శ్రీరాజోవాచ
సమః ప్రియః సుహృద్బ్రహ్మన్భూతానాం భగవాన్స్వయమ్
ఇన్ద్రస్యార్థే కథం దైత్యానవధీద్విషమో యథా
అన్ని ప్రాణులకూ పరమాత్మ సముడు కదా. ఆయన సముడే కాడు ప్రియుడు, మిత్రుడూ కదా. పక్షపాతం ఉన్న వాడిలాగ ఇంద్రుని కొరకు రాక్షసులను ఎలా చంపాడు
న హ్యస్యార్థః సురగణైః సాక్షాన్నిఃశ్రేయసాత్మనః
నైవాసురేభ్యో విద్వేషో నోద్వేగశ్చాగుణస్య హి
మనం ఒకరి ప్రయోజనాన్ని ఆశించి ఒకరి పక్షాన్ని ఆశిస్తాము. మరి స్వామికి ఏమి స్వార్థం ఉంది. పరమాత్మ అంటేనే జ్ఞ్యాన స్వరూపం, మోక్ష స్వరూపం. ఆయనకు దేవతలకు ఏమి పని. దేవతలతో లాభమూ లేదు రాక్షసులతో పగా లేదూ. ఆయన గుణములు లేని వాడు. మనం గుణములు పట్టిన వారం. గుణముల ఉద్రేకాన్ని బట్టి మన స్వభావం మారుతుంది మాలాంటి వారికి. ఆయనకు ప్రాకృతిక గుణములతో సంబంధం లేదు.
ఇతి నః సుమహాభాగ నారాయణగుణాన్ప్రతి
సంశయః సుమహాన్జాతస్తద్భవాంశ్ఛేత్తుమర్హతి
పరమాత్మ గుణాలను తెలుసుకోవాలని నాకు సందేహం కలిగింది. అది మీరు నిర్వృత్తి చేయవలసింది.
శ్రీఋషిరువాచ
సాధు పృష్టం మహారాజ హరేశ్చరితమద్భుతమ్
యద్భాగవతమాహాత్మ్యం భగవద్భక్తివర్ధనమ్
అద్భుతమైన పరమాత్మ గురించి బాగా అడిగావు. పరమ భాగవతుల గురించి చెప్పుకుంటే పరమాత్మ యందు భక్తి పెరుగుతుంది. అలాంటి భగవంతుని చరిత్ర అడిగావు.
గీయతే పరమం పుణ్యమృషిభిర్నారదాదిభిః
నత్వా కృష్ణాయ మునయే కథయిష్యే హరేః కథామ్
కృష్ణునికీ వ్యాసునికీ నమస్కారం (కృష్ణాయ మునయే). లేదా కృష్ణాయ మునయే అన్నదానికి వ్యాసునకు నమస్కారం అనే అర్థం వస్తుంది. వ్యాసునికీ కృష్ణ అనే పేరు.
నిర్గుణోऽపి హ్యజోऽవ్యక్తో భగవాన్ప్రకృతేః పరః
స్వమాయాగుణమావిశ్య బాధ్యబాధకతాం గతః
పరమాత్మకు ఎలాంటి ప్రాకృతిక గుణములు లేవు. అందుచేతనే కర్మబంధమైన జన్మలు లేని వాడు పరమాత్మ. కార్య కారణ రూపములో మనకు ప్రత్యక్షముగా కనపడడు. ప్రకృతికంటే విలక్షణుడు.తనకెలాంటి ప్రాకృతిక గుణములూ లేకున్నా, ఆ గుణాలలో తాను చేరి, జీవులకు అంతర్యామిగా చేరతాడు. బాధించబడే వాడూ బాధపడేవాడు బాధపెట్టేవాడూ తానే అయి ఉన్నాడు. ఆయనే బాధకుడు ఆయనే బాధ్యుడు. పుట్టేవారిలో మరణించేవారిలో ఆయనే ఉన్నాడు. ఆయనకు పుట్టుకా చావూ లేవు
సత్త్వం రజస్తమ ఇతి ప్రకృతేర్నాత్మనో గుణాః
న తేషాం యుగపద్రాజన్హ్రాస ఉల్లాస ఏవ వా
సత్వ రజో తమో గుణాలు ప్రకృతివే గానీ ఆత్మవు కావు, ఆత్మకు కావు. ఈ మూడు గుణాలూ ప్రకృతివే. కానీ ఈ మూడు గుణాలు ఎప్పుడూ సమానముగా ఉండవు. వీటిలో హెచ్చుతగ్గులు కావాలి. అన్నీ ఒకే సారి ఎక్కువ గానీ ఒకే సారి తక్కువ గానీ ఉండవు. ఒక సారి సత్వం పెరుగుతుంది, ఒక సారి రజస్సు పెరుగుతుంది, ఒక సారి తమస్సు పెరుగుతుంది. ఒక గుణం పెరిగిందంటే మిగతా రెండు గుణాలూ తగ్గినట్లు అర్థం. గుణములలో ఉండేది ఆయనే కాబట్టి ఒక దానిలో ఆయన అధికముగా ఉండి మిగతావాటిని తగ్గించాడు.
