేవ ప్రధానం.
శ్రీఋషయ ఊచుః
త్వం నస్తపః పరమమాత్థ యదాత్మతేజో
యేనేదమాదిపురుషాత్మగతం ససర్క్థ
తద్విప్రలుప్తమమునాద్య శరణ్యపాల
రక్షాగృహీతవపుషా పునరన్వమంస్థాః
మాకు తపముతోటి ఇంతటి తేజస్సును ప్రసాదించినది నీవు. ఆ తపస్సుతోనే బ్రహ్మ సకల జగత్తునీ సృష్టించాడు. మేమాచరించే తపస్సు మేము ఆచరించకుండా ఇతను లోపింపచేసాడు. నీవిపుడు ఈ అవతారాన్ని తీసుకుని ఆ తపస్సుని మాకు తిరిగి ఇచ్చావు.
శ్రీపితర ఊచుః
శ్రాద్ధాని నోऽధిబుభుజే ప్రసభం తనూజైర్
దత్తాని తీర్థసమయేऽప్యపిబత్తిలామ్బు
తస్యోదరాన్నఖవిదీర్ణవపాద్య ఆర్చ్ఛత్
తస్మై నమో నృహరయేऽఖిలధర్మగోప్త్రే
మా మా పుత్రులు మాకర్పించే శ్రాద్ధ భోజనం వీడే తినేసి, వారిచ్చే తర్పణాలు కూడా వీడే స్వీకరించాడు. అతని ఉదరాన్ని చీల్చి, ఆ జలాన్నీ అన్నాన్ని మాకు మళ్ళీ ప్రసాదించావు. సకల ధర్మాన్నీ కాపాడే నృసింహస్వామికి నమస్కారం
శ్రీసిద్ధా ఊచుః
యో నో గతిం యోగసిద్ధామసాధురహార్షీద్యోగతపోబలేన
నానా దర్పం తం నఖైర్విదదార తస్మై తుభ్యం ప్రణతాః స్మో నృసింహ
యోగము వలన మేము సంపాదించిన సిద్ధిని తన యోగముతో హిరణ్యకశిపుడు సంహరించాడు. "నేనే బలవంతున్నీ శక్తిమంతున్నీ" అని గర్విస్తున్న వాడిని చీల్చి మా సిద్ధిని మాకు ఇచ్చావు
శ్రీవిద్యాధరా ఊచుః
విద్యాం పృథగ్ధారణయానురాద్ధాం న్యషేధదజ్ఞో బలవీర్యదృప్తః
స యేన సఙ్ఖ్యే పశువద్ధతస్తం మాయానృసింహం ప్రణతాః స్మ నిత్యమ్
మేము మా మనసుని నీ యందు ధారణం చేసి పొందిన అఖిల విద్యలను ఈ దుర్మార్గుడు అడ్డుపడి నిషేధించాడు. యుద్ధములో పశువులా (ప్రతికిరా శూన్యుడై) సంహరించబడ్డాడు. అలాంటి నీకు నిత్యమూ నమస్కారము.
శ్రీనాగా ఊచుః
యేన పాపేన రత్నాని స్త్రీరత్నాని హృతాని నః
తద్వక్షఃపాటనేనాసాం దత్తానన్ద నమోऽస్తు తే
మా మస్తకములో ఉన్న రత్నాలనూ, మా స్త్రీ రత్నాలనూ హరించాడు. ఇతని వక్షస్థమ చీల్చి మాకు ఆనందం కలిగించావు
శ్రీమనవ ఊచుః
మనవో వయం తవ నిదేశకారిణో దితిజేన దేవ పరిభూతసేతవః
భవతా ఖలః స ఉపసంహృతః ప్రభో కరవామ తే కిమనుశాధి కిఙ్కరాన్
మేము మీ ఆజ్ఞ్యను పాలించేవారము.ఈ దితి కుమారుడు మా మర్యాదలను అడ్డగించాడు. ఈ ఖలుడు నీ చేత ఉపసంహరించబడ్డాడు. ఏమి చేయాలో మీ కింకరులమైన మాకు ఆజ్ఞ్యాపించు
శ్రీప్రజాపతయ ఊచుః
ప్రజేశా వయం తే పరేశాభిసృష్టా న యేన ప్రజా వై సృజామో నిషిద్ధాః
స ఏష త్వయా భిన్నవక్షా ను శేతే జగన్మఙ్గలం సత్త్వమూర్తేऽవతారః
మేము ప్రజాపతులం. నీవు పరేశుడవు. నీవు మమ్ము సృష్టించావు. నీ ఆజ్ఞ్య ప్రకారం మేము ప్రజలను సృష్టిస్తుంటే వీడు అడ్డగించాడు. అలాంటి వాడు నీచేత వక్షస్థలం చీలచబడి పడి ఉన్నాడు. సకల విశ్వమునకూ నీ అవతారం మంగళ కరం
శ్రీగన్ధర్వా ఊచుః
వయం విభో తే నటనాట్యగాయకా యేనాత్మసాద్వీర్యబలౌజసా కృతాః
స ఏష నీతో భవతా దశామిమాం కిముత్పథస్థః కుశలాయ కల్పతే
మేము నీకు గాయకులమూ నర్తకులమూ. నీ ఎదుట నాట్యం చేస్తాము. వీడు తనకు చేయించుకున్నాడు. చెడుదారిలో పోయేవాడు క్షేమాలు పొందుతాడా? ఏదో కొంతకాలం సాగించుకుంటాడు అంతే.
