ఏవం సురాదయః సర్వే బ్రహ్మరుద్రపురః సరాః
నోపైతుమశకన్మన్యు సంరమ్భం సుదురాసదమ్
ఇలా మహా ఉగ్రముగా ఉన్న స్వామిని స్తోత్రం చేసారు. కానీ స్వామి కోపం తగ్గలేదు. అప్పుడు దేవతలందరూ అమ్మవారిని పంపారు శాంతింపచేయడానికి. అమ్మవారు కూడా ఎప్పుడూ స్వామిని ఇలా వినలేదు చొఓడలేదు. ఆమెకూడా కొంచెం శంకించి దగ్గరకు వెళ్ళలేదు.
సాక్షాత్శ్రీః ప్రేషితా దేవైర్దృష్ట్వా తం మహదద్భుతమ్
అదృష్టాశ్రుతపూర్వత్వాత్సా నోపేయాయ శఙ్కితా
ప్రహ్రాదం ప్రేషయామాస బ్రహ్మావస్థితమన్తికే
తాత ప్రశమయోపేహి స్వపిత్రే కుపితం ప్రభుమ్
ఎవ్వరూ వెళ్ళకుంటే బ్రహ్మ ప్రహ్లాదున్ని పంపించాడు.
పక్కనే ఉన్న ప్రహ్లాదునితో నీవు వెళ్ళి నీ తండ్రి కారణముగా కోపించిన స్వామిని శాంతింపచేయి అన్నాడు.
తథేతి శనకై రాజన్మహాభాగవతోऽర్భకః
ఉపేత్య భువి కాయేన ననామ విధృతాఞ్జలిః
స్వపాదమూలే పతితం తమర్భకం విలోక్య దేవః కృపయా పరిప్లుతః
ఉత్థాప్య తచ్ఛీర్ష్ణ్యదధాత్కరామ్బుజం కాలాహివిత్రస్తధియాం కృతాభయమ్
సరేనని మహాభాగవతుడైన పిల్లవాడు దగ్గరకు వెళ్ళి చేతులు జోడించి భూమి మీద సాష్టాంగపడ్డాడు. పాదముల ఎదుట ఉన్న పిల్లవాన్ని చూసి, దయ ముంచగా ప్రహ్లాదున్ని లేపి, ఆ పిల్లవాని శిరస్సు మీద "కాలగ్రస్థులకు అభయాన్నిచ్చే" తన హస్తాన్ని ఉంచాడు. ఎపుడైతే పరమాత్మ హస్తం శిరస్సుమీద పడిందో, తన హస్త స్పర్శతో అన్ని పాపాలూ పోయాయి.
స తత్కరస్పర్శధుతాఖిలాశుభః సపద్యభివ్యక్తపరాత్మదర్శనః
తత్పాదపద్మం హృది నిర్వృతో దధౌ హృష్యత్తనుః క్లిన్నహృదశ్రులోచనః
పరమాత్మ స్పర్శతో పరమాత్మ తత్వం సాక్షాత్కరించబడినది. శరీరమంతా పులకిస్తూ ఉండగా ఆనందబాష్పాలు తడిపేస్తూ ఉండగా, ఏకాగ్ర మనస్సుతో సావధానముతో ప్రేమతో గొంతు బొంగురుపోగా స్తోత్రం చేస్తున్నాడు
అస్తౌషీద్ధరిమేకాగ్ర మనసా సుసమాహితః
ప్రేమగద్గదయా వాచా తన్న్యస్తహృదయేక్షణః
శ్రీప్రహ్రాద ఉవాచ
బ్రహ్మాదయః సురగణా మునయోऽథ సిద్ధాః
సత్త్వైకతానగతయో వచసాం ప్రవాహైః
నారాధితుం పురుగుణైరధునాపి పిప్రుః
కిం తోష్టుమర్హతి స మే హరిరుగ్రజాతేః
బ్రహ్మాదులూ దేవతలూ మునులూ నీ ఎదుట చేతులు ముడుచుకుని కూర్చున్నారు. కేవలం సత్వగుణం మాత్రమే గలవారు తమ అత్యధికమైన ఉత్తమ గుణములతో వాక్ప్రభావముతో నిన్ను ఆరాధించజాలరు. అలాంటి నిన్ను రాక్షస జాతికి చెందిన నేను స్తోత్రం చేయ యోగ్యుడినా.
మన్యే ధనాభిజనరూపతపఃశ్రుతౌజస్
తేజఃప్రభావబలపౌరుషబుద్ధియోగాః
నారాధనాయ హి భవన్తి పరస్య పుంసో
భక్త్యా తుతోష భగవాన్గజయూథపాయ
నిన్ను ఆరాధించడానికి అవేవీ అవసరం లేదు అని నా శిరసు మీద నీవు చేయి వేసి చెప్పావు. ధనమూ ఉత్తమ వంశం శాత్రం తేజస్సూ బలం బుద్ధీ పరమాత్మను ఆరాధించడానికి పనికి రావు. గజేంద్రుని భక్తికి సంతోషించావు.
విప్రాద్ద్విషడ్గుణయుతాదరవిన్దనాభ
పాదారవిన్దవిముఖాత్శ్వపచం వరిష్ఠమ్
మన్యే తదర్పితమనోవచనేహితార్థ
ప్రాణం పునాతి స కులం న తు భూరిమానః
పన్నెండు గుణాలు ఉన్న బ్రాహ్మణులు కూడా పరమాత్మ మీద భక్తిలేకపోతే, పరమాత్మ మీద భక్తి ఉన్న చండాలుడే నయం. పరమాత్మ యందే మనసూ వాక్కూ శరీరం అభిలాష నీ యందు అర్పించినవాడే తన కులమును పవిత్రం చేస్తాడు. నేనింత గొప్పవాడినీ అన్న అభిమానం పవిత్రం చేయదు.
