శ్రీనారద ఉవాచ
కల్పస్త్వేవం పరివ్రజ్య దేహమాత్రావశేషితః
గ్రామైకరాత్రవిధినా నిరపేక్షశ్చరేన్మహీమ్
వానప్రస్థ ఆశ్రమములో ఉన్నవాడు సన్యాస ఆశ్రమం తీసుకోగలిగితే తీసుకోవాలి. సమర్ధుడైతేనే సన్యాస ఆశ్రమములోకి ప్రవేశించాలి. సన్యాసాశ్రమానికి శరీరం మాత్రమే ఉండాలి. ఆశ్రమం కూడా ఉండరాదు. వానప్రస్థానములో ఆశ్రమం ఉంటుంది కానీ, సన్యాస ఆశ్రమములో అది ఉండరాదు. ఏ రెండో రాత్రీ ఒకే ఊళ్ళో ఉండకూడదు. నిరపేక్షుడై ఉండాలి.
బిభృయాద్యద్యసౌ వాసః కౌపీనాచ్ఛాదనం పరమ్
త్యక్తం న లిఙ్గాద్దణ్డాదేరన్యత్కిఞ్చిదనాపది
మరీ ఉండలేనప్పుడు ఆచ్చాధన కోసమే ఒక కౌపీనాన్ని కట్టుకోవాలి. దండ కమండలు తప్ప మరి ఏది తన కొరకు ధరించకూడదు ఆపద లేనప్పుడు.
ఏక ఏవ చరేద్భిక్షురాత్మారామోऽనపాశ్రయః
సర్వభూతసుహృచ్ఛాన్తో నారాయణపరాయణః
భూమిని సంచరించేప్పుడు ఒక్కరే సంచరించాలి, తనలో తాను ఆనందిస్తూ ఉండాలి. దేన్నీ ఆశ్రయించి ఉండరాదు. ఏ ప్రాణులనూ ద్వేషించకూడదు ప్రేమించకూడదు, రాగ ద్వేషాలను జయించాలి. పరమాత్మ యందు మాత్రమే బుద్ధీ మనసు లగ్నం చేసి ఉండాలి.
పశ్యేదాత్మన్యదో విశ్వం పరే సదసతోऽవ్యయే
ఆత్మానం చ పరం బ్రహ్మ సర్వత్ర సదసన్మయే
పరమాత్మలో ఈ ప్రపంచం మొత్తాన్ని చూడలి. ప్రపంచం పరమాత్మలో ఉన్నట్లు చూడాలి. తననూ పరమాత్మనూ ప్రకృతీ జీవుల స్వరూపలుగా ఉండే ప్రపంచము పరమాత్మలో ఉంది అని భావిస్తూ ఉండాలి.
సుప్తిప్రబోధయోః సన్ధావాత్మనో గతిమాత్మదృక్
పశ్యన్బన్ధం చ మోక్షం చ మాయామాత్రం న వస్తుతః
పడుకోని లేవడానికి మధ్య ఉన్న సంధ్యా సమయములో ఈ ఆత్మ ఎక్కడికి వెళ్ళాలి అని, పరమాత్మనీ ఆత్మనీ సాక్షాత్కరించుకున్నవాడై, సంసారమూ మోక్షమూ అన్న మాయ నుంచి (సంసారములో చిక్కుకోవడం ఎంత మాయో, మోక్షము కూడా అంతే మాయ. సంసారం అబద్దమైనపుడు మోక్షం కూడా మాయ) విడువడాలి
నాభినన్దేద్ధ్రువం మృత్యుమధ్రువం వాస్య జీవితమ్
కాలం పరం ప్రతీక్షేత భూతానాం ప్రభవాప్యయమ్
మృత్యువుని గానీ జీవితాన్ని గానీ రెంటినీ అభినందించకూడదు. పరమాత్మ ప్రసాదించిన శరీరం ఎప్పుడు పోతుందో ఆ సమయం కోసం ఎదురు చూడాలి. ప్రాణుల పుట్టుకా నాశమూ ఇష్టం ప్రకారం జరుగదు.