శ్రీచారణా ఊచుః
హరే తవాఙ్ఘ్రిపఙ్కజం భవాపవర్గమాశ్రితాః
యదేష సాధుహృచ్ఛయస్త్వయాసురః సమాపితః
మేము సంసారాన్ని పోగొట్టే నీ పాదములను ఆశ్రయించినవారం. సజ్జన హృదయములో శల్యం ఐన వీడిని సంహరించారు.
శ్రీయక్షా ఊచుః
వయమనుచరముఖ్యాః కర్మభిస్తే మనోజ్ఞైస్
త ఇహ దితిసుతేన ప్రాపితా వాహకత్వమ్
స తు జనపరితాపం తత్కృతం జానతా తే
నరహర ఉపనీతః పఞ్చతాం పఞ్చవింశ
చక్కని సేవలు చేస్తూ మీకు మేము అనుచరులుగా ఉన్నాము. నీకు సేవ చేయవలసిన మమ్ము ఈ రాక్షసుడు తనకు సేవకునిగా చేసుకుని తన వాహనాలని మోయించాడు. సకల లోకములకూ పరితాపాన్ని కలిగించాడు. అలాంటి ఇరవై ఐదవ తత్వము (ఇరవై నాలుగు తత్వాలు జీవుడు + ఇరవై ఐదవది పరమాత్మ)అయిన నీవు వీడి ఐదునీ (పంచ ప్రాణాలని) తీసుకున్నావు.
శ్రీకిమ్పురుషా ఊచుః
వయం కిమ్పురుషాస్త్వం తు మహాపురుష ఈశ్వరః
అయం కుపురుషో నష్టో ధిక్కృతః సాధుభిర్యదా
మేము చిన్న పురుషులము నీవు మహా పురుషుడవు, వీడు దుష్ట పురుసుడు. సజ్జనులతో దిక్కరించబడి నశించాడు.
శ్రీవైతాలికా ఊచుః
సభాసు సత్రేషు తవామలం యశో గీత్వా సపర్యాం మహతీం లభామహే
యస్తామనైషీద్వశమేష దుర్జనో ద్విష్ట్యా హతస్తే భగవన్యథామయః
ఆయా దేవ సభలలో నీ దివ్య గుణ నామాలను కీర్తించి గొప్ప గౌరవాన్ని పొందాము. ఈ దుర్మార్గుడు అలాంటి మర్యాదను తొలగించాడు. అలాంటి వాడు వ్యాధి తొలగించబడినట్లుగా మీ దయతో సంహరించబడ్డాడు.
శ్రీకిన్నరా ఊచుః
వయమీశ కిన్నరగణాస్తవానుగా దితిజేన విష్టిమమునానుకారితాః
భవతా హరే స వృజినోऽవసాదితో నరసింహ నాథ విభవాయ నో భవ
మేము కిన్నెరులం, నీ అనుచరులము. అలాంటి మేము ఈ రాక్షసునితో వాడి సేవను చేయవలసి వచ్చింది. మా దుఃఖాన్ని మీరు తొలగించారు. మా వైభవం మాకు కలిగించు.
శ్రీవిష్ణుపార్షదా ఊచుః
అద్యైతద్ధరినరరూపమద్భుతం తే దృష్టం నః శరణద సర్వలోకశర్మ
సోऽయం తే విధికర ఈశ విప్రశప్తస్తస్యేదం నిధనమనుగ్రహాయ విద్మః
అత్యద్భుతమైన నీ నరసింహరూపాన్ని మేము చూడగలిగాము. ఈ రూపం అన్ని లోకములకూ సుఖమూ శుభమూ మంగళం కలిగిస్తుంది. వేరే వాళ్ళందరూ స్వామి దుర్మార్గున్న సంహరించాడు అంటున్నారు కానీ వారికేం తెలుసు ఇతను కూడా మీ సేవకుడు, సనకాదులచే శపించబడ్డాడు అని. సనకాదుల శాపం వలన కలిగిన దుఃఖాన్ని పోగొట్టావు. అలాంటి వాని సంహారం నిగ్రహం కాదు, అది నీ అనుగ్రహమే. నీ సేవకులను నీవు నిగ్రహించవు. అనుగ్రహిస్తావు.