నైవాత్మనః ప్రభురయం నిజలాభపూర్ణో
మానం జనాదవిదుషః కరుణో వృణీతే
యద్యజ్జనో భగవతే విదధీత మానం
తచ్చాత్మనే ప్రతిముఖస్య యథా ముఖశ్రీః
పరమాత్మ భక్తులను ఎందుకు దయ చూస్తాడు? ఆయనకు అందరూ ఒకటే. అజ్ఞ్యాని జనులతో సర్వదా పరిపూర్ణుడైన వాడు పూజను ఎందుకు స్వీకరిస్తున్నాడు. దయతో స్వీకరిస్తున్నాడు. నీవు అద్దం వంటి వాడివి. అద్దం ఎదురుగా పెట్టుకుని మనం ముఖాన్ని దిద్దుకుంటాము. అద్దములో ప్రతిబింబం చూసుకోవడం మా లాభం కోసం అయినట్లు, నిన్ను స్తోత్రం చేయడం కూడా మా లాభం కోసమే. నీవు దయతో కాపాడుతుంటే, తెలియై వారు "బాగా స్తోత్రం చేస్తే పరమాత్మ కాపాడతాడు" అని అంటారు. నీవు పరిపూర్ణుడవు. నిన్ను స్తోత్రం చేయడం మా కోసమే తప్ప నీ కోసం కాదు.
తస్మాదహం విగతవిక్లవ ఈశ్వరస్య
సర్వాత్మనా మహి గృణామి యథా మనీషమ్
నీచోऽజయా గుణవిసర్గమనుప్రవిష్టః
పూయేత యేన హి పుమాననువర్ణితేన
నిన్ను స్తోత్రం చేసిన వారికే శుభం కలుగుతుంది కాబట్టి నిన్ను నా బుద్ధికి తోచినట్లుగా అన్ని రకములుగా స్తోత్రం చేస్తాను. నిన్ను స్తోత్రం చేస్తే కానీ మా మీద ఉన్న నీ మాయ పోదు. నీ మాయచే సృష్టించబడిన త్రిగుణాత్మకమైన ప్రకృతిలో బంధించబడిన మేము నీ స్తోత్రం చేతనే మేము పవిత్రులమవుతాము. ప్రకృతిలో ఉన్న మానవుడు ఏ స్తోత్రముతో పవిత్రుడవుతాడో అలాంటి స్తోత్రాన్ని చేస్తున్నాను.
సర్వే హ్యమీ విధికరాస్తవ సత్త్వధామ్నో
బ్రహ్మాదయో వయమివేశ న చోద్విజన్తః
క్షేమాయ భూతయ ఉతాత్మసుఖాయ చాస్య
విక్రీడితం భగవతో రుచిరావతారైః
నీవు చెప్పినట్లు చేసే బ్రహ్మాదులందరూ నిన్ను చూచి భయపడ్డారు.నీ అందమైన అవతారాలు జగత్తుకు క్షేమం శుభం ఆనందం కలిగించాలి, దుఃఖాన్ని తొలగించాలి. నీవు శాంతించు. ఇది మీకు ఒక ఆట. కోపాన్ని నిగ్రహించుకో, అసురుడు చనిపోయాడు.
తద్యచ్ఛ మన్యుమసురశ్చ హతస్త్వయాద్య
మోదేత సాధురపి వృశ్చికసర్పహత్యా
లోకాశ్చ నిర్వృతిమితాః ప్రతియన్తి సర్వే
రూపం నృసింహ విభయాయ జనాః స్మరన్తి
సజ్జనుడైనా, అహింసాపరాయణులైనా పామునో తేలునో చంపితే హర్షిస్తాడు. లోకపీడా పరాయణున్ని వధించుట లోకాలకి ఆనందమే. అన్ని లోకాలూ ఆనందం పొందాయి. వచ్చినవారందరూ తిరిగి వెళుతున్నారు. నీ ఈ స్వరూపాన్ని భయం తొలగడానికి స్మరించాలి
నాహం బిభేమ్యజిత తేऽతిభయానకాస్య
జిహ్వార్కనేత్రభ్రుకుటీరభసోగ్రదంష్ట్రాత్
ఆన్త్రస్రజఃక్షతజకేశరశఙ్కుకర్ణాన్
నిర్హ్రాదభీతదిగిభాదరిభిన్నఖాగ్రాత్
మహాభయంకరమైన వక్త్రం జిహ్వ సూర్యుని లాంటి కళ్ళు, పేగులు మాలలా వేసుకుని శంఖం వంటి కర్ణములు కలిగి, గర్ఝనతో దిగ్గజాలను భయపెట్టిన, శత్రువును చీల్చిన గోళ్ళను చూచీ నాకేమీ భయం కలగట్లేదు
త్రస్తోऽస్మ్యహం కృపణవత్సల దుఃసహోగ్ర
సంసారచక్రకదనాద్గ్రసతాం ప్రణీతః
బద్ధః స్వకర్మభిరుశత్తమ తేऽఙ్ఘ్రిమూలం
ప్రీతోऽపవర్గశరణం హ్వయసే కదా ను
సంసారాన్ని చూచి భయపడుతున్నాను గాని నిన్ను చూచి కాదు. మమ్ములను మేమే కట్టేసుకుంటున్నాము. ఈ బంధములు తెగి మోక్షం ప్రసాదించే నీ పాదమూలం ఎప్పుడు చేరతానో అని నేను భయపడుతున్నాను గానీ నీ నారసింహరూపాన్ని చూచి కాదు.
