శ్రీరాజోవాచ
నిశమ్య దేవః స్వభటోపవర్ణితం ప్రత్యాహ కిం తానపి ధర్మరాజః
ఏవం హతాజ్ఞో విహతాన్మురారేర్నైదేశికైర్యస్య వశే జనోऽయమ్
ఇది విని పరీక్షిత్తు అడిగాడు "మీరొక అంశాన్ని వదిలిపెట్టారు. విష్ణు భటులు విడిపించి యమలోకానికి యమభటులను పంపేసారు. అది వారు తమ ప్రభువుకు నివేదించలేదా? విన్న యమధర్మరాజు ఏమి చేసాడు."
యమస్య దేవస్య న దణ్డభఙ్గః కుతశ్చనర్షే శ్రుతపూర్వ ఆసీత్
ఏతన్మునే వృశ్చతి లోకసంశయం న హి త్వదన్య ఇతి మే వినిశ్చితమ్
సకల చరాచర జగత్తు మృత్యు వశములో ఉంటుంది. అలాంటప్పుడు తమ వారిని విష్ణు భక్తులు వెళ్ళగొడితే ఆయన ఎలా ఊరుకున్నాడు. ఇంతవరకూ యముని ఆజ్ఞ్య కొట్టబడినట్లు ఎక్కడా లేదు. అలాంటి యముని ఆజ్ఞ్య ఉల్లంఘించబడితే ఏమి జరిగింది
శ్రీశుక ఉవాచ
భగవత్పురుషై రాజన్యామ్యాః ప్రతిహతోద్యమాః
పతిం విజ్ఞాపయామాసుర్యమం సంయమనీపతిమ్
పరమాత్మ భక్తులతో అడ్డగించబడిన యమభటులు స్వామితో ఇలా అన్నారు
యమదూతా ఊచుః
కతి సన్తీహ శాస్తారో జీవలోకస్య వై ప్రభో
త్రైవిధ్యం కుర్వతః కర్మ ఫలాభివ్యక్తిహేతవః
ఈ ప్రపంచాన్ని శాసించే వారెందరున్నారు. వారు వారు ఆచరించే కర్మకనుగుణమైన ఫలితాన్ని ప్రసాదించేవారెందరున్నారు.
యది స్యుర్బహవో లోకే శాస్తారో దణ్డధారిణః
కస్య స్యాతాం న వా కస్య మృత్యుశ్చామృతమేవ వా
మాకు తెలిసి శాసకుడు ఒకడే ఉండాలి. చాలా మంది శాసకులు ఉంటే, ప్రతీ శాసకుడు తమ వారిని కాపాడాలి అనుకుంటే తప్పు చేసిన వారు శిక్షించబడరు, తన వాడు కాదనుకుంటే తప్పు చేయని వారు కూడా శిక్షించబడతారు. ఎవరికి నరకం ఎవరికి మోక్షం వస్తుంది అన్నది నీవల్లే తెలియాలి కదా.
కిన్తు శాస్తృబహుత్వే స్యాద్బహూనామిహ కర్మిణామ్
శాస్తృత్వముపచారో హి యథా మణ్డలవర్తినామ్
చాలామంది శాసకులుంటే శాసక్త్వం నామమాత్రమై (ఉపచారమాత్రమై) అపరాధమే పని చేస్తుంది (అపరాధులే శాసకులవుతారు). మండలాధికారులకు వారి మండలములో వారేది చెప్తే ధర్మాధర్మాలతో పనిలేకుండా అదే శాసనం
అతస్త్వమేకో భూతానాం సేశ్వరాణామధీశ్వరః
శాస్తా దణ్డధరో నౄణాం శుభాశుభవివేచనః
అందరికీ నీవే ఈశ్వరుడవని మాకు తెలుసు, శాసకుడవు, దండధారివి, పుణ్యపాపములను తెలుసుకొని తగిన రీతిలో శిక్ష విధించగలవాడవు నీవే. ఇలాంటి నీ శాసనం కూడా నివారించబడినది. అంటే లోకములో శాసనం లేదని అర్థం.