జయకాలే తు సత్త్వస్య దేవర్షీన్రజసోऽసురాన్
తమసో యక్షరక్షాంసి తత్కాలానుగుణోऽభజత్
సత్వ గుణం ఎక్కువ ఉన్నప్పుడు దేవతలూ, రజో గుణం ఎక్కువ ఉన్నప్పుడు రాక్షసులూ, తామస గుణం ఎక్కువ ఉన్నప్పుడు యక్షులూ రాక్షసులూ గెలుస్తారు. పరమాత్మ ఎవరినీ గెలిపించడూ ఓడించడు
జ్యోతిరాదిరివాభాతి సఙ్ఘాతాన్న వివిచ్యతే
విదన్త్యాత్మానమాత్మస్థం మథిత్వా కవయోऽన్తతః
సత్వ గుణ ప్రాచుర్యం ఉన్న సమయములో దేవతల పక్షం ఉంటాడు. తమో గుణం ఎక్కువ ఉన్నప్పుడు రాక్షసులలో ప్రకాశిస్తాడు. పొయ్యిలో కట్టెలు పెడతాము. ఒక్కో కట్టే ఒక్కో ఆకారములో ఉంటుంది. కట్టె ఏ ఆకారముతో ఉంటుందో మంట కూడా అదే ఆకారముతో ఉంటుంది. ఆ గుణము కట్టెదే గానీ మంటది కాదు. కట్టెలో దాగి ఉన్న అగ్ని పైకి కనపడదు. అంతవరకూ కట్టెలో నిప్పు ఉన్నట్లు ఎవరికీ తెలియదు. అందులోనే ఉంటుంది కానీ దాని కంటే వేరు కాదు. ప్రయత్నిస్తే కనపడుతుంది. అంటే లేని నిప్పు పుట్టిందా, ఉన్న నిప్పే కనపడిందా? కట్టెలో నిప్పు ఎప్పుడూ ఉన్నది. మనం చిలికితే వచ్చింది. అలాగే ఆ రీతిలో జీవాత్మలో అంతర్యామిగా ఉన్న పరమాత్మను యమ నియమాది ప్రక్రియతో చిలికి తెలుసుకుంటారు.
యదా సిసృక్షుః పుర ఆత్మనః పరో రజః సృజత్యేష పృథక్స్వమాయయా
సత్త్వం విచిత్రాసు రిరంసురీశ్వరః శయిష్యమాణస్తమ ఈరయత్యసౌ
కాబట్టి పరమాత్మ సృష్టి చేయాలనుకున్నప్పుడు రజస్సులోకీ, సత్వ గుణం అనుకున్నప్పుడు అందులోకీ, తమో గుణం అనుకున్నప్పుడు అందులోకీ ప్రవేశిస్తాడు.ప్రళయములో సృష్టిలో రక్షణలో మూడిటిలో సమానముగా ఒకటి ఉంది. అదే కాలం. పరమాత్మ నడుస్తూ ఉన్న కాలాన్ని సృష్టి స్థితి లయములకు ఆశ్రయం చేసి. ప్రకృతి జీవులతో కాలాన్ని కలుపుతాడు. ఈ మూడూ కలిసే ప్రపంచం.
కాలం చరన్తం సృజతీశ ఆశ్రయం ప్రధానపుమ్భ్యాం నరదేవ సత్యకృత్
య ఏష రాజన్నపి కాల ఈశితా సత్త్వం సురానీకమివైధయత్యతః
తత్ప్రత్యనీకానసురాన్సురప్రియో రజస్తమస్కాన్ప్రమిణోత్యురుశ్రవాః
గొప్ప కీర్తి గల పరమాత్మ సత్వ గుణం వృద్ధి చేయాలనుకున్నప్పుడు దేవతలను గెలిపిస్తాడు. తమో గుణం వృద్ధి చేయాలనుకున్నప్పుడు రాక్షసులను గెలిపిస్తాడు.