యస్మాత్ప్రియాప్రియవియోగసంయోగజన్మ
శోకాగ్నినా సకలయోనిషు దహ్యమానః
దుఃఖౌషధం తదపి దుఃఖమతద్ధియాహం
భూమన్భ్రమామి వద మే తవ దాస్యయోగమ్
ప్రియ వియోగం అప్రియ సయోగం - ఇదే సంసారం. ఈ రెంటి వలనా దుఃఖమే. నానా జాతులలో పుట్టి కాల్చబడుతున్నాము. మేము దుఃఖాన్ని సుఖం అనుకుని అనుభవిస్తున్నాము. దుఃఖాన్ని దుఃఖం అని అనుభవించడం లేదు. మాకు దుఃఖానికి మందుగా నీ దాస్య యోగాన్ని ప్రసాదించు
సోऽహం ప్రియస్య సుహృదః పరదేవతాయా
లీలాకథాస్తవ నృసింహ విరిఞ్చగీతాః
అఞ్జస్తితర్మ్యనుగృణన్గుణవిప్రముక్తో
దుర్గాణి తే పదయుగాలయహంససఙ్గః
ఎన్నో సార్లు బ్రహ్మ గానం చేసిన నీ దివ్య లీలలను నేను కూడా గానం చేస్తాను. ప్రకృతి ప్రయోగించిన సత్వ రజః తమో గుణముల నుండి సులభముగా దాటుతాను. నీ పాదముల జంటను నివాసముగా చేసుకున్న వారి సంగముతో.
బాలస్య నేహ శరణం పితరౌ నృసింహ
నార్తస్య చాగదముదన్వతి మజ్జతో నౌః
తప్తస్య తత్ప్రతివిధిర్య ఇహాఞ్జసేష్టస్
తావద్విభో తనుభృతాం త్వదుపేక్షితానామ్
నీ చూపు పడని పిల్లవానికి తల్లి తండ్రులు రక్షకులు కారు, రోగికి మందు రక్షకం కాదు, సముద్రములో మునిగేవారికి నావ రక్షకం కాదు, కాలినవాడికి చల్లటి నీరు రక్షకం కాదు. నీ చేత ఉపేక్షించబడిన వారికి రక్షకములేవీ రక్షకములు గావు
యస్మిన్యతో యర్హి యేన చ యస్య యస్మాద్
యస్మై యథా యదుత యస్త్వపరః పరో వా
భావః కరోతి వికరోతి పృథక్స్వభావః
సఞ్చోదితస్తదఖిలం భవతః స్వరూపమ్
కారకములు. ఒక పని చేయాలంటే ఆరు ఉండాలి. కర్తా కర్మా సాధనం సంప్రదానం (ఉద్దేశ్యం) అపాదానం (దేని వలన) సంబంధం (దేనికి అధీనమై) .
ప్రతీ పనిలో ఈ ఆరు ఉంటాయి. దేని యందు, దేని కొరకు, దేని వలన, దేనితోటి, ఏ సంబంధముతో, ఎక్కడా ఎవ్వరూ ఎప్పుడూ, ఎలా.
మన సంస్కారమే పనీ చేయిస్తుందీ, పనిలో మార్పూ చేస్తుంది. ఒక పని చేయడానికీ మానడానికీ కూడా కారణం సంస్కారం.
మాయా మనః సృజతి కర్మమయం బలీయః
కాలేన చోదితగుణానుమతేన పుంసః
ఛన్దోమయం యదజయార్పితషోడశారం
సంసారచక్రమజ కోऽతితరేత్త్వదన్యః
ఇదంతా నీ స్వరూపమే. ఈ మాయ కర్మమయమైన మనసుని సృష్టి చేస్తుంది. సృష్టించాలంటే కాలం కావాలి. సత్వ రజః తమో గుణాలతో ప్రోత్సహించబడిన కాలం. నీకంటే తాను వేరు అనుకున్నవాడు ఈ కాల చక్రాన్ని దాటగలడా
స త్వం హి నిత్యవిజితాత్మగుణః స్వధామ్నా
కాలో వశీకృతవిసృజ్యవిసర్గశక్తిః
చక్రే విసృష్టమజయేశ్వర షోడశారే
నిష్పీడ్యమానముపకర్ష విభో ప్రపన్నమ్
ఆ కాలానికి గుణ సహకారం ఉంటుంది. త్రిగుణముల చేత సహకారం పొందిన కాలముతో పని చేస్తాము. నిన్ను కాక ఇంకొకరిని ఆశ్రయించిన వాడు ఈ సంసారాన్ని ఎలా దాటుతాడు. ప్రకృతి పదహారు అరలు గల చక్రములో పడవేయబడ్డవాడు ఎలా దాటగలడు. నీవు తప్ప ఎవరు దాటిస్తారు. నిన్నాశ్రయించినవారికి మాయ అంటదు. అన్ని గుణములూ నీ వశములో ఉంచుకున్నవాడవు. కర్మలూ ప్రకృతీ నీ వశములోనే ఉంది. సృష్టి, సృష్టికి కారణమైన కర్మలూ, ప్రకృతీ నీ అధీమనులోనే ఉన్నాయి. ఈ మొత్తం ప్రపంచాన్ని పదహారు ఆకులు గల గానుగ చక్రములో పడవేసావు. ఎపుడూ తిరుగుతూనే ఉంటుంది ఆ గానుగా, గానీ ఒక్క అడుగూ ముందుకు వేయదు. ఇది పిండి చేసే తైల యంత్రం.
దృష్టా మయా దివి విభోऽఖిలధిష్ణ్యపానామ్
ఆయుః శ్రియో విభవ ఇచ్ఛతి యాన్జనోऽయమ్
యేऽస్మత్పితుః కుపితహాసవిజృమ్భితభ్రూ
విస్ఫూర్జితేన లులితాః స తు తే నిరస్తః
ప్రపంచములో ఉన్న సకల జీవులూ నిరంతరం తహ తహతో కోరికునే అన్ని వైభవాలూ, దేవతలూ వారి వైభవాలూ అన్నీ చూచాను. ఆ భోగాలన్నీ మా తండ్రి కోపముతో చూడగానే వారి ఐశ్వర్యాలన్నీ పోయాయి.అలాంటి వాడు నీవు కన్నెర్ర చేస్తే పోయాడు. మరి ఇప్పుడు ఏది నిజం? ఏది నిత్యం? మా తండ్రి వలన అన్నిటి గొప్ప ఎంతో అర్థమయ్యింది. అందరూ మా నాన్నకు భయపడేవారు. లోకపాలురనే వారి వైభవం ఏమిటో నేను చూసాను. మా నాన్న గారికి కోపం వచ్చి కనుబొమ్మ ఎక్కు బెట్టగానే భయపడే వారు. ఈ లోకాలూ కోరికలూ ఆయుర్దాయం ఐశ్వర్యం నాకు వద్దు. ఎప్పుడూ మాసిపోనిది నాకు కావాలి.