తస్య తే విహితో దణ్డో న లోకే వర్తతేऽధునా
చతుర్భిరద్భుతైః సిద్ధైరాజ్ఞా తే విప్రలమ్భితా
దివ్యమంగళ విగ్రహముతో నలుగురు పురుషులొచ్చి
నీయమానం తవాదేశాదస్మాభిర్యాతనాగృహాన్
వ్యామోచయన్పాతకినం ఛిత్త్వా పాశాన్ప్రసహ్య తే
నరకలోకముకు మాచే తీసుకుపోబడుతున్న మా పాశాలను చేదించారు.
తాంస్తే వేదితుమిచ్ఛామో యది నో మన్యసే క్షమమ్
నారాయణేత్యభిహితే మా భైరిత్యాయయుర్ద్రుతమ్
మేము తెలియదగినదని మీరనుకుంటే మేము వినదగినవారమని మీరనుకుంటే నారాయణ అన్న మాత్రన వారొచ్చి మమ్మల్ని వెళ్ళగొట్టడానికి కారణం ఏమిటీని అడిగితే
శ్రీబాదరాయణిరువాచ
ఇతి దేవః స ఆపృష్టః ప్రజాసంయమనో యమః
ప్రీతః స్వదూతాన్ప్రత్యాహ స్మరన్పాదామ్బుజం హరేః
యమ దూతలు విష్ణు దూతలను వెళ్ళగొట్టినా ఏమీ అనకుండా వచ్చినందుకు యముడు సంతోషించాడు, పరమాత్మ పాద పద్మాలను స్మరిస్తూ ఇలా అన్నాడు
యమ ఉవాచ
పరో మదన్యో జగతస్తస్థుషశ్చ ఓతం ప్రోతం పటవద్యత్ర విశ్వమ్
యదంశతోऽస్య స్థితిజన్మనాశా నస్యోతవద్యస్య వశే చ లోకః
నీకూ నాకే కాదు సకల చరాచర జగత్తుకూ అసలైన శాసకుడు ఒకడున్నాడు, నేను కాదు. స్థావర జంగమాదులైన సకల జగత్తుకూ ఈశ్వరుడు ఒకడున్నాడు. ఆ పరమాత్మ యందే సకల జగత్తూ ఇమిడి ఉన్నది. వస్త్రములో నిలువు దారాలూ అడ్డదారాలూ ఉంటాయి. నిలువు దారాలలో అడ్డదారాలు జొప్పిస్తారు. నిలువు దారాలు ప్రోతం. అడ్డదారాలు ఓతం. ఎలా ఐతే వస్త్రములో దారాలు కూరుస్తారో ఈ పరమాత్మలో జగత్తంతా ఇమిడి ఉన్నది. ఈ జగత్తు ఒకదానికి మరొకటి ఆధారమని అనిపిస్తుంది. నిలువుదారం లేకుంటే అడ్డదారాలు కూర్చబడవు. ఎవరికి వారే మేమే శాసకులమనుకుంటారు ఇలా దారాలు చూసినప్పుడు అనుకున్నట్లు. ఈ దారాలను దగ్గరకు ఏర్చీ కూర్చు వస్త్రముగా చేసినవాడు మూలం.నిలువు దారాలు మేము గొప్పా అని, అడ్డదారాలు మేము గొప్పా అనుకుంటే మరి వాటిని కూర్చినవాడినేమని అనాలి? పత్తి చెట్టు నాటి పెంచి పోషించి గింజలను తీసి వేరు చేసి దారాలను తీసి ఏర్చి కూర్చి వస్త్రం తయారు చేస్తే నిలువు, అడ్డ దారాలు "మాతోటే వస్త్రం తయారయ్యిందని" అనుకున్నట్లు ఉంటుంది మనం "నేను బలవంతున్నీ, బుద్ధి కలవాడినీ, ఆరోగ్యవంతున్నీ, బుద్ధిమంతున్ని" అని అనుకుంటాము.
తన కడుపులో ఉన్న జీవునికి ఇంద్రియాలూ మనసు తొడిగి వాడిని పంపిస్తే వాడు "నేను తెలివైన వాడిని అనుకున్నట్లు ఉంటుంది". ఆయనలో సకల చరాచర జగత్తు కూర్చబడినదీ, పేర్చబడినది. సకల చరాచర జగత్తు యొక్క సృష్టి స్థితి లయములు పరమాత్మ యొక్క సహస్రాంశతో జరుగుతున్నాయి. మనందరికీ ఆయన ముక్కు తాడు వేసి పట్టుకున్నాడు.