నాసచ్ఛాస్త్రేషు సజ్జేత నోపజీవేత జీవికామ్
వాదవాదాంస్త్యజేత్తర్కాన్పక్షం కంచ న సంశ్రయేత్
సన్స్యాసి నాస్తిక వాదాల జోలికి వెళ్ళరాదు. బతుకు తెరువు కోసం ప్రయత్నించరాదు. ఎవ్వరితో వాదించరాదు. ఏ ఒకరి పక్షమునూ ఆశ్రయించరాదు. అందుకే వాదాల జోలికి వెళ్ళకూడదు.
న శిష్యాననుబధ్నీత గ్రన్థాన్నైవాభ్యసేద్బహూన్
న వ్యాఖ్యాముపయుఞ్జీత నారమ్భానారభేత్క్వచిత్
శిష్యులతో ఎక్కువ అనుబంధం పెంచుకోకూడదు. వారిని నిర్భందం చేయకూడదు. ఎక్కువ గ్రంధాలను చదువకూడదు. గ్రంధాలు చదివినా వ్యాఖ్యానాల జోలికి వెళ్ళకూడదు. ఏ ఉద్యమాలూ,
న యతేరాశ్రమః ప్రాయో ధర్మహేతుర్మహాత్మనః
శాన్తస్య సమచిత్తస్య బిభృయాదుత వా త్యజేత్
బ్రహ్మచారీ గృహస్థా వానప్రస్థాలు ధర్మాచరణ గురించి. కానీ సన్యాసాశ్రమం ధర్మాన్ని ఆచరించడానికి కాదు. సన్యాసాశ్రమం ధర్మహేతువు కాదు.
అవ్యక్తలిఙ్గో వ్యక్తార్థో మనీష్యున్మత్తబాలవత్
కవిర్మూకవదాత్మానం స దృష్ట్యా దర్శయేన్నృణామ్
పూర్తిగా తన్మయమైన తరువాత, అటువంటి వారిని చూస్తే వారు ఏ ఆశ్రమానికి చెందినవారో తెలియకూడదు. చూసేవారికి తానేమిటో తెలియకూడదు. ఆ గుర్తులు ధరించకూడదు. కానీ విషయం మాత్రం స్పష్టముగా ఉండాలి. పరమాత్మను ధ్యానం చేస్తూ ఉండాలి. బుద్ధిమంతుడై ఉండాలి గానీ పిచ్చి పిల్లవానిలాగ ఉండాలి. పండితుడై ఉండాలి గానీ మూగవానిలా ఉండాలి. తనను తాను మూగవానిగా చూపుకోవాలి. ఈ విషయములో ఒక పురాణం ఉంది. అది చెబుతాను విను.
అత్రాప్యుదాహరన్తీమమితిహాసం పురాతనమ్
ప్రహ్రాదస్య చ సంవాదం మునేరాజగరస్య చ
ప్రహ్లాదునికీ ఒక అజగర వ్రతం ధరించిన ఒక మునికీ జరిగిన సంవాదం.
తం శయానం ధరోపస్థే కావేర్యాం సహ్యసానుని
రజస్వలైస్తనూదేశైర్నిగూఢామలతేజసమ్
సహ్య పర్వతములో కావేరీ నదీ తీరములో భూమి మీద పడుకుని ఉన్నాడు. శరీరమంతా దుమ్ముకొట్టుకుని పోయి ఉంది. నివురు గప్పిన నిప్పులా ఉన్నాడు. రహస్యముగా దాగి ఉన్న స్వచ్చమైన తేజస్సు కలిగి ఉన్నాడు.
