Followers

Sunday, 2 March 2014

శ్రీమద్భాగవతం చతుర్థ స్కంధం ఇరవై ఎనిమిదవ అధ్యాయం

నారద ఉవాచ
సైనికా భయనామ్నో యే బర్హిష్మన్దిష్టకారిణః
ప్రజ్వారకాలకన్యాభ్యాం విచేరురవనీమిమామ్

ఇలా యవనాధిపతి సైన్యాన్ని తీసుకుని దాడి చేసాడు. ఇష్టకారిణః - భగవంతుడు అనుకున్నదాన్ని చేసేవి. భగవత్సంకల్పాన్ని అనుసరించేవి. మొత్తం భూమండలాన్ని సంచరించడం మొదలుపెట్టాయి.

త ఏకదా తు రభసా పురఞ్జనపురీం నృప
రురుధుర్భౌమభోగాఢ్యాం జరత్పన్నగపాలితామ్

అలా తిరుగుతూ పురంజన పురానికొచ్చారు. ఈ నగరాన్ని ఐదు తలల పాము కాపాడుతోంది. ఆ పాము ముసలిదైంది. ఆ ముసలి పాముతో కాపాడబడుతోన్నా సర్వ భోగాలు గల పురంజన పురానికి వచ్చారు

కాలకన్యాపి బుభుజే పురఞ్జనపురం బలాత్
యయాభిభూతః పురుషః సద్యో నిఃసారతామియాత్

కాల కన్య కూడా వచ్చి ఈ పురంజర పురాన్ని బలాత్కారముగా అనుభవించడం మొదలుపెట్టింది. ఆ కాలకన్య రాగానే పురుషుడు బలహీనుడవుతాడు. ఇలా జరా పురంజనున్ని ఆక్రమించింది.

తయోపభుజ్యమానాం వై యవనాః సర్వతోదిశమ్
ద్వార్భిః ప్రవిశ్య సుభృశం ప్రార్దయన్సకలాం పురీమ్

ఇలా కాల కన్యా చండవేగుడూ రాగానే వారి సైన్యం వచ్చింది. తొమ్మిది ద్వారాల నుండీ వారు వచ్చారు.

తస్యాం ప్రపీడ్యమానాయామభిమానీ పురఞ్జనః
అవాపోరువిధాంస్తాపాన్కుటుమ్బీ మమతాకులః

ఇలా పురంజనున్ని ఆక్రమించినా ఇంకా అభిమానం తొలగక కుటుంబముతో కలిసి గొప్ప బాధననుభవించాడు. మమకారం వలన బాధపడుతున్నాడు.

కన్యోపగూఢో నష్టశ్రీః కృపణో విషయాత్మకః
నష్టప్రజ్ఞో హృతైశ్వర్యో గన్ధర్వయవనైర్బలాత్

కాల కన్య గట్టిగా కౌగిలించుకుంది (కన్యోపగూఢో ) విడిచిపెట్టకుండా. ధనము పోయి కృపణుడయ్యాడు. విషయములయందే మనసు ఉంచినవాడు. గంధర్వులు వచ్చి మొత్తమూ హరించారు

విశీర్ణాం స్వపురీం వీక్ష్య ప్రతికూలాననాదృతాన్
పుత్రాన్పౌత్రానుగామాత్యాన్జాయాం చ గతసౌహృదామ్

తన నగరము యొక్క ద్వారాలూ గోపురాలూ చూస్తుండగానే కూలిపోతున్నాయి.  తన నగరాన్ని చూచి, పుత్ర పౌత్ర అనుగ(సేవకులు) ఆమాత్యులు (అప్పటికే ఆమాత్యులు ఇతని మాట కాదని మనవల మాట వినడం మొదలు పెట్టారు, భార్య మాట వినడం మానేసింది.)