తస్మాదమూస్తనుభృతామహమాశిషోऽజ్ఞ
ఆయుః శ్రియం విభవమైన్ద్రియమావిరిఞ్చ్యాత్
నేచ్ఛామి తే విలులితానురువిక్రమేణ
కాలాత్మనోపనయ మాం నిజభృత్యపార్శ్వమ్
ఈ కోరికలను నేను కోరను. ఆయ్ష్షు సంపదా సుఖం వైభవం అవి అన్నీ నీవు కనుబొమ్మలు ముడివేయగానే పోతాయి.నీ చిన్న పరాక్రమముతో పోయేవాటిని నేను కోరను. బ్రహ్మాదులు పొందే వైభవాలు నాకొద్దు, నన్ను నీ భక్తుల వద్ద జేర్చు.
కుత్రాశిషః శ్రుతిసుఖా మృగతృష్ణిరూపాః
క్వేదం కలేవరమశేషరుజాం విరోహః
నిర్విద్యతే న తు జనో యదపీతి విద్వాన్
కామానలం మధులవైః శమయన్దురాపైః
కోరికలు వినడానికి ఇంపుగా ఉంటాయి. ఎండమావుల వంటి కోరికలెక్కడా, అన్ని రోగాలకూ పుట్టినిలూ అయిన శరీరమెక్కడా, ఐనా జ్ఞ్యానులకు కూడా విరక్తి కలగదు.
కామమనే నిప్పును తేనే దొరికితే తేనె చుక్కలతో చల్లార్చాలనుకుంటాడు. ఈ మానవులు విరతిని మాత్రం పొందరు. అవి నశించేవని తెలిసినా విరక్తిని మాత్రం పొందరు. అగ్ని జ్వాలలను కోరికలనే తేనె చుక్కలతో చల్లాచ్ర్చ ప్రయత్నిస్తాడు.
క్వాహం రజఃప్రభవ ఈశ తమోऽధికేऽస్మిన్
జాతః సురేతరకులే క్వ తవానుకమ్పా
న బ్రహ్మణో న తు భవస్య న వై రమాయా
యన్మేऽర్పితః శిరసి పద్మకరః ప్రసాదః
కొంచెం ఆలోచిస్తే ఆశ్చర్యముగా ఉంది, తమోగుణం ఎక్కువగా ఉన్న కులములో పుట్టిన నేనెక్కడా, నీ దయ ఎక్కడా? నీ దయకు ఇవేవీ పట్టింపులు లేవు. ఎన్నో పురాణాలు చదివానూ, ఎన్నో విన్నాను, గానీ ఎక్కడా నీ హస్తమును బ్రహ్మ నెత్తిన గానీ, శంకరుని నెత్తిన కానీ, అమ్మవారి నెత్తిన కానీ పెట్టినట్లు వినలేదు. పద్మం లాంటి నీ హస్తమునూ అనుగ్రహాన్నీ నా శిరస్సు నందు ఉంచావు.. అది నా యోగ్యత కాదు నీ దయ.
నైషా పరావరమతిర్భవతో నను స్యాజ్
జన్తోర్యథాత్మసుహృదో జగతస్తథాపి
సంసేవయా సురతరోరివ తే ప్రసాదః
సేవానురూపముదయో న పరావరత్వమ్
వీడు ఎక్కువ వాడూ, వీడు తక్కువ వాడూ అన్న పక్షపాతం నీకు లేదు. సకల జగత్తుకూ నీవు మిత్రుడివి. కల్పవృక్షం కోరిన వారు ఎవరా అన్న ప్రశ్న లేకుణ్డా ఎవరు కోరితే వారికి వరాలిస్తుంది, అడిగితే. నీవు కూడా నిన్న్సేవించిన వారికి మోక్షాన్ని ఇస్తావు. సేవించిన దాని బట్టి ఇస్తావు గానీ, వీడు ఎక్కువ వాడు,, వీడు తక్కువ వాడు అని కాదు. అది నీ స్వభావం.
ఏవం జనం నిపతితం ప్రభవాహికూపే
కామాభికామమను యః ప్రపతన్ప్రసఙ్గాత్
కృత్వాత్మసాత్సురర్షిణా భగవన్గృహీతః
సోऽహం కథం ను విసృజే తవ భృత్యసేవామ్
సంసారమనే మహా భయంకరమైన అగ్నిలో పడబోతున్న నన్ను పైకిలాగావు. నన్ను సంసారాన్ని దాటింపచేసావు. ఇంత మేలు చేసిన నీ భక్తులను నేను విడిచిపెడతానా? నీ భక్తులనెవరినీ విడిచిపెట్టను. సంసారమనే పాముల బావిలో, ఒక కోరిక తీరకమునుపే ఇంకో కోరిక ఊరుతూ ఉన్న చీకటి బావిలో పడిపోతూ దయతో నారదుని చేత గ్రహించాడ్డాను. అలాంటి నేను నీ సేవను ఎలా విడిచిపెడతాను.
మత్ప్రాణరక్షణమనన్త పితుర్వధశ్చ
మన్యే స్వభృత్యఋషివాక్యమృతం విధాతుమ్
ఖడ్గం ప్రగృహ్య యదవోచదసద్విధిత్సుస్
త్వామీశ్వరో మదపరోऽవతు కం హరామి
నీ సేవకుడైన నారదుని మాట "పరమాత్మను సేవించిన వాడు చేదిపోడు, భగవంతుని సేవించిన వాడికి ఎవరూ ఆపద కల్పించలేరు" అని చెప్పిన దాన్ని నిజం చేయడానికే ఈ పని చేసావు. కత్తిని తీసుకుని చంపబోతూ (కీఎడు చేయగోరి), ఒక వేళ నాకన్న వేరే భగవంతుడు ఉంటే నిన్ను కాపడు గాక అని అన్న నీ సేవకుడైన హిరణ్యకశిపుని వాక్యం నిజం చేసావు.