దదర్శ లోకాన్విచరన్లోకతత్త్వవివిత్సయా
వృతోऽమాత్యైః కతిపయైః ప్రహ్రాదో భగవత్ప్రియః
లోకజ్ఞ్యానం పొందాలని, తత్వం తెలుసుకోవాలని సంచరిస్తున్న ప్రహ్లాదుడు ఇతనిని చూచాడు. కొందరు మంత్రులను తీసుకుని తిరుగుతూ ఉన్నాడు
కర్మణాకృతిభిర్వాచా లిఙ్గైర్వర్ణాశ్రమాదిభిః
న విదన్తి జనా యం వై సోऽసావితి న వేతి చ
ఈయన చూస్తే బ్రహ్మచారా గృహస్థా యతా వానప్రస్థా సన్యాసా అని తెలియలేదు. ఆయనకు నమస్కరించి పూజించి
తం నత్వాభ్యర్చ్య విధివత్పాదయోః శిరసా స్పృశన్
వివిత్సురిదమప్రాక్షీన్మహాభాగవతోऽసురః
తల వంచి పాదములని స్పృశించి ఇలా అడిగాడు
బిభర్షి కాయం పీవానం సోద్యమో భోగవాన్యథా
విత్తం చైవోద్యమవతాం భోగో విత్తవతామిహ
భోగినాం ఖలు దేహోऽయం పీవా భవతి నాన్యథా
మీరు బాగా బలిసిన శరీరం ధరించి ఉన్నారు ప్రయత్నం చేసి ధనమును సంపాదించి భోగములని అనుభవించిన వారు ఎలా ఉంటారో అలా ఉన్నారు. ప్రయత్నంచేసిన వారికే ధనం వస్తుంది, వారే భోగం అనుభవిస్తారు, భోగం అనుభవించిన వారే అనుభవిస్తారు. మీకు చివరిదైన భోగం మాత్రమే ఉంది. డబ్బూ ప్రయత్నం ఉన్నట్లు కనపడట్లేదు.
న తే శయానస్య నిరుద్యమస్య బ్రహ్మన్ను హార్థో యత ఏవ భోగః
అభోగినోऽయం తవ విప్ర దేహః పీవా యతస్తద్వద నః క్షమం చేత్
ఏ ప్రయత్నం లేకుండా ఇలా పడుకుని ఉన్న మీకు డబ్బు ఎక్కడినుంచి వస్తుంది. అలాంటి వారికి భోగం ఎక్కడిది? ఎలాంటి భోగం లేని మీ శరీరం ఇలా ఎలా ఉంది? చెప్పదలచుకుంటే చెప్పండి.
కవిః కల్పో నిపుణదృక్చిత్రప్రియకథః సమః
లోకస్య కుర్వతః కర్మ శేషే తద్వీక్షితాపి వా
మిమ్ము చూస్తే కవి సమర్ధుడు నిపుణముగా చూసేవాడు, లౌకికమైన కర్మలు ఆచరించే వారు ఎలా పడుకుని ఉంటారో అలా ఉన్నారు. అన్ని భోగాలూ ఆచరించేవారు పడుతున్నట్లు పడుకున్నారు గానీ మీరే పనీ చేయట్లేదు
శ్రీనారద ఉవాచ
స ఇత్థం దైత్యపతినా పరిపృష్టో మహామునిః
స్మయమానస్తమభ్యాహ తద్వాగమృతయన్త్రితః
ఇలా అడిగితే ఆయన ఒక చిరునవ్వు నవ్వి
శ్రీబ్రాహ్మణ ఉవాచ
వేదేదమసురశ్రేష్ఠ భవాన్నన్వార్యసమ్మతః
ఈహోపరమయోర్నౄణాం పదాన్యధ్యాత్మచక్షుషా
నీవు సజ్జనులకు ఇష్టుడవు. నీవడిగితే చెప్పకుండా ఉండకూడదు. మనకు రెండే ఉన్నాయి. ఒకటి కోరిక. ఇంకొకటి విరక్తి. ఈ రెంటి యందు కూడా కోరిక లేకుంటే సన్యాసి అవుతాడు.