యో నామభిర్వాచి జనం నిజాయాం బధ్నాతి తన్త్ర్యామివ దామభిర్గాః
యస్మై బలిం త ఇమే నామకర్మ నిబన్ధబద్ధాశ్చకితా వహన్తి
మనందరినీ పేర్లతో కట్టేస్తాడు. నేను మనిషినీ దేవతనీ రాక్షసున్నీ అని. నమాలనే ధామాలతో (దారాలతో) కట్టి వేసాడు తాళ్ళతో గోవులను కట్టెసినట్లుగా. తమ పేర్లతో కర్మలతో జీవులందరూ ఆ పరమాత్మకే ఆరాధన జరుపుతారు. మనం చేసే అన్ని పనులూ భగవత్ ఆరాధనా రూపముగా ఉండాలి. ఇష్టమున్నా లేకున్నా పరమాత్మ చెప్పినట్లే మనం వింటూ ఉంటాము.
అహం మహేన్ద్రో నిరృతిః ప్రచేతాః సోమోऽగ్నిరీశః పవనో విరిఞ్చిః
ఆదిత్యవిశ్వే వసవోऽథ సాధ్యా మరుద్గణా రుద్రగణాః ససిద్ధాః
వీరందరూ
అన్యే చ యే విశ్వసృజోऽమరేశా భృగ్వాదయోऽస్పృష్టరజస్తమస్క
యస్యేహితం న విదుః స్పృష్టమాయాః సత్త్వప్రధానా అపి కిం తతోऽన్యే
వీరే కాక ప్రజాపతులు దేవతాధిపతులు, రజస్సూ తమస్సూ అంటని భృగ్వాదులు కూడా పరమాత్మ మాయని దాటలేరు. ఆయనౌ వాక్కుతో గానీ మనసుతో హృదయముతో గానీ ప్రాణులు తెలియలేరు
యం వై న గోభిర్మనసాసుభిర్వా హృదా గిరా వాసుభృతో విచక్షతే
ఆత్మానమన్తర్హృది సన్తమాత్మనాం చక్షుర్యథైవాకృతయస్తతః పరమ్
ఆయన మన హృదయములోనే అంతర్యామిగా ఉన్నాడు. కన్ను ఎదురుగా ఉన్న రూపాన్ని కన్నులో చూస్తుంది. కన్ను ఏ రూపాన్ని చూస్తుందో ఆ రూపం కనుగుడ్డులో కూడా కనపడుతుంది. అందులో పడితేనే మనకు రూపం కనిపిస్తుంది. కానీ మనం కంటి గుడ్డులో ఉన్న రూపాన్ని చూడలేము, ఎదురుగునా ఉన్నదానినే చూడగలం.
తస్యాత్మతన్త్రస్య హరేరధీశితుః పరస్య మాయాధిపతేర్మహాత్మనః
ప్రాయేణ దూతా ఇహ వై మనోహరాశ్చరన్తి తద్రూపగుణస్వభావాః
అలాగే మనం హృదయములో ఉన్న పరమాత్మను చూడలేము. పరమాత్మ సర్వతంత్ర స్వతంత్ర్యుడు. ఆయన పరుడు మాయాధిపతి. అలాంటి పరమాత్మ దూతలు ఈ లోకములో సంచరిస్తూ ఉంటారు. పరమాత్మ రూపమూ గుణమూ స్వభావమూ కలిగి ఉంటారు వారు. ఎదుటి వారు బాధపడుతూ ఉంటే చూడలేకపోయే వారు, వారు.
భూతాని విష్ణోః సురపూజితాని దుర్దర్శలిఙ్గాని మహాద్భుతాని
రక్షన్తి తద్భక్తిమతః పరేభ్యో మత్తశ్చ మర్త్యానథ సర్వతశ్చ
పరమాత్మ యొక్క దుర్దర్శలింగాని (చిహ్నములు) రూపములూ ఇవన్నీ పరమాత్మకు అత్యంత ప్రియమైన వారికి కూడా వస్తాయి. అలాంటి వారు ఇలాంటి రూపాన్ని కాపాడతారు. ఆ రూపములో వచ్చి రక్షిస్తుంటారు. నా నుంచే కాదు, పరమాత్మ భక్తులకు ఎవరు ఆపద కలిగేప్పుడు వారు వెళ్ళి రక్షిస్తారు
ధర్మం తు సాక్షాద్భగవత్ప్రణీతం న వై విదురృషయో నాపి దేవాః
న సిద్ధముఖ్యా అసురా మనుష్యాః కుతో ను విద్యాధరచారణాదయః
మీరు చెప్పిన ధర్మ మర్యాద లోకములో సరిపోతుంది గానీ ఆయన వద్ద కాదు. ధర్మమును పరమాత్మే ఏర్పరచాడు. అలాంటి ధర్మాన్ని ఋషులు గానీ దేవతలు గానీ సిద్ధులూ విద్యాధరులూ గంధర్వులూ మానవులు కిమంపురుషులూ తెలియజాలరు.