అత్రైవోదాహృతః పూర్వమితిహాసః సురర్షిణా
ప్రీత్యా మహాక్రతౌ రాజన్పృచ్ఛతేऽజాతశత్రవే
పరమాత్మ కాలానుగుణముగా వ్యవహరిస్తాడని చెప్పడానికి ఒక ఇతిహాసం ఉంది. రాజసూయ యాగములో అజాత శత్రువైన ధర్మరాజు ఈ ప్రశ్న నారదున్ని అడిగాడు.
దృష్ట్వా మహాద్భుతం రాజా రాజసూయే మహాక్రతౌ
వాసుదేవే భగవతి సాయుజ్యం చేదిభూభుజః
తత్రాసీనం సురఋషిం రాజా పాణ్డుసుతః క్రతౌ
పప్రచ్ఛ విస్మితమనా మునీనాం శృణ్వతామిదమ్
పరమాత్మ శిశుపాలుని వధించినప్పుడు శిశుపాలుని తేజస్సు ఆయనలో కలవడం చూచి ఆశ్చర్యపడి శిశుపాలునికి వాసుదేవుని సాయుజ్యం ఎలా దొరికింది అని నారద మహర్షిని ఋషులందరూ వింటూ ఉండగా ఆశ్చర్యముతో ఇలా అడిగాడు
శ్రీయుధిష్ఠిర ఉవాచ
అహో అత్యద్భుతం హ్యేతద్దుర్లభైకాన్తినామపి
వాసుదేవే పరే తత్త్వే ప్రాప్తిశ్చైద్యస్య విద్విషః
ఏకాంత భక్తులకు కూడా దొరకని పరమాత్మ సిద్ధిని పరమ శత్రువైన శిశుపాలునికి ఎలా కలిగింది.
ఏతద్వేదితుమిచ్ఛామః సర్వ ఏవ వయం మునే
భగవన్నిన్దయా వేనో ద్విజైస్తమసి పాతితః
వేనుడు పరమాత్మను నిందించడం సహించని ఋషులు అతనికి నరకాన్నిచ్చారు. శిశుపాలుడు చేసిన పని కూడా అదే కదా. ఒకరికి నరకం ఒకరికి మోక్షం ఎలా వచ్చింది.
దమఘోషసుతః పాప ఆరభ్య కలభాషణాత్
సమ్ప్రత్యమర్షీ గోవిన్దే దన్తవక్రశ్చ దుర్మతిః
మాటలు నేర్చుకున్నపటినుంచీ కృష్ణపరమాత్మను తిట్టడమే పనిగా పెట్టుకున్నవాడు. అలాంటి వాడికి మోక్షమెలా వచ్చింది. ఇతని తమ్ముడు కూడా అలాంటి వాడే.
శపతోరసకృద్విష్ణుం యద్బ్రహ్మ పరమవ్యయమ్
శ్విత్రో న జాతో జిహ్వాయాం నాన్ధం వివిశతుస్తమః
ఇంత ఘోరం చేసిన వీరిద్దరూ కృష్ణ పరమాత్మను ఎంతగా నిందించారంటే, ఇంకెవరైనా అలా మాట్లాడితే నాలికకు పుండు కావలసి ఉంది. వీరు నరకానికి ఎందుకు పోలేదు. సామాన్యులకు తెలుసుకోవడానికి వీలు లేని పరమాత్మ యందు, వీరు అందరూ చూస్తుండగానే మోక్షం ఎలా పొందారు. గాలికి కొట్టుకుంటున్న దీపములా నా మనసు కూడా రెపరెప లాడుతోంది. అది మీరు వివరించవలసింది.
కథం తస్మిన్భగవతి దురవగ్రాహ్యధామని
పశ్యతాం సర్వలోకానాం లయమీయతురఞ్జసా
ఏతద్భ్రామ్యతి మే బుద్ధిర్దీపార్చిరివ వాయునా
బ్రూహ్యేతదద్భుతతమం భగవాన్హ్యత్ర కారణమ్
ఈ ఆశ్చర్యానికి కారణం మీరే చెప్పగలరు
శ్రీబాదరాయణిరువాచ
రాజ్ఞస్తద్వచ ఆకర్ణ్య నారదో భగవానృషిః
తుష్టః ప్రాహ తమాభాష్య శృణ్వత్యాస్తత్సదః కథాః
ఈ మాట అడగగానే నారదుడు విశ్రాంతి సమయం కాబట్టి సదస్సులో ఉన్న వారందరూ వినడానికి వీలైనట్లుగా చెప్పారు.