ఆత్మానం కన్యయా గ్రస్తం పఞ్చాలానరిదూషితాన్
దురన్తచిన్తామాపన్నో న లేభే తత్ప్రతిక్రియామ్

తనకు జర వచ్చింది. పంచాల రాజ్యము (పంచ జ్ఞ్యానేంద్రియాలు) శత్రువులచే ఆక్రమించబడింది. ఇలా చింతను పొందినవాడై దీనికి ఏమి ప్రతిక్రియ చేయాలో తెలియని వాడయ్యాడు.

కామానభిలషన్దీనో యాతయామాంశ్చ కన్యయా
విగతాత్మగతిస్నేహః పుత్రదారాంశ్చ లాలయన్

జర వచ్చి అన్ని కోరికలనూ ఆక్రమించుకుంది (తినలేడూ తాగలేదు ఏమీ చేయలేడు). ఏ పనీ చేయలేక కేవలం కాలము గడిచిన కామనలను తలచుకుంటూ తన యందు ప్రేమలేని కొడుకులనూ భార్యలనూ బంధువులను ఓదారుస్తూ ఉంటాడు. 

గన్ధర్వయవనాక్రాన్తాం కాలకన్యోపమర్దితామ్
హాతుం ప్రచక్రమే రాజా తాం పురీమనికామతః

గంధర్వ యవన కాల కన్యచే ఆక్రమించబడిన నగరాన్ని, ఈ రాజ్యములో ఉండలేమని వదిలిపెట్టాలనుకున్నాడు. 

భయనామ్నోऽగ్రజో భ్రాతా ప్రజ్వారః ప్రత్యుపస్థితః
దదాహ తాం పురీం కృత్స్నాం భ్రాతుః ప్రియచికీర్షయా

మృత్యువు వచ్చాడు. అంతకన్నా ముందు రోగమొచ్చింది. వారొచ్చి శరీరాన్ని తగలబెట్టారు అన్నగారైన మృత్యువుకోసం. 

తస్యాం సన్దహ్యమానాయాం సపౌరః సపరిచ్ఛదః
కౌటుమ్బికః కుటుమ్బిన్యా ఉపాతప్యత సాన్వయః

అలా తగలబడుతోంటే పౌరులందరూ (బంధువులు) పరితపించారు.

యవనోపరుద్ధాయతనో గ్రస్తాయాం కాలకన్యయా
పుర్యాం ప్రజ్వారసంసృష్టః పురపాలోऽన్వతప్యత

ఇక్కడ ఉండలేమని పుర పాలకుడు బాగా పరితపించి బాగా వణుకుపుట్టి దీన్ని కాపాడలేమని 

న శేకే సోऽవితుం తత్ర పురుకృచ్ఛ్రోరువేపథుః
గన్తుమైచ్ఛత్తతో వృక్ష కోటరాదివ సానలాత్

నిప్పంటుకున్న చెట్టు తొర్రలోంచి పక్షులు వెళ్ళిపోయింట్లు వెళ్ళదలచుకున్నాడు. 

శిథిలావయవో యర్హి గన్ధర్వైర్హృతపౌరుషః
యవనైరరిభీ రాజన్నుపరుద్ధో రురోద హ

గంధర్వుల వలన (పగలూ రాత్రీ) మొత్తం బలమంతా పోయింది. ఇలా అరికడితే ఉండలేకా వెళ్ళలేక ఏడ్చాడు. 

దుహితౄః పుత్రపౌత్రాంశ్చ జామిజామాతృపార్షదాన్
స్వత్వావశిష్టం యత్కిఞ్చిద్గృహకోశపరిచ్ఛదమ్
అహం మమేతి స్వీకృత్య గృహేషు కుమతిర్గృహీ
దధ్యౌ ప్రమదయా దీనో విప్రయోగ ఉపస్థితే

ఒక్క సారి ఈ నగరాన్ని విడిచిపెట్టి పోవాలనుకునే సరికి కూతుర్లూ కొడుకులూ మనవలూ బంధువులూ మొదలైన వారు ఎవరూ రాలేదు. ఎవరూ నా వాడు అనలేదు. ఒక్క శరీరం ఒక్కటే తనది. అది కూడా పోవాలనే అనుకుంటోంది. ఇల్లూ డబూ ఆస్థి పాస్తులూ అహంకార మమకారముతో నేనూ నాది అన్న భావనతో పోగొట్టుకున్నాడు