యస్య నారాయణో దేవో భగవాన్హృద్గతః సదా
భక్త్యా కేవలయాజ్ఞానం ధునోతి ధ్వాన్తమర్కవత్
శ్రీమన్నారాయణుడు అన్ని వేళలా హృదయములో ఉంటాడు. చీకటిని సూర్యుడు పోగొట్టినట్లు హృదయములో ఉన్న పరమాత్మ అజ్ఞ్యానాన్ని పోగొడతాడు. దానికి పరమాత్మ యందు భక్తి మాత్రం ఉండాలి.
తథాపి బ్రూమహే ప్రశ్నాంస్తవ రాజన్యథాశ్రుతమ్
సమ్భాషణీయో హి భవానాత్మనః శుద్ధిమిచ్ఛతా
సాధారణముగా నీ ప్రశ్నకు నేను సమాధానం చెప్పకూడదు. నీవు పరమాత్మ దగ్గరనుంచి వచ్చినవాడవు. మనసు పరిశుద్ధముగా ఉండాలని కోరుకునేవారు నిన్ను గౌరవించకతప్పదు. ప్రకృతి సంబంధాన్ని విడిచిపెట్టినా ప్రకృతిలో ఉండి పరమాత్మ భక్తులని గౌరవించాలి. అలాంటి వారందరికీ నీవు గౌరవించదగిన వాడవు.
తృష్ణయా భవవాహిన్యా యోగ్యైః కామైరపూర్యయా
కర్మాణి కార్యమాణోऽహం నానాయోనిషు యోజితః
నేను ఎన్నటికీ నిండని, సంసారం వైపు ప్రవహింపచేసేదైన , ఆశతో, యోగ్యమైన అయోగ్యమైన కోరికలతో రక రకముల పనులను చేయించబడుతూ ఉన్న నేను ఎన్నో జన్మలను ఎత్తాను
యదృచ్ఛయా లోకమిమం ప్రాపితః కర్మభిర్భ్రమన్
స్వర్గాపవర్గయోర్ద్వారం తిరశ్చాం పునరస్య చ
ఆయా కర్మలతో తిరుగుతూ స్వామి కృపతో భూలోకములో వచ్చిపడ్డాను. ఈ భూలోకం స్వర్గానికైనా అపవర్గానికైనా ద్వారం.
తత్రాపి దమ్పతీనాం చ సుఖాయాన్యాపనుత్తయే
కర్మాణి కుర్వతాం దృష్ట్వా నివృత్తోऽస్మి విపర్యయమ్
ఇక్కడికొస్తే ఈ భూలోకములో సుఖము కోసం, దుఃఖం తొలగించడానికి ప్రయత్నం. స్త్రీ పురుష సమాగమ రూపమైన సుఖమును పొందాలి, అంతకన్నా ముందు దుఃఖాన్ని తొలగించుకోవాలి. వాటి కోసం రక రకాల పనులు చేస్తూ ఉన్నాను. ఇలా చేస్తు చేస్తూ నేను విపర్యయాన్నే పొందాను. సుఖాన్ని పొందాలని కర్మలు చేస్తే సుఖం తొలగి దుఃఖం కలిగింది.
సుఖమస్యాత్మనో రూపం సర్వేహోపరతిస్తనుః
మనఃసంస్పర్శజాన్దృష్ట్వా భోగాన్స్వప్స్యామి సంవిశన్
అన్ని కోరికలనూ విడిచిపెట్టుటే సుఖం అని తెలుసుకున్నాను. ఏ కోరికలూ లేకుండా ఉండుటే సుఖం. మనస్సు యొక్క యోగం (ఆస్కతి) వలన ఇవన్నీ కలుగుతున్నాయి. వారి వారి మనసుకు నచ్చినవాటిని సుఖముగా భావించి వాటి గురించి బతకడం మొదలుపెడితే సంసారం పెరుగుతూ ఉంటుంది. కళ్ళు తెరిస్తే బాధ అని కళ్ళు మూసుకున్నాను.
ఇత్యేతదాత్మనః స్వార్థం సన్తం విస్మృత్య వై పుమాన్
విచిత్రామసతి ద్వైతే ఘోరామాప్నోతి సంసృతిమ్
అసలు ఆత్మ యొక్క స్వరూపాన్నీ స్వార్థాన్నీ మరచిపోయిన మానవుడు లేని భేధ బుద్ధిలో మనసు ఉంచి ఘోరమైన సంసారాన్ని పొందుతున్నాడు.