ఏకస్త్వమేవ జగదేతమముష్య యత్త్వమ్
ఆద్యన్తయోః పృథగవస్యసి మధ్యతశ్చ
సృష్ట్వా గుణవ్యతికరం నిజమాయయేదం
నానేవ తైరవసితస్తదనుప్రవిష్టః
నీ మాయతో మహత్ తత్వాన్నీ ప్రకృతినీ సృష్టించి అందులో నీవు ప్రవేశించి ఈ విశ్వాన్ని తయారు చేస్తున్నావు.
త్వమ్వా ఇదం సదసదీశ భవాంస్తతోऽన్యో
మాయా యదాత్మపరబుద్ధిరియం హ్యపార్థా
యద్యస్య జన్మ నిధనం స్థితిరీక్షణం చ
తద్వైతదేవ వసుకాలవదష్టితర్వోః
చిత్ అచిత్ ఈశ్వరుడు, జీవుడు ప్రకృతీ ఈశ్వరుడు. ఈ మూడు సత్. మరి అసత్ ఎక్కడనుంచి వచ్చింది? మాయ కూడా నీకంటే వేరు కాదు. అంటే ఇక్కడ అసత్ అనే పదమే లేదు. అసత్ అనేది కేవలం భేధ బుద్ధి వలన వచ్చింది. సత్ కంటే, నీ కంటే మాయ విడిగా ఉంటుంది. ప్రళయకాలములో ఈ సత్ అసత్ గా భాసిస్తుంది. సృష్టి కాలములో అసత్ గా అనిపిస్తున్నది సత్ గా మారుతుంది. ఇలా సత్ అసత్ గా అసత్ సత్ గా భాసించడానికి నీ యోగ మాయ కారణం. నీవు సత్ అసత్తులకు అధిపతివి. నేనూ వాడూ అనే బుద్ధి అపార్థం. వీడు వేరూ నేను వేరు అనే భేధ బుద్ధి అపార్థం. ప్రపంచములో సృష్టి స్థితి లయమూ సంకల్పమూ
న్యస్యేదమాత్మని జగద్విలయామ్బుమధ్యే
శేషేత్మనా నిజసుఖానుభవో నిరీహః
యోగేన మీలితదృగాత్మనిపీతనిద్రస్
తుర్యే స్థితో న తు తమో న గుణాంశ్చ యుఙ్క్షే
బీజములో వృక్షం, వృక్షము నుండి బీజం, ఈ రెంటినీ ఒకే సారి చూడలేము. బీజములో వృక్షం ఉంది. కనపడదు. అలాగే నీలో జగత్తు ఉంది, కనపడదు. జగత్తులో నీవున్నావు, కానీ కనపడవు. జగత్తు నీలో నీవు జగత్తులో ఉన్నావని అజ్ఞ్యానులు చూడలేరు. ఈ సకల చరాచర జగత్తునీ నీలో దాచుకుని హాయిగా నిదురిస్తున్నావు ఏ కోరికా లేకుండా. నీవు ప్రళయ కాలములో తమో గుణము గానీ ఇతర గుణములు గానీ కూర్చడం లేదు. సూక్ష్మావస్థలో ఉన్న ప్రకృతిని క్షోభిస్తే సృష్టి జరుగుతుంది. అవ్యక్తం, సూక్షం, మూల ప్రకృతి, ప్రధానం, వ్యక్తం, వికారం, ఇది దాటాక మహత్ తత్వం. ఇందులో మూల ప్రకృతి అవ్యక్తం చాలా చిన్న భాగముగా ఉంటుంది. పరమాత్మను చూచినపుడు ప్రకృతీ జీవుడూ కనపడరు. ప్రకృతిని చూస్తే పరమాత్మ జీవుడూ కనపడరు. ఇలా ఒక దాన్ని చూస్తే రెండవది కనపడకపోవుట నీ మాయ.
తస్యైవ తే వపురిదం నిజకాలశక్త్యా
సఞ్చోదితప్రకృతిధర్మణ ఆత్మగూఢమ్
అమ్భస్యనన్తశయనాద్విరమత్సమాధేర్
నాభేరభూత్స్వకణికావటవన్మహాబ్జమ్
అలాంటి సూక్ష్మావస్థలో కాలమును ప్రవేశింపచేస్తే అంతకాలం రహస్యముగా ప్రళయ కాలములో దాగి ఉన్న జగత్తు వ్యక్తమవుతుంది. నీ శరీరమే జగత్తూ జీవుడూ ప్రకృతి. నీవు నీ శరీరాన్ని(జగత్తుని) చూపెట్టినపుడు. అంతకాలం నీలో దాగి ఉన్న మూల ప్రకృతిని బయటకు వెలువరిస్తున్నావు. సమాధిని విరమించిన నీ నాభి నుండి చిన్న గింజ నుంచి పెద్ద వృక్షములాగ మహా పద్మం పుట్టింది. ఆ పద్మమంటే ఒక్కో రేకు ఒక్కో బ్రహ్మాండం.