స్వయమ్భూర్నారదః శమ్భుః కుమారః కపిలో మనుః
ప్రహ్లాదో జనకో భీష్మో బలిర్వైయాసకిర్వయమ్
పరమాత్మ యొక్క మాయను తెలిసిన వారు కొంతమంది ఉన్నారు. స్వయమ్భూర్నారదః శమ్భుః కుమారః కపిలో మనుః, ప్రహ్లాదో జనకో భీష్మో బలిర్వైయాసకిర్వయమ్. మా పన్నెండు మందికి మాత్రమే భగవత్ ధర్మం తెలుసు.
ద్వాదశైతే విజానీమో ధర్మం భాగవతం భటాః
గుహ్యం విశుద్ధం దుర్బోధం యం జ్ఞాత్వామృతమశ్నుతే
పరమ రహస్యమైనదీ పరిశుద్ధమైనదీ ఎంత కష్టపడ్డా తెలియనిది, అలాంటి ధర్మాన్ని తెలుసుకున్నవాడు మోక్షాన్ని పొందుతాడు.
ఏతావానేవ లోకేऽస్మిన్పుంసాం ధర్మః పరః స్మృతః
భక్తియోగో భగవతి తన్నామగ్రహణాదిభిః
ఈ ప్రపంచములో ఇదే ధర్మం. పరమాత్మ యొక్క నామ సంకీర్తనం కథా శ్రవణం పరమాత్మ గుణాను సంధానమే పరమాత్మ ఆరాధన. పరమాత్మ యందు భక్తి యోగమే ధర్మం. తక్కినదంతా అధర్మం.
నామోచ్చారణమాహాత్మ్యం హరేః పశ్యత పుత్రకాః
అజామిలోऽపి యేనైవ మృత్యుపాశాదముచ్యత
పరమాత్మ నామం పలికితే కలిగే ఫలితం మీరే చూసారు. అజామీలుడు కేవలం ఒక్క సారి నారాయణ అంటేనే మీ పాశాలు ఎగిరిపోయాయి. ఇంతకన్నా పరమాత్మ నామ కీర్తన గురించి చెప్పేదేముంది.
ఏతావతాలమఘనిర్హరణాయ పుంసాం
సఙ్కీర్తనం భగవతో గుణకర్మనామ్నామ్
విక్రుశ్య పుత్రమఘవాన్యదజామిలోऽపి
నారాయణేతి మ్రియమాణ ఇయాయ ముక్తిమ్
మానవుల సర్వపాపాలు పోవడానికి ఇదొక్కటి చాలు. పరమాత్మ పేర్లు ఆయన ఆచరించిన కర్మలు పరమాత్మ గుణములు. నామం గానీ గుణం కానీ కర్మను కానీ ఈ మూటిలో దేన్ని ఆచరించినా మానవులు తమ పాపాన్ని తొలగించుకుంటారు
ప్రాయేణ వేద తదిదం న మహాజనోऽయం
దేవ్యా విమోహితమతిర్బత మాయయాలమ్
త్రయ్యాం జడీకృతమతిర్మధుపుష్పితాయాం
వైతానికే మహతి కర్మణి యుజ్యమానః
మరి ఇంత సులభమైతే నరకానికి అందరూ ఎందుకు పోతున్నారు. గొప్పవాళ్ళు కూడా పరమాత్మ యొక్క మాయా దేవితో మోహించబడిన బుద్ధి గల వారు ఈ విషయాన్ని తెలియలేరు. మకరందాన్ని అందించే వేదాన్ని (మనసును ఊరించే) చూసి అందరూ మోహములో పడతారు. అది చూసి విశాలమైన పనులు చేస్తాడు (వ్రతాలూ నోములూ ఉపవాసాలు) గానీ, పెద్ద పెద్ద పనులు (యాగాలూ యజ్ఞ్యాలూ) చేయాలంటాడు గానీ గొప్పవారు కూడా పరమాత్మ నామాన్ని జపించలేరు. వేదములో మునిగి జడ మతులవుతున్నారు.