జలం తదుద్భవైశ్ఛన్నం హిత్వాజ్ఞో జలకామ్యయా
మృగతృష్ణాముపాధావేత్తథాన్యత్రార్థదృక్స్వతః
మనకు నీరు కావాలి. మనం నీటి దగ్గరే ఉన్నం. కానీ నీటి పైన నాచు పడి ఉంది. నీటితో పుట్టినవాటితోటే నీరు కప్పబడి ఉన్నది. అలాగే మనసులో పుట్టిన కోరికలే మన మనసును కప్పేస్తాయి. ఎలా ఐతే మనం జలాన్ని అక్కడ చూడక ఎండమావులను చూచి నీరు అనుకుంటే దొరకదు. పరమాత్మకంటే ఇతరమైన చోట మనకు కావలసిన ఆశలు తీరుతాయి అనడం కూడా అలాంటిదే.
దేహాదిభిర్దైవతన్త్రైరాత్మనః సుఖమీహతః
దుఃఖాత్యయం చానీశస్య క్రియా మోఘాః కృతాః కృతాః
నాకు సుఖం కావాలి అని కోరుకుంటాడు. కానీ తాను కోరుకున్న సుఖం తన శరీరముతో పొందాలి అనుకుంటాడు. శరీరం ఇంద్రియములూ మనసూ బుద్ధీ చిత్తముతో పొందాలి అనుకుంటాడు. కాని అవి అన్నీ దైవాధీనాలు. మనం చెప్పినట్లు వినవు. భగవంతుని ఆధీనములో దేహాదులతో మనసుకూ ఆత్మకూ సుఖం కోరేవాడు దుఃఖాన్ని తప్పించాలి అని కోరేవాడు చేసే పనులన్నీ వ్యర్థం అవుతున్నాయి.
ఆధ్యాత్మికాదిభిర్దుఃఖైరవిముక్తస్య కర్హిచిత్
మర్త్యస్య కృచ్ఛ్రోపనతైరర్థైః కామైః క్రియేత కిమ్
తాపత్రయములచే కొట్టబడే వానికి ఎంతో కష్టపడి సంపాదించిన అర్థ కామములతో మానవునికి తృప్తీ సుఖమూ కలుగుతాయా? తల్లి వలే పిల్లలు ఉన్నట్లు కష్టం నుంచి వచ్చిన పనులకు ఫలితం కష్టమే.
పశ్యామి ధనినాం క్లేశం లుబ్ధానామజితాత్మనామ్
భయాదలబ్ధనిద్రాణాం సర్వతోऽభివిశఙ్కినామ్
ధనవంతులూ ఏడుస్తున్నారు, దరిద్రులూ ఏడుస్తున్నారు, లోభులూ ఏడుస్తున్నారు. లేని వాని కన్నా డబ్బు ఉన్నవారికే ఎక్కువ బాధలు. ధనవంతులకు లోభులకూ డబ్బు పోతుంది అన్న భయముతో నిద్రేపట్టదు. దరిద్రుడే హాయిగా నిదురపోతాడు. ధనవంతుడు ప్రతీ చోటా ఆపదను శంకిస్తూనే ఉంటాడు.
రాజతశ్చౌరతః శత్రోః స్వజనాత్పశుపక్షితః
అర్థిభ్యః కాలతః స్వస్మాన్నిత్యం ప్రాణార్థవద్భయమ్
రాజుల నుంచి భయం (పన్ను), దొంగల వలన భయం, శత్రువుల నుంచి భయం, తన వారి నుంచి భయం, పశు పక్షాదుల వలన, యాచకుల వలన, కాలము వలన భయం, తనకే దుష్ట బుద్ధి పుట్టవచ్చు, ఈ భయం ప్రాణానికీ అర్థానికీ ఉంటుంది. ప్రాణమూ అర్థమూ ఉన్నవారికి ఉంటుంది.