లోకాన్తరం గతవతి మయ్యనాథా కుటుమ్బినీ
వర్తిష్యతే కథం త్వేషా బాలకాననుశోచతీ

భార్యను చూచి "నేను లోకాంతరానికి వెళితే నా  భార్య ఏమవ్వాలి. అమాయకురాలు ఆమె ఎలా బ్రతుకుతుందో "

న మయ్యనాశితే భుఙ్క్తే నాస్నాతే స్నాతి మత్పరా
మయి రుష్టే సుసన్త్రస్తా భర్త్సితే యతవాగ్భయాత్

నేను తినకపోతే అదీ తినదు.  నేను స్నానం చేస్తేనే అది స్నానం చేస్తుంది. మరి ఇప్పుడు ఎలా ఉంటుంది. భయపెడితే మాట్లాడకుండా ఉండేది

ప్రబోధయతి మావిజ్ఞం వ్యుషితే శోకకర్శితా
వర్త్మైతద్గృహమేధీయం వీరసూరపి నేష్యతి

ఎక్కడికైనా వెళితే ఏడుస్తూ ఉండేది. ఈ గృహ్స్థాశ్రమ మార్గాన్ని నేను లేకుండా ఎలా గడుపుతుంది. 

కథం ను దారకా దీనా దారకీర్వాపరాయణాః
వర్తిష్యన్తే మయి గతే భిన్ననావ ఇవోదధౌ

నావ లేని సముద్రములో వెళ్ళలేనట్లు నేను లేకపోతే పిల్లలను ఎలా పోషిస్తుంది.

ఏవం కృపణయా బుద్ధ్యా శోచన్తమతదర్హణమ్
గ్రహీతుం కృతధీరేనం భయనామాభ్యపద్యత

ఆలోచించకూడని సమయములో ఇలా అందరి గురించి శొచిస్తూ ఉంటే ఇటువంటి వాడిని పట్టుకోవడానికి మృత్యువు చేరింది.

పశువద్యవనైరేష నీయమానః స్వకం క్షయమ్
అన్వద్రవన్ననుపథాః శోచన్తో భృశమాతురాః

పశువును మెడలో తాడు వేసి లాగుకొని పోయినట్లు మృత్యువు పాశముతో లాగుకొని వెళ్ళింది. 

పురీం విహాయోపగత ఉపరుద్ధో భుజఙ్గమః
యదా తమేవాను పురీ విశీర్ణా ప్రకృతిం గతా

ఆ సర్పం కూడా అరికట్టబడింది. 

వికృష్యమాణః ప్రసభం యవనేన బలీయసా
నావిన్దత్తమసావిష్టః సఖాయం సుహృదం పురః

ఇన్ని కష్టాలు వచ్చాయి. ఇందరు వచ్చి బంధించి బాధిస్తూ తీసుకుని వెళుతూ ఉన్నా కూడా తన ప్రాణ మిత్రున్ని గుర్తు చేసుకోలేదు అజ్ఞ్యానం ఆవరించినవాడై. 

తం యజ్ఞపశవోऽనేన సంజ్ఞప్తా యేऽదయాలునా
కుఠారైశ్చిచ్ఛిదుః క్రుద్ధాః స్మరన్తోऽమీవమస్య తత్

ఇలా పాశములు కట్టి లాగుకొని పోతుంటే అక్కడికి పోతుంటే ఇతని కోసం యజ్ఞ్య పశువులు సిద్ధముగా ఉన్నాయి. కోపముతో ఇతని పాపాన్ని తలచుకుంటూ గొడ్డళ్ళతో (కుఠారై) నరికేసాయి 

అనన్తపారే తమసి మగ్నో నష్టస్మృతిః సమాః
శాశ్వతీరనుభూయార్తిం ప్రమదాసఙ్గదూషితః

అంతులేని చీకటిలో కూరుకుపోయి చాలా కాలం అవస్థపడ్డాడు, తన ఇంతకు ముందు ప్రియా సంగము వలన. 