ఏవం విమృశ్య సుధియో భగవత్యనన్తే
సర్వాత్మనా విదధతే ఖలు భావయోగమ్
తే మే న దణ్డమర్హన్త్యథ యద్యమీషాం
స్యాత్పాతకం తదపి హన్త్యురుగాయవాదః
మంచి బుద్ధి కలవారు ఇలా విషయాన్ని పరిశీలించి పరమాత్మ యందు తమ భావాన్ని నిలుపుతారు. అలాంటి వారు నా దండమును పొందరు. వారు పాపమును చేసినా పరమాత్మ నామోచ్చారణే ఆ పాపమును తొలగిస్తుంది.
తే దేవసిద్ధపరిగీతపవిత్రగాథా
యే సాధవః సమదృశో భగవత్ప్రపన్నాః
తాన్నోపసీదత హరేర్గదయాభిగుప్తాన్
నైషాం వయం న చ వయః ప్రభవామ దణ్డే
ఇలాంటి మహాత్ములు దేవతల చేతా సిద్ధుల చేతా మహానుభావులచేతా గానం చేసే గాధను కలిగి ఉంటారు. వీరు సాధువులు సమదర్శులు. పరమాత్మను మాత్రమే ఆశ్రయించిన వారు. అలాంటి వారి దగ్గరకు మాత్రం మీరు వెళ్ళకండి. వారి చుట్టూ పరమాత్మ గద ఉండి వారిని కాపాడుతూ ఉంటుంది. అలాంటి వారికి మేము శిక్ష విధించలేము. వారాచరించిన పాపం కూడా వారిని శిక్షించలేదు.
తానానయధ్వమసతో విముఖాన్ముకున్ద
పాదారవిన్దమకరన్దరసాదజస్రమ్
నిష్కిఞ్చనైః పరమహంసకులైరసఙ్గైర్
జుష్టాద్గృహే నిరయవర్త్మని బద్ధతృష్ణాన్
మీరు ఎలాంటి వారిని తీసుకు రావాలంటే, పరమాత్మ పాద పద్మ మకరంద రసమును స్వీకరించడానికి ఎవరు విముఖముగా ఉంటారో అలాంటి వారిని తీసుకు రండి. పరమ దరిద్రులు (నిష్కిఞ్చనైః - పరమాత్మ తప్ప వేరే దిక్కు లేని వారు, భగవంతుని కంటే భిన్నమైన రక్షణ, భగవంతుని దయ కన్నా భిన్నమైన ఆస్తి లేనివారు), పరమాత్మ పాద పద్మ మకరందాన్ని కోరేవారు కాకుండా మిగిలిన వారికి నరకమార్గం మీద ఆశ ఎక్కువ. ఇల్లు అనే నరక మార్గాన్ని కోరేవారిని, దాని మీద ఆశ పెంచుకున్నవారినీ మీరు బంధించాలి.
జిహ్వా న వక్తి భగవద్గుణనామధేయం
చేతశ్చ న స్మరతి తచ్చరణారవిన్దమ్
కృష్ణాయ నో నమతి యచ్ఛిర ఏకదాపి
తానానయధ్వమసతోऽకృతవిష్ణుకృత్యాన్
పరమాత్మను ఆశ్రయించని వాడంటే పూజ చేయకపోయినా గుడికి వెళ్ళకపోయినా, పరమాత్మ నామాన్ని కూడా ఎవరి నాలుక పలకదో, ఒక్క సారి కూడా పరమాత్మకు శిరస్సు వంచి నమస్కరించదో అటువంటి వారిని పట్టుకు రండి. ఏ ఒక్క సారీ పరమాత్మ యొక్క ఏ చిన్న సేవా చేయని వారిని పట్టుకు రండి.