శోకమోహభయక్రోధ రాగక్లైబ్యశ్రమాదయః
యన్మూలాః స్యుర్నృణాం జహ్యాత్స్పృహాం ప్రాణార్థయోర్బుధః
శోకమూ మోహమూ భయమూ క్రోధమూ రాగమూ విషాదమూ అలసటా, ఇవన్నీ ఆశ ఉండుట వలన కలుగుతాయి. ఆశ లేకుంటే ఇవేవీ ఉండవు. ఉన్నవి రెండే ఆశలు. ఒకటి బాగా డబ్బు ఉండాలనీ, రెండు చాలా ఎక్కువ కాలం ఉండాలని. ప్రాణం మీదా డబ్బు మీదా ఆశ వలనే పైవన్నీ వస్తున్నాయి.
మధుకారమహాసర్పౌ లోకేऽస్మిన్నో గురూత్తమౌ
వైరాగ్యం పరితోషం చ ప్రాప్తా యచ్ఛిక్షయా వయమ్
నాకు ఇద్దరు మహా గురువులు. ఒక గురువు తేనెటీగ. ఇంకో గురువు కొండచిలువ. తేనెటీగతో వైరాగ్యాన్నీ, కొండ చిలువతో తృప్తినీ నేర్చుకున్నాను. కష్టపడి సంపాదించుకున్న తేనెని, ఎవరైనా కింద మంట పెడితే అది వదిలేసి వెళ్ళిపోతాయి. మనం కూడా తినకుండా తాగకుండా సమపాదించినవి మన పిల్లలూ స్వజనులూ అనుభవిస్తారు.
విరాగః సర్వకామేభ్యః శిక్షితో మే మధువ్రతాత్
కృచ్ఛ్రాప్తం మధువద్విత్తం హత్వాప్యన్యో హరేత్పతిమ్
కొండచిలువ తన దగ్గరకు వచ్చినదాన్నే తింటుంది. దొరికినప్పుడు దొరికినదానితో తృప్తి పొందడం నేర్చుకున్నాను. తేనెటీగ వలన అన్ని కోరికల నుండీ వైరాగ్యాన్ని నేర్చుకున్నాను. ఎంతో కష్టపడి సంపాదించిన తేనెను ఇతరులు పొందినట్లుగా, మనం సంపాదించిన ధనాన్ని మనను చంపి తీసుకుని పోతారు.
అనీహః పరితుష్టాత్మా యదృచ్ఛోపనతాదహమ్
నో చేచ్ఛయే బహ్వహాని మహాహిరివ సత్త్వవాన్
ఏ కోరికా లేకుండా సంతోషముతో భగవంతుని దయ వలన వచ్చిన దాన్ని తినడం నేర్చుకున్నాను కొండచిలువ వలన.
క్వచిదల్పం క్వచిద్భూరి భుఞ్జేऽన్నం స్వాద్వస్వాదు వా
క్వచిద్భూరి గుణోపేతం గుణహీనముత క్వచిత్
ఒక రోజు ఎక్కువ అన్నం దొరుకుంతుంది, ఒక రోజు రుచి లేనిది దొరుకుతుంది. దొరికినప్పుడు దొరికినదానితో తృప్తి పడాలి.
శ్రద్ధయోపహృతం క్వాపి కదాచిన్మానవర్జితమ్
భుఞ్జే భుక్త్వాథ కస్మింశ్చిద్దివా నక్తం యదృచ్ఛయా
కొందరు మనని గౌరవించి పెడతారు. కొందరు అవమానించి పెడతారు. దొరికిన దాన్ని తింటాను. దొరికిన చోట పడుకుంటాను.