తామేవ మనసా గృహ్ణన్బభూవ ప్రమదోత్తమా
అనన్తరం విదర్భస్య రాజసింహస్య వేశ్మని

భార్యని తలచుకుంటూ మరణించాడు కాబట్టి తరువాతి జన్మలో స్త్రీగా పుట్టాడు.

ఉపయేమే వీర్యపణాం వైదర్భీం మలయధ్వజః
యుధి నిర్జిత్య రాజన్యాన్పాణ్డ్యః పరపురఞ్జయః

విదర్భ రాజ కుమారుడిని వివాహం చేసుకుంది. భగవంతుని సేవ చేసి తోటి రాజులను (కామ క్రోధాలను గెలిచాడు) నిరంతరం యజ్ఞ్యములాచరించాడు దాని వలన 

తస్యాం స జనయాం చక్ర ఆత్మజామసితేక్షణామ్
యవీయసః సప్త సుతాన్సప్త ద్రవిడభూభృతః

మహాపరాక్రమవంతుడు ఇతను, యుద్ధములో చాలా రాజ్యాలను గెలిచి భార్యతో ఒక అమ్మాయిని కన్నాడు. ద్రవిడ దేశానికి రాజులుగా ఏడుగురు కొడుకులని కన్నాడు
భక్తి అనే కూతురు కలిగింది (నల్లని చూపు కలది - నల్లని వాన్ని చూపులో ఉంచుకున్నది - భక్తి) ఏడుగురు కొడుకులు సత్య ఆత్మ నివేదనములు తప్ప మిగతా నవ విధ భక్తులు.

ఏకైకస్యాభవత్తేషాం రాజన్నర్బుదమర్బుదమ్
భోక్ష్యతే యద్వంశధరైర్మహీ మన్వన్తరం పరమ్

ఒక్కో రాజ కుమారుడికీ మళ్ళీ సంతానం కలిగారు. ఇలా వారి వారితో భూమి మన్వంతర కాలం అనుభవించబడింది

అగస్త్యః ప్రాగ్దుహితరముపయేమే ధృతవ్రతామ్
యస్యాం దృఢచ్యుతో జాత ఇధ్మవాహాత్మజో మునిః

అందులో ఒక అమ్మాయిని అగస్త్యుడు వివాహం చేసుకున్నాడు. అగః అంటే పర్వతం. పర్వతాన్ని వచినవాడు (వింధ్య పర్వతం) . అహంకారాన్ని వచినవాడు. జ్ఞ్యాని. భక్తిని జ్ఞ్యానం వివాహం చేసుకున్నాడు. వినయశీలీ అహంకార రహితుడే భక్తిని వశం చేసుకోగలడు. ఇధ్మవాహాత్మజో  - అగ్ని కుమారుడు

విభజ్య తనయేభ్యః క్ష్మాం రాజర్షిర్మలయధ్వజః
ఆరిరాధయిషుః కృష్ణం స జగామ కులాచలమ్

ఇతను తన రాజ్యాన్ని అందరికీ పంచివేసాడు. కులాద్రి పర్వతానికి భార్యను తీసుకుని వెళ్ళిపోయాడు

హిత్వా గృహాన్సుతాన్భోగాన్వైదర్భీ మదిరేక్షణా
అన్వధావత పాణ్డ్యేశం జ్యోత్స్నేవ రజనీకరమ్

అందరినీ వదిలి ఈమె కూడా భర్తను అనువర్తించింది

తత్ర చన్ద్రవసా నామ తామ్రపర్ణీ వటోదకా
తత్పుణ్యసలిలైర్నిత్యముభయత్రాత్మనో మృజన్

చన్ద్రవసా - తామ్రపర్ణీ. ఈ నదికి రెండువైపులా మఱ్ఱి చెట్టు ఉంది. మఱ్ఱి చెట్టు సంసారానికి సంకేతము. ఇహ పరలోకములో వచ్చే అన్ని పాపాలను మర్రి చెట్టు వేళ్ళు తాకిన నీరు తాగితే పోతాయి. అటువంటి మర్రి చెట్టు నీడలో తపస్సుకు కూర్చున్నాడు