తత్క్షమ్యతాం స భగవాన్పురుషః పురాణో
నారాయణః స్వపురుషైర్యదసత్కృతం నః
స్వానామహో న విదుషాం రచితాఞ్జలీనాం
క్షాన్తిర్గరీయసి నమః పురుషాయ భూమ్నే
మీరు వారి చర్యకు అడ్డు చెప్పకున్నా కొంతసేపైనా వారితో వాదన చేసారు కాబట్టి తన పురుషులకెదురుగా వాదనకు దిగి మాట్లాడిన మన తెలివి మానిన పనిని ఆ పరమాత్మ క్షమించుగాక. మా మనుషులు చేసిన దాన్ని స్వామి క్షమించుగాక. మహానుభావులకు అంజలి జోడించడమే అన్ని క్షమలకూ మూలము. (అంజలి - అం జలయతి. అకారమంటే శ్రీమన్నారాయణుడు. పరమాత్మను కూడా కరిగించేది.) తప్పు చేసినందు వలన కలిగిన కోపం క్షమాపణ వేడితే తొలగిపోతుంది.
తస్మాత్సఙ్కీర్తనం విష్ణోర్జగన్మఙ్గలమంహసామ్
మహతామపి కౌరవ్య విద్ధ్యైకాన్తికనిష్కృతమ్
నిరంతర పరమాత్మ నామ సంకీర్తనం సకల జగత్తుకూ మంగళం కలిగిస్తుంది. మహామాహా పాతకములకు కూడా ఒకే ఒక పరిహారం పరమాత్మ నామ సంకీర్తనం
శృణ్వతాం గృణతాం వీర్యాణ్యుద్దామాని హరేర్ముహుః
యథా సుజాతయా భక్త్యా శుద్ధ్యేన్నాత్మా వ్రతాదిభిః
ఏదో పేరుకు రకరకాల వ్రతాలు చేస్తే మనసు పరిశుద్ధమవదు. పరమాత్మ అనంతమైన గుణములూ పరాక్రమములూ విన్న వారికీ చెప్పేవారికీ చదివేవారికీ మనసు పవిత్రమవుతుంది. ఈ మూడూ లేకుండా మేము వ్రతం చేస్తున్నామని పదిమందికీ చూపేవారి మనసు పవిత్రం కాదు.
కృష్ణాఙ్ఘ్రిపద్మమధులిణ్న పునర్విసృష్ట
మాయాగుణేషు రమతే వృజినావహేషు
అన్యస్తు కామహత ఆత్మరజః ప్రమార్ష్టుమ్
ఈహేత కర్మ యత ఏవ రజః పునః స్యాత్
అందుకే పరమాత్మ పాద పద్మ మకరందాన్ని ఆస్వాదించే తుమ్మెదా (భక్తుడు) పొరబాటున కూడా ప్రకృతి గుణముల యందు ఆసక్తుడు కాడు, ఇరుక్కోడు. పరమాత్మ పాదాలను స్మరించని వాడు కోరికలతో కొట్టబడి తనకంటిన మురికిని తొలగించుకోవడానికి ప్రయత్నించి మరికాస్త మురికి అంటించుకుంటాడు. ఆ కర్మతో మరి కాస్త బురద అంటుతుంది కానీ ఉన్న బురద పోదు. భగవత్సేవ కన్నా భిన్నమైన దానితో ఉన్న పాపాలు పోక పోగా కొత్త పాపాలు వస్తాయి
ఇత్థం స్వభర్తృగదితం భగవన్మహిత్వం
సంస్మృత్య విస్మితధియో యమకిఙ్కరాస్తే
నైవాచ్యుతాశ్రయజనం ప్రతిశఙ్కమానా
ద్రష్టుం చ బిభ్యతి తతః ప్రభృతి స్మ రాజన్
తన యజమాని చెప్పిన విషయాలని విన్న యమ కింకరులు విస్మయాన్ని పొందారు. అప్పటినుంచీ పరమాత్మ భక్తుల పేర్లు పలకడానికే చూడటానికే భయపడుతున్నారు.
ఇతిహాసమిమం గుహ్యం భగవాన్కుమ్భసమ్భవః
కథయామాస మలయ ఆసీనో హరిమర్చయన్
ఇది పరమ రహస్యమైన ఇతిహాసం. దీన్ని మలయ పర్వతం మీద అగస్త్య మహాముని (రావణున్ని చంపించినవాడు, ఖర్దూషణులను చంపేందుకు వైష్ణవమనే ధనువు ఇచ్చినవాడు, వాతాపిని జీర్ణం చేసుకున్నవాడు)చెప్పాడు. ఇది పరమ ప్రమాణం.