క్షౌమం దుకూలమజినం చీరం వల్కలమేవ వా
వసేऽన్యదపి సమ్ప్రాప్తం దిష్టభుక్తుష్టధీరహమ్
క్వచిచ్ఛయే ధరోపస్థే తృణపర్ణాశ్మభస్మసు
క్వచిత్ప్రాసాదపర్యఙ్కే కశిపౌ వా పరేచ్ఛయా
కొందరు బాగా ఆదరిస్తారు. కొందరు పడుకోవడానికి చోటు ఇస్తారు. కటిక నేలైనా పరుపైనా తెలిసేది నిద్ర పట్టేదాకానే. కొందరు ఒంటికి అత్తరూ పన్నీరు రాస్తారు,. కొందరు పట్టు వస్త్రాలు కట్టి పూల మాలలు వేసి అలంకరిస్తారు. కొందరు రథం మీద ఏనుగు మీదా గుర్రాల మీద ఒంటెల మీదా ఊరేగిస్తారు.
క్వచిత్స్నాతోऽనులిప్తాఙ్గః సువాసాః స్రగ్వ్యలఙ్కృతః
రథేభాశ్వైశ్చరే క్వాపి దిగ్వాసా గ్రహవద్విభో
నాహం నిన్దే న చ స్తౌమి స్వభావవిషమం జనమ్
ఏతేషాం శ్రేయ ఆశాసే ఉతైకాత్మ్యం మహాత్మని
నన్ను ఆదరించిన వాడిన్ పొగడను, అవమానించినవాడిని నిందించను. అదంతా వారి వారి స్వభావములను బట్టి వారు చేస్తున్నారు. వారందరికీ భగవానుడు మేలు కలిగించుగాక అని అడుగుతాను.
వికల్పం జుహుయాచ్చిత్తౌ తాం మనస్యర్థవిభ్రమే
మనో వైకారికే హుత్వా తం మాయాయాం జుహోత్యను
వికల్పాన్ని చిత్తములో చిత్తాన్ని, చిత్తాన్ని మనసులో, మనసును అహంకారములో, అహంకారాన్ని ప్రకృతిలో విడిచిపెట్టాలి. దీన్ని ఆత్మానుభూతిలో మాయను, మాయను పరమాత్మలో పెట్టి ఈ విధానాన్ని అవలంబిస్తే ఆశ పోతుంది. మనవి అనుకున్నవన్నీ పరమాత్మకు అర్పించాలి. శరీరాన్ని అవయవాలలో, అవయవాలను ఇంద్రియాలలో, ఇంద్రియాలను మనసులో, మనసును ప్రాణములో, ప్రాణమును చిత్తములో, చీతమును బుద్ధిలో బుద్ధిని అనతఃకరణములో అంతఃకరణాన్ని అహంకారములో అహంకారమును ప్రకృతిలో ప్రకృతిని జీవాత్మలో జీవాత్మని పరమాత్మలో ఉంచాలి.
ఆత్మానుభూతౌ తాం మాయాం జుహుయాత్సత్యదృఙ్మునిః
తతో నిరీహో విరమేత్స్వానుభూత్యాత్మని స్థితః
తన అనుభూతితో పరమాత్మానుభూతితోటే ఉండాలి.
స్వాత్మవృత్తం మయేత్థం తే సుగుప్తమపి వర్ణితమ్
వ్యపేతం లోకశాస్త్రాభ్యాం భవాన్హి భగవత్పరః
ఇది పరమ రహస్యమైనది. నీవడిగావు కాబట్టి, నీవు పరమాత్మ భక్తుడవి కాబట్టి, నీకు చెప్పడం వలన అది పెరుగుతుంది కానీ తరుగదు. ఇది లోక శాస్త్రములకంటే అవతల ఉన్నది. నీవు భగవంతునికి అధీనుడవు
శ్రీనారద ఉవాచ
ధర్మం పారమహంస్యం వై మునేః శ్రుత్వాసురేశ్వరః
పూజయిత్వా తతః ప్రీత ఆమన్త్ర్య ప్రయయౌ గృహమ్
ఈ రీతిలో సన్యాస ధర్మాన్ని ముని వలన విన్న అసురేశ్వరుడు ప్రహ్లాదుడు ఆయను పూజించి ఆయన అనుజ్ఞ్యను పొంది తన ఇంటికి వెళ్ళాడు.