కన్దాష్టిభిర్మూలఫలైః పుష్పపర్ణైస్తృణోదకైః
వర్తమానః శనైర్గాత్ర కర్శనం తప ఆస్థితః
శీతోష్ణవాతవర్షాణి క్షుత్పిపాసే ప్రియాప్రియే
సుఖదుఃఖే ఇతి ద్వన్ద్వాన్యజయత్సమదర్శనః

తపస్సు ద్వారా ద్వంద్వాలను గెలిచాడు సమదర్శనుడై అన్నిటిలో ఉన్న పరమాత్మను చూస్తూ మౌనముగా తపస్సు చేసాడు. తపస్సుతో పాపాలన్ని భస్మయ్యాయి

తపసా విద్యయా పక్వ కషాయో నియమైర్యమైః
యుయుజే బ్రహ్మణ్యాత్మానం విజితాక్షానిలాశయః

ఇంద్రియములనూ వాయువునూ మనసునూ మూటినీ గెలిచాడు కో మొద్దులా ఐపోయి నూరు సంవత్సరాలు పరమాత్మ యందు తప్ప దేని యందూ మనసు ఉంచలేదు

ఆస్తే స్థాణురివైకత్ర దివ్యం వర్షశతం స్థిరః
వాసుదేవే భగవతి నాన్యద్వేదోద్వహన్రతిమ్

స వ్యాపకతయాత్మానం వ్యతిరిక్తతయాత్మని
విద్వాన్స్వప్న ఇవామర్శ సాక్షిణం విరరామ హ

పరమాత్మ సర్వాంతర్యామి అని తెలుసుకొని జగత్తునీ శరీరాన్నీ కలలోని వస్తువుగా అనిత్యముగా తెలుసుకున్నాడు, అన్నీ మానేశాడు

సాక్షాద్భగవతోక్తేన గురుణా హరిణా నృప
విశుద్ధజ్ఞానదీపేన స్ఫురతా విశ్వతోముఖమ్

కపిలుడు ఏ మార్గాన్ని చెప్పాడో ఆ మార్గాన్ని తీసుకుని తనను పరామాత్మలో పరమాత్మను తనలో చూచాడు. 

పరే బ్రహ్మణి చాత్మానం పరం బ్రహ్మ తథాత్మని
వీక్షమాణో విహాయేక్షామస్మాదుపరరామ హ

కోరికనూ ఆసక్తినీ విడిచి శరీరమునుండీ విడిచిపెట్టాడు

పతిం పరమధర్మజ్ఞం వైదర్భీ మలయధ్వజమ్
ప్రేమ్ణా పర్యచరద్ధిత్వా భోగాన్సా పతిదేవతా

అన్ని రాజభోగాలను విడిచిపెట్టి పతిని సేవించింది, నార వస్త్రాలను ధరించి కేశాలనున్ జడలుగా చేసుకుని భర్తను అనుగమించింది

చీరవాసా వ్రతక్షామా వేణీభూతశిరోరుహా
బభావుప పతిం శాన్తా శిఖా శాన్తమివానలమ్

అజానతీ ప్రియతమం యదోపరతమఙ్గనా
సుస్థిరాసనమాసాద్య యథాపూర్వముపాచరత్

భర్తను సేవిస్తూ గడిపింది. అతను శరీరం విడిచిపెట్టినట్లు తెలుసుకోలేదు. తన భర్త పాద ప్రక్షాళన చేయబోతే అతని కాళ్ళు వేడిగా లేవు. 

యదా నోపలభేతాఙ్ఘ్రావూష్మాణం పత్యురర్చతీ
ఆసీత్సంవిగ్నహృదయా యూథభ్రష్టా మృగీ యథా

తోటి వారిని కోల్పోయిన ఆడలేడిలా దైన్యముతో ఏడుస్తూ ఉంది. 