శ్రీనారద ఉవాచ
నిన్దనస్తవసత్కార న్యక్కారార్థం కలేవరమ్
ప్రధానపరయో రాజన్నవివేకేన కల్పితమ్
నీవడిగిన ప్రశ్నే తప్పు. నిందా గౌరవం పూజా ధిక్కారం పరిహాసం సత్కారం ఇవన్నీ ఆత్మకు ఉంటాయా? అలాంటప్పుడు హింసించేది హింసించబడేదీ శరీరమే తప్ప ఆత్మ కాదు.
హింసా తదభిమానేన దణ్డపారుష్యయోర్యథా
వైషమ్యమిహ భూతానాం మమాహమితి పార్థివ
శరీరమే ఆత్మ అన్న అభిమానముతోనే మనం ఇతరులని హింసిస్తాము, శిక్షిస్తామూ, పరుషముగా మాట్లాడతాము.
యన్నిబద్ధోऽభిమానోऽయం తద్వధాత్ప్రాణినాం వధః
తథా న యస్య కైవల్యాదభిమానోऽఖిలాత్మనః
పరస్య దమకర్తుర్హి హింసా కేనాస్య కల్ప్యతే
నాదీ నేనూ అన్నవే కారణాలు శత్రుత్వానికి. ఇది శరీరాన్ని బట్టి వచ్చేదే. ఏ అభిమానముతో ఇవి కలుగుతున్నాయో ఆ అభిమానముతో ఆ శరీరాన్ని చంపేసి ఆ బాధ తొలగిపోయింది అనుకుంటారు . ఇవన్నీ అంత్రయామికి అంటవు. ఇలాంటి వాటితో ఎవరు హింస కలిపిస్తారు? ఎవరు ఆత్మను బాధిస్తారు. అందరూ శరీరాన్ని బాధించేవారే.
తస్మాద్వైరానుబన్ధేన నిర్వైరేణ భయేన వా
స్నేహాత్కామేన వా యుఞ్జ్యాత్కథఞ్చిన్నేక్షతే పృథక్
నీవు ఏ భావముతోనైనా ఉండు, ఏ గుణాలైనా కలిగి ఉండు. కానీ ఉన్నంత కాలం పరమాత్మనే స్మరించు. వైరముతో స్నేహముతో భక్తితో సేవించినా పరమాత్మకు ఆ తేడా ఉండదు . వైరమున్నా స్నేహం ఉన్నా భక్తి ఉన్నా భగవంతుని సేవిస్తే మోక్షం తప్పదు. స్నేహముతో కానీ కోరికతో గానీ సేవించినా మోక్షమే వస్తుంది.
యథా వైరానుబన్ధేన మర్త్యస్తన్మయతామియాత్
న తథా భక్తియోగేన ఇతి మే నిశ్చితా మతిః
పరమాత్మ యందు భక్తి కంటే పరమాత్మ యందు వైరమే తొందరగా ఫలితాన్నిస్తుంది. ఒక తుమ్మెద ఒక పురుగును పట్టుకొని వచ్చి గోడకున్న రంధ్రానికి పెడుతుంది. పెట్టి, తను కాపలా ఉండి నిరంతరం చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఆ పురుగు దాన్నే చూస్తూ దాన్నే ఆలోచిస్తూ కొన్నాళ్ళకు ఆ తుమ్మెదగా మారుతుంది. మనం కూడా ఏ భావనతో పరమాత్మను తలస్తూ చూస్తూ ఉంటే మనకు కూడా ఆ రూపమే వస్తుంది.