తత్సమ్భవః కవిరతోऽన్యదపశ్యమానస్
త్వాం బీజమాత్మని తతం స బహిర్విచిన్త్య
నావిన్దదబ్దశతమప్సు నిమజ్జమానో
జాతేऽఙ్కురే కథముహోపలభేత బీజమ్
ఆ పద్మం నుండి పుట్టినవాడు బ్రహ్మ. ఆయనకు అంత పెద్ద పద్మములో ఏమీ కనపడలేదు. పద్మానికి బీజాన్ని వెలుపలా లోపలా వెతికాడు. దిగి నీటిలోకి వెళ్ళాడు. దొరకని బీజం కోసం వంద ఏళ్ళు వెతికాడు. ఇది నీ మాయ కాక మరేమిటి
స త్వాత్మయోనిరతివిస్మిత ఆశ్రితోऽబ్జం
కాలేన తీవ్రతపసా పరిశుద్ధభావః
త్వామాత్మనీశ భువి గన్ధమివాతిసూక్ష్మం
భూతేన్ద్రియాశయమయే వితతం దదర్శ
మళ్ళీ పద్మములో కూర్చుని నీ ఉపదేశముతో తీవ్రమైన తపస్సు చేసి, మనస్సు పరిశుద్ధం చేసుకుని భూమిలో గంధములాగ అతి సూక్ష్మమైన నిన్ను చూచాడు. పంచ భూతములూ, కర్మ జ్ఞ్యాన ఇందిర్యములూ పంచ తన్మాత్రలూ ఉన్న అంతఃకరణములో నిన్ను సందర్శించాడు
ఏవం సహస్రవదనాఙ్ఘ్రిశిరఃకరోరు
నాసాద్యకర్ణనయనాభరణాయుధాఢ్యమ్
మాయామయం సదుపలక్షితసన్నివేశం
దృష్ట్వా మహాపురుషమాప ముదం విరిఞ్చః
నీవు సకల చరాచర జగత్తూ వ్యాపించి అనంత క్రియా అనంత జ్ఞ్యాన శక్తి కలవాడవై ఉన్నావు. సహస్ర శీర్షా అంటే అనంత జ్ఞ్యానం. ఇచ్చా శక్తీ క్రియా శక్తీ జ్ఞ్యాన శక్తి కలవాడు. ఇలా ఉన్న నిన్ను చూచి, గుర్తించదగ్గా అవయ సంస్థానం ఉన్న నిన్ను చూచి బ్రహ్మ గారు ఆనందాన్ని పొందారు
తస్మై భవాన్హయశిరస్తనువం హి బిభ్రద్
వేదద్రుహావతిబలౌ మధుకైటభాఖ్యౌ
హత్వానయచ్ఛ్రుతిగణాంశ్చ రజస్తమశ్చ
సత్త్వం తవ ప్రియతమాం తనుమామనన్తి
ఆ సమయములోనే బ్రహ్మగారికి వైదిక పరిజ్ఞ్యానాన్ని అందచేయబోతుంటే ఇద్దరు రాక్షసులు ఆ వేద రాశిని అపహరించారు, దాన్ని బ్రహ్మకు అందించడానికి హయగ్రీవ అవతారములో వచ్చి వారిని సంహరించి వేదములను బ్రహ్మగారికి ఇచ్చావు. ఆ రాక్షసులు రజస్సూ తమస్సులకు ప్రతీక. వారిని సంహరించిన నీవు శుద్ధ సత్వ స్వరూపుడివి.
ఇత్థం నృతిర్యగృషిదేవఝషావతారైర్
లోకాన్విభావయసి హంసి జగత్ప్రతీపాన్
ధర్మం మహాపురుష పాసి యుగానువృత్తం
ఛన్నః కలౌ యదభవస్త్రియుగోऽథ స త్వమ్
నీవు లోకములను సృష్టించి, వాటిని కాపాడుతున్నావు. నరునిగా, తిర్యక్, ఋషి, దేవ, ఝష (మత్స్య), అవతారాలుగా వచ్చి, ధర్మముకు విఘాతం కలిగించేవారిని శిక్షిస్తున్నావు. కలియుగములో నీవు దాగి ఉండి సత్వాన్ని కాపాడి రజస్సూ తమస్సులను అణగదొక్కుతున్నావు. అందుకే నీవు త్రి యుగః - సత్వ రజ తమో గుణాలు, సృష్టి స్థితి రక్షణలు, కృత త్రేతా ద్వాపరాలు
నైతన్మనస్తవ కథాసు వికుణ్ఠనాథ
సమ్ప్రీయతే దురితదుష్టమసాధు తీవ్రమ్
కామాతురం హర్షశోకభయైషణార్తం
తస్మిన్కథం తవ గతిం విమృశామి దీనః
ఇలాంటి నీ కథలలో లగ్నం చేయని మనసుని సృష్టించావు. ఈ మనసు మహా పాతకి, చెడ్డది. ఈ మనసుకు విపరీతమైన కోరికలుంటాయి. ఇందులో హర్ష శోక భయ ఈశనము ఇలాంటి మనసునెందుకు సృష్టించావు.అలాంటి మనసు మాకిచ్చినప్పుడు ఎవరైనా అటువంటి మనసులో నీ గురించి ఆలోచిస్తారా. అలాంటి మనసుతో నిన్ను ఎలా ధ్యానిస్తాను.
జిహ్వైకతోऽచ్యుత వికర్షతి మావితృప్తా
శిశ్నోऽన్యతస్త్వగుదరం శ్రవణం కుతశ్చిత్
ఘ్రాణోऽన్యతశ్చపలదృక్క్వ చ కర్మశక్తిర్
బహ్వ్యః సపత్న్య ఇవ గేహపతిం లునన్తి
ఒక్క మనసు పెట్టావు, పది ఇంద్రియాలు పెట్టావు. ఒక్కో ఇంద్రియం ఒక్కో వైపు లాగుకొని పోతుంది. ఇలా రకరకాలుగా బహు భార్యలు గల భర్తను భార్యలు లాగినట్లుగా లాగుకుని పోతాయి.
ఏవం స్వకర్మపతితం భవవైతరణ్యామ్
అన్యోన్యజన్మమరణాశనభీతభీతమ్
పశ్యన్జనం స్వపరవిగ్రహవైరమైత్రం
హన్తేతి పారచర పీపృహి మూఢమద్య
ఇలా సంసారమనే వైతరినీ నదిలో పడి, పుడుతూ చస్తూ, పుట్టినందుకు తింటూ, బాధలు పడుతూ భయపడుతూ ఉంటారు. ఈ మధ్యన "వాడు నా వస్తువు తీసుకున్నాడు, వాడిని నేను చంపుతాను" అని అనుకుంటాడు. ఈ మధ్యలోనే ఒకడి మీద శతృత్వం, ఇంకొకరి మీద మిత్రత్వం. ఇన్ని బాధలలో ఉన్న మమ్ము దయ చూసి నీవే బయట పడెయ్యాలి.