ఆత్మానం శోచతీ దీనమబన్ధుం విక్లవాశ్రుభిః
స్తనావాసిచ్య విపినే సుస్వరం ప్రరురోద సా

ఉత్తిష్ఠోత్తిష్ఠ రాజర్షే ఇమాముదధిమేఖలామ్
దస్యుభ్యః క్షత్రబన్ధుభ్యో బిభ్యతీం పాతుమర్హసి

మహారాజా  నీవు పోతే ఈ రాజ్యాన్ని ఎవరు కాపాడతారని ఏడుస్తూ 

ఏవం విలపన్తీ బాలా విపినేऽనుగతా పతిమ్
పతితా పాదయోర్భర్తూ రుదత్యశ్రూణ్యవర్తయత్

కన్నీరు స్రవింపచేస్తూ చితిని పేర్చి అగ్నిని పెట్టి సంస్కారం చేసి తాను కూడా అందులో పడి మరణించాలనుకుంటే

చితిం దారుమయీం చిత్వా తస్యాం పత్యుః కలేవరమ్
ఆదీప్య చానుమరణే విలపన్తీ మనో దధే

తత్ర పూర్వతరః కశ్చిత్సఖా బ్రాహ్మణ ఆత్మవాన్
సాన్త్వయన్వల్గునా సామ్నా తామాహ రుదతీం ప్రభో

తన పూర్వ మిత్రుడు ఓదారుస్తూ ఇలా అన్నాడు

బ్రాహ్మణ ఉవాచ
కా త్వం కస్యాసి కో వాయం శయానో యస్య శోచసి
జానాసి కిం సఖాయం మాం యేనాగ్రే విచచర్థ హ

నీవరు ఎవరి దానవు ఇతనెవరు. నీ స్నేహితుడనైన నేను నీకు తెలుసా

అపి స్మరసి చాత్మానమవిజ్ఞాతసఖం సఖే
హిత్వా మాం పదమన్విచ్ఛన్భౌమభోగరతో గతః

నా పేరు అవిజ్ఞ్యాతుడు. నా కన్న ఉత్తమైన సుఖము కావాలని కోరి భూలోకానికి వచ్చావు

హంసావహం చ త్వం చార్య సఖాయౌ మానసాయనౌ
అభూతామన్తరా వౌకః సహస్రపరివత్సరాన్

నీవూ నేనూ ఇద్దరమూ హంసలమే. ఇద్దరమూ మానస సరోవరములో ఉంటాము. అది వదిలిపెట్టి ఏదో ఒక నావ పట్టుకుని ఇక్కడికి వచ్చి

స త్వం విహాయ మాం బన్ధో గతో గ్రామ్యమతిర్మహీమ్
విచరన్పదమద్రాక్షీః కయాచిన్నిర్మితం స్త్రియా

నన్ను విడిచిపెట్టి గ్రామ్య సుఖాలనాశించి వచ్చావు. అలా ఒక స్త్రీ యొక్క నగరాన్ని, తొమ్మిది ద్వారాలున్న, జలమూ శరీరమూ అగ్నీ (అన్నమయ మనో మయ ప్రాణమయ) ద్వారాలుగా గల దాన్ని 

పఞ్చారామం నవద్వారమేకపాలం త్రికోష్ఠకమ్
షట్కులం పఞ్చవిపణం పఞ్చప్రకృతి స్త్రీధవమ్

పఞ్చేన్ద్రియార్థా ఆరామా ద్వారః ప్రాణా నవ ప్రభో
తేజోऽబన్నాని కోష్ఠాని కులమిన్ద్రియసఙ్గ్రహః

పంచేంద్రియాలనే ఆరామాలతో తొమ్మిది ప్రాణ ద్వారాలతో అగ్నీ జలమూ అన్నమూ అనే మూడు కోష్టాలతో, జ్ఞ్యానేంద్రియాలతో కర్మేంద్రియాలనే అంగడితో 