కీటః పేశస్కృతా రుద్ధః కుడ్యాయాం తమనుస్మరన్
సంరమ్భభయయోగేన విన్దతే తత్స్వరూపతామ్
ఏవం కృష్ణే భగవతి మాయామనుజ ఈశ్వరే
వైరేణ పూతపాప్మానస్తమాపురనుచిన్తయా
ఈ రీతిలో మాయా మానుష విగ్రహుడైన కృష్ణ పరమాత్మ యందు ద్వేషముతో నిరంతరం తలచి అన్ని పాపాలను పోగొట్టుకుని ఆయననే పొందాడు. ఇందులో వింతేమీ లేదు
కామాద్ద్వేషాద్భయాత్స్నేహాద్యథా భక్త్యేశ్వరే మనః
ఆవేశ్య తదఘం హిత్వా బహవస్తద్గతిం గతాః
కామముతో కానీ కోరికతో భయముతో భక్తితో గానీ ఆయననే తలిస్తే పాపాన్ని పోగొట్టుకుని ఎంతో మంది ఈ భావాలతో పరమాత్మను చేరారు
గోప్యః కామాద్భయాత్కంసో ద్వేషాచ్చైద్యాదయో నృపాః
సమ్బన్ధాద్వృష్ణయః స్నేహాద్యూయం భక్త్యా వయం విభో
గోపికలు కామముతో, కంసుడు భయముతో, శిశుపాల దంతవక్తృఅ జరాసంధాధులు ద్వేషముతో, బంధుత్వముతో యాదవులు, మీరు స్నేహముతో, మేము భక్తితో తరిస్తూ ఉన్నాము.
కతమోऽపి న వేనః స్యాత్పఞ్చానాం పురుషం ప్రతి
తస్మాత్కేనాప్యుపాయేన మనః కృష్ణే నివేశయేత్
ఈ ఐదింటిలో వేనుడు ఎందులోనూ చేరడు. విధానం ఏది అన్నది అప్రధానం. ఏ భావముతో నీవు కృష్ణున్ని తలచినా నీకు మోక్షమే వస్తుంది. కానీ మనసు సమగ్రముగా అక్కడే ఉండాలి.
మాతృష్వస్రేయో వశ్చైద్యో దన్తవక్రశ్చ పాణ్డవ
పార్షదప్రవరౌ విష్ణోర్విప్రశాపాత్పదచ్యుతౌ
ఇంత అడుగుతున్నావు. శిశుపాల దంత వక్తృలు కూడా కృష్ణునికి బంధువులే. నీవు బావ అన్న భావముతో పూజిస్తే వారు శత్రువు అన్న భావముతో పూజిస్తున్నారు. మీకంటే వారికి పరమాత్మతో దగ్గర సంబంధం ఉంది. శాపముతో వారు ఇక్కడకు వచ్చారు. వారు స్వామి ద్వారపాలకులు.
శ్రీయుధిష్ఠిర ఉవాచ
కీదృశః కస్య వా శాపో హరిదాసాభిమర్శనః
అశ్రద్ధేయ ఇవాభాతి హరేరేకాన్తినాం భవః
పరమాత్మ భక్తులకు కూడా శాపం తగులుతుందా. ఎంత బ్రాహ్మణులైనా పరమాత్మ ద్వారపాలకులను శపించగలరా. అంత గొప్ప వారు శాపం ఎలా పెట్టారు. ఇది నమ్మదగ్గట్టుగా లేదు. పరమాత్మ ఏకాంత సేవకులు.
దేహేన్ద్రియాసుహీనానాం వైకుణ్ఠపురవాసినామ్
దేహసమ్బన్ధసమ్బద్ధమేతదాఖ్యాతుమర్హసి
వైకుంఠములో ఉండే వారికి ప్రకృతి సంబంధమైన శారీర ఇంద్రియ ప్రాణములు ఉండవు కదా? శరీరము ఉన్న వారితో సంబంధముతో సంబంధం ఎలా ఏర్పడింది. మాకు ఈ రహస్యాన్ని వివరించవలసింది
శ్రీనారద ఉవాచ
ఏకదా బ్రహ్మణః పుత్రా విష్ణులోకం యదృచ్ఛయా
సనన్దనాదయో జగ్ముశ్చరన్తో భువనత్రయమ్
సనక సనందన సనత్కుమార సనత్సుజాలు లోకాలన్నీ తిరుగుతూ పరమాత్మను సేవించాలని వైకుంఠానికి వెళ్ళారు. వారి వయసు చూస్తే ఐదారేళ్ళ పిల్లల్లా ఉన్నారు కానీ మొదలు పుట్టినవారందరి కంటే మొదలు పుట్టినవారు.