కో న్వత్ర తేऽఖిలగురో భగవన్ప్రయాస
ఉత్తారణేऽస్య భవసమ్భవలోపహేతోః
మూఢేషు వై మహదనుగ్రహ ఆర్తబన్ధో
కిం తేన తే ప్రియజనాననుసేవతాం నః
సంసారమనే మహాసముద్రము నుండి బయటకు తీయుట నీకొక లెఖ్ఖా? మమ్ము నీవు ఉద్దరించాలి. మూర్ఖుల యందు దయ చూపేవారే మహానుభావులు. మాలాంటి వారి మీద నీవు దయ చూపాలి. నీ భక్తులను నిరంతరం సేవించే మమ్ము సంసారం నుండీ బయట పడేయ్యాలి
నైవోద్విజే పర దురత్యయవైతరణ్యాస్
త్వద్వీర్యగాయనమహామృతమగ్నచిత్తః
శోచే తతో విముఖచేతస ఇన్ద్రియార్థ
మాయాసుఖాయ భరముద్వహతో విమూఢాన్
వైతరణీ నది నుంచీ నరకలోకం గురించీ నేను భయపడను. నిన్ను గానం చేస్తూ ఆ కథ అనే మహాసముద్రలో ఆనందముగా ఉన్నాను. ఇంత అద్భుతమైన నీ ప్రతాపమూ దయ ఉండగా, వీటిని వదిలిపెట్టి సంసారములో మగ్గుతున్నవారిని చూచి నాకు బాధ కలుగుతోంది. ఇంద్రియములూ విషయములనే మాయా సుఖముల యందు ఆసక్తి కలిగి ఉంటారు.
ప్రాయేణ దేవ మునయః స్వవిముక్తికామా
మౌనం చరన్తి విజనే న పరార్థనిష్ఠాః
నైతాన్విహాయ కృపణాన్విముముక్ష ఏకో
నాన్యం త్వదస్య శరణం భ్రమతోऽనుపశ్యే
లోకములో చాలామంది మునులూ యోగులూ తపస్వులు తమంత తాము ఒక చెట్టుకింద కూర్చుని తపస్సు చేస్తూ ప్రయత్నిస్తున్నారు గానీ, ఇతరులనీ దీనులనీ ఉద్దరించడానికి ప్రయత్నించరు. వారికే కోరికం లేదు. వారి మౌనముగా ఏకాంతముగా తపస్సు చేస్తూ ఉంటారు. ఇలాంటి దీనులని వదిలిపెట్టి నేనొక్కడినే మోక్షానికి రావడం నాకు ఇష్టం లేదు. సంసారములో పడి ఉన్న వారికి సంసారం వదలాలంటే నీవు తప్ప వేరే దిక్కు లేదు.
యన్మైథునాదిగృహమేధిసుఖం హి తుచ్ఛం
కణ్డూయనేన కరయోరివ దుఃఖదుఃఖమ్
తృప్యన్తి నేహ కృపణా బహుదుఃఖభాజః
కణ్డూతివన్మనసిజం విషహేత ధీరః
స్త్రీ పురుష సమాగమాన్ని చాలా సుఖం అంటున్నారు. దూరద పెడితే గోక్కున్నప్పుడు వచ్చే సుఖం లాంటిది అది. ఆ ఏడుపునే కోరి ఏడుస్తూనే ఉంటారు కానీ తృప్తి పొందడం లేదు మన్షులు.. అనేక దుఃఖాలని వీరు పొందుతున్నారు. ఎలాగైతే దురద పెడితే గోరు తగిలేంత గోక్కోవద్దు అని వైద్యుడు చెబుతాడు. దురదని సహించింట్లుగా కామాతురతని నిగ్రహించుకోవాలి.
మౌనవ్రతశ్రుతతపోऽధ్యయనస్వధర్మ
వ్యాఖ్యారహోజపసమాధయ ఆపవర్గ్యాః
ప్రాయః పరం పురుష తే త్వజితేన్ద్రియాణాం
వార్తా భవన్త్యుత న వాత్ర తు దామ్భికానామ్
మోక్షాన్నిచ్చేది మౌనం వ్రత్రం అధ్యయం మొదలైనవి. ఇవన్నీ ఇంద్రియ జయం లేని వారికి ముచ్చట మాత్రమే, వారు ఆచరించలేరు. ఇంద్రియ నిగ్రహం లేని వారికి ఇవి వార్తలేం( చెప్పుకోవదానికి మాత్రమే పనికొచ్చేవి)
రూపే ఇమే సదసతీ తవ వేదసృష్టే
బీజాఙ్కురావివ న చాన్యదరూపకస్య
యుక్తాః సమక్షముభయత్ర విచక్షన్తే త్వాం
యోగేన వహ్నిమివ దారుషు నాన్యతః స్యాత్
బీజమూ మొలక లాగ, ప్రపంచాన్ని చూస్తే నీవూ, నిన్ను చూస్తే ప్రపంచమూ కనపడదు. ప్రపంచమంతా నీలోనే ఉంది, నీవు ప్రపంచములోనే ఉన్నావు. ఇదంతా వేద సృష్టే. నీకు ఏ రూపమూ లేదు. పాంచభౌతిక రూపాలన్నీ నీ నుండే వచ్చాయి. అందుకే నిన్ను ప్రకృతిలో జీవునిలో సృష్టిలో ప్రళయములో జీవులు నిన్ను వెతుకుతూనే ఉంటారు. కట్టెలో నిప్పు ఉంటుంది, అది మధనం చేస్తారు. దాన్ని మధనముతో బయటకు తెచ్చినట్లు ధ్యానముతో నిన్ను బయటకు తీసుకురావాలి.