విపణస్తు క్రియాశక్తిర్భూతప్రకృతిరవ్యయా
శక్త్యధీశః పుమాంస్త్వత్ర ప్రవిష్టో నావబుధ్యతే

తరగని ప్రకృతితో బుద్ధి అనే స్త్రీకి వశమై తానెక్కడికి వచ్చాడో తెలుసుకోలేకపోయాడు

తస్మింస్త్వం రామయా స్పృష్టో రమమాణోऽశ్రుతస్మృతిః
తత్సఙ్గాదీదృశీం ప్రాప్తో దశాం పాపీయసీం ప్రభో

నీవానగరములో ఉన్న స్త్రీని ఆలింగనం చేసుకోబోయి ఈ స్థితిని పొందావు. ఇదంతా పాప దశ

న త్వం విదర్భదుహితా నాయం వీరః సుహృత్తవ
న పతిస్త్వం పురఞ్జన్యా రుద్ధో నవముఖే యయా

నువ్వు విదర్భ పుత్రికవూ కావు ఇతను నీకు భర్తా కాదు. పూర్వ జన్మలో కూడా పురంజనికి భర్తవి కావు. బంధించబడ్డావు

మాయా హ్యేషా మయా సృష్టా యత్పుమాంసం స్త్రియం సతీమ్
మన్యసే నోభయం యద్వై హంసౌ పశ్యావయోర్గతిమ్

ఇదంతా నా మాయ. నేను పురుషుడినీ పక్కవారు స్త్రీ అన్న మాయలో పడ్డావు. రెండూ కాదు. నీవు స్త్రీవీ అతను పురుషుడూ కావు. మనిద్దరమూ హంసలము. మనకే సంబంధము లేదు. నిత్య ముక్త బుద్ధ స్వరూపము మనది

అహం భవాన్న చాన్యస్త్వం త్వమేవాహం విచక్ష్వ భోః
న నౌ పశ్యన్తి కవయశ్ఛిద్రం జాతు మనాగపి

నేనూ నీవూ వేరు కాదు. నీవు నా అంశే. పండితులూ జ్ఞ్యానులూ మనిద్దరిలో ఏ కొంచెమూ తేడా చూడరు

యథా పురుష ఆత్మానమేకమాదర్శచక్షుషోః
ద్విధాభూతమవేక్షేత తథైవాన్తరమావయోః

ఇద్దరం కనపడుతున్నా మనం ఒక్కరమే. అద్దములో మన ప్రతిబింబమూ మనమూ వేరని అనుకుంటామా? అలాగే అద్దములో మనమూ మన కన్నూ కనబడుతుంది. అద్దములో కంటిలో కూడా ప్రతిబింబాలు కనపడతాయి. ఈ ప్రతిబింబాలూ మనకన్నా వేరా? అలాంటి తేడానే నీకూ నాకూ ఉంది. 

ఏవం స మానసో హంసో హంసేన ప్రతిబోధితః
స్వస్థస్తద్వ్యభిచారేణ నష్టామాప పునః స్మృతిమ్

ఇలా పరమాత్మ జీవాత్మకు బోధించాడు. దీనితో జీవుడు పరిశుద్ధుడయ్యాడు. పరమాత్మ కృపతో ఇంతకాలం మరచిపోయిన జ్ఞ్యానన్ని మళ్ళీ పొందాడు

బర్హిష్మన్నేతదధ్యాత్మం పారోక్ష్యేణ ప్రదర్శితమ్
యత్పరోక్షప్రియో దేవో భగవాన్విశ్వభావనః

ప్రాచీనబర్హీ! నేను చెప్పేది కథకాదు. ఇది ఆధ్యాత్మ జ్ఞ్యానము. పరోక్షముగా వ్యంగ్యముగా చెప్పాను, ఎందుకంటే సకల లోకాన్ని సృష్టించే పరమాత్మ పరోక్ష ప్రియుడు.

Popular Posts