పఞ్చషడ్ఢాయనార్భాభాః పూర్వేషామపి పూర్వజాః
దిగ్వాససః శిశూన్మత్వా ద్వాఃస్థౌ తాన్ప్రత్యషేధతామ్
దిగంబరముగా ఉన్నారు. అప్పుడు అక్కడున్న ద్వారపాలకులు అడ్డగించారు. పరమాత్మ పాద సన్నిధిలో ఉన్న వారికి రజస్సు తమస్సు ఉన్నయని ఇలాంటి చోట మీరు ఉండటానికి వీలు లేదు. ఏ గుణముతో మీరు ఆపారో ఆ గుణముగల రాక్షసుల యందు మీరు జన్మించండి
అశపన్కుపితా ఏవం యువాం వాసం న చార్హథః
రజస్తమోభ్యాం రహితే పాదమూలే మధుద్విషః
పాపిష్ఠామాసురీం యోనిం బాలిశౌ యాతమాశ్వతః
ఏవం శప్తౌ స్వభవనాత్పతన్తౌ తౌ కృపాలుభిః
ప్రోక్తౌ పునర్జన్మభిర్వాం త్రిభిర్లోకాయ కల్పతామ్
మహాత్ముల శాపం వలన భూలోకములోకి పడిపోతున్నవారి మీద జాలి కలిగి మూడు జన్మలలోనే పరమాత్మను చేరతారు అని చెప్పారు
జజ్ఞాతే తౌ దితేః పుత్రౌ దైత్యదానవవన్దితౌ
హిరణ్యకశిపుర్జ్యేష్ఠో హిరణ్యాక్షోऽనుజస్తతః
హతో హిరణ్యకశిపుర్హరిణా సింహరూపిణా
హిరణ్యాక్షో ధరోద్ధారే బిభ్రతా శౌకరం వపుః
మొదటి జన్మలో హిరణ్యాక్ష హిరణ్యకశిపులుగా పుట్టారు. నరసింహరూపములో హిరణ్యకశిపున్నీ వరాహ రూపములో హిరణ్యాక్షున్నీ సంహరించాడు
హిరణ్యకశిపుః పుత్రం ప్రహ్లాదం కేశవప్రియమ్
జిఘాంసురకరోన్నానా యాతనా మృత్యుహేతవే
పరమభాగవతుడైన తన పుత్రుడైన హిరణ్యకశిపున్ని స్వామి చంపాడు. ప్రహ్లాదున్ని చంపాలని ఎంత ప్రయత్నించినా పరమాత్మ తేజస్సు కలవాడు, ప్రశాంతాత్ముడూ, పరమ భాగవతుడు అయిన ప్రహ్లాదున్ని ఏమీ చేయలేకపోయాయి
తం సర్వభూతాత్మభూతం ప్రశాన్తం సమదర్శనమ్
భగవత్తేజసా స్పృష్టం నాశక్నోద్ధన్తుముద్యమైః
తతస్తౌ రాక్షసౌ జాతౌ కేశిన్యాం విశ్రవఃసుతౌ
రావణః కుమ్భకర్ణశ్చ సర్వలోకోపతాపనౌ
ఇలా పరమాంత చే సంహరించబడిన వారు కేశినీ విశ్వా వసునకు రావణ కుంభకర్ణులుగా అవతరించారు. రామునిగా పరమాత్మ అవతరించి వారిని వధించాడు. మార్కండేయ మహర్షి వలన నీవు త్వరలో ఆ చరిత్ర వింటావు. ఆ రావణ కుంభర్కర్ణులే శిశుపాల దంతవక్తౄలుగా పుట్టారు.
తీవ్ర వైరముతో పరమాత్మను ధ్యానించి ఆయన సన్నిధికి వారు చేరారు
తత్రాపి రాఘవో భూత్వా న్యహనచ్ఛాపముక్తయే
రామవీర్యం శ్రోష్యసి త్వం మార్కణ్డేయముఖాత్ప్రభో
తావత్ర క్షత్రియౌ జాతౌ మాతృష్వస్రాత్మజౌ తవ
అధునా శాపనిర్ముక్తౌ కృష్ణచక్రహతాంహసౌ
వైరానుబన్ధతీవ్రేణ ధ్యానేనాచ్యుతసాత్మతామ్
నీతౌ పునర్హరేః పార్శ్వం జగ్మతుర్విష్ణుపార్షదౌ
శ్రీయుధిష్ఠిర ఉవాచ
విద్వేషో దయితే పుత్రే కథమాసీన్మహాత్మని
బ్రూహి మే భగవన్యేన ప్రహ్లాదస్యాచ్యుతాత్మతా
లోకములో కొడుకంటే అందరికీ ప్రీతి ఉంటుంది కదా. ఈంత పరమ ప్రీతి పాత్రుడైన పుత్రుడు, మహాత్ముడూ, పరమాత్మ యందు ప్రీతి కలిగిన ప్రహ్లాదుని యందు ద్వేషమెందుకు వచ్చింది