త్వం వాయురగ్నిరవనిర్వియదమ్బు మాత్రాః
ప్రాణేన్ద్రియాణి హృదయం చిదనుగ్రహశ్చ
సర్వం త్వమేవ సగుణో విగుణశ్చ భూమన్
నాన్యత్త్వదస్త్యపి మనోవచసా నిరుక్తమ్
పంచ భూతాలూ పంచ తన్మాత్రలూ ఇంద్రియాలూ ప్రాణాలూ అన్నీ నీవే . నీవే సగుణుడివీ నిర్గుణుడివి. వాక్కుకు అందవు.
నైతే గుణా న గుణినో మహదాదయో యే
సర్వే మనః ప్రభృతయః సహదేవమర్త్యాః
ఆద్యన్తవన్త ఉరుగాయ విదన్తి హి త్వామ్
ఏవం విమృశ్య సుధియో విరమన్తి శబ్దాత్
గుణాలూ మనస్సూ జ్ఞ్యాన కర్మేంద్రియాలూ పంచ తన్మాత్రలూ అన్నీ జనన మరణములు కలవే. అందరూ ఆద్యంతములు కలవారే. నీవొక్కడే అవి లేనివాడవు. జ్ఞ్యానులు ఈ విషయం తెలుసుకుని మౌనముగా ఉంటారు. ప్రవృత్తి నుండి విరమిస్తారు.
తత్తేऽర్హత్తమ నమః స్తుతికర్మపూజాః
కర్మ స్మృతిశ్చరణయోః శ్రవణం కథాయామ్
సంసేవయా త్వయి వినేతి షడఙ్గయా కిం
భక్తిం జనః పరమహంసగతౌ లభేత
నీకు నమస్కారం చేయాలి నిన్ను స్తోరం చేయాలి నీకు పూజలూ చేయాలి. బుద్ధి నీ పాదాల యందూ, చెవులలో నీ కథలూ ఉండాలి, నా మనసు బుద్ధీ నిన్ను సేవిస్తూ ఉండాలి. ఇలాంటి షడంగమైన ఈ భక్తి లేకుండా ఎవరైనా నిన్ను పొందుతారా?మానవులు ఆరు పనులు చేయాలి. నీకు నమస్కారం చేయాలి. ఎప్పుడైనా నమస్కారం చేయవచ్చి, ఎవరైనా చేయవచ్చు. ఎలాగైనా చేయవచ్చు. అలా ఒక్క సారి నమస్కరించినా చాలు. అలా చేస్తే ఇంతకాలం మనలో దాచుకున్న పాపాలన్నీ పోతాయి. తరువాత స్తోత్రం చేయాలి. కర్మ (పని) చేయాలి. ఏ కర్మ, పని చేసినా అది స్వామి కొరకే చేయాలి. అదే యజ్ఞ్యం. అలా చేయగా స్వామికి నివేదించిన పదార్ధం శేష పదార్ధం అవుతుంది. ప్రసాదం అవుతుంది. పూజ చేయాలి. లోపల ఎవరిగురించో ఆలోచించకుండా, భగవంతుని గురించి వినాలి. తరువాత భగవత్ కథలు శ్రవణం చేస్తూ ఉండాలి.
ఇవి చేస్తే భగవంతుని పొందే దారిలో ప్రయాణం చేస్తాము.
శ్రీనారద ఉవాచ
ఏతావద్వర్ణితగుణో భక్త్యా భక్తేన నిర్గుణః
ప్రహ్రాదం ప్రణతం ప్రీతో యతమన్యురభాషత
ఇలా ప్రకృతి గుణములు లేని పరమాత్మ ప్రహ్లాదుని చేత స్తోత్రం చేయబడి కోపాన్ని నిగ్రహించుకుని ప్రీతితో ఇలా అన్నాడు
శ్రీభగవానువాచ
ప్రహ్రాద భద్ర భద్రం తే ప్రీతోऽహం తేऽసురోత్తమ
వరం వృణీష్వాభిమతం కామపూరోऽస్మ్యహం నృణామ్
ప్రహ్లాదా నీకు మంగళం, శుభం. నీ స్తుతిచే ప్రీతి చెందాను. నీకు బెంగ అక్కరలేదు. నేనే కోరికలు తీర్చే వాడిని. నన్ను చూచిన వాడెవడూ మరలా దుఃఖం పొందడు. సాధువులూ శ్రేయస్సు కోరేవారు నన్నే సేవించి నా వలనే కోరికలను నింపుకుంటారు.
మామప్రీణత ఆయుష్మన్దర్శనం దుర్లభం హి మే
దృష్ట్వా మాం న పునర్జన్తురాత్మానం తప్తుమర్హతి
ప్రీణన్తి హ్యథ మాం ధీరాః సర్వభావేన సాధవః
శ్రేయస్కామా మహాభాగ సర్వాసామాశిషాం పతిమ్
శ్రీనారద ఉవాచ
ఏవం ప్రలోభ్యమానోऽపి వరైర్లోకప్రలోభనైః
ఏకాన్తిత్వాద్భగవతి నైచ్ఛత్తానసురోత్తమః
ప్రహ్లాదుడు స్వామిని స్తోత్రం చేసాడు. ప్రహ్లాదుడు ఒక వరమును కోరుకున్నాడు. ఆనాటినుంచీ మనసులో ఎటువంటి కోరికలూ కలగని వరం కోరాడు. అప్పుడు స్వామి "నీవు కూడా ఒక మన్వంతర కాలం (72 మహా యుగాలు, నాలుగు యుగాలు ఒక మహా యుగం). రాజ్యాన్ని పరిపాలించాలి". రాజ్య భోగాలలోనే మనసుని లగ్నం చేయకు. మనసు నా యందు లగ్నం చేయి. అన్ని కర్మలూ నాకు అర్పిస్తూ నిరంతరం నన్ను ధ్యానిస్తూ అన్ని కర్మలూ చేయి. అని భగావనుడు చెప్పాడు.